ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల‌ కార్మికుల వేదన

లారీ డ్రైవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలో నిలిచిపోయిన ఒక లారీ డ్రైవర్
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

‘‘నేను ఇర‌వై ఏళ్ళుగా డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్నా. వరుస‌గా పాతిక రోజుల పాటు ఎప్పుడూ ఖాళీగా ఉండ‌లేదు. మొద‌టి సారి ఇలాంటి ప‌రిస్థితి ఎదురయింది. డ్రైవింగ్‌కి వెళితే రోజూ వెయ్యి రూపాయాల‌కు త‌క్కువ కాకుండా వ‌స్తాయి. ఇప్పుడు నెల రోజుల ప‌ని పోతే నా కుటుంబం ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తం అవుతుంది’’ అని చెప్తున్నారు జాన‌కి రామ‌య్య‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నానికి చెందిన రామయ్య హెవీ వెహిక‌ల్ డ్రైవ‌ర్.

‘‘బ‌య‌ట‌కు వెళ్లాలంటే క‌రోనా భ‌యం వెంటాడుతోంది. ఇంట్లో ఉండాలంటే గ‌డ‌వ‌డం ఎలానో అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోయాయి. రాబోయే రోజులు త‌ల‌చుకుంటే క‌ల‌వ‌రం క‌లుగుతోంది...’’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారాయన.

ఈ ప‌రిస్థితి కేవ‌లం రామ‌య్య ఒక్కరిదే కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ర‌వాణా రంగంలోని కోట్ల మంది కార్మికుల‌ది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌భావం తొలుత ర‌వాణా రంగాన్నే తాకింది. ప్ర‌యాణికులు, స‌రకు ర‌వాణా వాహ‌నాల‌పై ఆధార‌ప‌డిన కార్మికులు ఇప్పుడు ఉపాధి కోల్పోయారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌వాణా, దాని అనుబంధ రంగాల‌పై ఆధార‌ప‌డిన 30 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం ప‌డింది. దేశ వ్యాప్తంగా వారి సంఖ్య ఆరు కోట్లు ఉంటుంద‌ని ట్రాన్స్‌పోర్ట్ వ‌ర్క‌ర్స్ ఫెడ‌రేష‌న్ లెక్కలు చెప్తున్నాయి. ఉపాధి కోల్పోయిన కాలానికి త‌గిన ప‌రిహారం అందించ‌క‌పోతే లక్షలాది కుటుంబాలు క‌ష్టాల్లో కూరుకుపోతాయ‌ని వారు ఆందోళ‌న‌లో ఉన్నారు.

జ‌న‌తా క‌ర్ఫ్యూతో మొద‌లు...

మార్చి 22వ తేదీన జ‌న‌తా క‌ర్ఫ్యూ కార‌ణంగా తొలుత ఒక రోజు వాహ‌నాలు నిలిపివేయ‌డానికి సన్న‌ద్ధ‌మ‌య్యారు. అయితే దానికి కొన‌సాగింపుగా దేశమంతటా లాక్‌డౌన్ అమ‌లులోకి తెచ్చారు.

కొన్ని చోట్ల అమ‌లు ప్ర‌క్రియ‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. దీంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. అంత‌ర్రాష్ట్ర ర‌వాణా వాహ‌నాల‌తో పాటు ప్రైవేటు, ప్ర‌భుత్వ వాహ‌నాల‌న్నిటినీ నిలిపివేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట‌మెంట్ లెక్క‌ల ప్ర‌కారం 2019 చివ‌రి నాటికి 13,27,689 వాహ‌నాల్లో 95 శాతం క‌ద‌ల‌డం లేదు. అందులో 6.30 లక్షల వాహ‌నాలు స‌రకు ర‌వాణా సంబంధించినవి. మ‌రో 14,689 స్టేజీ క్యారియ‌ర్లు కూడా ఉన్నాయి. ఆర్టీసీకి చెందిన సొంత వాహ‌నాలు, అద్దె బ‌స్సులు క‌లిపి 10,400 వాహ‌నాలు కూడా నిలిపోయాయు.

ఇక 4.8 ల‌క్ష‌ల ఆటోలు, 83 వేల క్యాబ్స్, 22,859 విద్యా సంస్థ‌ల‌కు చెందిన బ‌స్సులు కూడా ఆగిపోయాయి. దాంతో ఆయా వాహ‌నాల డ్రైవ‌ర్లు, ఇత‌ర సిబ్బంది ఖాళీగా మారిపోయారు. ప్ర‌స్తుతం 3,670 ఆంబులెన్సులు మాత్రమే సేవలు అందిస్తున్నాయి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

‘అప్పు చేసి క్యాబ్ కొనుకున్నాను.. ఈ క‌ష్టాలు తీరేదెలా?’

రెండేళ్ల కిందట అప్పు చేసి ట్యాక్సీ కొనుక్కుని కుటుంబాన్ని న‌డుపుకుంటున్నానని.. ఏపూట‌కి ఆ పూట వ‌చ్చే ఆదాయంతో కుటుంబం గ‌డిచిపోయేదని విజ‌య‌వాడ‌కు చెందిన ఎస్.శ్రీనివాస్ వాపోయారు.

‘‘కొన్ని నెల‌లుగా మాకు బుకింగ్స్ బాగా త‌గ్గిపోయాయి. అయినా జీవితం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు మొత్తం నెల రోజుల పాటు నిలిపివేయాల్సి వ‌చ్చింది. కారు ఈఎంఐ ప‌రిస్థితి ప‌రిస్థితి ఏమిటి? కుటుంబానికి రోజువారీ ఖ‌ర్చుల మాటేమిటి? అనేది అంతుబ‌ట్ట‌డం లేదు’’ అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

‘ఆదాయం పోయింది.. అద‌న‌పు భారం కూడా..!’

గ‌తంలో బంద్‌లు, ఇత‌ర ఆందోళ‌నల సంద‌ర్భంగా వాహనాలు నిలిపివేసిన ప‌రిస్థితి ఉంది గానీ ఇలా నెల రోజుల పాటు నిలిపివేసిన త‌ర్వాత వాహ‌నాల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది అంతుబ‌ట్ట‌డం లేదని గుంటూరుకే చెందిన శ్రీ ల‌క్ష్మీ లారీ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ య‌జ‌మాని ఆర్.రామ‌లింగేశ్వరావు చెప్తున్నారు.

‘‘మాకు 16 లారీలున్నాయి. అంత‌ర్రాష్ట్ర స‌రకు రవాణాతో పాటు కొన్ని స్థానికంగా మెటీరియ‌ల్ స‌ర‌ఫ‌రాలో ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. కొన్ని లారీలు క్వారీల‌లోనే ఉండిపోయాయి. ఎలాంటి స్థితిలో ఉన్నాయ‌న్న‌ది కూడా తెలియ‌డం లేదు. నెల రోజుల పాటు వాటిని సంరక్షించుకునే అవ‌కాశం కూడా లేదు. లాక్‌డౌన్ ఉన్న అన్ని రోజులు నిలిపివేసిన త‌ర్వాత అవి ఏ స్థాయికి చేరుతాయ‌న్న‌ది కూడా తెలియ‌డం లేదు. ఆదాయం కోల్పోవ‌డం ఒక భాగం అయితే వాహ‌నాల నిర్వ‌హ‌ణ‌, ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్రారంభించేందుకు అయ్యే ఖ‌ర్చులు ఆలోచిస్తే చాలా పెద్ద భార‌మే త‌ప్ప‌దు’’ అని వివ‌రించారు.

నిలిచిపోయిన రిక్షాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిలిచిపోయిన రిక్షాలు

అనుబంధ రంగాల వారి ప‌రిస్థితి కూడా అంతే...

ర‌వాణా రంగంలో నేరుగా వాహ‌నాల‌పై ప‌నిచేసే వారితో పాటుగా స‌రకు ఎగుమ‌తులు, దిగుమ‌తుల్లో పనిచేసే హ‌మాలీల‌కు కూడా ఆందోళ‌న త‌ప్ప‌డం లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ కోసం ఇలాంటి క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు త‌ప్ప‌వ‌ని.. కానీ త‌మ కుటుంబాలు గ‌డ‌వ‌డం ఎలాగో తెలీక స‌త‌మ‌తమవుతున్నామ‌ని చెబుతున్నారు.

విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్‌లో సుమారు 126 ప‌రిశ్ర‌మ‌లు వాహ‌నాల‌కు సంబంధించిన విడిభాగాల త‌యారీ, ఇత‌ర కార్య‌క‌లాపాల్లో ఉంటాయి. ఇప్పుడు అవ‌న్నీ మూత‌ప‌డ్డాయి. వాటిలో ఉపాధి పొందే వారికి కూడా జీవ‌నం పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంద‌ని ఆటోన‌గ‌ర్‌లో గ్యారేజ్ నిర్వాహ‌కుడు పి.రమేష్ తెలిపారు.

వివిధ మెకానిక్ షెడ్డులు, జాతీయ ర‌హ‌దారి పొడ‌వునా ర‌వాణా వాహ‌నాల‌పై ఆధార‌ప‌డి ఉండే దాబాలు, ఇత‌ర హోట‌ళ్లు, మ‌ర‌మ్మ‌త్తు షాపులు అన్నీ మూత‌ప‌డ్డాయి. క‌రోనా రూపంలో వ‌చ్చిన ముప్పుతో వారంతా విల‌విల్లాడే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నిలిచిపోయిన లారీలు
ఫొటో క్యాప్షన్, నిలిచిపోయిన లారీలు

అంద‌రినీ ఆదుకుంటామంటున్న ఏపీ ప్ర‌భుత్వం

ర‌వాణా రంగంలో ఉన్న వారికి ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా తీవ్ర న‌ష్టం త‌ప్ప‌దని.. అయినా భ‌విష్య‌త్ రీత్యా ఇలాంటి జాగ్ర‌త్త‌లు అనివార్యం అవుతున్నాయ‌ని ఏపీ ర‌వాణా మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ర‌వాణా రంగంపై ఆధార‌ప‌డిన వారి గురించి ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. తొలుత అంద‌రికీ స‌మానంగా ఉచితంగా రేష‌న్ స‌రుకులు ఇంటింటికీ అందిస్తాం. దాంతో పాటు ఏప్రిల్ 4వ తేదీన తెల్ల రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున స‌హాయం అందిస్తాం’’ అని చెప్పారు.

‘‘ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం కూడా ఆదాయం కోల్పోతోంది. ర‌వాణా శాఖ ద్వారా నెల‌కు క‌నీసం రూ. 200 కోట్లు రోడ్డు ప‌న్నుల రూపేణా వ‌స్తుంది. ఉత్ప‌త్తి జ‌రిగే స‌రుకుల‌పై విధించే ప‌న్నులు స‌హా వివిధ‌ మార్గాల్లో వ‌చ్చే ఆదాయం అద‌నం. ఇప్పుడు అవ‌న్నీ నిలిచిపోయాయి. దాంతో ప్ర‌భుత్వ‌మే తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఆదాయం క‌న్నా ప్ర‌జ‌లను కాపాడుకోవ‌డ‌మే కీల‌కం కాబ‌ట్టి అంద‌రూ లాక్‌డౌన్ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే’’ అని ఆయన పేర్కొన్నారు.

‘కార్మికులు జాగ్ర‌త్త‌లు పాటించాలి.. ప్ర‌భుత్వం క‌నిక‌రించాలి’

క‌రోనా స‌మ‌యంలో రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ర్క‌ర్స్ ఫెడ‌రేష‌న్ కార్య‌ద‌ర్శి సి.హెచ్.సుంద‌ర‌య్య కోరుతున్నారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ స‌మ‌యంలో అపార న‌ష్టం త‌ప్ప‌దు. ట్రాన్స్‌పోర్ట్ కార్మికులపై ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌గిన రీతిలో స్పందించాలి. క‌నీసం రూ. 5,000 చొప్పున ప్ర‌తి కార్మికుడికి అందించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

‘‘క‌రోనా ముప్పుని కార్మికులు కూడా గ్ర‌హించాలి. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి. ప్ర‌స్తుతం ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌గా పిలుస్తున్న ఆర్టీసీలో కార్మికుల‌ను విధిగా డిపోలకు రావాల‌ని చెప్ప‌డం స‌మంజ‌సం కాదు. అలాంటి ఆదేశాలు ఉప‌సంహ‌రించుకోవాలి. అత్య‌వ‌స‌ర వేళ‌ల్లో రావాల‌ని చెప్ప‌డం వ‌ర‌కూ స‌మ‌స్య కాదు. రోజూ డిపోలకు రావాల‌నే ఆదేశాలు ఉప‌సంహ‌రించుకోవాలి’’ అని కోరారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)