భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?

ఫొటో సోర్స్, ANI
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ఇటీవల అందించిన నివేదిక "పక్షపాతం"గా ఉందని, "సరి కాదని" భారత్ పేర్కొంది. భారతదేశం, దాని రాజ్యాంగ నిర్మాణం విషయంలో "విస్తృతమైన అవగాహనా లోపం" ఉందని ఈ నివేదికపై వ్యాఖ్యానించింది.
భారతదేశంలో విమర్శనాత్మక స్వరాలను అణచివేస్తున్నారని, ముఖ్యంగా మతపరమైన మైనారిటీలు, వారి తరపున నిలబడినవారి గొంతు నొక్కేస్తున్నారని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (USCIRF) తాజా నివేదిక పేర్కొంది.
ఈ నివేదికపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.
"భారతదేశంపై USCIRF అందించిన పక్షపాత, తప్పుడు నివేదికను పరిశీలించాం. భారత రాజ్యాంగం, దేశంలోని భిన్నత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల తీవ్రమైన అవగాహనా లోపం కనిపిస్తోంది. ఒక అజెండాతో పదే పదే వాస్తవాలను వక్రీకరిస్తూ నివేదికలు అందిస్తోంది. ఇటువంటి చర్యలు సంస్థ విశ్వసనీయత, నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు లేవనెత్తుతాయి" అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @MEAIndia/twitter
ఈ నివేదికలో ఏముంది?
జూన్ మొదటి వారంలో విడుదలైన USCIRF 2021 నివేదికలో భారతదేశంలో మత స్వేచ్ఛకు సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా విదేశాంగ శాఖ ఈ రిపోర్టు తయారుచేస్తుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ దీన్ని విడుదల చేశారు.
ఇటీవల భారతదేశంలో మత అసహనం, ప్రార్థనా స్థలాలకు సంబంధించి ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.
"భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అక్కడ వివిధ మతాలకు చెందిన వారు నివసిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ దేశంలో పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయి" అని ఆయన అన్నారు.
భారత్ స్పందన
ఈ నివేదికపై భారత్ స్పందిస్తూ, అంతర్జాతీయ సంబంధాలలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.
"ఈ నివేదిక, అమెరికా సీనియర్ అధికారుల నుంచి వచ్చిన నిరాధార వ్యాఖ్యలను మేం గమనించాం. ముందే నిశ్చయించుకున్న అభిప్రాయాలు, పక్షపాత ధోరణుల ఆధారంగా అంచనాలకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. వైవిధ్యాన్ని విశ్వసించే సమాజంగా భారతదేశం మత స్వేచ్ఛను, మానవ హక్కులను గౌరవిస్తుంది. అమెరికాతో పలు చర్చల్లో అక్కడి జాతి విద్వేషాలు, దాడులు, తుపాకీ సంస్కృతి గురించి మేం ఆందోళన వ్యక్తం చేశాం" అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
మత స్వేచ్ఛపై పరిమితులు ఉన్న దేశాలు
భారతదేశాన్ని "ప్రత్యేక ఆందోళన" (స్పెషల్ కన్సర్న్) దేశాల జాబితాలో చేర్చాలని ఏప్రిల్‌లో ఈ కమీషన్ అమెరికా విదేశాంగ శాఖకు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా కమిషన్ ఈ సిఫార్సును చేస్తూనే ఉంది కానీ, భారతదేశాన్ని ఇంకా ఆ జాబితాలో చేర్చలేదు.
ఆంటోనీ బ్లింకెన్ మత స్వేచ్ఛపై పరిమితులు ఉన్న దేశాలను సూచిస్తూ సౌదీ అరేబియా సహా చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల పేర్లు ప్రస్తావించారు.
"చైనాలో ముస్లిం వీగర్ సమాజం, ఇతర మైనారిటీ కమ్యూనిటీలపై అణచివేత కొనసాగుతోంది" అని ఆయన అన్నారు.
పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ, 2021లో కనీసం 16 మందిపై దైవదూషణ కేసు వేశారని, వారికి కోర్టు మరణశిక్ష విధించిందని చెప్పారు.
భారతదేశంలో మీడియా లేదా సోషల్ మీడియాలో హిందువులు లేదా హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హిందువేతరులను పోలీసులు అరెస్టు చేశారని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
- వలసపోయే ప్రజల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర మార్గాలు ఇవే...
- ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పు 53 మంది ప్రాణాలను బలి తీసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













