భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?

ఫొటో సోర్స్, Getty Images
హిమాలయాల్లో చైనాతో జరిగిన సరిహద్దు యుద్ధాన్ని చూసిన వారెవరూ యాభైయేళ్లయినా దాన్ని అంత తేలిగ్గా మరచిపోలేరు. భారత సైన్యం ఆనాడు పరాజయం పాలైంది. అది ఓ రాజకీయ వైఫల్యం.
ఈ యుద్ధం చరిత్రను మళ్లీ తిరగరాయాల్సిన అవసరం లేనంతగా చరిత్రకారులు లిఖించారు.
జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రను రాసిన ఎస్. గోపాల్ అయితే ఘటనలను చాలా దారుణంగా వర్ణించారు. దీనిలో కొన్ని ఘటనలైతే నమ్మలేని నిజాల్లా కనిపిస్తాయి.
తప్పిదాలు ఏ స్థాయిలో జరిగాయంటే.. అప్పటి భారత రాష్ట్రపతి ఎస్ రాధా కృష్ణన్ సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు గుప్పించారు. వాస్తవాలను బేరీజు వేసుకోకుండా చైనాను గుడ్డిగా నమ్మారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తప్పు
"ఈ ఆధునిక ప్రపంచం వాస్తవాలకు మనం చాలా దూరంగా ఉండిపోయాం. మనం ఓ అభూత కల్పన ప్రపంచంలో జీవిస్తున్నాం" అని పార్లమెంటులో నెహ్రూ పశ్చాత్తాపంతో వ్యాఖ్యానించారు.
సరిహద్దుల్లో చిన్నచిన్న అతిక్రమణలు, అవతలి ప్రాంతాల్లో గస్తీ, ఆరోపణలు చేయడం తప్పితే చైనా ఇంకేమీ చేయలేదని భావించి చాలా తప్పు చేసినట్లు ఆయన దాదాపు అంగీకరించారు.
1959 నవంబరు తొలి వారంలో చైనాతో ఘర్షణ విధ్వంసకర స్థాయికి చేరింది. తొలిసారి లద్దాఖ్‌లోని కోంగ్‌కాలాలో చైనా రక్తం ఏరులై పారించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ తప్పులన్నింటికీ మన ప్రధాన మంత్రే బాధ్యులని అందరూ ఆయన వైపే వేళ్లు చూపించారు.
అయితే ఆయన సలహాదారులు, అధికారులు, సైన్యానికి కూడా దీనిలో పాత్ర ఉంది. వీరెవరూ మీరు చేసేది తప్పని నెహ్రూకి చెప్పే ధైర్యం చేయలేకపోయారు..
నెహ్రూకు అందరికంటే బాగా తెలుసు అనే సాకుతో అందరూ తప్పించుకున్నారు. “మేం చైనా చదరంగం ఆడుతున్నాం అనుకున్నాం. అయితే అది ప్రాణాంతక రష్యా రూలెట్ గేమ్‌లా మారిపోయింది” అని చైనాతో ఏకపక్షంగా కాల్పుల విరమణ అనంతరం భారత సైన్యాధిపతిగా మారిన జనరల్ ముచ్‌కూ చౌధరి వ్యాఖ్యానించారు.
బాధ్యులు ఎవరు?
ఈ పరాజయానికి బాధ్యులైన వారి జాబితా చాలా పెద్దదే ఉంది. వీరిలో ఇద్దరి పేర్లు అగ్రస్థానంలో ఉంటాయి. వారిలో ఒకరు 1957 నుంచి రక్షణ మంత్రిగా పనిచేసిన కృష్ణ మేనన్.
రెండో పేరు కృష్ణ మేనన్‌కు వెన్నంటే నిలబడిన లెఫ్టినెంట్ జనరల్ బీఎం కౌల్. ఈశాన్య సైనిక విభాగానికి అప్పుడు కౌల్ అధిపతిగా ఉండేవారు. ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్‌ను అప్పుడు “ఈశాన్య ఫ్రంటియర్” గా పిలిచేవారు.
కౌల్.. అగ్రశ్రేణి సైన్యాధికారుల్లో ఒకరు. పెద్దపెద్ద ఆకాంక్షలతో విపరీతమైన జోష్‌తో ఆయన ఉండేవారు. అయితే ఆయనకు యుద్ధంలో ఎలాంటి అనుభవమూ లేదు.
ఈశాన్య విభాగానికి కౌల్‌ను అధిపతిగా ఎంచుకోవడం పూర్తిగా తప్పిదమే. అయినా కృష్ణ మేనన్‌పై ప్రధానికి ఉండే గుడ్డి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిభావంతుడనే పేరుతోపాటు చిరుబురులాడే స్వభావం గల కౌల్.. సైన్యాధికారుల్ని జూనియర్ల ముందే అగౌరవ పరిచేవారు. సైనిక నియామకాలు, పదోన్నతుల్లో స్నేహితులకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
ఈ కారణాల వల్లే సైన్యాధిపతి జనరల్ కేఎస్ తిమ్మయ్య, మేనన్‌ల మధ్య ఎప్పుడూ గందరగోళం ఉండేది. ఒకసారి అయితే తిమ్మయ్య రాజీనామా కూడా సమర్పించారు. అయితే ఒత్తిడిపై ఆయన దాన్ని వెనక్కి తీసుకున్నారు.
అయితే ఆ తర్వాత, మేనన్ చెప్పినట్టే సైన్యం నడుచుకొనేది. మరోవైపు విపరీతమైన ఉత్సాహంతో ముందుకువెళ్లే కౌల్‌ను యుద్ధ కమాండర్‌గా నియమించి ఈ పరిస్థితిని ఆయన మరింత జటిలం చేశారు.
హిమాలయాల్లో ఎత్తైన ప్రాంతాలకు చేరుకున్నప్పుడు కౌల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను దిల్లీకి తీసుకొచ్చారు. అయితే దిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోనున్న ఇంట్లోనుంచి కౌల్ యుద్ధాన్ని నడిపిస్తారని మేనన్ ఆదేశాలు జారీచేశారు.

ఫొటో సోర్స్, J. Wilds
కుప్పకూలుతుందనే భయం
తిమ్మయ్య తర్వాత సైన్యాధిపతి అయిన పీఎన్ థాపర్.. ఈ పరిణామాలపై పూర్తిగా వ్యతిరేకించారు. అయితే వీటిని బహిరంగంగా వెల్లడిస్తే మేనన్‌ను ఢీకొట్టాల్సి వస్తుందని భయపడేవారు. కౌల్ చాలా తప్పులు చేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఆయన నిర్ణయాలను మార్చుకోమని చెప్పే ధైర్యాన్ని థాపర్ చేయలేకపోయేవారు.
నవంబరు 19న అమెరికా అధ్యక్షుడు కెన్నడీకి భావోద్వేగంతో నెహ్రూ లేక రాయకముందే.. ఈ పరిణామాల వల్ల మేనన్, కౌల్‌లపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.
ఫలితంగా కాంగ్రెస్‌లోని చాలా మందితోపాటు పార్లెమెంటు సభ్యులూ.. సరిహద్దుల్లో చొరబాట్లను పక్కనపెట్టి రక్షణ మంత్రి పదివి నుంచి మేనన్‌ను తప్పించడంపై దృష్టిపెట్టారు.
ఒత్తిడి పెరగడంతో నవంబరు 7న మేనన్‌ను రక్షణ మంత్రి పదవి నుంచి నెహ్రూ తప్పించారు. కౌల్‌కు రాష్ట్రపతి రాధాకృష్ణన్ చీవాట్లు పెట్టారు.
నవంబరు 19న రాష్ట్రపతిని కలిసేందుకు దిల్లీకి అమెరికా సెనేటర్లు వచ్చారు. వారిలో ఒకరు కౌల్‌ను అరెస్టుచేశారా? అని అడిగారు. దురదృష్టవశాత్తు అది జరగలేదు అని రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.
దేశ భద్రతపై మేనన్, కౌల్ తీసుకున్న నిర్ణయాలు చాలా అస్తవ్యవస్తంగా ఉండేవి. విధానపరమైన నిర్ణయాల్లో విదేశాంగ కార్యదర్శి ఎంజే దేశాయ్, నిఘా విభాగం అధిపతి బీఎన్ మాలిక్, రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి హెచ్‌సీ సారిన్‌లు మాత్రమే పాలుపంచుకొనేవారు.

ఫొటో సోర్స్, Getty Images
నిఘావిభాగం అధిపతి వైఫల్యం
వీరందరూ మేనన్ నమ్మినబంట్లే. వీరిలో మాలిక్ పాత్ర పెద్దది. నిఘా విభాగంతో సంబంధంలేని విధానపరమైన నిర్ణయాల్లోనూ ఆయన వేలు పెట్టేవారు.
ఆయన పనిపై ఆయన దృష్టిపెట్టి చైనా ఏం చేస్తుందో కనిపెట్టి ఉంటే భారత్ భంగపాటుకు గురయ్యేదికాదు.
వీరు చైనా వ్యూహాలను కనిపెట్టలేకపోయారు. పైగా చైనా నుంచి ఎలాంటి పెద్ద దాడి జరగదనే నమ్మకంలో ఉండేవారు.
అదే సమయంలో మావో, ఆయన సైన్యాధిపతులు, రాజకీయ సలహాదారులు జాగ్రత్తగా భారత్‌పై దాడికి ప్రణాళికలు రచించారు. వీటిని పక్కాగా అమలుచేశారు.
నెహ్రూ కూడా భారత్-చైనా ఘర్షణలపై చైనా-రష్యా విభేదాలు ప్రభావం చూపుతాయని, చైనా కొంచెం భయపడుతోందని భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
నమ్మక ద్రోహమా లేక పిరికిపందల చర్యా?
క్యూబా క్షిపణి సంక్షోభాన్ని సమర్థంగా ఉపయోగించుకొని నెహ్రూతోపాటు అప్పటి రష్యా అధ్యక్షుడు నికితా ఖ్రుషెచేవ్ కు కూడా బుద్ధి చెప్పాలని మావో భావిస్తున్నట్లు మనకు తెలియదు. అందుకే ఆనాడు సోవియట్ నాయకులూ మౌనంగా ఉండిపోయారు.
ఈ క్షిపణి సంక్షోభం గురించి భారత్‌కు ఎలాంటి సమాచారం లేదు. అక్టోబరు 25న, చైనా మన సోదర దేశం, భారతీయులు మన మిత్రులు అని రష్యా పత్రిక ప్రవడా ఓ వార్త ప్రచురించింది. దీంతో భారతీయుల్లో నైరాశ్యం అలుముకొంది.
చైనాతో భారత్ అన్ని అంశాలనూ బేరీజు వేసుకొని చర్చలు జరపాలని ప్రవడా సూచించింది. క్యూబా సంక్షోభం తర్వాత రష్యా తమ పాత విధానానికి వచ్చింది.
ఆ సమయాన్ని మావో ఉపయోగించుకున్నారు. ఫలితంగా అనుకున్న విధంగా భారత్‌పై ఆయన దాడి చేయగలిగారు. మరోవైపు కరేబియాతోపాటు హిమాలయాల్లో చర్యలకుగాను రష్యాకు కూడా ఆయన సందేశం ఇచ్చారు.
(అక్టోబరు 2012న బీబీసీ న్యూస్ కోసం సీనియర్ జర్నలిస్టు ఇందర్ మల్హోత్రా ఈ కథనం రాశారు. 11, జూన్ 2016లో మల్హోత్రా మరణించారు.)
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా మీడియా ఆరోపణలు ఏంటి?
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








