స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎలా ముగిసింది?

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం

ఫొటో సోర్స్, getty images/Dmitry Rogulin

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోట్లాది ప్రాణాలు బలి తీసుకుని రెండో ప్రపంచయుద్ధ గమనాన్ని సమూలంగా మార్చేసిన యుద్ధం 'బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్‌గ్రాడ్'. ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధాలలో ఇదీ ఒకటి.

1943 ఫిబ్రవరి 2న స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ బలగాలు హిట్లర్ నాయకత్వంలోని యాక్సిస్ సేనలను ఓడించాయి. హిట్లర్ ఓటమితో స్టాలిన్‌గ్రాడ్ యుద్ధానికి తెరపడింది.

బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, సోవియట్ రష్యాలతో కూడిన అలైడ్ కూటమి... రెండో ప్రపంచయుద్ధ విజేతగా నిలవడానికి ప్రధాన కారణం స్టాలిన్ గ్రాడ్‌ యుద్ధంలో సాధించిన విజయమే.

సుమారు 6 నెలలపాటు సాగిన ఈ యుద్ధంలో రెండు వైపులా దాదాపు 18 లక్షల మంది సైనికులు చనిపోయారు. మరెంతో మంది సామాన్య ప్రజలు మరణించారు.

1942లో మొదలైన యుద్ధం

ఫొటో సోర్స్, getty images/Daily Herald Archive

1942లో మొదలైన యుద్ధం

1942 జూన్‌లో జర్మనీ నేతృత్వంలోని యాక్సిస్ కూటమి సైన్యం దక్షిణ రష్యాపై ఆక్రమణను ప్రారంభించింది. రస్తోఫ్, వొరొనెస్ వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదలింది.

జులై చివరి నాటికి నాజీ బలగాలు సోవియట్ రష్యా బలగాలను డాన్ నది వరకు వెనక్కు తరిమాయి. 1942 జులై, అగస్టులో కలచ్ వద్ద స్టాలిన్‌గ్రాడ్ ఫ్రంట్‌తో జరిగిన యుద్ధంలో హిట్లర్ బలగాలు విజయం సాధించాయి.

కలచ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది స్టాలిన్‌గ్రాడ్‌. అంటే నగరం పొలిమేరల వరకూ చేరుకున్నాయి జర్మన్ సైన్యాలు.

అలా 1942 అగస్టులో స్టాలిన్‌గ్రాడ్ ఆక్రమణ మొదలైంది. బలం విషయంలో సోవియట్ రష్యా కంటే మెరుగ్గా ఉన్న జర్మన్ బలగాలు తొలుత వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగాయి. యుద్ధవిమానాలతో స్టాలిన్‌గ్రాడ్ మీద టన్నుల కొద్ది బాంబుల వర్షాన్ని కురిపించాయి.

సెప్టెంబరు నాటికి స్టాలిన్‌గ్రాడ్‌లో ఉక్కు, ఆయుధాలు, ట్రాక్టర్లు తయారు చేసే కీలక ఫ్యాక్టరీల మీద జర్మనీ దాడి మొదలైంది.

జర్మనీ యుద్ధ విమానం

ఫొటో సోర్స్, getty images/Keystone-France

మరోవైపు ఆకాశం నుంచి యుద్ధవిమానాలు దాడుల తీవ్రతను పెంచగా నేల మీద యుద్ధట్యాంకులు, ఫిరంగులతో విరుచుకుపడింది జర్మనీ.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంలో జర్మన్ వైమానిక దళాలు కీలక పాత్ర పోషించాయి. వందల సంఖ్యలో యుద్ధవిమానాలు సోవియట్ బలగాల మీద ఎడతెగకుండా బాంబులు, బుల్లెట్లు కురిపించాయి.

ఆ దాడుల్లో సోవియట్ రష్యాకు చెందిన కొన్ని రెజిమెంట్లు పూర్తిగా నాశనమయ్యాయి. మొత్తానికి సుమారు మూడు నెలల పోరాటం తరువాత స్టాలిన్‌గ్రాడ్‌లోని మెజారిటీ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ.

జర్మన్ బలగాల చేతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నా పట్టు వదలలేదు సోవియట్ రష్యా. తన పేరు మీద ఉన్న స్టాలిన్‌గ్రాడ్‌ను నిలబెట్టుకోవడాన్ని స్టాలిన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీలోని రిజర్వుడు బలగాలను స్టాలిన్‌గ్రాడ్‌కు తరలించారు. దేశం నలుమూలల నుంచి యుద్ధ విమానాలను తీసుకొచ్చి మోహరించారు.

ఆయుధాలు పట్టగలిగిన ప్రతి ఒక్కరీని యుద్ధంలోకి దించారు. అటు హిట్లర్‌కు ఇటు స్టాలిన్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది స్టాలిన్‌గ్రాడ్ యుద్ధరంగం.

సోవియట్ రష్యా ఎదురుదాడులు

ఫొటో సోర్స్, getty images/TASS

సోవియట్ రష్యా ఎదురుదాడులు

అప్పటి వరకు జర్మనీ దాడులను కాచుకుంటూ వచ్చిన సోవియట్ రష్యా ఇక ఎదురు దాడులు ప్రారంభించింది. 1942 నవంబరులో ఆపరేషన్ యురేనస్ పేరిట జర్మన్ సిక్త్స్ ఆర్మీని స్టాలిన్‌గ్రాడ్ వద్ద చుట్టుముట్టుంది సోవియట్ రెడ్ ఆర్మీ.

నవంబరు చివరి నాటికి నగరంలోని చాలా ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది సోవియట్ రష్యా. యాక్సిస్ బలగాలను విడతీసి ఏకాకిని చేయడంలో అది విజయవంతమైంది.

స్టాలిన్‌గ్రాడ్ బయట లక్షల మంది జర్మన్ సైనికులను చుట్టు ముట్టింది సోవియట్ రష్యా సైన్యం. వీరిని విడిపించేందుకు డిసెంబరులో జర్మనీ చేపట్టిన ఆపరేషన్ వింటర్ స్టార్మ్ విఫలమైంది.

ఆపరేషన్ లిటిల్ శాట్రన్ పేరుతో యాక్సిస్ కూటమిలోని ఇటలీ, హంగేరీ బలగాలను ఓడించింది సోవియట్ రష్యా. మొత్తం మీద 1943 జనవరి నాటికి సోవియట్ బలగాలు పూర్తి ఆధిపత్యం సాధించాయి.

కానీ, జర్మన్ బలగాలు లొంగి పోయేందుకు హిట్లర్ అంగీకరించలేదు. చివరకు ఆయుధ సామాగ్రి, తిండి లేని జర్మన్ సైన్యం ఆ తరువాత కొద్ది రోజులకే లొంగిపోయింది. దాంతో 1943 ఫిబ్రవరి 2న స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం ముగిసింది.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం

ఫొటో సోర్స్, getty images/Hulton Archive

సుమారు 20 లక్షల మంది మరణం

దాదాపు ఆరు నెలలపాటు సాగిన స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంలో భారీ ప్రాణనష్టం జరిగింది. జర్మనీ నాయకత్వంలోని యాక్సిస్ బలగాలు 7 లక్షల మందికి పైగా సైనికులను కోల్పోయాయి. సోవియట్ రష్యాకు చెందిన 11 లక్షల మంది సైనికులు చనిపోవడమో, గాయపడటమో జరిగింది.

ఇక వేల సంఖ్యలో సామాన్య ప్రజలు మరణించారు. స్టాలిన్‌గ్రాడ్ శిథిలాల కుప్పగా మారింది. ఈ యుద్ధంలో సోవియట్ రష్యా సైనికుల సగటు జీవితకాలం 24 గంటలే నంటూ కొందరు నిపుణులు అంచనా వేశారు.

అందుకే ప్రపంచచరిత్రలోనే అత్యంత ఘోరమైన యుద్ధాలలో దీన్ని ఒకటిగా చూస్తారు.

హిట్లర్ అంచనాలు తలకిందులు

ఫొటో సోర్స్, getty images/UniversalImagesGroup

హిట్లర్ అంచనాలు తలకిందులు

తొలి నుంచి కూడా జర్మన్ల ఆక్రమణ సాధ్యమైనంత వరకు నెమ్మదిగా సాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు స్టాలిన్.

సోవియట్ రష్యా బలగాలు దెబ్బతింటూ నష్టపోతూ వెనక్కి తగ్గుతూనే జర్మన్ సైన్యానికి గట్టి పోటీ ఇచ్చాయి. దాంతో అనుకున్నంత వేగంగా హిట్లర్ సేనలు ముందుకు కదలలేక పోయాయి.

చలికాలం వచ్చే వరకూ జర్మన్ బలగాలను స్టాలిన్‌గ్రాడ్‌లోనే నిలువరించడంలో విజయం సాధించింది సోవియట్ రష్యా.

సోవియట్ యూనియన్‌ను ఆక్రమించాలనే తొందరలో అక్కడి వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా సిద్ధం కావడంలో విఫలమయ్యాడు హిట్లర్.

రెడ్ ఆర్మీని తక్కువ అంచనా వేసిన హిట్లర్, చలికాలంలోపే రష్యానంతా గెలవొచ్చని భావించాడు. అందువల్ల దూకుడుగా దాడులు చేయడం మీదనే ఫోకస్ పెట్టిన హిట్లర్, సుదీర్ఘ కాల పోరాటాలకు అనుగుణంగా తన బలగాలను సిద్ధం చేయలేదు.

చలికాలంలో యుద్ధం

ఫొటో సోర్స్, getty images/Sovfoto

కానీ, ఊహించని రీతిలో సోవియట్ బలగాల నుంచి జర్మనీకి గట్టి పోటీ ఎదురైంది. దాంతో స్టాలిన్‌గ్రాడ్ వద్దకు చేరుకునే సరికే చలికాలం వచ్చేసింది.

ఎక్కువ కాలం పోరాడాల్సి రావడంతో జర్మన్ సైనికులకు కావాల్సిన తిండి సరకులు అయిపోయాయి. ఆయుధ సామాగ్రికి కొరత ఏర్పడింది. యుద్ధవిమానాల సంఖ్య తగ్గిపోయింది.

మరో వైపు వెస్ట్ ఫ్రంట్‌లో ఫ్రాన్స్, బ్రిటన్‌తో పోరాడుతున్న జర్మనీకి సోవియట్ రష్యాతో యుద్ధం ఓ గుదిబండగా మారింది.

జర్మనీ దూకుడుగా ముందుకొస్తున్న రోజుల్లో వ్యూహాత్మకంగా ధాన్యం, పశువులు, ఇతర కీలకమైన సామగ్రిని స్టాలిన్‌గ్రాడ్ దాటించారు స్టాలిన్.

దాంతో తిండి దినుసులు దొరక్క జర్మన్ సైన్యాలు ఇబ్బందిపడ్డాయి. అందువల్ల సోవియట్ యూనియన్ తిరిగి దాడులు మొదలు పెట్టినప్పుడు నిలబడలేక పోయాయి.

మంచు తుపానులను ఎదుర్కొంటూ సోవియట్ బలగాలు చేసే దాడులను కాచుకోవడం జర్మనీకి కష్టంగా మారింది.

పెట్రోలు, డీజిల్ కోసమేనా?

ఫొటో సోర్స్, getty images/Mondadori Portfolio

పెట్రోలు, డీజిల్ కోసమేనా?

వోల్గా నది ఒడ్డున్న ఉండే స్టాలిన్‌గ్రాడ్, సోవియట్ రష్యాకు ఎంతో కీలకమైన నగరం. పారిశ్రామిక నగరమైన స్టాలిన్‌గ్రాడ్‌లో రష్యా ఆయుధాలు, వాహనాలు తయారుచేసేది.

అంతేకాదు, దక్షిణ రష్యాపై పట్టు కోసం కూడా ఈ నగరమే కీలకం. బ్లాక్ సీ, కాస్పియన్ సీ మధ్య ఉండే కాకసస్ ప్రాంతం ముడిచమురు వనరులకు నిలయం.

స్టాలిన్‌గ్రాడ్‌ను ఆక్రమిస్తే, కాకసస్ ప్రాంతంలోని చమురు నిక్షేపాలను సొంతం చేసుకోవచ్చన్నది హిట్లర్ పథకం.

నాటి సోవియట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ పేరు మీదనే ఆ నగరానికి స్టాలిన్‌గ్రాడ్ అనే పేరు వచ్చింది. అందుకే స్టాలిన్ గ్రాడ్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని హిట్లర్ సెంటిమెంటల్ విజయంగా కూడా భావించాడు.

సోవియట్ రష్యాపై హిట్లర్ దాడికి కారణమేంటి?

ఫొటో సోర్స్, getty images/ullstein bild Dtl.

సోవియట్ రష్యాపై హిట్లర్ దాడికి కారణమేంటి?

రెండో ప్రపంచయుద్ధం ప్రారంభంలో జర్మనీ, సోవియట్ యూనియన్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సోవియట్ యూనియన్ మీద జర్మనీ కానీ, జర్మనీ మీద సోవియట్ యూనియన్ కానీ దాడి చేయకూడదు.

1939లో జరిగిన ఈ ఒప్పందాన్నే హిట్లర్-స్టాలిన్ పాక్ట్ అని కూడా అంటారు. కానీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 1941లో సోవియట్ యూనియన్ మీదకు దండెత్తాడు హిట్లర్.

యుద్ధానికి దిగనంటూ ఒప్పందం చేసుకొని కూడా సోవియట్ యూనియన్ మీద హిట్లర్ దండెత్తడానికి అనేక కారణాలున్నాయి.

రెండో ప్రపంచయుద్ధంలో భాగంగా ఒకేసారి బ్రిటన్, ఫ్రాన్స్‌తోనూ సోవియట్ యూనియన్‌తోనూ పోరాడటం కష్టం కనుకనే సోవియట్ యూనియన్‌తో రాజీకీ వచ్చాడు హిట్లర్.

తద్వారా పూర్తిగా ఫోకస్ ముందుగా పశ్చిమ దేశాల మీదనే పెట్టేందుకు హిట్లర్ మార్గం సులభమైంది. ఒప్పందం అయితే చేసుకున్నాడు కానీ సోవియట్ యూనియన్‌ను పూర్తిగా నమ్మలేదు హిట్లర్.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం

ఫొటో సోర్స్, getty images/Sovfoto

బ్రిటన్, ఫ్రాన్స్‌తో చేసే యుద్ధంలో బలహీనపడిన తరువాత జర్మనీ మీదకు స్టాలిన్ దండెత్తుతాడని హిట్లర్ భావించాడు.

పైగా రెండు దేశాల సిద్ధాంతాలు వేరు. సోవియట్ రష్యా అనుసరించే కమ్యూనిజానికి హిట్లర్ బద్ధ వ్యతిరేకి. అలాగే నాజీ సిద్ధాంతాలు స్టాలిన్‌కు పొసిగేవి కాదు. అందువల్ల స్టాలిన్‌ను నమ్మలేకపోయాడు హిట్లర్.

సోవియట్ రష్యా మీదకు జర్మనీ దండెత్తడానికి మరొక కారణం ముడి చమురు వంటి సహజ వనరులు.

రష్యాతో పోలిస్తే జర్మనీ భూభాగం చాలా చిన్నది. అందువల్ల దానికి వనరుల కొరత ఉండేది. యుద్ధ అవసరాలకు రష్యాలోని ముడి చమురు వంటి సహజ వనరులు ఎంతో కీలకమని హిట్లర్ భావించాడు.

ఈ కారణాల వల్ల సోవియట్ యూనియన్‌ను ఆశ్చర్యపరస్తూ దాని మీదకు జర్మనీ దండెత్తింది. కానీ చివరకు సోవియట్ బలగాల ప్రతిఘటనతో జర్మనీకి ఓటమిని చవి చూడక తప్పలేదు. ఫలితంగా హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

వీడియో క్యాప్షన్, వ్లాదిమిర్ పుతిన్: ఒకప్పటి గూఢచారి.. ప్రపంచనేతగా ఎలా ఎదిగారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)