కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. భారత్‌లో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం శుక్రవారం ఉదయం నాటికి ఈ సంఖ్య సుమారు 2088 ఉండగా 56 మరణాలు సంభవించాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో సామాన్యుల్లో మెదిలే కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నం ఇది.
ప్రశ్న:ఏవైనా వస్తువులపై వైరస్ ఎంత సేపు ఉంటుంది? రోజూ తెప్పించుకునే పేపర్‌ను కొనసాగించవచ్చా?
సమాధానం:కోవిడ్-19 సాధారణంగా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వారి నోరు, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు పడటం ద్వారా వేరొకరికి వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో దగ్గరగా మెలగటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.
అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల మేరకు ఈ వైరస్ కేవలం శరీరంపైన మాత్రమే కాకుండా బయట కూడా మనుగడ సాగించగలదు.
అప్పటికే వైరస్ ఉన్న వస్తువును మీరు తాకి ఆ తర్వాత మీరు ముఖాన్ని కానీ లేదా ముక్కును కానీ ముట్టుకున్నట్టయితే మీకు వైరస్ సోకే ప్రమాదం ఉంది.
మార్చి నెలలో వెలువడిన ఓ పరిశోధన ప్రకారం ఈ వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై ఎక్కువ కాలం అంటే 2 నుంచి 3 రోజులు, చెక్కపై 24 గంటల పాటు మనుగడ సాగించగలదు. మిగిలిన చోట్ల తక్కువ ప్రభావం చూపిస్తుందని తేలింది.
ఇక బయట నుంచి తెప్పించుకొనే ఆహార పదార్థాల విషయానికొస్తే డెలివరీ బాయ్ నుంచి తీసుకునే ముందు మీ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి.
ఆ తర్వాత ఆ ప్యాకెట్‌పై కిచెన్ స్ప్రే చల్లండి. ఆ తర్వాత మాత్రమే ఆ ప్యాకెట్‌ను విప్పండి. ఆపై మరోసారి చేతులు శుభ్రం చేసుకొన్న తర్వాత తినవచ్చు.
న్యూస్ పేపర్ విషయానికొస్తే మరీ అంత కంగారు పడాల్సిన పని లేదు. వాటిపై వైరస్ అతి తక్కువ సమయం మాత్రమే మనుగడ సాగించగల్గుతుంది. అయినప్పటికీ పేపర్ ముట్టుకునే ముందు, తరువాత చేతులు శుభ్రపరచుకోవడం మంచిది.
వైరస్ మనుగడను దృష్టిలో పెట్టుకొని తరచూ ముట్టుకునే ప్లాస్టిక్ వస్తువులను, డోర్ హ్యాండిల్స్ వంటి స్టీల్ వస్తువులను తరచూ శానిటైజర్ వంటి రసాయనాలతో శుభ్రపరచడం తప్పనిసరి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రశ్న: కూరలు, పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
సమాధానం:పళ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీళ్లలో శుభ్రంగా కడగాలి. ఆపై పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రశ్న: ఏదైనా ఓ బ్లడ్ గ్రూప్ విషయంలో ఎక్కువ ప్రమాదం ఉందా ?
సమాధానం: కొన్ని బ్లడ్ గ్రూపుల విషయంలో కోవిడ్-19 వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ వైరస్ ఉనికిని కనుగొన్న మొదట్లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ వైరస్‌కు పుట్టుక స్థానమైన చైనాలోని వుహాన్, షెంజెన్ ప్రాంతాల్లో 2,173 మంది కోవిడ్-19 రోగులపై చేసిన పరిశోధనల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా బాధితుల్లో 'ఓ' గ్రూపుకి చెందిన వారితో పోల్చితే 'ఏ' గ్రూపుకి చెందిన వారే ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరారు. స్థానికంగా 32 శాతం మంది టైప్ “ఏ” బ్లడ్ గ్రూపుకి చెందిన వారుంటే వారిలో 38శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు.
అదే “ఓ” గ్రూపుకి చెందిన వారిని పరిశీలించగా స్థానికంగా ఉన్న 34 శాతం మందిలో కేవలం 26శాతం మంది మాత్రమే కోవిడ్-19 బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు.
అయితే ఈ పరిశోధన విస్తృత స్థాయిలో జరగలేదు. బహుశా అనుకోని విధంగా కూడా అలా ఒకదానికొకటి సరిపోలి ఉండవచ్చు.
కాబట్టి బ్లడ్ గ్రూపుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొని వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం అత్యుత్తమం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రశ్న: పిల్లలు కనాలనుకునే జంటలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
సమాధానం: తన భాగస్వామికి కరోనావైరస్ లక్షణాలు కనిపించనంత వరకు పిల్లలు కనే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది రాయల్ కాలేజీకి చెందిన ప్రసూతి వైద్య నిపుణుల మాట.
ఇక మన విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల డిప్యూటీ కలెక్టర్ల ఆదేశాల మేరకు ఇప్పటి వరకు క్వారంటైన్ కోసం కేటాయించిన ఆస్పత్రుల్లో ప్రసూతి సేవలను నిలిపేశారు. కానీ ఆ నిర్ణయం వల్ల ఆయా ప్రాంతాల్లోని గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
క్వారంటైన్ వార్డులు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ ఆస్పత్రుల్లో కూడా గర్భిణులకు వైద్య సేవలు అందించాలని తమకు డిప్యూటీ కలెక్టర్ల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తూర్పు గోదావరి జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిశోర్ బీబీసీకి చెప్పారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తరచు పరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు వెళ్లే విషయంలో గర్భవతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
అలాంటి సమయంలో ఫోన్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారి సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా వైద్యుల్ని కలవడం తల్లి-బిడ్డ ఇద్దరికీ మంచిదని లండన్‌లోని రాయల్ కాలేజీకి చెందిన ప్రసూతి నిపుణులు చెబుతున్నారు.
ప్రశ్న: నా పెంపుడు కుక్కను తీసుకొని నడకకు వెళ్లవచ్చా?
సమాధానం: కచ్చితంగా వెళ్లొచ్చు. బ్రిటన్ ప్రభుత్వం అక్కడ ప్రజలకు ఇచ్చిన సూచనల ప్రకారం మీరు మీ పెంపుడు శునకంతో కలిసి వ్యాయామానికి వెళ్లాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లవచ్చు.
అయితే వాకింగ్ సమయంలో కచ్చితంగా ఎదుటివారితో 2 మీటర్ల దూరం పాటించాలి. అలాగే మీరు మీ కుక్కతో కలిసి వెళ్లేముందు, తిరిగి వచ్చిన తర్వాత కచ్చితంగా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
భారత్‌లోని కొన్ని జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- ఇండియా లాక్డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల కార్మికుల వేదన
- ఇండియా లాక్డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?
- ఇండియా లాక్ డౌన్: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వలస కూలీలు
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








