ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?

హెచ్ఐవీ, ఎయిడ్స్

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

ప్రపంచంలోనే హెచ్ఐవీ నయమైన రెండో వ్యక్తిగా లండన్‌కు చెందిన ఆడమ్ క్యాస్టిలెజో నిలిచారు.

యాంటీ-రెట్రోవైరల్ థెరపీ ఆపేసిన 30 నెలల తర్వాత కూడా ఆయనకు హెచ్ఐవీ దూరంగానే ఉంది.

ఆయనకు హెచ్ఐవీ నయమవ్వడానికి కారణం హెచ్ఐవీ ఔషధాలు కాదని, క్యాన్సర్ కోసం తీసుకున్న మూల కణ చికిత్స అని ద లాన్సెట్ హెచ్ఐవీ జర్నల్ పేర్కొంది.

News image

ఆ మూల కణాలు వేరే దాత నుంచి తీసుకున్నవి. ఆ దాతకు హెచ్ఐవీ నిరోధకత చూపే ప్రత్యేక జన్యువులు ఉన్నాయి. అందువల్లే ఆడమ్‌కు అది దూరమైంది.

ఇదివరకు టిమోతీ బ్రౌన్ అనే వ్యక్తికి కూడా హెచ్ఐవీ నయమైంది. ఈయన ‘బెర్లిన్ పేషెంట్’గా ప్రాచుర్యం పొందారు. ఆయన కూడా ఇలాంటి చికిత్సే తీసుకున్నారు.

హెచ్ఐవీ, ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటి ఈ చికిత్స?

మూల కణ మార్పిడి చికిత్స ద్వారా రోగిలోని వ్యాధి నిరోధక కణాలను దాత కణాలతో భర్తీ చేయొచ్చు. ఈ కణాలు వైరస్ ఎదగకుండా అడ్డుకుంటాయి.

పస్తుతం ఆడమ్‌ రక్తంలో, వీర్యంలో, శరీర కణజాలంలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ క్రియాశీలంగా లేదని వైద్యులు చెప్పారు.

ఏడాది క్రితం వైద్యులు ఆయనకు వైరస్ దూరమైనట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ అది తిరిగి రాలేదు.

ఆడమ్‌కు హెచ్ఐవీ మొత్తంగా దాదాపు నమయైనట్లేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లీడ్ రీసెర్చర్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ గుప్తా అన్నారు.

‘‘ఇదివరకు బెర్లిన్ పేషెంట్‌కు మూల కణ మార్పిడి చికిత్స ద్వారా హెచ్ఐవీని నయం చేయడంలో దక్కిన విజయం పునరావృతం చేయొచ్చని మా అధ్యయనంలో తేలింది’’ అని ఆయన అన్నారు.

హెచ్ఐవీ, ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఇది హెచ్ఐవీ ఉన్న వాళ్లందరికీ చేసే చికిత్స కాదు.

క్యాన్సర్లను నయం చేసేందుకు ఈ చికిత్సను చేస్తారు. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న చికిత్స.

ప్రస్తుతం హెచ్ఐవీ ఉన్నా, ఆరోగ్యంగా సుదీర్ఘ కాలం బతికేందుకు ఉపయోగపడే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.

‘‘మూల కణ మార్పిడి చికిత్స చాలా రిస్క్‌తో కూడుకున్నది. హెచ్ఐవీ ఉండి, కొన్ని ప్రాణాంతక క్యాన్సర్లతో బాధపడుతున్నవారికి చివరి అస్త్రంగా దీన్ని చేస్తారు. హెచ్ఐవీ ఉన్నా, యాంటీ-రెట్రో‌వైరల్ ఔషధాలతో ఆరోగ్యంగా ఉండొచ్చు. వాళ్లకు ఈ చికిత్సను చేయరు’’ అని గుప్తా చెప్పారు.

అయితే, రాబోయే రోజుల్లో జన్యు చికిత్సల ద్వారా హెచ్ఐవీకి పరిష్కారం కనిపెట్టేందుకు దీని ద్వారా అవకాశాలు ఉన్నాయి.

హెచ్ఐవీ, ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా పని చేస్తుంది?

హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లలో 95 శాతానికి హెచ్ఐవీ-1 రకం వైరస్‌లే కారణం. సీసీఆర్5 అనే గ్రాహకం ద్వారా ఇవి కణాల్లోకి చొరబడతాయి.

అయితే, మనుషుల్లో కొందరికి సీసీఆర్5 గ్రాహకం మారిపోయి ఉంటుంది. అలాంటి వారికి హెచ్ఐవీ నిరోధకత ఉంటుంది. అలాంటి వారి శరీరంలోని కణాల్లోకి హెచ్ఐవీ-1 వైరస్ చొరబడలేదు.

అలాంటి వారి మూల కణాలు తీసుకుని ఆడమ్‌కు చికిత్స చేశారు.

భవిష్యతులో సీసీఆర్5 గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకుని జన్యు చికిత్సలు చేయడం ద్వారా హెచ్ఐవీని నయం చేసేందుకు అవకాశాలు ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు.

శాశ్వత పరిష్కారమా?

ఆడమ్‌లో వ్యాధి నిరోధక కణాలను దాత కణాలు 99 శాతం భర్తీ చేశాయి. అయితే, ఆయన శరీరంలో ఇంకా వైరస్ ఉంది. బ్రౌన్ విషయంలోనూ అంతే.

హెచ్ఐవీ వీరికి తిరిగి ఎప్పటికీ రాదని కచ్చితంగా చెప్పలేం.

‘‘నేను ఆశకు ప్రతినిధిలా ఉండాలని అనుకుంటున్నా. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో నేను అక్కడున్నా’’ అని ఆడమ్ అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)