కరోనావైరస్: అంటార్కిటికాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ‘భారతి మిషన్’ పరిశోధకులు ఎలా ఉన్నారు?

ఫొటో సోర్స్, Pradeep Tomar
- రచయిత, శామ్ ప్రాఫిట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంటార్కిటికా ఖండంలో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కానప్పటికీ అక్కడ పని చేస్తున్నపరిశోధన బృందాలు మాత్రం స్వీయ నిర్బంధ నియమాలను ఎందుకు పాటిస్తున్నాయి?
ఇక్కడ ఒక్క కోవిడ్-19 కేసు నమోదు అయినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
“మా పరిస్థితి నిర్బంధంలో నిర్బంధానికి గురైనట్లుగా ఉంది” అని భారతీయ మిషన్ ‘భారతి’ పరిశోధన బృందంలో పని చేయడానికి వెళ్లిన డాక్టర్ ప్రదీప్ తోమర్ అన్నారు.
“వ్యాధి సోకాక చికిత్స తీసుకోవడం కన్నా వ్యాధి రాకుండా కాపాడుకోవడం మంచిది” అని ఆయన అన్నారు.
ఆయన అంటార్కిటికా వెళ్లి ఐదు నెలలు అవుతోంది. ఆయన అక్కడ భారతి మిషన్‌లో సంవత్సరం పాటు పని చేయవలసి ఉంది.
ఇక్కడ కనుక ఎవరికైనా కోవిడ్-19 సోకితే జరిగే ప్రమాదాన్ని ఊహించలేమని ప్రదీప్ అన్నారు. వైద్య సదుపాయాల కొరత, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, PRADEEP TOMAR
ఇక్కడ ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కానప్పటికీ 23 మంది సభ్యులతో కూడిన భారతి బృందం ఫిబ్రవరి నుంచి లాక్ డౌన్ లోనే గడుపుతోంది.
అంటార్కిటికాకు వెళ్లిన వారెవరినైనా 14 రోజుల పాటు కచ్చితంగా క్వారంటైన్‌లో పెడుతున్నారు.
ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే వారిని, వారి సమీపంలోకి వచ్చిన వారిని కూడా స్వీయ నిర్బంధంలో పెట్టాలని ఆయన అన్నారు.
అంటార్కిటికాలో 29 దేశాలకు పరిశోధనా స్థావరాలు ఉన్నాయి.
లాక్ డౌన్ ప్రారంభం కాక ముందు భారతి మిషన్‌ను సందర్శించడానికి ఇతర దేశాల వారు వస్తుండేవారు.
వారి సందర్శనకి గుర్తుగా వారి వారి దేశాల జాతీయ జండాలను ఎగరవేసేవారు. ఆయా దేశాల్లో జరుపుకునే జాతీయ పండగలని, ముఖ్యమైన రోజులని అందరూ కలిసి జరుపుకునేవారు.
ఎవరికైనా ఏమైనా పరికరాలు అవసరం అయితే ఇచ్చి పుచ్చుకునేవారు.
బయట ప్రపంచంలో దేశాల మధ్య ఇంత సుహృద్భావం కనిపించదని తోమర్ అన్నారు.
కానీ, లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇతర స్థావరాల నుంచి ఎవరూ రావటం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Pradeep Tomar
ధృవ యాత్రలు చేపట్టినప్పుడు పరిశోధకులపై ఉండే మానసిక ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు తోమర్ నవంబర్ 15వ తేదీన అంటార్కిటికా వెళ్లారు.
“వచ్చిన కొత్తలో మిగిలిన ప్రపంచంలో ఉన్నట్లే అనిపించింది. కానీ, ఇప్పుడు కరోనావైరస్ గురించిన సమాచారం పూర్తిగా లేకపోవడం వలన, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అనే ఆందోళన నిరంతరం వేధిస్తోంది” అని ఆయన అన్నారు.
తోమర్‌కి, అతని సహచరులకి కరోనావైరస్ ఒక మహమ్మారి అని దానిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్‌లు విధించారన్న సమాచారం మాత్రమే ఉంది.
ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సమాచారం మీదే ఆధారపడుతున్నారు.
సామాజిక దూరం వలన కలిగే పరిణామాలని ఆయన ఊహించలేకపొతున్నారు.
‘‘నేనున్నట్లే చాలా మంది వారి వారి ఇళ్లల్లో నిర్బంధంలో ఉన్నట్లు నా స్నేహితులు చెబుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించి బయటకి వెళ్లడం నా ఊహకి అందటం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా క్వారంటైన్ పద్ధతులు అమలులో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి బయటకి వెళ్లడం గాని, బయట నుంచి ఇక్కడికి ఎవరైనా రావడం గాని సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించటం లేదు.
ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణంలో మేము మరిన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’’ అని తోమర్ చెప్పారు.

ఫొటో సోర్స్, PRADEEP TOMAR
దక్షిణ సముద్ర తీరంలో ఉన్న లార్సెమాన్ పర్వతాలపై భారతి మిషన్ స్థావరం నెలకొని ఉంది.
ఈ మిషన్ 2012 లో ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే అత్యంత మారు మూల ప్రదేశాల్లో నెలకొన్న పరిశోధనా స్థావరం ఇది.
దీనికి 5000 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆఫ్రికా భూభాగం ఉంది. ఇదే ఈ స్థావరానికి దగ్గర్లో ఉన్న భూభాగం. ఇక్కడ నుంచి బయటకి వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క రవాణా మార్గం బోట్ ప్రయాణం మాత్రమే.
అది కూడా అంటార్కిటికాలో వేసవికాలం అయిన నవంబర్ మధ్య నుంచి మార్చి చివరి వరకు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలవుతుంది.
ఇలాంటి ప్రదేశంలో నివసిస్తున్నవారు లాక్ డౌన్ ఎలా ఉంటుందో బాగా అర్ధం చేసుకోగలరు.
అంటార్కిటికా స్థావరంలో పని చేస్తున్న వారందరూ ప్రస్తుతం వారి వారి ఇళ్ల దగ్గర నుంచే పని చేస్తున్నారు. షాపులు ఏవి తెరవలేదు. సరదాగా బయటకి నడిచి వెళ్లే అవకాశం కూడా లేదు. మరో వైపు వాతావరణంలో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి పడిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Pradeep Tomar
ఇక్కడికి రాక ముందే భారతి మిషన్లో పని చేసే సభ్యులందరూ అంటార్కిటికా చలిని ఎలా తట్టుకోవాలో.. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి శిక్షణ తీసుకుని వచ్చారు.
సామాజిక నిర్బంధం, ఒంటరితనం, సూర్య రశ్మి లేకపోవడం వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. సూర్య రశ్మి లేకపోవడం వలన ఒక నిర్ణీత పద్దతిలో నిద్రపోవడం కూడా కష్టంగానే ఉంటుంది.
శరీరానికి తగినంత నిద్ర తీసుకోవాలని తమ బృంద సభ్యులకి సూచిస్తామని తోమర్ చెప్పారు.
ఆ చలి ఖండంలో ఉండే పరిస్థితుల గురించి తోమర్‌కి ఇక్కడికి రాక ముందే అవగాహన ఉంది. ఇక్కడ ఎప్పుడూ ప్రాణ భయం వెంటాడుతుందని తోమర్ అన్నారు. ఇప్పుడు ఆ భయం మరింత పెరిగిందని ఆయన అన్నారు.
‘‘అయితే, నాకు ఇంటి దగ్గర అందరూ ఎలా ఉన్నారో అనే భయం కూడా ఎక్కువైంది. నాకు నిర్బంధంలో ఎలా ఉండాలో తెలుసు, కానీ, ఇంటి దగ్గర వారికి శిక్షణ ఉండదు కదా’’ అనే భయాన్ని వ్యక్తం చేశారాయన.
తనకి తెలిసిన ప్రపంచ స్వరూపం ఈ ఒక్క సంవత్సరంలో పూర్తిగా మారిపోతుందేమోనని అన్నారు.
“ఈ సమయంలో దేశానికి సేవ చేయాలని నాకు బలంగా అనిపిస్తోంది. ఇలాంటి విపత్తుని ఎవరూ ఊహించలేదు. నేను ఇంటికి తిరిగి వెళ్లేసరికి మళ్ళీ పాత ప్రపంచం నా కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందని ఆశిస్తున్నాను”.
ఇవి కూడా చదవండి:
- తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం? ఎవరికి ప్రాణాంతకం?
- వేసవి ఎండలు: భారతదేశమే భూగోళం మీద అత్యంత వేడి ప్రాంతమా?
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








