F-35C: సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు

ఎఫ్35సీ విమానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్లేర్ హిల్స్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

అమెరికా నావికాదళానికి చెందిన ఒక యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. చైనా ఆ విమాన శకలాలు సంపాదించక ముందే తాము దానిని చేరుకోవాలని అమెరికా నౌకాదళం కాలంతో పోటీపడుతోంది.

పది కోట్ల డాలర్ల విలువ చేసే ఆ F-35C విమానం.. యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ యుద్ధనౌక నుంచి టేకాఫ్ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కూలిపోయిందని అమెరికా నౌకాదళం చెప్పింది.

ఆ జెట్ విమానం సరికొత్తది. అత్యంత రహస్య పరికరాలను దానిలో అమర్చారు. ఇప్పుడది అంతర్జాతీయ జలాల్లో కూలిపోవటంతో.. దానిని ఎవరైనా అందుకోవచ్చు.

ఎవరు ముందు దానిని చేరుకుంటే వారు గెలుస్తారు. మరి బహుమతి? అత్యంత ఖరీదైన, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యుద్ధవిమానంలోని రహస్యాలన్నీ.

దక్షిణ చైనా సముద్రంలో గాలింపు

ఫొటో సోర్స్, Getty Images

గత సోమవారం సైనిక విన్యాసాల సందర్భంగా విన్సన్ డెక్‌కు ఢీకొని కూలిపోయినపుడు ఏడుగురు నావికులు గాయపడ్డారు.

ఇప్పుడది సముద్రగర్భంలో పడివుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందనేది రహస్యం. అది ఎక్కడ కూలిపోయిందనేది కానీ, దానిని వెలికితీయటానికి ఎంత కాలం పడుతుందని కానీ అమెరికా నౌకాదళం నిర్ధారించటం లేదు.

చైనాయేమో.. దాదాపు దక్షిణ చైనా సముద్రం అంతా తనదేనని వాదిస్తోంది. దానిని బలపరచుకోవటానికి ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నో చర్యలు చేపట్టింది. 2016 అంతర్జాతీయ ట్రైబ్యునల్ ఆదేశాన్ని పాటించటానికి నిరాకరిస్తోంది. దానికి చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదని చెప్తోంది.

కూలిపోయిన F-35C విమానం కోసం చైనా అన్వేషిస్తోందనే వాదనను చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ గురువారం నాడు తిరస్కరించారు. ‘‘ఆ విమానం మీద మాకు ఆసక్తి లేదు’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు.

అయినప్పటికీ.. ఆ విమానాన్ని వెదికి పట్టుకెళ్లాలని చైనా సైన్యం చాలా ఆసక్తిగా ఉంటుందని అమెరికా జాతీయ భద్రత నిపుణులు అంటున్నారు. అమెరికా సహాయ నౌక ఒకటి.. విమానం కూలిన ప్రదేశానికి కనీసం 10 రోజుల దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

అలా జరిగితే చాలా ఆలస్యమవుతుందని డిఫెన్స్ కన్సల్టెంట్ అబి ఆస్టెన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అప్పటికి బ్లాక్స్ బ్యాటరీ పనిచేయకుండా పోతుందని, దానివల్ల విమానం జాడను కనిపెట్టటం మరింత కష్టమవుతుందని ఆమె తెలిపారు.

‘‘అమెరికా తన విమానాన్ని వెనక్కు తెచ్చుకోవటం చాలా ముఖ్యం. ఎఫ్-35 యుద్ధవిమానం ఎగిరే కంప్యూటర్ వంటిది. ఇతర కీలక స్థావరాలు, కంప్యూటర్లతో లింకయ్యేలా దానిని డిజైన్ చేశారు’’ అని ఆమె వివరించారు.

చైనా దగ్గర ఆ టెక్నాలజీ లేదు కాబట్టి ఆ విమానాన్ని పట్టుకోవటం ద్వారా వారు భారీ ముందడుగు వేయగలుగుతారని ఆమె చెప్తున్నారు.

ఇక్కడ ప్రచ్ఛన్నయుద్ధం ఛాయలు కనిపిస్తున్నాయా అని అడిగినపుడు.. ‘‘ఇదంతా బరిలో ఎవరు బలవంతులు అనే క్రీడ. నిజానికిది ‘ద హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ మీట్స్ ద అబిస్’ – ఓ అద్భుతమైన నాటకం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, దక్షిణ చైనా సముద్రం: ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద ప్రాంతంగా ఎందుకు మారింది

F-35C ఎందుకంత ప్రత్యేకం?

విమానం ఎగురుతుండగా సేకరించే సమాచారాన్ని రియల్ టైమ్‌లో షేర్ చేయగలిగే నెట్‌వర్క్ అనుసంధానిత మిషన్ సిస్టమ్

అమెరికా నౌకాదళం అమ్ములపొదిలోకి చేరిన.. శత్రువుల గగనతలంలో వారు గుర్తుపట్టకుండా ఎగరగలిగే తొలి ‘లో-అబ్జర్వబుల్’ విమానం.

ఇంకా పెద్ద రెక్కలు, బలమైన ల్యాండింగ్ గేర్ వల్ల సముద్రంలో యుద్ధనౌకల నుంచి ఈ విమానాన్ని లాంచ్ చేయటం సులభం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధవిమానం ఇంజన్ ఇందులో ఉంది. గంటకు 1200 మైళ్ల వేగాన్ని – అంటే మాక్ 1.6 వేగాన్ని చేరుకోగలదు.

రెక్కల మీద రెండు మిసైళ్లు, లోపల నాలుగు మిసైళ్లను మోసుకుపోగలదు

వీడియో క్యాప్షన్, వీడియో: భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ

యూఎస్ చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్స్‌కు మాజీ సలహాదారు, మాజీ సీనియర్ నాటో, ఈయూ దౌత్యవేత్త అయిన ఆస్టెన్.. ఈ విమానాన్ని పట్టుకుని తెచ్చుకునే హక్కులు తమవేనని చైనా వాదించే ప్రయత్నం చేస్తే అది అమెరికాకు ఒత్తిడి పరీక్ష అవుతుందని పేర్కొన్నారు.

సైబర్ గూఢచర్యం వల్ల.. ఈ విమానం లోపలి సాంకేతిక గురించి చైనా వారికి కొంత తెలిసినప్పటికీ.. ఈ విమానాన్ని తాము చేజిక్కించుకోవాలని చైనా కోరుకుంటుందనటంలో సందేహం లేదని చైనా అఫైర్స్ ఎనలిస్ట్ బ్రైస్ బారోస్ చెప్పారు.

‘‘ఈ విమానంలో సాంకేతికతను ఎలా అమర్చారు, అందులోని బలహీనతలు ఏమిటి అనేది మరింత బాగా తెలుసుకోవటానికి ఈ విమానంలోని అసలు భాగాలను చూడాలని వారు కోరుకుంటారని నేను భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

ఈ విమానాన్ని వెదికి తేవటానికి రికవరీ ఆపరేషన్ కొనసాగుతోందని అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో చెప్పింది.

వీడియో క్యాప్షన్, విమానం చక్రాల్లో దాక్కుని వెళ్లినా బతికాడు, ఎలాగంటే..

విమానాన్ని ఎలా వెలికితీస్తారు?

యూఎస్ నేవీ సూపర్వైజర్ ఆఫ్ సాల్వేజ్ అండ్ డైవింగ్ బృందం.. విమానానికి బ్యాగులు తగిలిస్తుంది. ఆ తర్వాత వాటిలోకి నెమ్మదిగా గాలి నింపుతుంది. తద్వారా విమానశకలం నీటిపైకి తేలుతుంది.

అయితే.. విమానం ఒకే ముక్కగా ఉండకపోతే ఈ ఆపరేషన్ మరింత కష్టమవుతుంది.

ఈ విమానం రెక్కల్లో కానీ, అంతర్గతంగా కానీ కనీసం ఒక జత మిస్సైళ్లు ఉండి ఉండే అవకాశముంది. వీటివల్ల కూడా దీనిని వెలికితీయటం సంక్లిష్టంగా మారొచ్చు.

ఎవరు ముందు కనుక్కుంటే వాళ్లదే అనే ఈ సైనిక పిల్లీ ఎలుక ఆటలు గతంలోనూ చోటుచేసుకున్నాయి.

1974లో ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయిలో ఉన్నపుడు.. అమెరికాకు చెందిన సీఐఏ భద్రతా విభాగం.. హవాయి సముద్ర తీరం నుంచి ఒక రష్యా సబ్‌మెరీన్‌ను ఓ భారీ లోహపు పంజాను ఉపయోగించి రహస్యంగా పైకి లాగింది.

రెండేళ్ల ముందు.. చైనా తూర్పు తీరంలో మునిగిపోయిన బ్రిటన్‌కు చెందిన జలాంతర్గామి హెచ్ఎంఎస్ పొసీడిన్‌ను చైనా సైన్యం రహస్యంగా పట్టితెచ్చుకుంది.

వీడియో క్యాప్షన్, నిషేధాన్ని ఉల్లంఘించి చైనాకు విమానాలు నడిపిన ఒక ఎయిర్‌లైన్స్

అలాగే.. 2011లో ఒసామా బిన్ లాడెన్ మీద దాడి చేసినపుడు.. అమెరికాకు చెందిన ఒక స్టెల్త్ హెలికాప్టర్‌ కూలిపోగా.. చైనా దానిని చేజిక్కించుకుందని అందరూ భావిస్తున్నారు.

‘‘అప్పుడు ఆ హెలికాప్టర్‌లోని పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను చైనా సైన్యం చూడగలిగిందని మేం కచ్చితంగా నమ్ముతున్నాం’’ అని బారోస్ పేర్కొన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైన సముద్రంలో అత్యంత లోతు నుంచి శకలాలను వెలికితీసిన ఉదంతం.. 2019 మేలో జరిగింది. ఫిలిప్పీన్స్ సముద్రంలో కూలిపోయిన అమెరికా నౌకాదళానికి చెందిన రవాణా విమానాన్ని అప్పుడు వెలికి తీశారు.

అప్పుడది సముద్రతలానికి 5,638 మీటర్లు (18,500 అడుగులు) లోతులో ఉంది.

అయితే.. ఈ రేసులో మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంది. అమెరికా యుద్ధ విమానం చైనా చేతికి చిక్కకుండా ఉండటానికి.. ఆ విమానాన్ని ధ్వంసం చేయటం.

‘‘దానిని టార్పెడోతో పేల్చివేయటం అవసరమవుతుంది’’ అని సైనికాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ మార్గాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపించటం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)