సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Hindustan Times
- రచయిత, మధు పాల్ వోహ్రా
- హోదా, ముంబయి నుంచి బీబీసీ కోసం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇకలేరు అని తెలుసుకున్న వారి కళ్లు చెమర్చాయి.
టీవీ సీరియల్స్‌లో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న ఆయన తర్వాతి కాలంలో సినిమాల ద్వారా మరింతమంది అభిమానులను సంపాదించుకున్నారు. 34 ఏళ్ల వయసులో ఆదివారం ముంబయిలోని తన నివాసంలో చనిపోయారు.
ముంబయి బాంద్రా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సుశాంత్ సింగ్ మృతదేహం లభించింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఎంతో మంది అభిమానులు, పేరు ప్రఖ్యాతలు ఉన్న యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? అన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానాలు దొరకలేదు. అయితే, గత ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌తో పోరాడుతున్నారని తెలుస్తోంది.
ముంబయిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే, విశాలమైన ఇంట్లో ఉండాలని భావించిన ఆయన ఎనిమిది నెలల కిందటే ఈ అద్దె ఇంటికి వచ్చారు.
ఈ అద్దె ఇంట్లో ఆయన ఒక్కరే నివసించట్లేదు. ఆయన క్రియేటివ్ మేనేజర్, ఒక ఫ్రెండ్, పనిమనిషి కూడా నివశిస్తున్నారు. అయితే, ఇంట్లో నివశిస్తున్న ఎవ్వరూ కూడా ఆదివారమే సుశాంత్ సింగ్ చివరి రోజు అనుకోలేదు.
సుశాంత్ సింగ్ పనిమనిషి చెప్పిన వివరాల ప్రకారం పోలీసుల కథనం ఇలా ఉంది.. ''ఉదయం అంతా బాగానే ఉంది. 6.30 గంటలకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిద్రలేశారు. పనిమనిషి 9 గంటలకు దానిమ్మ గింజల రసం ఆయనకు ఇచ్చారు. ఆయన దాన్ని తాగారు కూడా. 9 గంటల సమయంలో సుశాంత్ సింగ్ తన సోదరితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత తన స్నేహితుడు మహేశ్ షెట్టితో కూడా ఫోన్లో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Hindustan Times
మహేశ్ శెట్టితో పాటుగానే సుశాంత్ తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ఏక్తా కపూర్ సీరియల్ 'కిస్ దేశ్ మే హోగా మేరా దిల్'లో నటించారు. వారిద్దనూ మంచి స్నేహితులు.
సుశాంత్ సింగ్ చివరి ఫోన్‌కాల్ వెళ్లింది మహేశ్ షెట్టికే. ఆ తర్వాత సుశాంత్ సింగ్ తన గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపుకు గడియపెట్టుకున్నారు. 10 గంటలకు టిఫిన్ చేస్తారని పనిమనిషి ఆయన్ను గది బయటి నుంచి పిలిచారు. కానీ, సుశాంత్ సింగ్ తలుపు తెరవలేదు.
రెండు, మూడు గంటల తర్వాత కూడా సుశాంత్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సుశాంత్ సోదరికి మేనేజర్ కాల్ చేశారు. ఆమె సుశాంత్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత తాళాలు తయారు చేసే వ్యక్తిని పిలిచి గది తలుపు తెరిచారు. తమ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అంతా షాకయ్యారు''.
పోలీసుల కథనం ప్రకారం సుశాంత్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య చనిపోయారు. ఉరి తాడుకు సుశాంత్ సింగ్ వేలాడుతుండటాన్ని అతని సోదరి సహా అక్కడున్నవాళ్లు అందరూ చూశారు. సుశాంత్ పనిమనిషి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తమకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందిందని, 2.30 గంటలకు తాము సుశాంత్ సింగ్ ఇంటికి చేరుకున్నామని పోలీసులు వెల్లడించారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ముంబయి పోలీసుల విచారణ మొదలైంది. సుశాంత్ సింగ్ ఇంటి నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహాన్ని పోలీసులు సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ ఆర్ఎన్ కపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే పోస్టుమార్టం జరుగనుంది.
సాయంతంరం 6.45 గంటలకు ముంబయి 9వ జోన్ డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాతో మాట్లాడుతూ.. ''నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరితాడుకు వేలాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మృతికి అసలు కారణాలు ఏంటి? అనేది పోస్టు మార్టం జరిగిన తర్వాతనే పోలీసులు స్పష్టంగా చెప్పగలరు. ఆయన ఇంటి నుంచి ఎలాంటి అనుమానాస్పద వస్తువులనూ పోలీసులు సేకరించలేదు''.
34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ముంబయి చేరుకున్నారు. సోమవారం సుశాంత్ సింగ్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- డిప్రెషన్ సమస్యకు వేడినీళ్ల సమాధానం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" - దలైలామా
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








