ఆపరేషన్ మిన్స్‌మీట్: రెండవ ప్రపంచ యుద్ధంలో అడాల్ఫ్ హిట్లర్‌ను ఒక అనాధ శవం ఎలా మోసం చేసింది?

హిస్టర్‌ను మోసం చేసిన శవం

ఫొటో సోర్స్, WARNER BROS

    • రచయిత, జానీ విల్క్స్
    • హోదా, బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రా

అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. 1943లో సిసిలీని ఆక్రమించుకునేందుకు మిత్రరాజ్యాలు (బ్రిటిష్, అమెరికా, సోవియట్ యూనియన్ మొదలైన దేశాలు) పథకం రచించాయి. ఇందులో ఇద్దరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రధాన పాత్ర పోషించారు. ఒక శవం, ఒక జలాంతర్గామి, కొన్ని పత్రాలతో నిండిన బ్రీఫ్‌కేస్‌ సహాయంతో జర్మనీని బోల్తా కొట్టించారు.

వీరి పన్నాగం రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపుతిప్పింది. వేలాది మంది ప్రాణాలను కాపాడింది.

అసలేం జరిగింది?

ఆరోజు అడాల్ఫ్ క్లాస్, కార్ల్-ఎరిచ్ కుహెలెంతల్ తమ అదృష్టాన్ని తామే నమ్మలేకపోయారు. వీరిద్దరూ జర్మనీ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'అబ్వెర్' సభ్యులు. అప్పటికి కొన్ని రోజులుగా స్పానిష్ అధికారులతో మంతనాలు టెన్షన్ పెడుతున్నాయి. ఆ సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పే సమాచారం వీరి చేతికి చిక్కింది.

ఇద్దరు బ్రిటిష్ జనరల్స్ మధ్య సాగిన అత్యంత రహస్యమైన లేఖ వారికి దొరికింది. 1943 ఏప్రిల్ 30న సముద్ర తీరంలో తేలుతున్న ఒక రాయల్ మరీన్ (బ్రిటిష్ నావికాదళం) అధికారి మృతదేహం వద్ద ఈ లేఖ దొరికింది. విమాన ప్రమాదంలో ఈ అధికారి సముద్రంలో పడిపోయి ఉంటారని భావించారు. ఆయన మృతదేహాన్ని ఒక మత్స్యకారుడు కనుగొన్నాడు.

ఆ లేఖలో రాబోయే కొద్ది నెలల్లో గ్రీస్, సార్డినియాలపై మిత్రరాజ్యాల దాడికి సంబంధించిన సమాచారం ఉంది. దీని సహాయంతో, తమ శత్రువులు యూరోప్‌లోకి అడుగుపెట్టకుండా జర్మన్లు ఆపగలరు.

అబ్వెర్ ఈ లేఖ ప్రతిని హిట్లర్ ముందుంచింది. ఆయన వెంటనే గ్రీస్, సార్డినియా, బాల్కన్‌లను రక్షించడానికి పదాతిదళం, పాంజెర్ విభాగాలు, యుద్ధ దళాలు, ఫిరంగులు, టార్పెడో బోట్లు సమాయత్తం చేయమని ఆదేశించారు.

ఇక, మిత్రరాజ్యాల దండయాత్ర విఫలం కావడం ఖాయం. సముద్రంలో కొట్టుకొచ్చిన బ్రిటిష్ నావీ అధికారి దగ్గర ఆ లేఖ దొరకడం అదృష్టమని జర్మనీ భావించింది,

ఇదిలా ఉండగా, లండన్‌లో సన్నివేశం మరోరకంగా ఉంది. మసకగా, ఇరుకుగా ఉన్న బేస్‌మెంట్ గదిలో బ్రిటిష్ అధికారులు ఆనందంతో గెంతులు వేస్తున్నారు. జర్మనీ యుద్ధం సన్నాహాలు విని సెక్షన్ 17Mకు చెందిన మహిళలు, పురుషులు బల్లలు గుద్దుతూ, ఎగురుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

విన్‌స్టన్ చర్చిల్‌కు ఒక టెలిగ్రాం అందించారు. అందులో "మిన్స్‌మీట్ స్వాలోవ్డ్ రాడ్, లైన్, సింకర్" అని రాశారు.

ఆ టెలిగ్రాం అర్థమేమిటి? మిన్స్‌మీట్ అంటే ఏంటి?

ఆపరేషన్ మిన్స్‌మీట్‌

ఆపరేషన్ మిన్స్‌మీట్

బ్రిటిష్ అధికారుల పన్నాగాన్ని జర్మన్లు నమ్మారు. అడాల్ఫ్ హిట్లర్ పప్పులో కాలేశారు. సముద్రతీరంలో దొరికిన మృతదేహం రాయల్ మరీన్స్‌కు చెందిన కెప్టెన్ విలియం మార్టిన్‌ది కాదు. గ్లిండ్వర్ మైఖేల్ అనే ఒక అనాథది.

కొన్ని వ్యక్తిగత పత్రాలు, తాళాలు, సిగరెట్లు, స్టాంపులు, థియేటర్ టికెట్లు, కాబోయే భార్య ఇచ్చిన బహుమతులు అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం ఆయన జేబులో ఉంచారు. పథకం ప్రకారమే బ్రిటిషర్లు ఆ శవాన్ని నీళ్లల్లోకి వదిలారు. జర్మన్లకు దొరికిన రహస్య లేఖ కూడా ఈ పన్నాగంలో భాగమే.

జర్మన్లను మోసగించడానికి బ్రిటిషర్లు రచించిన పథకం అది. సిసిలీపై నుంచి జర్మన్ల దృష్టి మళ్లించడానికి ఆడిన నాటకం. అదే ఆపరేషన్ మిన్స్‌మీట్.

1942 చివరి నాటికి, మిత్రరాజ్యాలు ఉత్తర ఆఫ్రికా ప్రచారంలో విజయం సాధించడంతో, తమ చూపును జర్మనీ అధీనంలో ఉన్న యూరోప్ వైపు మళ్లించాయి. సిసిలీ అందుకు అనువైన కేంద్రం. సిసిలీపై నియంత్రణ సాధిస్తే, మధ్యధరా సముద్రంలో షిప్పింగ్‌పై నియంత్రణ సాధించవచ్చు. కానీ, అక్కడే ఉంది అసలు సమస్య. సిసిలీని ఆక్రమించుకోవడం అంత సులభం కాదు.

చర్చిల్ మాటల్లో చెప్పాలంటే "బుద్ధిహీనుడు, తెలివితక్కువవాడు అయితే తప్ప అది సిసిలీ అని అందరికీ తెలుసు".

అయితే, మిత్రరాజ్యాలు ఊరుకోలేదు. ఇటలీ వైపు మళ్లడానికి సిసిలీ ప్రధాన మార్గం. అందుకే వ్యూహం రచించాయి. సిసిలీపై నుంచి జర్మన్ల దృషి మరలించి, గ్రీస్ వైపుకు తిప్పాయి.

ఆ దిశలో మోసపూరితమైన ప్రణాళిక ఆపరేషన్ బార్క్లేను ముందుకు తీసుకొచ్చారు. నకిలీ సైన్యాన్ని, మౌలిక సదుపాయాలను సృష్టించారు. బాల్కన్స్‌పై దాడి చేయనున్నట్టు హిట్లర్‌ను నమ్మించారు.

వీడియో క్యాప్షన్, ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా క్యూబా విప్లవాన్ని 81 మంది ఫైటర్లతో ఎలా ప్రారంభించారు?

మిన్స్‌మీట్ ఆలోచన ఎలా వచ్చింది?

మిన్స్‌మీట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన, విజయవంతమైన పథకం. ఈ వ్యూహానికి ఆలోచన, యుద్ధం ప్రారంభ దశలో 1939లో వచ్చిన 'ట్రౌట్ మెమో' అనే పత్రం నుంచి వచ్చింది. బ్రిటన్ నేవల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్ గాడ్ఫ్రే ఈ పత్రాన్ని జారీ చేసినప్పటికీ, దీన్ని రాసినది ఆయన సహాయకుడు ఇయాన్ ఫ్లెమింగ్ కావచ్చు.

ఈ మెమోలో శత్రువును మోసగించేందుకు అనేక మార్గాలను సూచించారు. తరువాత ఫ్లెమింగ్ రాసిన జేమ్స్ బాండ్ నవలల్లో కూడా ఇవి కనిపిస్తాయి.

ఆ జాబితాలో 28వ పాయింట్‌కు టైటిల్ "ఒక సూచన (అంత మంచిదేం కాదు)" అని ఉంటుంది.

ఆ సూచన ఏంటంటే, "వైమానిక దళం దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి మృతదేహాన్ని తీరంలో వదిలిపెట్టవచ్చు. దుస్తుల జేబుల్లో అవసరమైన పత్రాలు ఉంచాలి. ఫెయిల్ అయిన పారాచూట్ నుంచి ఆ శవం సముద్రంలో పడిపోయినట్టు కనిపించాలి. నేవీ ఆస్పత్రి నుంచి మృతదేహాలు దొరకడం కష్టమేం కాదు. కానీ, అది తాజా శవం అయి ఉండాలి".

సిసిలీని ఆక్రమించుకోవాలంటే మామూలు యుద్ధ తంత్రాలు సరిపోవు. కొత్తగా ఆలోచించాలి. చర్చిల్ మాటల్లో చెప్పాలంటే "యుక్తి కావాలి".

ఆ దిశలో పాయింట్ 28ని 1943లో బ్రిటిష్ అధికారులు ఉపయోగించారు. ఈ వ్యూహం వెనకున్న యుక్తిపరులు చార్లెస్ చాల్మాండెలీ, ఎవెన్ మోంటాగు. డబుల్ ఏజెంట్లుగా ఇద్దరూ ఆరితేరినవారు.

చాల్మాండెలీ (చుమ్లీ) కళ్లద్దాలు, పెద్ద మీసాలతో సాహసానికి వెనుకాడని వ్యక్తి. ఈయన్ను రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక చేసింది.

ఎవెన్ మోంటాగు యుద్ధానికి ముందు, నేవల్ ఇంటెలిజెన్స్‌లో చేరక ముందు ప్రముఖ న్యాయవాది.

వీరిద్దరూ నాయకత్వం వహించిన బృందం పేరు సెక్షన్ 17M. నావీ అధికార భవనం బేస్‌మెంట్‌లోని ఇరుకైన గది, రూమ్ నంబరు 13లో ఈ బృందం సమావేశమయ్యేది. ఆ గదిలో మసక వెలుతురు, చుట్టూ పొగ, ఆరుగురు పట్టే గదిలో డజను మంది చేరి పథకం రచించారు.

ఆపరేషన్ మిన్స్‌మీట్‌

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఫేక్ ఐడీ కార్డు

ఆపరేషన్ మిన్స్‌మీట్‌లో విలియం మార్టిన్, గ్లిండ్వర్ మైఖేల్ ఎవరు?

చాల్మాండెలీ, మోంటాగు ముందున్న మొదటి సమస్య సరైన శవాన్ని పట్టుకోవడం. విమాన ప్రమాదం జరిగనట్టుగానే ఉండాలి. ఇతర రకాల గాయాలు ఆ మృతదేహంపై కనిపించకూడదు. కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకొచ్చి ప్రశ్నించకూడదు.

ఇందుకోసం వాళ్లు పాథాలజిస్ట్ సర్ బెర్నార్డ్ స్పిల్స్‌బరీని సంప్రదించారు. లండన్ కరోనర్ (శవ పరీక్షలు జరిపే వ్యక్తి) బెంట్లీ పర్చేజ్ సహాయం కోరారు. ఎట్టకేలకు, 1943 జనవరిలో ఈ ఆపరేషన్‌కు కావాల్సిన సరైన శవం దొరికింది.

ఇల్లు, వాకిలీ లేని, ఉద్యోగం సద్యోగం లేని 34 ఏళ్ల గ్లిండ్వర్ మైఖేల్ ఆ చలికాలంలో ఎలుకల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కింగ్స్ క్రాస్ దగ్గర ఒక గిడ్డంగిలో ఆయన మృతదేహం దొరికింది. పరీక్ష కోసం అది పర్చేజ్ దగ్గరకొచ్చింది. ఆయనది "మతిస్థిమితం లేని చర్య"గా పర్చేజ్ తన రిపోర్టులో రాశారు.

ఈ వ్యక్తి "మరణానికి ముందు, తరువాత చేసిన విలువైన పని ఇదొక్కటే" అని మోంటాగు అంటారు.

నిజానికి, గ్లిండ్వర్ మైఖేల్ చరిత్రలో అనామకంగా మిగిలిపోయి ఉండేవారు. 1990లలో ఒక ఔత్సాహిక చరిత్రకారుడు ఈ విషయాలన్నింటినీ వెలికితీయకపోతే, మిన్స్‌మీట్‌లో ఉపయోగించిన మృతదేహం మైఖేల్‌దేనని ఎవరికీ తెలిసుండేది కాదు. అది రహస్యంగానే మిగిలిపోయేది.

మార్చురీ ఫ్రిడ్జిలో మైఖేల్ శవాన్ని దాచిపెట్టి, జర్మన్లను నమ్మించేందుకు మిగతా సన్నాహాలు ప్రారంభించారు చాల్మాండెలీ, మోంటాగు.

విలియం మార్టిన్ అనే నకిలీ ఐడీ సృష్టించి దాని చుట్టూ ఒక కథ అల్లారు. ఈ పేరు రాయల్ మరీన్స్‌లో సాధారణంగా కనిపించే పేరే. ఆ పేరుకు ఒక టాప్ ర్యాంకు ఆఫీసరు పదవిని జోడించారు. అంటే జర్మన్లు కనిపెట్టేంత ఉన్నత స్థాయి కాదుగానీ, నావీ రహస్యాలు తీసుకెళ్లగలిగేంత ఉన్నత స్థాయి పదవి కట్టబెట్టారు.

శవాన్ని ఫొటో తీసి ఐడీ కార్డులో పెట్టలేరు కాబట్టి, కొంచం దగ్గర పోలికలున్న వ్యక్తి కోసం వెతికారు. M15కు చెందిన రోనీ రీడ్‌కు, మైఖేల్‌కు చాలా దగ్గర పోలికలున్నట్టు గమనించారు. తరువాత మైఖేల్ మృతదేహానికి వేసిన దుస్తుల్లో సాధారణంగా నావీ అధికారుల జేబుల్లో ఉండే సామాగ్రిని కుక్కారు. తాళాలు, సిగరెట్లు, థియేటర్ టికెట్లు, కొత్త షర్టు కొనుక్కున్న రసీదు, తండ్రి దగ్గర నుంచి ఒక ఉత్తరం, ఒక బ్యాంకు నోటీసు ఇలా అన్నీ జేబులో పెట్టారు. ఇవన్నీ రాయడానికి, ముద్రించడానికి నీళ్లల్లో చెరిగిపోని ఇంకు వాడారు.

ఇప్పుడు మార్టిన్‌కు ప్రియురాలిని సృష్టించాలి. M15కే చెందిన క్లర్కు జీన్ లెస్‌లీ పేరును ఇందుకు వినియోగించారు. ఆమెకు పెట్టిన ముద్దు పేరు పామ్. పామ్ మార్టిన్‌కు పెట్టుకున్న ముద్దు పేరు బిల్. ఎంగేజ్మెంట్ ఉంగరానికి సంబంధించిన రసీదు, పామ్, 'బిల్ డార్లింగ్‌'కు రాసినట్టు కొన్ని ప్రేమలేఖలు సృష్టించారు.

నాజీలను మోసగించడానికి చేసిన ఈ మొత్తం ప్రక్రియను చాల్మాండెలీ, మోంటాగు బాగా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. 'మార్టిన్' లోదుస్తులను ఆమధ్య మరణించిన చరిత్రకారుడు, రాజకీయవేత్త హెర్బర్ట్ ఫిషర్ అల్మారాలోంచి తీసుకొచ్చారు. మార్టిన్‌కు వేసిన యూనిఫాం బాగా వాడినదని తెలియడం కోసం చాల్మాండెలీ దాన్ని చాలాసార్లు ధరించి నలగ్గొట్టారు.

మోంటాగు అయితే బిల్ పాత్రలో ఒదిగిపోతూ జీన్ లెస్‌లీతో చిత్రమైన ప్రేమాయణమే నడిపారు. మోంటాగు భార్యకు ఇదంతా ఆందోళన కలిగించింది. ఆమె వెంటనే అమెరికా నుంచి వచ్చేశారు.

ఏప్రిల్ మధ్యలో సిసిలీపై దండయాత్ర దగ్గరపడుతుండగా, మిన్స్‌మీట్ ఆపరేషన్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. చాల్మాండెలీ, మోంటాగు మైఖేల్ శవాన్ని సిద్ధం చేసి, ఐసుపెట్టెలో పెట్టి స్కాట్లాండ్ తీసుకువెళ్ళారు. అక్కడ జలాంతర్గామి హెచ్ఎంఎస్ సెరాఫ్ వేచి ఉంది. శవాన్ని సముద్రంలో అనుకున్న చోట వదలడానికి పదిరోజులు పట్టింది. కొన్ని బాంబులు వేయాల్సి వచ్చింది. అయితే, ఓడలోని సిబ్బందికి ఇదేమీ తెలీదు. శవాన్ని సముద్రంలో విడిచిపెట్టాక, ఇంజిన్ల జోరు పెంచి శవం స్పానిష్ తీరాన్ని చేరుకునేలా చేశారు.

ఏప్రిల్ 30 ఉదయం హుయెల్వా సమీపంలో ఒక సార్డిన్ మత్స్యకారుడు తీరంలో కొట్టుకొచ్చిన బ్రిటిష్ అధికారిని చూశాడు.

యుద్ధంలో చనిపోయిన అధికారిగా భావించి, స్థానిక అధికారులు మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. మిన్స్‌మీట్‌తో కలిసి పనిచేస్తున్న కొందరు అధికారులు అక్కడి పాథాలజిస్టుల కన్నుగప్పి మార్టిన్ శవాన్ని మిలటరీ లాంఛనాలతో తొందరగా ఖననం చేశారు.

వీడియో క్యాప్షన్, హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన యుద్ధం ఇది

మృతదేహంపై ఉన్న రహస్యాలేంటి?

శవానికి ఉన్న ట్రెంచ్ కోటుకు ఒక బ్రీఫ్‌కేసు తగిలించి ఉంది. దాని లోపల, "వ్యక్తిగతం, అత్యంత రహస్యం" అని రాసి ఉన్న ఒక లేఖ ఉంది. ఆపరేషన్ మిన్స్‌మీట్‌లో ఇదే కీలకం. ఇంపీరియల్ జనరల్ స్టాఫ్ వైస్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సర్ ఆర్చిబాల్డ్ నై, ఉత్తర ఆఫ్రికాలోని 18వ ఆర్మీ గ్రూప్ కమాండర్ జనరల్ సర్ హెరాల్డ్ అలెగ్జాండర్‌కు రాసిన ఉత్తరం అది. జర్మన్లను నమ్మించడానికి ఈ ఉత్తరాన్ని నిజంగానే జనరల్ సర్ ఆర్చిబాల్డ్ నై స్వహస్తాలతో రాసి చాల్మాండెలీ, మోంటాగులకు ఇచ్చారు.

"జర్మన్లు గ్రీస్, క్రీట్‌లలో తమ బలగాలను పటిష్టం చేస్తున్నారని మాకు సమాచారం అందింది. వారితో దాడికి మన దళాలు సరిపోవని చీఫ్ ఆఫ్ ఇంపీరియల్ జనరల్ స్టాఫ్ భావిస్తున్నారు. కేప్ అరక్సోస్‌కు దక్షిణంగా ఉన్న బీచ్‌పై దాడికి 5వ డివిజన్‌ను ఒక బ్రిగేడ్ గ్రూప్ బలోపేతం చేయాలని, కలమట వద్ద 56వ డివిజన్‌ను కూడా ఇదే విధంగా బలోపేతం చేయాలని చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ నిర్ణయించారు" అని ఆ లేఖలో రాసి ఉంది.

అంతే కాకుండా, సిసిలీపై దాడి అవసరం లేదన్నట్టు కూడా ఆ లేఖలో నై ప్రస్తావించారు.

"సిసిలీపై మనం దండయాత్ర చేయనున్నట్టు జర్మన్లను నమ్మించాం. దాని గురించి వారు ఆందోళన చెందుతూ ఉంటారు" అంటు నాజీలను తప్పుదోవ పట్టించే విధంగా రాశారు.

సముద్రంలో దొరికిన బ్రిటిష్ అధికారి శవం గురించి జర్మన్లకు వార్త అందింది. ఆ సమయంలో స్పెయిన్ ప్రభుత్వం నాజీలకు సహకరిస్తోంది. కాబట్టి ఆ ఉత్తరం అబ్వెర్‌కు చేరుతుందని చాల్మాండెలీ, మోంటాగులు ఊహించారు. అందుకే హుయెల్వా సమీపంలో ఆ శవాన్ని విడిచారు. అక్కడ వదిలితే అలలు మార్టిన్ శవాన్ని అడాల్ఫ్ క్లాస్‌ అనే ఏజెంట్ వరకూ తీసుకెళ్తాయని వాళ్లకు తెలుసు.

అప్పుడే, చాల్మాండెలీ, మోంటాగు ఒక టెలిగ్రాం కూడా పంపించారు. మార్టిన్ దగ్గరున్న బ్రీఫ్‌కేసు ఎవరూ తెరవకుండా తమ వద్దకు తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ఆ టెలిగ్రాంలో సూచించారు.

"నల్ల బ్రీఫ్‌కేసులో రహస్య పత్రాలు ఉన్నాయి. అవి ఎవరూ చూడకుండా, బ్రీఫ్‌కేసు తెరవకుండా జాగ్రత్తపడాలి" అని ఆ టెలిగ్రాంలో రాశారు.

దాంతో, అడాల్ఫ్ క్లాస్‌కు అందులో ఏవో ముఖ్యమైన పత్రాలు ఉన్నట్టు తోచింది.

అయితే, ఆ రహస్య పత్రం జర్మన్ల కళ్లపడాలన్నదే అసలు వ్యూహం. చాల్మాండెలీ, మోంటాగు మరో పని కూడా చేశారు. లేఖ ఉంచిన కవరును ఎవరైన తెరిస్తే తమకు తెలిసేలా ఏర్పాటు చేశారు . స్పానిష్ వాళ్లు బ్రీఫ్‌కేసును తెరిస్తే వాళ్లకు తెలిసిపోతుంది.

ఆపరేషన్ మిన్స్‌మీట్
ఫొటో క్యాప్షన్, ఎవెన్ మోంటాగు

ఆపరేషన్ మిన్స్‌మీట్ పనిచేసిందా?

చిత్రంగా స్పానిష్ అధికారులు మార్టిన్ మృతదేహంతో పాటు దొరికిన వస్తువులను జర్మన్లను అప్పగించడానికి నిరాకరించారు. అత్యంత సీనియర్ అబ్వెర్ ఏజెంట్ కార్ల్-ఎరిచ్ కుహెలెంతల్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఒక వారం తరువాత, ఆ లేఖ తెరిచి చదివారు. దాని ఫొటో తీసి హిట్లర్‌కు పంపారు. ఉత్తరం హిట్లర్‌కు చేరుకున్నట్టు బ్రిటిష్ అధికారులకు తెలిసింది.

అయితే, హిట్లర్ ఆ లేఖను నమ్మారా లేదా అనేది బేస్‌మెంట్‌లో రూం నంబర్ 13లో ఉన్న అధికారులకు ఇంకా తెలియలేదు. వాళ్లు కొంచం టెన్షన్‌ పడ్డారు. కానీ, మెల్లిగా వాళ్లు వినాలనుకున్న వార్త చెవినపడింది. హిట్లర్ గ్రీస్‌కు రక్షణగా దళాలను పంపుతున్నారని తెలిసింది. సిసిలీపై దండయాత్రను అడ్డుకునేందుకు పంపిన సైనిక దళాలను గ్రీస్ వైపుకు మళ్లించారని తెలిసింది.

హిట్లర్ ఆ లేఖను ఎంతగా నమ్మారంటే జూలై 10న సిసిలీపై దండయాత్ర ఆపరేషన్ హస్కీ ప్రారంభమైనప్పుడు కూడా అది పొరపాటున జరిగి ఉంటుందని భావించారు. 38 రోజుల్లో మిత్రరాజ్యాలు సిసిలీని స్వాధీనం చేసుకున్నాయి. అనుకున్నదానికన్నా అతి తక్కువ ప్రాణనష్టంతో, నౌకల, ఆయుధాల నష్టంతో సిసిలీ ద్వీపాన్ని ఆక్రమించుకున్నాయి.

తరువాత, మిత్రరాజ్యాలు ఇటలీపై దండయాత్ర చేశాయి. ఫలితంగా బెనిటో ముస్సోలినీ పాలన పతనమైంది. దాంతో, హిట్లర్ సోవియట్‌పై దాడిని రద్దు చేసి ఇటలీని రక్షించడానికి సైనిక దళాలను పంపారు.

అక్కడితో, రెండవ ప్రపంచ యుద్ధం మలుపు తిరిగింది. అయితే, మార్టిన్ బ్రీఫ్‌కేసులో లేఖ చూశాక జర్మన్లు కూడా యుద్ధం మలుపు తిరుగుతుందని అనుకున్నారు. కానీ, వారు ఊహించని మలుపు తిరిగింది.

ఆపరేషన్ మిన్స్‌మీట్‌ను మోంటాగు "ఎప్పుడూ ఉనికిలో లేని వ్యక్తి" అని అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)