కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో మరణాలకు కారణం ఏమిటి...

కరోనావైరస్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, జేమ్స్ గళగర్
    • హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరస్పాండెంట్

కొత్త కరోనావైరస్ గత డిసెంబర్ నెలలోనే బయటపడి.. ఇంతలోనే ప్రపంచ మహమ్మారిగా మారింది. ఈ వైరస్‌తో, ఇది కలిగించే కోవిడ్-19 వ్యాధితో అంతర్జాతీయ సమాజం తలపడుతోంది.

చాలా మంది మీద ఈ వ్యాధి తేలికపాటి ప్రభావమే చూపుతోంది. కానీ కొంత మంది ప్రాణాలను హరిస్తోంది.

ఈ వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తోంది? కొంత మంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి చికిత్స చేయటం ఎలా?

ఇంక్యుబేషన్ పీరియడ్

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది.

వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి.

కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఉప్పెనలా మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.

ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.

ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ - అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం - ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

కరోనావైరస్

స్వల్ప వ్యాధి

చాలా మందికి ఇలాగే ఉంటుంది.

కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి స్వల్ప ఇన్‌ఫెక్షన్‌గానే ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు.

ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు.

జ్వరం రావటానికి, నలతగా ఉన్నట్లు అనిపించటానికి కారణం.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతి స్పందించటమే. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి.. ఏదో తేడా ఉందంటూ కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది.

నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.

కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.

ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.

ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.

అయితే.. కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని ఇప్పుడిప్పుడే పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

ముదిరిన వ్యాధి

ఈ వ్యాధి ముదిరిందంటే.. దానికి కారణం మన రోగనిరోధక వ్యవస్థ - వైరస్ మీద పోరాడటానికి అతిగా ప్రతిస్పందించటం.

రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. దీంట్లో సున్నితంగా సంతులనం సాధించాల్సి ఉంటుంది. వాపు విపరీతంగా పెరిగినట్లయితే శరీరమంతటా చాలా నష్టం జరగవచ్చు.

''శరీర రోగనిరోధక వ్యవస్థలో ఈ వైరస్ ఒక అసంతులనాన్ని రాజేస్తోంది. వాపు చాలా అధికంగా ఉంటోంది. వైరస్ ఈ పని ఎలా చేస్తోందనేది మనకు తెలియదు'' అని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ నథాలీ మాక్‌డెర్మాట్ చెప్పారు.

ఊపిరితిత్తుల వాపును న్యుమోనియా అని పిలుస్తారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్, ఊపిరితిత్తుల్లో కరోనావైరస్‌ సోకిన ప్రాంతాలు

ఈ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి. మన శ్వాసప్రక్రియలో.. ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించటం, కార్బన్‌డయాక్సైడ్ వెలుపలికి రావటం జరిగేది ఈ ఊపిరితిత్తుల్లోనే. కానీ న్యూమోనియా వచ్చినపుడు.. ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది.

కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది.

చైనా నుంచి అందిన సమాచారం ఆధారంగా చూస్తే.. కరోనావైరస్ సోకిన వారిలో సుమారు 14 శాతం మంది ఈ దశకు చేరుతున్నట్లు భావిస్తున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, AFP

విషమించిన వ్యాధి

మొత్తం మీద ఆరు శాతం కేసుల్లో విషమంగా జబ్బుపడుతున్నట్లు అంచనా.

ఈ దశకు వచ్చేసరికి.. శరీరం విఫలమవటం మొదలవుతుంది. మరణం సంభవించే అవకాశం అధికం.

శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ.. శరీరమంతటినీ పాడుచేస్తుండటం ఇక్కడ సమస్య.

దీనివల్ల 'సెప్టిక్ షాక్' సంభవించవచ్చు. అంటే.. రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి.

ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వల్ల.. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి.. శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఆక్సిజన్ అందకపోతే.. శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.

Sorry, your browser cannot display this map