పీటీ ఉష: మారుమూల పల్లె నుంచి రాజ్యసభను చేరుకున్న అలుపెరుగని అథ్లెట్

ఫొటో సోర్స్, PTUshaOfficial/FB
- రచయిత, జాన్హవీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన అథ్లెట్ పి.టి. ఉష రాజ్యసభ సభ్యురాలు కాబోతున్నారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఉషకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ట్వీట్ చేశారు.
"పిటి ఉష భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. క్రీడా రంగంలో ఆమె సాధించిన ఎన్నో ఘన విజయాలు మనందరికీ తెలుసు. అయితే, గత కొన్నేళ్ళుగా కొత్త అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ దేశానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు" అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
క్రీడారంగంలో 103 అంతర్జాతీయ పతకాలు గెల్చుకున్న ఈ అరుదైన అథ్లెట్‌ను బీబీసీ 'జీవితకాల సాఫల్య పురస్కారం'తో గౌరవించింది. 'పయ్యోలీ ఎక్స్‌ప్రెస్'గా పేరు పొందిన పీటీ ఉష కథ ఇది.
ఉష కథ
విజేతలపైనే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఓడిపోయిన వ్యక్తులు ఎవరికీ గుర్తుండరు. ఇది సాధారణంగా ప్రముఖుల విషయంలో జరుగుతూ ఉంటుంది. కానీ, ఈ వాదన తప్పని నిరూపించారు పీటీ ఉష.
1984లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో నాల్గవ స్థానం సంపాదించినప్పటికీ, ఉష పేరు ఈ దేశపు క్రీడాకారిణుల పేర్ల మధ్య వినిపిస్తూనే ఉంటుంది. ఉష క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవడం మాత్రమే కాకుండా ఎంతో మంది క్రీడాకారుల భవితకు కూడా బాటలు వేసిన వ్యక్తి.
ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు.
"1980లలో పరిస్థితులు వేరుగా ఉండేవి. నేనెప్పుడూ ఒలింపిక్స్‌లో పాల్గొంటానని అనుకోలేదు" అని ఉష అన్నారు.

పయ్యోలిలో మొదలైన ప్రయాణం
పిలవుల్లకండి టెక్కెపరాంబిల్ ఉష బాల్యం కేరళ రాష్ట్రంలోని కోళికోడ్, పయ్యోలిలో గడిచింది. అందుకే ఆమెని "పయ్యోలి ఎక్స్‌ప్రెస్" అని కూడా పిలుస్తారు.
ఉష పరుగు పెట్టడం నాల్గవ తరగతిలో ఉండగా మొదలుపెట్టారు. స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె జిల్లా స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కానీ ఆమె అసలైన ప్రయాణం 13 ఏళ్ల వయసులో కేరళ ప్రభుత్వం ప్రారంభించిన క్రీడల విభాగంలో చేరినపుడు మొదలయింది.
"మా అంకుల్ ఒకాయన అదే స్కూల్ లో టీచర్‌గా పని చేస్తుండటంతో నేను క్రీడల్లో చేరడానికి మా తల్లితండ్రుల్ని ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు.
మైదానం దగ్గర చాలా కుక్కలు తిరగడంతో మా నాన్నగారు నాతో పాటు మైదానానికి వచ్చి అక్కడే ఒక కర్ర పట్టుకుని వాటిని బెదిరిస్తూ కూర్చునేవారు.’’

ఒక్కొక్కసారి ఆమె రైల్వే ట్రాక్ పక్కన ఉండే మురికి దారిలో కూడా రైలుతో సమానంగా పరుగు పెట్టేవారు.
ఆమెకు సముద్ర తీరంలో శిక్షణ తీసుకోవడం చాలా ఇష్టం.
"సముద్ర తీరంలో పరుగెత్తడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ పరుగుకు అంతే ఉండదు."
"అది 1978-79 సంవత్సరం. నేను షార్ట్స్ వేసుకుని పరుగు పెడుతుంటే అందరూ వింతగా నా వైపు చూసేవారు. చాలా మంది సముద్రపు ఒడ్డుకి వచ్చి నేను పరుగు పెడుతుంటే చూస్తూ ఉండేవారు."
నెమ్మదిగా ఆమెని ప్రోత్సహించే వాళ్ళు పెరిగారు.
"నాకు ఈత రాకపోవడం వలన నీళ్ళలోకి వెళ్లాలంటే భయంగా ఉండేది. చుట్టు పక్కల ఉండే పిల్లలు నాతో పాటు వచ్చి నేను ఈత కొడుతుంటే కాపలా కాస్తూ ఉండేవారు. "
ఆమె జీవితాన్ని తీర్చిదిద్దిన కోచ్
ఆమె రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చే సంస్థలో భాగమయినప్పటికీ , వాళ్లకి ఇచ్చే సౌకర్యాలు మాత్రం నామ మాత్రంగా ఉండేవి. "అక్కడ అందరూ కలిపి 40 మంది ఉండేవాళ్ళం. మాకందరికి కలిపి రెండు బాత్రూంలు మాత్రమే ఉండేవి. కానీ మా దినచర్య కఠినంగా ఉండేది. పొద్దున్న 5 గంటలకి నిద్రలేస్తే ఆటల్లో శిక్షణతో పాటు, స్కూల్‌లో తరగతులకు కూడా హాజరు కావాల్సి వచ్చేది" అని ఉష చెప్పారు
ఆమె స్పోర్ట్స్ డివిజన్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండగా ప్రముఖ కోచ్ ఓం నంబియార్‌ని కలిసారు. ఇది ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. అయన ఉషలో దాగిన ప్రతిభని గుర్తించి ఆమె ఒక శక్తివంతమైన అథ్లెట్ గా తయారయ్యేందుకు సహకరించారు.
"మమ్మల్ని అందరినీ వలయాకారంలో నిల్చోబెట్టి నంబియార్ సర్ వ్యాయామం చేయించేవారు. బాగా వ్యాయామం చేసినవారికి తినడానికి నట్స్ ఇచ్చేవారు."
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఆ తర్వాత జాతీయ స్థాయికి ఉష అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. కేవలం 16 ఏళ్ల వయసులో 1980లో మాస్కోలో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి ఒలింపిక్స్ ఫైనల్‌కి చేరిన తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె నిలిచారు.
కానీ, ఒక్క సెకండ్ తేడాతో పతకాన్ని కోల్పోయారు.

1984 లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ని తల్చుకుంటే క్రీడాభిమానులకి గగుర్పాటు తెప్పిస్తుంది.
"20 ఏళ్ల అమ్మాయి గురించి ముందెప్పుడూ వినలేదు. ఏ ప్రచారం లేకుండా ఈ రోజు బంగారు పతకం సాధించే స్థాయిలో ఉందని", పరుగు పెట్టడానికి సిద్ధంగా సన్నగా పొడవుగా లాస్ ఏంజెల్స్ ట్రాక్ మీద నిల్చున్న ఉష గురించి కామెంటేటర్స్ అనుకునేవారు.
కానీ ఆ పోటీలో ఆస్ట్రేలియా అథ్లెట్ డెబ్బీ ఫ్లింటాఫ్ ఒక్క అడుగు వేయగానే పడిపోవడంతో ఆ పోటీని రద్దు చేసి మళ్ళీ నిర్వహించారు.
"నేను చాలా వణికిపోయాను. చాలా ఆందోళనకు గురయ్యా. మళ్ళీ పరుగు మొదలయింది. కానీ, నేను వేగంగా పరుగు పెట్టలేకపోయాను."
ఈ పోటీలో ఉష రెప్పపాటులో ఓడిపోయారు.
"నా కాలు ముందుకు వేశాను. కానీ నా ఛాతి భాగం ముందుకు వంగలేదు. నేను నా ఛాతీని ముందుకు వంచి ఉంటే నేను పతకాన్ని గెలిచి ఉండేదాన్ని."
"ఆ క్షణంలో ఏడుపు వచ్చేసింది. నంబియార్ సర్ కూడా ఏడ్చేశారు. ఆ క్షణంలో భారతదేశంలో ప్రజలంతా నాలాగే బాధపడి ఉంటారు" అని ఉష అన్నారు.
నాల్గవ స్థానంలో నిలిచినప్పటికీ, ఉషని భారత దేశ ప్రజలు ఒక హీరోలా చూశారు.
తర్వాత జరిగిన పరుగుపందేల్లో ఉష తన ప్రతిభని నిరూపించుకోలేకపోయారు. ఆమెకి విమర్శలు రావడం మొదలు పెట్టాయి. కానీ ఆమె తిరిగి విజయం సాధిస్తుందనే నమ్మకం ఆమెకి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె జీవితంలో ఎత్తు పల్లాలు
1986లో సియోల్, సౌత్ కొరియాలో జరిగిన ఆసియన్ గేమ్స్‌లో ఉష బంగారు పతకాల పంట పండింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో ఒక పతకం, 400, 200మీటర్ల పరుగు పందేల్లో రెండు, 400 మీటర్ల రిలే రేస్‌లో మరొకటి.. ఇలా ఆమె నాలుగు బంగారు పతకాలు గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
"భారతదేశానికి మొత్తం ఐదు బంగారు పతకాలు వస్తే అందులో నాలుగు నావే. నాకు అది చాలా గర్వించదగ్గ క్షణం. నేను పతకం అందుకున్న ప్రతిసారీ ‘జన గణ మన’ వినిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది."
1983లో ఆమెకి అర్జున అవార్డు లభించింది. 1985లో భారత ప్రభుత్వం ఆమెకి "పద్మ శ్రీ" ఇచ్చి సత్కరించింది.

ఆమె విజయాలకి, జ్ఞాపకాలకి నెలవు- ఆమె ఇల్లు
పయ్యెలి గ్రామంలో ఆమె పేరుతో ఉన్న వీధి దాటగానే ఆమె ఇల్లు ఉంటుంది. ఆమె ఉంటున్న ఇల్లు కేవలం ఆమె నివాసం కాదు. అది ఆమె విజయాలకి, జ్ఞాపకాలకి నెలవు.
ఉష భర్త వి. శ్రీనివాసన్ మమ్మల్ని ఇల్లంతా తిప్పి చూపించారు. ఆమె ఇంటి హాల్‌లో ఆమె గెల్చుకున్న పతకాలు, ట్రోఫీలు కొలువు తీరాయి. ఆ పక్కనే ఉన్న మెట్ల దారంతా పాత ఫొటోగ్రాఫ్‌లు ఉన్నాయి. ఉష అప్పటి ప్రధాన మంత్రులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, తోటి ఆటగాళ్లతో కలిసి తీయించుకున్న ఫొటోలతో ఆ గోడ అలంకరించి ఉంది.
మరో గోడ పై అర్జున అవార్డు, పద్మ శ్రీ అవార్డు ఉన్నాయి. ఆమె వీధి గుమ్మం పైన నంబియార్‌తో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది.
"మీరు మా ఇంట్లోకి అడుగు పెట్టినపుడు ఆమె సాధించిన విజయాలు చూస్తారు. బయట కాలు పెట్టగానే ఈ విజయాలకి కారణమైన వ్యక్తి ఎవరో మీకు అర్ధం అవుతుంది" అని ఆమె భర్త అన్నారు.
ఆమె విజయాల వెనక నంబియార్‌తో పాటు ఆమె భర్త పాత్ర కూడా ఉంది. 1991లో ఆమె వివాహం జరగగానే ఆమె క్రీడల నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు.
"నా భర్తకి కూడా క్రీడలంటే ఇష్టం. అతను ముందు కబడ్డీ ఆటగాడు. నేను బిడ్డకి జన్మనిచ్చాక మళ్ళీ పరుగు పెట్టడానికి నా భర్త చాలా సహకరించారు."
ఆమె 1997లో పరుగు పందేల నుంచి రిటైర్ అయ్యే సమయానికి ఆమె 103 అంతర్జాతీయ పతకాలు సాధించారు.
తర్వాత ఒలింపిక్స్ కి వెళ్లాలనుకునే అథ్లెట్‌లకి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీని ప్రారంభించారు.

కోళికోడ్‌లో కిణలూర్ కొండల మధ్యలో ఈ అకాడమీ నెలకొని ఉంది.
"లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత ప్రతి మూడు నెలలకి శిక్షణ తీసుకోవడానికి లండన్ వెళుతూ ఉండేదానిని . అక్కడ ఉండే సదుపాయాలు చూసినపుడు అలాంటి శిక్షణ కేంద్రాన్ని ఇండియాలో కూడా ప్రారంభించాలని అనుకున్నాను" అని ఆమె చెప్పారు.
ఆమె భర్తతో కలిసి అథ్లెట్లు కావాలనుకునేవారికి శిక్షణ ఇస్తున్నారు.
"ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే మా లక్ష్యం. మా దగ్గర శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు ఆసియన్ గేమ్స్‌లో ఇప్పటికే ప్రతిభ కనబరిచి, ఒలింపిక్స్‌లో పదకొండవ స్థానం వరకు వెళ్లారు’’ అని ఆమె చెప్పారు.
ఉష మహిళలకి ఇచ్చే సలహా
"నేను 1980లలో.. ఏ సదుపాయాలు లేనప్పుడే ఇంత చేయగలిగానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరు. క్రీడలు కానివ్వండి, చదువులో కానివ్వండి ఏదైనా సాధ్యమే. కాకపొతే ఎదురయ్యే సవాళ్ళను మీకు మేరే ఎదుర్కోవాలి".
‘‘కష్టపడటమే మంత్రం. మహిళలు అద్భుతాలు చేయగలరు. ఇందులో సందేహం లేదు."

ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









