కరోనావైరస్: పూజలు చేస్తే కరోనా మాయమవుతుందా.. ప్రార్థనలు చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందా

ఫొటో సోర్స్, BBC MONITORING
కోవిడ్-19 విషయంలో వైద్య శాస్త్రం ఇప్పటి వరకు ఎటువంటి కచ్చితమైన నివారణ మార్గాన్ని కనుక్కోలేదు. కానీ భారత్‌లోని కొన్ని మతాలకు సంబంధించిన గ్రూపుల్లో మాత్రం కొన్ని విశ్వాసాలను పాటించడం ద్వారా కోవిడ్-19 మహమ్మారి బారిన పడకుండా ఉంటామన్న ప్రచారం జరుగుతోంది.
తెలిసిన వాళ్ల నుంచి, తెలియని వాళ్ల నుంచి ఇటువంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలను విస్తృతంగా చేరుతున్నాయి. వాటిని చూస్తే కచ్చితంగా నమ్మేట్టుగా మాత్రమే కాదు.. కొన్ని సార్లు హాస్యాస్పదంగా కూడా ఉంటున్నాయి.
వీటిల్లో చాలా వరకు హిందు, ముస్లిం, క్రైస్తవ మతాలకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కనిపిస్తున్నాయి. అయితే అవన్నీ కూడా ప్రార్ధనలకే పరిమితం కావడంతో వాటి వల్ల హాని లేదని చెప్పవచ్చు. అయితే కొన్ని సార్లు ఇటువంటి మూఢభక్తి కారణంగా కోవిడ్ రోగులకు చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఆ తరువాత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొన్ని సార్లు ఇటివంటి మతపరమైన నమ్మకాలు సమాజంలో ప్రజల మధ్య చీలికలను తెచ్చే ప్రమాదం కూడా ఉంది. వేర్వేరు మతాలకు చెందిన కొన్ని గ్రూపులు వైరస్‌ను తగ్గిస్తాయంటూ తమ సొంత అభిప్రాయాలను ప్రచారం చెయ్యడం మాత్రమే కాదు, ఇతర మతాలకు చెందిన వాళ్లు ఇన్ఫెక్షన్‌కు వాహకాలుగా మారుతున్నారంటూ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ తప్పుడు సమాచారం వల్ల తలెత్తే సమస్యలను హైలెట్ చేస్తూ ఆంగ్ల న్యూస్ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో చాలా మంది భారతీయులు మూఢ విశ్వాసాలను, వదంతులను, అశాస్త్రీయ విధానాలు నమ్మడం వల్ల కోవిడ్-19 బాధితులకు చికిత్సను అందించడం చాలా కష్టతరమవుతోందని ఆ కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Bsip
కోవిడ్-19కి రామాయణంలో పరిష్కారం ఉందని ప్రచారం..
హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణంలో ప్రస్తుతం తలెత్తిన కోవిడ్-19 మహమ్మారిని ప్రస్తావన ఉందన్న మెసేజ్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. గబ్బిలాల నుంచి ఒక వైరస్ పుడుతుందని అది ప్రపంచాన్ని కమ్మేస్తుందని ఆ గ్రంథంలో ప్రస్తావించారన్నది ఆ సమాచారం సారాంశం.
అలాగే 17వ శతాబ్దంలో తులసీదాసు రచించిన రామాయణంలో కూడా అనేక శ్లోకాల్లో(దోహా) ప్రస్తుతం తలెత్తిన మహమ్మారి ప్రస్తావించారంటూ న్యూస్ ట్రాక్‌లైవ్.కామ్ అనే వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
“అందులో కరోనావైరస్ వ్యాధి లక్షణాల గురించి చెబుతూ వ్యాధి కారణంగా దగ్గు పెరుగుతుందని ఆ ప్రభావం ఊపిరితిత్తులపై పడి అక్కడ రక్తం పేరుకుపోవడం మొదలవుతుంది”అని ఒక శ్లోకంలో ఉందని ఆ వెబ్ సైట్ తెలిపింది.
అయితే ఇలాంటి ప్రచారాల విషయంలో నిజానిజాలు ప్రజల ముందుకు తెచ్చే ది లలాన్ టాప్. కామ్ అనే వెబ్ సైట్ అసలు ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యాధి గురించి ప్రస్తావించారంటూ పేర్కొంటున్న శ్లోకాలను అవాధీ మాండలికం నుంచి హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి తప్పుగా అనువాదం చేశారని తెలిపింది. తులసీదాసు రామాయణంలో గబ్బిలాలను ప్రస్తావించిన సందర్భం వేరని తన కథనంలో పేర్కొంది.
కోవిడ్-19 దేశంలో వేగంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కూడా స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. మధ్య ప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో మాయిహర్ దేవీ ఆలయానికి చెందిన ప్రధానార్చకులు ప్రజల్ని కరోనావైరస్ బారి నుంచి కాపాడాలంటూ హనుమంతునిపై ప్రత్యేక ప్రార్థనను కూడా కంపోజ్ చేశారని ప్రముఖ ఇంగ్లిష్ వార్తా వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అలాగే వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న దారిలో ఓ చోట పది రూపాయలకే కరోనావైరస్ చికిత్స అంటూ బోర్డులు కూడా వెలిసినట్టు ఆ కథనంలో తెలిపింది.
వ్యాధిని ఎదుర్కొనేందుకు అవసరమయ్యే నిరోధక శక్తి పెరుగుతుందని గతంలో కొన్ని హిందూ గ్రూపుల్లో ప్రచారం జరిగింది కూడా.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా సోకకుండా ఖురాన్ కాపాడుతుందని మరో ప్రచారం
ఇటువంటి ప్రచారాలు కేవలం ఒక్క హిందూ మతానికే పరిమితం కాలేదు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ చదివితే కరోనావైరస్ సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చంటూ ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ అయ్యాయి.
ఖురాన్ నుంచి కరోనావైరస్ వచ్చిందని ఎవ్వరైతే ఖురాన్ చెప్పినట్టు పాటిస్తారో వారు కోవిడ్-19 గురించి భయపడాల్సిన పని లేదంటూ ఓ మహిళ చెప్పే వీడియో వాటిల్లో ఒకటి.
“ఖురాన్ నుంచి కరోనా పుట్టింది. కరోనా అంటే ఖురాన్ అని అర్థం. దీని కన్నా ప్రమాదకరమైన వ్యాధులు పుట్టుకొస్తాయి. కానీ దేవుడి దయ వల్ల మనం మాత్రం సుక్షితంగా ఉంటాం” అని ఆ మహిళ వీడియోలో చెబుతారు. హిందూ రాజకీయాలకు మద్దతు పలికే వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలతో పాటు కొన్ని మీడియా సంస్థలు ఆ వీడియోను ఉపయోగించుకున్నాయి.
కొంత మంది 'దువా' అని పిలువబడే కొన్ని ఖురాన్ పద్యాలను 'హదీసులు' అని పిలువబడే ముహమ్మద్ ప్రవక్త యొక్క సూక్తులను, ముస్లింలను మహమ్మారి బారి నుంచి సురక్షితంగా ఉంచుతాయని పేర్కొనే సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ప్రవక్త ఆదేశాలైన హదీసుల్ని వాట్సాప్‌లో షేర్ చేస్తూ చివర్లో ఆ హదీసు వారిని వైరస్ బారిన పడకుండా కాపాడుతుందని కూడా ప్రచారం చేశారు
కొంత మంది ఇస్లాం మత పెద్దలు కోవిడ్-19 నుంచి రక్షించుకునేందుకు తమ సొంత విధానాలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో సుమారు 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్న ప్రస్తుతం వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనవైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏ విధానాలైతే పాటిస్తున్నారో వాటి ప్రస్తావన సుమారు 1400 ఏళ్ల పురాతమైన హదీసులో కూడా ఉందని చెప్పుకొచ్చారు. “ఈ విషయంలో నేను చెప్పింది తప్పు అని ఏ ఒక్కరూ రుజువు చెయ్యలేరు” అంటూ ఆ హధీసును చదవే ముందు ఆ వీడియోలో ఆయన చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏసు క్రీస్తును ప్రార్థిస్తే వైరస్‌నుంచి కాపాడుకోవచ్చని ప్రచారం
ఇక క్రైస్తవుల విషయానికొస్తే కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు తగినంత వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలో జీసస్ సాయం చేస్తారంటూ ప్రచారం జరిగింది. అలాంటి వాటిలో కేరళకు చెందిన హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ పేరిట ప్రచారమైన మెసేజ్ ఒకటి. కేరళలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులంతా జీసస్‌ను ప్రార్ధించాలంటూ ఆయన ఆ మెసేజ్‌లో ప్రజల్ని అభ్యర్థించారు. మలయాళంలో ఉన్న ఆ మెసేజ్ అర్థం ఇలా ఉంటుంది. “నేను జీసస్ క్రైస్ట్ రక్తంతో వాక్సినేట్ చేయబడ్డాను. నన్ను ఏ వైరస్ కూడా తాకలేదు”.
మొదటి మూడు దశల 40 రోజుల లాక్ డౌన్‌ను బైబిల్‌తో ముడి పెడుతూ మరో మేసేజ్ వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారమైంది. 40 అనే సంఖ్యకు విశేష ప్రాముఖ్యం ఉందని, నోవహు కాలంలో 40 రోజుల పాటు వరద కొనసాగిందని, మోషే 40 రోజులు దేవునితో ఉన్నాడని, ఏసు కూడా 40 రోజులు ఎడారిలో ఉపవాసం ఉన్నాడని ప్రచారం చేశారు. మొత్తంగా “బైబిల్ ప్రకారం ఎప్పుడెప్పుడైతే 40 సంఖ్య వచ్చిందో అప్పుడు గొప్ప మార్పు సంభవించింది” అని చెప్పుకొచ్చారు.
ప్రముఖ ఇంగ్లిష్ మ్యాగ్‌జైన్ “ద వీక్” వెబ్ సైట్ కూడా ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. కేరళలోని కొంతమంది కాథలిక్కులు సెయింట్ కరోనా పేరిట ప్రార్థనలు చేస్తే కోవిడ్-19ను అడ్డకోవచ్చని భావిస్తున్నారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు సెయింట్ కరోనా చిత్ర పటాలు, మలయాళంలో ప్రార్థనా గీతాలు కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్‌లలో ప్రచారమయ్యాయి. అందులో సెయింట్ కరోనా మనల్ని కరోనావైరస్ నుంచి కాపాడుతుందంటూ కొందరు బోర్డులపై రాసుకున్నారు కూడా.
అయితే చర్చి వర్గాలు కానీ, సీనియర్ మతాధికారులు కానీ ఈ తరహా ప్రచారాన్ని ఆమోదించలేదని “ద వీక్” తన కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్ నుంచి మిడతల దండు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు వచ్చేస్తోందా
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు
- పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం ఎలా
- కరోనావైరస్: అంటార్కిటికాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ‘భారతి మిషన్’ పరిశోధకులు ఎలా ఉన్నారు?
- వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
- లాక్డౌన్ సడలిస్తే మనకు ముప్పు తప్పదా
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది
- ప్రధాని మోదీ ఏడాది కిందట కాళ్లు కడిగిన పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్డౌన్ కాలంలో ఎలా ఉన్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








