ఇండియా-చైనా చర్చలు : సరిహద్దు వివాదానికి, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెర పడుతుందా

భారత్ సరిహద్దుల్లో చైనా సైనికుడు

ఫొటో సోర్స్, DIPTENDU DUTTA/AFP via Getty Image

ఫొటో క్యాప్షన్, భారత్ సరిహద్దుల్లో చైనా సైనికుడు(పాత చిత్రం)
    • రచయిత, ప్రొఫెసర్ స్వర్ణ్ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి ఈ రోజు(శనివారం) రెండు దేశల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి.

రెండు దేశాల మధ్య నెల రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ వివాదం ప్రధానంగా లద్దాఖ్ పాంగాంగ్ సరస్సు(కాన్‌క్లేవ్ లేక్)తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ దగ్గర ప్రాంతాల గురించి మొదలైంది.

రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు భారత్ చొరవతో జరుగుతున్నాయి.

అందుకే మొదటి దశ చర్చలకు భారత్-చైనా మధ్య నియంత్రణ రేఖ దగ్గర ఉన్న చుశుల్-మోల్దో బోర్డర్ పాయింట్ మీటింగ్ హట్‌ వేదికైంది.

జిన్ పింగ్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమావేశంలో భారత్ తరఫున లేహ్‌లోని ఇండియన్ ఆర్మీ 14వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్ పాల్గొంటున్నారు. ఈ వారంలోనే భారత సైన్యం నార్తర్న్ కమాండ్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ వై.కె.జోషి లేహ్‌లో పర్యటించారు.

క్షేత్రస్థాయిలో వరుసగా మారుతున్న పరిస్థితుల గురించి స్వయంగా ప్రత్య సమీక్ష జరపాలనే ఉద్దేశంతో జనరల్ జోషి లేహ్‌లో పర్యటించారు.

దీన్ని బట్టి ఈ అంశం ఎంత తీవ్రమైనదో మనకు అర్థమవుతుంది. ఇలా సరిహద్దు పోస్టులో రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి.

రెండు దేశాల సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఈసారీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది

సాధారణంగా సరిహద్దు పోస్టుల్లో ఇలాంటి చర్చలు బ్రిగేడియర్ స్థాయిలోనే జరుగుతుంటాయి. ఆ చర్చల ద్వారా రెండు దేశాల సైనికుల మధ్య ప్రాంతీయ స్థాయిలో ఏర్పడే ఉద్రిక్తతలకు తెరచిందేందుకు వారు ప్రయత్నిస్తుంటారు.

ఇప్పటివరకూ రెండు వైపులా సరిహద్దు పోస్టుల్లో లోకల్ కమాండర్ల మధ్య పది సార్లు చర్చలు జరిగాయి. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.

సరిహద్దుల్లో ఏర్పడిన అనిశ్చితిని చూసి భారత్ ఈరోజు చైనా లెఫ్టినెంట్ జనరల్‌తో చర్చలు జరుపుతోందంటే, ఇందులో వారికి షాక్ ఇచ్చే అంశాల్లాంటివి ఏవీ లేవు.

ముఖ్యంగా నియంత్రణ రేఖ దగ్గర చైనా అతిక్రమణ ఘటనలు ఏడాదిలో 600 సార్లకు చేరుకోవడంతో భారత్ ఈ చర్చలకు సిద్ధమైంది.

అంతే కాదు, రెండు దేశాల సైనికుల మధ్య అప్పట్లో మూడేళ్లలో ఒకసారి ఘర్షణ తలెత్తితే, ఇప్పుడు ఏడాదిలో మూడు సార్లు వారు గొడవపడ్డారు. ఇంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఘర్షణ స్థితి రాలేదంటే ఆ ఘనత ఈ లెఫ్టినెంట్ జరనళ్లకే దక్కుతుంది. వారు తమ సైనికులను ఎప్పటికప్పుడు అదుపులో పెడుతూ వచ్చారు.

చైనా సరిహద్దు

ఫొటో సోర్స్, YAWAR NAZIR

లద్దాఖ్‌లో సున్నిత పరిస్థితి

ఉదాహరణకు ఈసారీ భారత్, చైనా సైనికులు నియంత్రణ రేఖ దగ్గర నాలుగు సున్నిత ప్రాంతాల్లో అమీతుమీకి సిద్ధపడ్డారు.

వీటిలో తూర్పు లద్దాఖ్ చాలా సున్నితమైన ప్రాంతం. అక్కడ పాంగాంగ్ సరస్సు(కాంక్లేవ్ లేక్) గల్వాన్ లోయ ప్రాంతాలను రెండు దేశాలూ మావంటే మావని చెబుతుండడంతో ఇవి చర్చల్లో నిలిచాయి.

అయితే దీనిని భారత్, చైనా మధ్య ఉద్రిక్తలకు కొత్త కారణంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కొన్నేళ్లుగా తూర్పు లద్దాఖ్ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఆవిర్భవించింది.

ఇక్కడ డెమచోక్, చుమార్, త్రిక్ పర్వతాలపై ఇంతకు ముంద కూడా భారత, చైనా జవాన్ల మధ్య గొడవలు జరిగింది.

అయితే, మే 4న గల్వాన్ లోయ దగ్గర భారత్, చైనా సైనికులు గొడవకు దిగిన ప్రాంతం నుంచి చైనా దళాలు దాదాపు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయి. అలాగే భారత సైనికులు కూడా ప్రాంతం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ వెనక్కు తగ్గాయి.

భారత్ తన ఉద్దేశాన్ని కూడా బాహాటంగా చెప్పింది. ఇటీవల వివాదాలకు కారణమైన ప్రాంతాల నుంచి చైనా తమ సైనికులను వెనక్కు పిలిపిస్తే, భారత్ కూడా తమ సైన్యాన్ని మే 4కు ముందున్న స్థితికి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని చెప్పింది.

కానీ చైనా సైనికులు ఇప్పటికీ తూర్పు లద్దాఖ్‌లోని ఫింగర్-4 దగ్గర అలాగే ఉన్నారు. ఇది ఇంతకు ముందు భారత్ నియంత్రణలో ఉన్న ప్రాంతం.

దాంతో, ప్రభుత్వం నిర్దేశించిన ‘సంయమనంతో కఠిన వైఖరి’ అనే విధానంతో భారత్ కూడా ఆ వివాదిత ప్రాంతంలో తమ సైనిక దళాల సంఖ్యను పెంచేసింది. తూర్పు లద్దాఖ్‌లోని వివాదిత ప్రాంతానికి అదనపు సైనిక దళాలు, సాయుధ వాహనాలు, ఫిరంగులు పంపించింది.

2017 డొక్లామ్ సంక్షోభం తర్వాత సైన్యం మధ్య చెలరేగిన ఈ తీవ్ర ఉద్రిక్తతలకు వీలైనంత త్వరగా తెరదించాలని రెండు దేశాల సైన్యాలు దౌత్య స్థాయిలో పరస్పర చర్చలు జరుపుతున్నాయని భారత ప్రభుత్వం చెప్పింది.

ఇండో చైనా బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫింగర్-4 గురించే వివాదం

భారత-చైనా లెఫ్టినెంట్ జనరళ్లకు పాంగాంగ్ సరస్సు దగ్గర ఎదురవుతున్న సవాళ్ల గురించి తెలుసుకోవాలంటే తూర్పు లద్దాఖ్‌లో ఉన్న ఫింగర్-4 భౌగోళిక పరిస్థితిని తెలుసుకోవడం చాల ముఖ్యం.

ఫింగర్-4 ప్రాంతం పాంగాంగ్ సరస్సు తీరాన్ని తాకుతుంది. నిజానికి కరాకోరం పర్వత తూర్పు ప్రాంతం అంటే చాంగ్ చెనమో నుంచి 8 పర్వత దారులు వెళ్తాయి. వాటిని ఫింగర్ అంటారు.

ఈ దారుల్లో నియంత్రణ రేఖ ఎక్కడనుంచి వెళ్తుంది అనేదానిపై చైనా, భారత్ వేరు వేరు వాదనలు వినిపిస్తున్నాయి. భారత సైనికులు ఫింగర్-8 ప్రాంతం వరకూ గస్తీ కాస్తుంటారు.

కానీ వాస్తవానికి ఫింగర్-4 ప్రాంతం భారత్ స్వాధీనంలో ఎప్పుడూ లేదు. అటు చైనా మాత్రం నియంత్రణ రేఖ ఫింగర్-2 నుంచి వెళ్తుంది అని చెబుతోంది.

చైనా సైనికులు ఫింగర్-4 వరకూ గస్తీ కాస్తున్నారు. అప్పుడప్పుడూ వారు ఫింగర్-2 వరకు కూడా వస్తుంటారు. అందుకే ఇరు దేశాలకు చెందిన వందలాది సైనికులు ఇప్పుడు ఫింగర్-4 ప్రాంతంలో అమీతుమీకి సిద్ధమవుతున్నారు.

మే 5న ఇక్కడే భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. కానీ పరస్పరం తోసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం దాటి అది ముందుకు వెళ్లలేదు.

కానీ, తూర్పు లద్దాఖ్‌లోని చాలా ప్రాంతాల్లో చైనా తమ సైన్యాన్ని చాలా రెట్లు పెంచేసింది. నియంత్రణ రేఖ దగ్గర వివాదిత ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టింది. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశం.

ఇప్పుడు చైనా తమ సైనికులతో తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టింది. వారికి సాయంగా ఆర్ ట్యాంకులు, ఫిరంగులు ఇతర ఆయుధాలను కూడా మోహరించింది.

చైనా తన ఆయుధాలను, రిజర్వ్ సైనికులను నియంత్రణ రేఖకు చాలా దగ్గరలో మోహరించింది. శాటిలైట్ దృశ్యాల్లో పాంగాంగ్ సరస్సు దగ్గర నుంచి వెళ్లే నియంత్రణ రేఖకు దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఒక చైనా సైనిక స్థావరంలో కార్యకలాపాలు బాగా పెరిగినట్లు కనిపిస్తోంది.

చైనా, భారత్ సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

చైనాకు కలవరం

సరిహద్దుల దగ్గర భారత్ నిర్మించిన ఒక రోడ్డు చైనాకు కోపం తెప్పించింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు ఇది ప్రధాన కారణంగా నిలిచింది.

గల్వాన్ లోయను దారబుక్, షాయోక్, దౌలత్ బేగ్ ఓల్డీలతో కలిపే 255 కిలోమీటర్ల రోడ్డుపై చైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ రోడ్డు వల్ల లేహ్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ వరకూ చేరుకోడానికి ఇప్పుడు చాల తక్కువ సమయం పడుతుంది.

దౌలత్ బేగ్ ఓల్డీలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన వైమానిక దళ స్థావరం ఉంది. ఇది నియంత్రణ రేఖకు అతి దగ్గరలో ఉన్న భారత ఎయిర్ ఫీల్డ్.

ఈ రోడ్డు వేయడం వల్ల లేహ్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ చేరుకోడానికి ఇంతకు ముందు రెండ్రోజులు పడితే, ఇప్పుడు దానికి ఆరు గంటలు పడుతుంది.

చైనా ఇంతకు ముందు నుంచే తమ ప్రాంతంలో వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తోంది. సరిహద్దుల్లో ఇలాంటి రహదారులు వేస్తే సైనికులకు భారీగా ఆయుధాలు తరలించడానికి, ఆర్మీ వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందనే విషయం వారికి తెలుసు.

అందుకే సరిహద్దుల్లో వివాదాలను లేవనెత్తి భారత్‌ను గందరగోళంలో పెట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. దీని వెనుక ప్రధాన లక్ష్యం భారత్ నియంత్రణ రేఖకు దగ్గరగా తమ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను విస్తరించకుండా అడ్డుకోవడం. వాటిని అడ్డుకోలేకపోయినా, కనీసం అవి ఆలస్యం అయ్యేలా చేయాలని చైనా భావిస్తోంది.

లద్దాఖ్‌లో చైనా ఇలా స్పందించడం వెనుక అసలైన అతిపెద్ద ఆందోళన వేరే ఉంది.

అక్సాయి చీన్ ప్రాంతంలో తమ అక్రమ చొరబాట్లను సవాలు చేయడానికే భారత్ ఈ రోడ్డు నిర్మిస్తోందని చైనా భయపడుతోంది.

అటు నియంత్రణ రేఖకు దగ్గరగా చైనా ప్రముఖ లాసా కాష్గర్ హైవే కూడా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి ముప్పుగా మారింది.

భారత్, చైనాల జెండాలు

ఫొటో సోర్స్, Getty Images

లెఫ్టినెంట్ జనరల్ చర్చల్లో సవాళ్లు

రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. రెండూ తమ భూభాగంలోని ఇంచి భూమిని కూడా వదులుకోమని ప్రతిజ్ఞలు చేశాయి.

నియంత్రణ రేఖ దగ్గర రెండు దేశాల మధ్య స్పష్టత లేని ఇలాంటి వివాదిత ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి రెండూ వేరు వేరు వాదనలు వినిపిస్తున్నాయి.

చైనాతో తమ సరిహద్దులు 3488 కిలోమీటర్లు ఉందని భారత్ చెబుతోంది. కానీ చైనా మాత్రం రెండు దేశాల మధ్య 2000 కిలోమీటర్ల సరిహద్దు రేఖే ఉందని అంటోంది.

సరిహద్దుల్లో ఉన్న దాదాపు లక్షా 30 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రెండు దేశాలూ మాదంటే మాదని చెబుతున్నాయి.

లద్ధాఖ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ వివాదం ముగుస్తుందా?

అయితే తాజాగా జరిగే ఈ చర్చల వల్ల రెండు దేశాల మధ్య అన్ని వివాదాలూ ముగిసిపోతాయని అనుకోలేం. ఎందుకంటే నియంత్రణ రేఖ దగ్గర చైనా చొరబాట్లు, అతిక్రమణల ఈ పాటర్న్ మిగతా ప్రాంతాల్లో దాని భౌగోళిక విస్తరణ వ్యూహంలో ఒక భాగం మాత్రమే.

అలాంటప్పుడు దీనిని భారత్, చైనా మధ్య చివరి సరిహద్దు వివాదం అనలేం. ఒక అడుగు వెనక్కు, రెండడుగులు ముందుకు వేసే డ్రాగన్ ఎత్తుగడ వారి విస్తృత వ్యూహంలో ఒక భాగం. అందుకే భారత్ దానిని ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సుంటుంది.

(రచయిత దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఇండర్నేషనల్ స్టడీస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఆర్గనైజేషన్ అండ్ డిసార్మ్ మెంట్ అధ్యక్షుడు కూడా)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)