యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?

- రచయిత, సుబ్రత్ కుమార్ పతి
- హోదా, బీబీసీ కోసం
సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ మీద ఆర్‌బీఐ మారటోరియం విధించింది. డిపాజిటర్లు రోజుకు రూ.50వేలకు మించి నగదు విత్‌డ్రా చేసుకోకుండా ఆంక్షలు అమలు చేస్తోంది.
అయితే, యస్ బ్యాంకులో ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన పూరీ జగన్నాథ్ ఆలయానికి కూడా ఖాతా ఉంది. ఆ ఆలయానికి చెందిన రూ.545 కోట్లు ఇప్పుడు అందులో చిక్కుకుపోయాయి.


హిందువులు సందర్శించే ప్రముఖ గుళ్లలో పూరీ జగన్నాథ్ ఆలయం కూడా ఒకటి. 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్లు చెబుతారు.
ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జేటీఏ) చూస్తుంది. చట్ట ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు.

గత ఏడాది సెప్టెంబర్ వరకూ ఎస్‌జేటీఏ యస్ బ్యాంకులో రూ.592 కోట్ల జమ చేసింది. కొన్నాళ్ల క్రితం రూ.47 కోట్లు విత్ డ్రా చేసింది.
ఇంతలోనే ఆర్‌బీఐ నగదు తీసుకోవడంపై ఆంక్షలు తెచ్చింది. మిగతా రూ.545 కోట్లు బ్యాంకులోనే ఉండిపోయాయి.
ఎస్‌జేటీఏ యస్ బ్యాంకులో రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా ఇటీవల చెప్పారు. అందులో ఒకదానికి మార్చి 16న, మరోదానికి మార్చి 29తో మెచూరిటీ తీరుతుందని అన్నారు.
మెచూరిటీ తీరిన తర్వాత ఈ మొత్తాలను జాతీయ బ్యాంకుల్లో వేయాలన్నది ఎస్‌జేటీఏ ప్రణాళిక. కానీ, ఇంతలోనే ఆర్‌బీఐ ఆంక్షలతో పరిస్థితి మారింది.

ఫొటో సోర్స్, TWITTER
ఆర్థిక మంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్
ఈ విషయంపై ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పుజారీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
యస్ బ్యాంకు నుంచి రూ.545 కోట్లను విత్ డ్రా చేసేందుకు ఎస్‌జేటీఏకు ఆర్బీఐ నుంచి అనుమతి ఇప్పించాలని ఇందులో అభ్యర్థించారు.
ఇది భక్తుల మతవిశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశమని ఆ లేఖలో ప్రస్తావించారు.
‘‘ఈ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో ఉంచారు. లక్షల మంది హిందూ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ డిపాజిట్‌ను తిరిగి తీసుకునేందుకు త్వరగా అనుమతించాలి. ఇది భగవాన్ జగన్నాథ్ భక్తులకు మతపరమైన ప్రాముఖ్యం ఉన్న అంశం’’ అని నిరంజన్ ఆ లేఖలో రాశారు.
ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్ ఎంపీలు కొందరు మంగళవారం దిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసి సమస్యను వివరించారు.
మరోవైపు ఆలయ నిధులు కాజేసే కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ హరిచందన్ ఆరోపించారు.
‘‘అభివృద్ధి కమిషన్ 2017లో ఇచ్చిన నివేదిక ప్రకారం భగవాన్ జగన్నాథ్ నిధులను 25 బ్యాంకుల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆ జాబితాలో యస్ బ్యాంకు లేదు. కానీ, 2019 జులైలో ఆ బ్యాంకును జాబితాలో చేర్చారు. అందులో డబ్బు డిపాజిట్ చేశారు’’ అని ఆయన అన్నారు.
అభివృద్ధి కమిషన్ గానీ, సంబంధిత శాఖ మంత్రి గానీ దీనికి బాధ్యత వహిస్తారా అని హరిచందన్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, jagannath Sena
సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్
రిజర్వు బ్యాంకు ఆంక్షల పట్ల భక్తులు అసంతృప్తితో ఉన్నారని జగన్నాథ ఆలయ సీనియర్ దయితాపతి (సేవకుడు) బినాయక్ దాస్ మోహ్‌పాత్ర అన్నారు.
‘‘ప్రైవేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తం జమ చేయడానికి బాధ్యులు ఎవరో పూర్తి విచారణ జరిపి గుర్తించాలి. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని జగన్నాథ్ సేన సంస్థ కన్వీనర్, పూరీకి చెందిన న్యాయవాది ప్రియదర్శన్ పట్నాయక్ డిమాండ్ చేశారు.
‘‘ఆలయ డబ్బు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం చట్ట విరుద్ధం. ఎస్‌జేటీఏ, ఆలయ నిర్వహణ కమిటీలను దీనికి బాధ్యులుగా గుర్తించాలి’’ అని ఆయన అన్నారు.
ఇప్పటివరకూ ఈ అంశంపై ఎస్‌జేటీఏ ప్రతినిధులు ఎవరూ మీడియాతో మాట్లాడలేదు.

అసెంబ్లీలో గందరగోళం
ఈ వ్యవహారంపై ఒడిశా అసెంబ్లీలో బుధవారం గందరగోళం రేగింది. సభ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
సభ ప్రారంభమవ్వగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభ మధ్యలోకి వచ్చి, నిరసన తెలిపారు.
‘జై జగన్నాథ్’ అంటూ నినాదాలు చేస్తూ, ఆలయ డబ్బులు యస్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.
ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించాలని కూడా డిమాండ్ చేశారు.
‘‘శ్రీ జగన్నాథ్ ఆలయ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు బ్యాంకులో దేవుడి డబ్బు డిపాజిట్ చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించినవారిని అరెస్టు చేయాలి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా మీడియాతో అన్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మహమ్మారిని నిరోధించటానికి వివిధ దేశాలు చేపడుతున్న చర్యలు ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల జీవోల్లో ఎందుకంత రహస్యం?
- కరోనావైరస్: ఇది మీ జేబుపై, మీరు కొనే వస్తువులపై ఇలా ప్రభావం చూపుతోంది..
- కరోనావైరస్కు హోమియోపతి మందు ఉందా-ఆయుష్ ప్రకటనతో అయోమయం
- హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్‌కు కరోనా వైరస్
- 123 ఏళ్ల నాటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివారణ చట్టం)-1897 ఏం చెబుతోంది?
- కరోనావైరస్: యూరప్ నుంచి అమెరికాకు అన్ని ప్రయాణాలూ రద్దు చేసిన డోనల్డ్ ట్రంప్
- ఇటలీ: రోమ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన విద్యార్థులకు ఊరట.. వైద్య పరీక్షలు జరిపిస్తామన్న భారత ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









