చైనా-అమెరికా ఉద్రిక్తతలు: దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, శుభం కిశోర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా మరింత క్రియాశీలకంగా చర్యలు చేపడుతోంది.
రెండు అమెరికా నావికా దళ విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో సోమవారం యుద్ధ విన్యాసాలు చేశాయి.
"మేం అతణ్ని చూసాం.. అతడు కూడా మమ్మల్ని చూసాడు"అని అమెరికా భారీ యుద్ధ నౌక యూఎస్ఎస్ నిమిట్స్ కమాండర్ రియర్ అడ్మిరల్ జేమ్స్ కర్క్.. రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
అమెరికా బల ప్రదర్శన చేసేందుకే దక్షిణ చైనా సముద్రంలోకి నౌకలను పంపిస్తోందని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఈ ప్రాంతంలోని దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
ఈ ప్రాంతంలో అమెరికా, చైనా బలాలను ప్రదర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. అయితే ఈ సారి పరిస్థితి కాస్త భిన్నమైనది. కరోనావైరస్ వ్యాప్తి రెండు దేశాల ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవైపు చైనాపై అమెరికా మరింత ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
"కరోనావైరస్ వల్ల అమెరికా నావికా దళం బలహీన పడిందని చైనా భావిస్తోంది. అయితే తమ సామర్థ్యం ఏమీ తగ్గలేదని నిరూపించేందుకే అమెరికా ఈ సంకేతం ఇచ్చింది" అని సెంటర్ ఫర్ చైనా అనాలసిస్ అండ్ స్ట్రాటజీ అధ్యక్షుడు జయదేవ్ రనాడే వ్యాఖ్యానించారు.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అందరిదని, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని అమెరికా చెప్పాలని అనుకుందని రనాడే అన్నారు.
ఉద్రిక్తతలు ఇంకా పతాకస్థాయికి చేరలేదని ఆయన అన్నారు. "చైనా కు చెందిన నౌకను అడ్డుకొన్నా లేదా ఈ ప్రాంతంలో చైనా సైనిక స్థావరాల ఏర్పాటును అడ్డుకొనేందుకు ప్రయత్నించినా ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుతాయి" అని ఆయన వివరించారు.
అయితే, రానున్న రోజుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.
"సముద్ర జలాల్లో స్వేచ్ఛగా తిరిగడం, హక్కని చెబుతూ.. అమెరికా ఇదివరకు కూడా ఇలా నౌకలను పంపించింది. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. కోవిడ్-19కు కళ్లెం వేయడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. చైనాకు ఎదురు నిలవగల ఏకైక నాయకుడు తానేనని ట్రంప్ నిరూపించుకోవాలని అనుకుంటున్నారు"అని జేఎన్‌యూ ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దక్షిణ చైనా సముద్ర వివాదం
3.5 మిలియన్ల చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉండే ఈ సముద్రం... ఇండోనేసియా నుంచి వియత్నాంల మధ్యలో ఉంటుంది. దీనిపై మాకు హక్కులు ఉన్నాయంటూ చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, తైవాన్, బ్రూనై వాదిస్తున్నాయి. ఇక్కడి జలాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. భిన్న రకాల జీవ జాతులకూ ఇది నిలయం.
దశాబ్దం ముందువరకు ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. అయితే చైనా నౌకల అన్వేషణలతో ఇక్కడ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇసుక, ఇటుకలు, కాంక్రీటు సాయంతో ఇక్కడ పెద్దయెత్తున నిర్మాణపు పనులను చైనా చేపడుతోంది.
మొదట చైనా ఇక్కడ నౌకాశ్రయం నిర్మించింది. తర్వాత విమానాలు దిగేందుకు రన్ వేలు సిద్ధంచేసింది. అనంతరం కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలనూ ఏర్పాటుచేసింది.
ఈ ప్రాంతానికి సంబంధించి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పును కూడా చైనా తోసిపుచ్చింది.
భారత్ నుంచి అమెరికా ఏం ఆశిస్తోంది?
ఇటీవల భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల అనంతరం దక్షిణ చైనా సముద్రంలో భారత్ జోక్యం ఎక్కువవుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం ఎవరికీ చెందదని ఇప్పటివరకు భారత్ చెబుతూ వస్తోంది.
అయితే, చైనాతో సంబంధాలు దిగజారుతున్న తరుణంలో భారత్.. అమెరికాకు దగ్గరవుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే దక్షిణ చైనా సముద్రంలో మాత్రం భారత్ అంత క్రియాశీల పాత్ర పోషించకపోవచ్చని అంటున్నారు.
"భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా చూస్తోంది. ఈ విషయంలో భారత్ తమ వాదనకే కట్టుబడి ఉండాలని కోరుతోంది. ఎందుకంటే ఇది కూడా ఒకలాంటి మద్దతే కదా.. చైనా దీన్ని వ్యతిరేకిస్తోంది కూడా" అని రనాడే వ్యాఖ్యానించారు.
"ఈ ప్రాంతంలో అమెరికా నౌకల గస్తీకి కూడా ఏ దేశమూ మద్దతు పలకడం లేదు. అయితే 2015లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు.. దక్షిణ చైనా సముద్రంలో సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు భారత్, అమెరికా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి" అని స్వరణ్ వివరించారు.
"ఈ ప్రకటన అనంతరం చైనా నిరసన తెలియజేసింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్ నేరుగా స్పందించలేదు. చాలాసార్లు చైనా విస్తరణ కాంక్ష గురించి మాట్లాడినా.. దక్షిణ చైనా సముద్రం పేరును నేరుగా ప్రస్తావించలేదు."
భారత్ ఇప్పటికీ ఇదే వాదనకు కట్టుబడి ఉందని, ఉద్రిక్తతలు తీవ్రమైతే క్వాడ్ ప్రధాన పాత్ర పోషించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఏమిటీ క్వాడ్?
ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్యూఎస్ఐడీ)నే క్వాడ్‌గా పిలుస్తున్నారు. ఇది అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల రాజకీయ చర్చల కూటమి.
"దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం ప్రదర్శించినప్పుడు అన్ని దేశాల నుంచీ ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా భారత్, జపాన్, ఆస్ట్రేలియాల వాణిజ్యంలో ఈ మార్గం ప్రధాన పాత్ర పోషిస్తోంది. క్వాడ్ ఎప్పుడూ దూకుడుతో వ్యవహరించదలేదు. చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకోవాలనే దేశాలు దీనిలో తమ ఆలోచనలు పంచుకుంటాయి"అని మాజీ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా వివరించారు.
2007లోనే పురుడు పోసుకున్న క్వాడ్ పదేళ్లపాటు మౌనంగానే ఉండిపోయింది. 2017లో మళ్లీ క్వాడ్ దేశాలు సమావేశమయ్యాయి.
2019లో క్వాడ్ దేశాల సమావేశం స్థాయి పెరిగింది. ఆ ఏడాది నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశంలో పాలుపంచుకున్నారు. క్వాడ్ సైనిక కూటమి కాదు.. అందుకే దక్షిణ చైనా సముద్రంలో సైనిక జోక్యం ఉంటుందని నిపుణులు భావించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









