‘చైనా ఏజెంట్లు ప్రపంచమంతా పాకేశారు.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్ మెయిలింగ్‌లు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్
టెలికాం దిగ్గజం హువావే చుట్టూ తాజాగా అల్లుకున్న వివాదం, చైనా గూఢచర్యం విధానాలను మరోసారి బయటపెట్టింది.
చైనా తన పనులు నెరవేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది తేటతెల్లం చేసింది.
చైనా గూఢచర్యం ఏ స్థాయిలో ఉంది? అది ఎలా నడుస్తుంది? ఎవరు నడుపుతారు?
మాజీ ఎం-16 గూఢచారి సహకారంతో ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ అనేక అంశాలను బయటపెట్టింది.
తమ టెలికాం కంపెనీ తిరిగి బ్రిటన్‌లో కార్యకలాపాలు కొనసాగించడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ రాజకీయ నాయకులతో ఎలా వ్యవహారం నడిపిందో.. ప్రముఖ వ్యక్తులను ప్రభావితం చేయడానికి ఎలా ప్రయత్నించిందో అందులో వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పని చేస్తుంటుంది.
ఇది చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి జవాబుదారీగా ఉంటుంది.
ఆయా సంస్థలు తమ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా? లేదా అనేది ఈ విభాగం నిత్యం పర్యవేక్షిస్తుంటుంది.
ఈ తరహాలోనే బిజినెస్ ముసుగులో చైనా కమ్యూనిస్టు పార్టీ బ్రిటన్‌లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
"కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ప్రపంచమంతా ఉంటుంది'' అని ఒకరు వ్యాఖ్యానించారు.
"చైనాకు సంబంధించినంత వరకు వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు కాదు'' అని ఆయన అన్నారు.
చైనా కమ్యూనిస్టు పార్టీకి 9 కోట్ల 30 లక్షలమందికి పైగా సభ్యులున్నారు. వారిలో చాలామంది వివిధ దేశాలలోని సంస్థల్లో పనిచేస్తుంటారు.
రహస్యాలు సేకరించడానికి ముఖ్యంగా టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో వీరు క్రియాశీలంగా ఉంటారు.
విదేశాలలోని కంపెనీలలో పనిచేసే వీరంతా ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటారు.
వివిధ రకాల పద్దతుల్లో ఆయా దేశాలలోని అధికారులను, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
హనీట్రాప్
చైనా తన వ్యూహాల అమలులో అనేక ఎత్తుగడలు వేస్తుంది. తమ లక్ష్యం చైనాయేతరుడైన అధికారి అయితే పెద్ద మొత్తంలో బహుమతుల రూపంలో అతన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది మొదటి రకం విధానం.
ఆ తరువాత అనేక విధాలుగా ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటివి చేస్తుంటారు.
పాశ్చాత్య దేశాల వారికి చైనాలో పెద్దపెద్ద బిజినెస్ మీటింగ్‌లకు ఆహ్వానం పంపడం, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ధన రూపంలో సాయం చేయడం, లేదంటే ఏ కంపెనీలోనో నాన్- ఎగ్జిక్యుటివ్ బోర్డ్ మెంబర్ పదవిని కట్టబెట్టడం, ఒక్కోసారి వారి జీవితమే మారిపోయేంత డబ్బును ఆఫర్ చేయడంలాంటి పనులు చేస్తుంటాయి.
గత పది, పదిహేనేళ్లుగా కీలకమైన విదేశీ వ్యక్తులను భారీ నజరానాలతో ఆకట్టుకునే పద్ధతి క్రమంగా పెరుగుతూ వచ్చినట్లు తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక చైనాలో కూడా ఇలాంటి విధానాలు కొన్ని మరీ దారుణంగా ఉంటాయి.
దేశంలో ఉన్న వారి కుటుంబం సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, బ్లాక్‌మెయిల్ చేయడం, విదేశీవ్యాపారులైతే వారికి అమ్మాయిలను ఎరవేయడం(హానీట్రాప్) సర్వసాధారణం.
ఆకర్షణీయమైన మహిళలతో వారి పరిచయం కలగజేసి వారితో సంభాషణలు, ఇతర వ్యవహారాలను రికార్డు చేసి.. బ్లాక్ మెయిల్ చేస్తారు.
"సొంత దేశంలో హనీట్రాప్‌ను సెట్‌చేయడంలో చైనా ప్రభుత్వం నేర్పరి'' అని చైనాలో పని చేస్తున్న ఒక బ్రిటిష్ అధికారి అన్నారు.
ఇలాంటివన్నీ చైనా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి.
కాకపోతే ఇవన్నీ కేంద్రీకృత విధానంలో కాకుండా, వివిధ రాష్ట్రాల రక్షణ విభాగాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల వ్యవహారాలను విడివిడిగా పర్యవేక్షిస్తుంటాయి.
ఉదాహరణకు అమెరికా వ్యవహారాలను షాంఘై బ్యూరో చూసుకుంటే , రష్యా వ్యవహారాలను బీజింగ్ బ్యూరో.. జపాన్, కొరియా వ్యవహారాలను టియాంజిన్ బ్యూరో చూసుకుంటాయి. ఇలా ఒక్కొక్క బ్యూరో ఒక్కో దేశ వ్యవహారాలు చూస్తుంది.
"సమాచార సేకరణ కోసం చైనా ప్రభుత్వం తన అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది'' అని ఈ వ్యవహారాలలో పాలుపంచుకున్న ఓ వ్యక్తి వెల్లడించారు.
భారీ సైబర్ గూఢచర్యం దగ్గర్నుంచి, ఇండస్ట్రీ నిపుణులను లోబరుచుకునే వరకు, వివిధ మార్గాలలో ఇది కొనసాగుతుంది'' అని ఆయన వెల్లడించారు.
"రష్యాతోపాటు, ఇప్పుడు చైనా కూడా బ్రిటన్‌కు అతి పెద్ద గూఢచర్య ముప్పుగా పరిణమించింది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








