కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?

యూపీ ప్రభుత్వం బస్సులు పంపకపోతే, ఆనంద్ విహార్ బస్టాండ్‌లో జనం చేరుండేవారే కాదని దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బస్సులు పంపకపోతే, ఆనంద్ విహార్ బస్టాండ్‌లో జనం చేరుండేవారే కాదని దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
    • హోదా, బీబీసీ కోసం

దిల్లీ నుంచి యూపీ, బిహార్ వెళ్లే రహదారులపై కాలి నడకన వెళ్తున్న జనం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నట్లుగా కొన్ని రోజుల నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇంతలోనే దిల్లీ-ఉత్తర్ప్రదేశ్ (యూపీ) సరిహద్దుల్లో ఉన్న బస్టాండ్లకు జనం వేల సంఖ్యలో చేరడం మొదలుపెట్టారు. సొంత ఊళ్లకు వెళ్లే బస్సుల కోసం నిరీక్షిస్తూ, చాలా పెద్ద సంఖ్యలో పోగయ్యారు.

కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు, ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం విధించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ఈ పరిణామాలతో నవ్వులాటగా మారింది.

దిల్లీలోని ఆనంద్ విహార్ బస్టాండ్ నుంచి గాజియాబాద్లోని కౌశాంబీ, లాల్ కువా, హాపుర్ బస్టాండ్లలో శనివారం రాత్రి పెద్ద ఎత్తున జనం కనిపించారు. ఇప్పటికీ వాళ్లు అలాగే ఉన్నారు. తమ తమ ఊర్లకు చేరుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలతో తమకున్న సరిహద్దుల్లో చిక్కుకుపోయిన జనాలను వారి వారి జిల్లాలకు చేర్చేందుకు తమ రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు నడుపుతుందని యూపీ రవాణా శాఖ మంత్రి అశోక్ కటారియా తెలిపారు. జనం ఎవరూ తమ తమ ఇళ్లను వదిలి బయటకు రావొద్దని కూడా ఆయన అభ్యర్థించారు.

దిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున జనం చేరి, గందరగోళం ఏర్పడటానికి దిల్లీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.

''ఎక్కడి నుంచి వచ్చినవారైనా, వాళ్లు పని చేస్తున్న రాష్ట్రానికి సంపద కింద లెక్క. కానీ, తమ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్లు వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోవాలని దిల్లీ ప్రభుత్వం చెప్పింది. దిల్లీ ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో వారిని సరిహద్దులు దాటించింది. వాళ్లు ఇలా చేయాల్సింది కాదు. కాలి నడకన వస్తున్నవారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు బస్సులు పంపాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఈ సదుపాయం ఒకట్రెండు రోజుల కోసమే. అందుకే, ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోవాలని మేం జనాలను వేడుకుంటున్నాం. ఇలా జనాలు తిరిగితే, కరోనావైరస్ వ్యాప్తి ఇంకా ఎక్కువవుతుంది. అందరికీ నష్టం జరుగుతుంది'' అని అశోక్ కటారియా బీబీసీతో అన్నారు.

దిల్లీలో జనాలు

ఫొటో సోర్స్, Getty Images

కానీ, అశోక్ కటారియా ఆరోపణలను దిల్లీ కార్మికశాఖ మంత్రి గోపాల్ రాయ్ ఖండించారు.

''యూపీ ప్రభుత్వం బస్సులు పంపకపోతే, ఆనంద్ విహార్ బస్టాండ్లో జనం చేరుండేవారే కాదు. కాలినడకన వెళ్తున్నవాళ్ల విషయానికి వస్తే, దిల్లీ నుంచే కాదు, హరియాణా, రాజస్థాన్ల నుంచి ఇలాగే జనం వెళ్తున్నారు. అలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. బస్సులు పంపిన తర్వాతే, జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు'' అని ఆయన అన్నారు.

కానీ, దిల్లీ ప్రభుత్వం సొంత బస్సుల్లో జనాలను హాపుర్కు ఎందుకు తరలించింది?

ఈ ప్రశ్నకు... కేంద్ర ప్రభుత్వం సూచన ప్రకారమే అలా చేశామని గోపాల్ రాయ్ బదులిచ్చారు.

''దిల్లీ ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు పక్క రాష్ట్రాలకు వెళ్లవు. భద్రత దృష్ట్యా హోం శాఖ చెప్పడంతో మేం బస్సుల్లో జనాలను హాపుర్కు తరలించాం. భోజనం, మంచి నీటి సదుపాయాలను కల్పించాం. నాలుగు లక్షల మందికి ఉచితంగా మేం భోజనం పెడుతున్నాం. వలస కార్మికులు ఎవరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవద్దని మేం విజ్ఞప్తి చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

పరిస్థితి తీవ్రంగా మారి, శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించడంతో దిల్లీ, హరియాణా, రాజస్థాన్ సరిహద్దులకు 1200 బస్సులను తాము పంపాల్సి వచ్చిందని యూపీ మంత్రి అశోక్ కటారియా చెప్పారు.

''రెండు రోజులుగా దాదాపు లక్ష మందిని వారి వారి ప్రాంతాలకు తరలించాం. జిల్లా కేంద్రాల వరకే బస్సులను నడిపాం. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించలేదు'' అని వివరించారు.

జనాలను చెదరగొడుతున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనం ఎవరూ తమ తమ ఇళ్లను వదిలి బయటకు రావొద్దని యూపీ రవాణా శాఖ మంత్రి అశోక్ కటారియా అభ్యర్థించారు

మరోవైపు గత మూడు రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి యూపీకి వచ్చిన లక్షకు పైగా మంది వివరలతో జాబితా రూపొందిస్తున్నామని, వివిధ జిల్లాల యంత్రాంగాలు వారిని పర్యవేక్షిస్తాయని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బయటి నుంచి వచ్చిన జనం ఎవరితో కలవకుండా ఉండేలా చూడాలని గ్రామాల్లోని నాయకులకూ ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

దిల్లీ-యూపీ సరిహద్దుల్లో జనం ఇంకా ఉన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తులను చేయకుండా ఇంకా వస్తూనే ఉన్నారు. మొదట్లో కొంత మంది జనం కాలినడకనే ఇళ్ల నుంచి బయల్దేరారు. కానీ, బస్సులు నడుస్తున్నట్లు ప్రకటన వెలువడగానే, చాలా మంది బయటకు రావడం మొదలైంది.

ఏ రాష్ట్రానికి చెందినవారైనా దిల్లీ నుంచి వెళ్లిపోవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటన చేశారు.

ఆనంద్ విహార్, కౌశాంబీ బస్టాండ్లలో శనివారం నుంచే జనాలు పెద్ద సంఖ్యలో పోగవుతూ ఉన్నారు. ఒకరి నుంచి మరొకరు దూరంగా ఉండాలని అధికారులు అభ్యర్థిస్తున్నా, అక్కడే పాటించే పరిస్థితి లేదు. బస్టాండ్లలో పోగైన జనానికి తగ్గ స్థాయిలో బస్సలు నడవలేదు. దీంతో జనాలు గంటలుగంటలు నిరీక్షించాల్సి వచ్చింది.

సొంత ఊళ్లకు వెళ్లే బస్సుల కోసం నిరీక్షిస్తూ, దిల్లీ-యూపీ సరిహద్దుల్లోని బస్టాండ్లలో చాలా పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సొంత ఊళ్లకు వెళ్లే బస్సుల కోసం నిరీక్షిస్తూ, దిల్లీ-యూపీ సరిహద్దుల్లోని బస్టాండ్లలో చాలా పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు

కౌశాంబీ బస్టాండ్లో ఆరు గంటల పాటు బస్సు కోసం వేచిచూసి, లాభం లేదనుకుని చివరికి కాలి నడకనే ప్రయాణమయ్యానని దినేశ్ ప్రజాపతి అనే ఆయన చెప్పారు.

కౌశాంబీ బస్టాండ్ వద్ద 200 బస్సులు అందుబాటులో ఉన్నాయని, వేరే జిల్లాల నుంచి కూడా బస్సులు అక్కడికి వస్తూ ఉన్నాయని రవాణా శాఖ అధికారి ఒకరు చెప్పారు. బస్సులు రాగానే జనాలు వాటి వద్దకు పరుగులు తీస్తుండటంతో గందరగోళం రేగుతోందని, కానీ సమస్య చాలా వరకూ నియంత్రణలోకి వచ్చిందని ఆయన అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.

అశోక్ కటారియా సహా బీజేపీ నాయకులు దిల్లీ ప్రభుత్వం వల్లే ఈ సమస్య తలెత్తిందని నిందిస్తున్నారు.

దిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాఘవ్ చెడ్డా మాత్రం దిల్లీ నుంచి తమ తమ ఇళ్లకు వెళ్తున్నవారిని యూపీ ప్రభుత్వం కొట్టిస్తోందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.

వివిధ రాష్ట్రాల నుంచి యూపీకి వస్తున్నవారికి, ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తున్నవారికి సదుపాయాల కల్పన కోసం 11 మంది సీనియర్ అధికారులతో యూపీ ప్రభుత్వం ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

నాలుగు కాసులు వెనకేసుకుని వెళ్లాలని వలస కార్మికులు దిల్లీకి వస్తుంటారని, లాక్డౌన్ వల్ల ఆదాయ మార్గం మూసుకుపోవడంతో తమ ఇళ్లకు వెళ్లానుకుంటున్నారని దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. కానీ, కరోనావైరస్ వ్యాప్తి ముప్పును వాళ్లు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)