కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’... పంటను కోయలేరు, అమ్మలేరు

- రచయిత, దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
- హోదా, వి. శంకర్, బీబీసీ కోసం
‘‘నా పేరు నరసింహారెడ్డి. టమాటా రైతుని. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో రూ.10 లక్షలు పెట్టుబడితో టమాటా సాగుచేస్తే.. ఇప్పుడు 30 కిలోలకు 80 రూపాయలు వస్తున్నాయి. కూలీలకు ఏమివ్వాలి? పెట్టుబడి ఎలా తీసుకురావాలి? నా కుటుంబం ఏం కావాలి?’’.. అంటూ ప్రశ్నిస్తున్న ఓ రైతు వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి ప్రభుత్వం కూడా స్పందించింది. సదరు రైతు నుంచి మొత్తం ఉత్పత్తి కొనుగోలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు.
అయితే ఈ సమస్య కేవలం నరసింహారెడ్డికి మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని వేల మంది రైతులు కరోనావైరస్ కారణంగా ఎదురైన లాక్‌డౌన్ ప్రభావంతో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, అవి పూర్తిస్థాయిలో అందరికీ ఉపయోగపడట్లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వర్షాలు కురిసినా.. కరోనా ముంచేస్తోంది
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం వర్షపాతం బాగానే నమోదైంది. ఫలితంగా ఈ రబీలో వరిని లక్ష్యానికి మించి సాగు చేశారు. 7.40 లక్షల హెక్టార్లలో రబీ పంట వేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 8.07లక్షల హెక్టార్లలో వరి పంట చేతికి వస్తోంది.
ఇప్పటికే గోదావరి డెల్టాలో వరి కోతకు సిద్ధమైంది. వరితో పాటుగా మొక్క జొన్న, ఆయిల్ పామ్ వంటి ఉద్యానవన పంటలు, శెనగలు, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు, టొమాటో వంటి కూరగాయల సాగు దిగుబడి దశకు చేరింది. పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో గంపెడాశతో ఉన్న రైతులకు అనూహ్యంగా వచ్చిన కరోనావైరస్ పెద్ద సమస్యగా మారింది.
మార్కెట్ లేకపోవడం, కూలీల కొరత వంటి కారణాలతో చేతి వరకూ వచ్చిన పంటను సొమ్ము చేసుకునే అవకాశం దక్కుతుందా లేదా అనేది ప్రస్తుతం వారికి అంతుబట్టట్లేదు.

ఖరీఫ్ కొనుగోళ్లు కూడా పూర్తికాలేదు
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళు ఇంకా పూర్తికాలేదు. ముఖ్యంగా ఆలస్యంగా ఖరీఫ్ పంట వేసిన నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. విజయనగరం జిల్లాలో కూడా దాదాపుగా లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ వాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం జాప్యం చేసింది.
విజయనగరం జిల్లాలో నిల్వ చేసేందుకు గోడౌన్లు సిద్ధంగా లేని కారణంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ నేపథ్యంలో మిగిలిన ధాన్యం అమ్మకాలు ఎలా అన్న ప్రశ్న ఎదురవుతోంది.
నెల్లూరు జిల్లా బుచ్చి మండలం దామరమడుగు గ్రామానికి చెందిన జక్కా రామిరెడ్డి అనే రైతు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఫిబ్రవరిలో తెరిచారు. పంట అమ్ముకుందామని అనుకునేలోపు మళ్లీ మూసేశారు. మార్చి 15 తర్వాత వాటిని తెరుస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్‌తో వాటిని తెరిచే అవకాశం లేదంటున్నారు. మా ధాన్యం ఏం చేయాలో పాలుపోవడం లేదు. 6 ఎకరాల పంట కుప్పలు వేశాం. మార్కెట్‌కి ధాన్యం తీసుకెళ్లడం కూడా కష్టమే. దళారులు కూడా ధరలు తగ్గించేస్తున్నారు. అటు ప్రభుత్వం కొనక, ఇటు పొలాల్లో ఉంచలేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి’’ అంటూ వివరించారు.

తెలంగాణలో పరిస్థితి మరోలా...
తెలంగాణలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడి రైతులు కూడా పంట కోతలకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకు కోతలు జరుగుతాయి.
తెలంగాణలో వరితో పాటు మొక్క జొన్న, మిర్చి, రాగులు, జొన్నలు లాంటి ఇతర పంటలను కూడా సాగుచేస్తున్నారు. మొక్క జొన్న కోతలు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావొస్తున్నాయని రైతులు అంటున్నారు. వరి కోతలకు ఇంకా దాదాపు రెండు వారాల సమయం ఉంది. ఈసారి రబీ వరి దిగుబడులు బాగా పెరిగాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. "ఊహించని రీతిలో ఈ ఏడాది పంట దిగుబడి పెరిగింది. సాగు నీటి సరఫరా పెరగటం అందుకు తోడ్పడింది’’ అన్నారు.
అయితే ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశం లాక్‌డౌన్‌లో ఉన్నందున రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దీని కోసం రూ.30 వేల కోట్లను పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేటాయించినట్లు తెలిపింది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకు ప్రతి ఊళ్లో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ ప్రతి రైతుకీ కూపన్లు ఇచ్చి, వాటి ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని ప్రభుత్వం అంటోంది.
"మార్కెట్ యార్డులు మూసి వేశాం. అక్కడికి ఏ రైతూ కూడా రావాల్సిన పని లేదు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యవసాయాధికారులే మీ వద్దకు వచ్చి ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు" అని ముఖ్యమంత్రి తెలిపారు.
వరంగల్ రూరల్‌లో ఉంటున్న రాజన్న అనే రైతు రెండు ఎకరాల్లో వరి పంట వేశారు. "ఈ ఏడాది నీరు అందినా, వర్షాలు సమయానికి కురవకపోవడంతో పంట దిగుబడి అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.
అయితే మొక్క జొన్న పంట ఇప్పటికే చేతికొచ్చింది. శ్రీనివాస్ లాంటి మొక్క జొన్న రైతులు పంటను మూటగట్టి ఇంటి దగ్గరకు చేర్చారు. "మా ఊళ్ళో కొంతమంది ప్రభుత్వ నిర్ణయం రాకముందే పంటను కాంటాకు వేశారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే అమ్మేశారు. ఆలా దాదాపు ఎకరం మీద రూ.15వేల దాకా నష్టపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం మంచిదైంది’’ అని శ్రీనివాస్ అంటున్నారు.
ఈ ఏడాది రబీలో మొత్తం 5.84 లక్షల ఎకరాల్లో 14.59 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదిలో వచ్చిన దిగుబడి (7.59 లక్షల మెట్రిక్ టన్నులు)తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఈ పంటనంతా ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
దీని కోసం తెలంగాణ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌ని నోడల్ ఏజెన్సీగా గుర్తిస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1760కి పంటను కొనుగోలు చేస్తున్నట్టు మార్కెఫెడ్ చైర్మన్ ఎం.గంగరెడ్డి తెలిపారు. "ఇప్పటికే పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు కూపన్లు ఇచ్చి ఆర్డరు ప్రకారం పంటను కొనుగోలు చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

ఈ మొక్కజొన్న పంట కొనుగోలు కోసం ప్రభుత్వ హామీ మీద బ్యాంకుల నుంచి మార్క్‌ఫెడ్ రూ.3213 కోట్లను అప్పుగా తీసుకునేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే తరహాలో వరిని కూడా కొనుగోలు చేయనున్నట్లు సివిల్ సప్లయిస్ విభాగం డిప్యుటీ కమిషనర్ శారద తెలిపారు. ‘‘గ్రామాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం. రైతులు తీసుకొచ్చే ధాన్యం నాణ్యతను చూసి, దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు అనుగుణంగా దాన్ని కొనుగోలు చేస్తాం’’ అని ఆమె తెలిపారు.
మంచి నాణ్యత గల ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1555గా ఉంది. వరి కోతలకు ఇంకాస్త సమయం కూడా ఉంది.

కౌలు రైతుల పరిస్థితేంటి?
అయితే ఈ కొనుగోళ్ల విషయంలో రైతులుకు కొన్ని సందేహాలు కూడా ఎదురవుతున్నాయి. కౌలు రైతులు పండించే పంటను ఎలా కొనుగోలు చేస్తారన్నది అందులో ఒకటి.
"ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు పట్టాదార్ పాస్‌బుక్ తీసుకొని రమ్మన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువకు సంబంధించిన డబ్బు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను మూడెకరాలు కౌలుకు తీసుకున్నా. పట్టాదార్ పాస్‌బుక్ నా పేరు మీద లేదు. మరి నేను ఏం చేయాలి’’ అన్నది భూపాలపల్లికి చెందిన గోపీ అనే రైతు సందేహం. అయితే జిల్లాలోని వ్యవసాయ అధికారి అందించిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా కౌలు రైతుల నుంచి కూడా పంటను కొనుగోలు చేసి, వారి ఖాతాలోనే డబ్బులు వేసే వెసులు బాటు ఉందని పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ శారద తెలిపారు.
‘‘ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని అంటోంది. ఇక్కడ కౌలు రైతులు, సన్నకారు రైతులు నష్టపోకుండా ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తారో చూడాలి’’ అని రైతు స్వరాజ్య వేదికకు చెందిన సాయులు రవి అన్నారు.

ఇరు రాష్ట్రాల రైతులనూ వేధిస్తున్న సమస్య ఇదే
అయితే ప్రస్తుతం రైతులకు ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య కూలీల కొరత. పంటను కోయడానికి, ఆ తరువాత లోడింగ్, అన్‌లోడింగ్ పనులకు కూలీల అవసరం ఉంటుంది.
‘‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలు కూడా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పని ఎలా చేస్తారు? దీనికోసం బిహార్ ప్రభుత్వానికి ఏమైనా లేఖ రాశారా? అన్న ప్రశ్నకు అధికారులు సమాధానమివ్వలేదు.

ఆంధ్రప్రదేశ్ రైతులను కూడా ఇదే సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా వరి కోతలకు ఒడిశా, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు ఏపీలోని పలు జిల్లాలకు వచ్చేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. పైగా ఇప్పటికే ఏపీలో ఉన్న వలస కూలీలు కూడా తిరుగుపయనం అయినట్టు భీమవరం ప్రాంతానికి చెందిన రైతు పెన్మత్స వెంకట్రాజు తెలిపారు.
‘‘మా ప్రాంతంలో ఉత్తరాంధ్ర కూలీలు పెద్ద సంఖ్యలో కనిపించేవారు. కానీ ఈసారి మార్చి మొదటి వారంలో వచ్చిన వారు కూడా వెనక్కిపోయారు. చెరువుల దగ్గర కాపలా ఉండేవాళ్లు కూడా చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇది చాలా పెద్ద సమస్య అవుతోంది. ఒకవేళ లాక్ డౌన్ ఆంక్షలు తొలగించినా కూలీలు దొరుకుతారనే ధీమా లేదు’’ అన్నారాయన.
తెలంగాణలో వరి, మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపే ప్రయత్నం చేసినా, పప్పుసెనగ, పొద్దుతిరుగుడు, పసుపు, మిర్చి లాంటి ఇతర పంటల పరిస్థితి ఏంటన్న దానిపై కూడా ఆ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ‘‘రెండెకరాల్లో మిర్చి పంట వేశాను. కోతలు పూర్తవుతున్నాయి. ఎంత కాలం దాన్ని ఇంటి దగ్గర పెట్టుకోవాలో తెలీదు’’ అంటున్నారు సామయ్య అని మిర్చి రైతు.
ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగరెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోళ్ల బెంగ
తెలంగాణలో పంట కొనుగోళ్లపై అధికారులు ఇలా రైతులకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ఆంధ్ర ప్రదేశ్ రైతులను మాత్రం ఆందోళన వెంటాడుతోంది. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, దాదాపు అన్ని పంటలను కొనుగోలు చేసేవారు కనిపించడం లేదన్నది అక్కడి రైతుల మాట.
రాష్ట్రంలో 3.25 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ఫిబ్రవరి వరకూ టన్నుకి రూ.9900 వరకూ దక్కేది. కానీ ప్రస్తుతం అది రూ.7,800కి పడిపోయిందని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకి చెందిన రైతు పి.రవిశంకర్ తెలిపారు. ఒక్కసారిగా ఆయిల్ కంపెనీలు మూతపడడంతో కొన్ని చోట్ల ఆయిల్ పామ్ గెలలు చెట్టుకే పండిపోయినట్టు చెప్పారు. ఆయిల్ కంపెనీలు తెరుచుకుంటే తప్ప మళ్లీ ఉపశమనం ఉండదని ఆయన అంటున్నారు.
ఇక కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే శెనగ పంట కూడా నిల్వ చేసుకునే అవకాశం సాధారణ రైతులకు కనిపించడం లేదు. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం ఉంటే తప్ప నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మొక్క జొన్న రైతులు కళ్లాల్లోనే ఆందోళనకు దిగారు. రాయలసీమ ప్రాంతంలో టమోటా సహా ప్రస్తుతం దిగుబడి దశలో ఉన్న పంటలను సాగు చేస్తున్న రైతులందరిదీ అదే పరిస్థితి.

రవాణా వ్యవస్థ స్తంభించడంతోనే..
దేశవ్యాప్తంగా రవణా వ్యవస్థ స్తంభించింది. సరకు రవాణాకు కొంత అవకాశం ఉన్నప్పటికీ వ్యవసాయ పంటల కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
నిత్యావసర సరకులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మధ్య సమన్వయం కనిపించడం లేదని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పి.పెద్దిరెడ్డి అంటున్నారు.
‘‘వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలి. రవాణా విషయంలో పోలీసుల ఆటంకాలు పెద్ద సమస్య అవుతోంది. వాటిని నివారించాలి’’ అని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘టమాటా, ఆయిల్ పామ్ వంటి పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టి మార్కెటింగ్ విషయంలో చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. రైతులు ఎక్కడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. వ్యవసాయ ఉత్పత్తుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించాం. ఉత్పత్తులకు ధరలు తగ్గకూడదని, రైతులు నష్టపోకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. నిల్వచేయలేని పంటల విషయంలో మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెట్లకు సంబంధించిన వెసులుబాటుపై కేంద్రం నుంచి ఇటీవల ఆదేశాలు అందాయి. రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1280 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పింది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని ధర కంటే బయట మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటే రైతులు ఎక్కడైనా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.









