జహంగీర్‌పురి: ముస్లింలు ఇళ్లు వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు, వారి భయం దేనికి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జహంగీర్‌పురి ఇంటి నంబర్ 458.
గత నెల రోజులుగా ఈ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో ఉంటోన్న వ్యక్తి ఆచూకీ తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్లాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు.
ఆయన కథ ఏంటో మాత్రం అందరికీ తెలుసు.
''ఆయన ఈ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. చికెన్ సూప్ అమ్మేవాడు. కానీ, పోలీసుల భయానికి ఆయన పారిపోయాడు'' అని పొరుగువారు చెప్పారు.
అయితే బీబీసీతో మాట్లాడుతూ దిల్లీ పోలీస్ పీఆర్వో సుమన్ నాల్వా ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. ''ప్రజలను పోలీసులు వేధిస్తున్నారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది'' అని చెప్పారు.
"పోలీసులకు, అధికారులకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మా పని మేం చేయకుండా వారే అడ్డుకుంటారు. మళ్లీ పోలీసులు ఏమీ చేయడం లేదని వారే అంటారు'' అని ఆయన అన్నారు.
జహంగీర్‌పురిలో చాలా ఏళ్లుగా ఆయన చికెన్ సూప్ అమ్మేవాడు. కానీ, వీధిలోని ఆయన దుకాణం చాలా రోజులుగా మూసివేసి ఉంది.
ఏప్రిల్ 16న జహంగీర్‌పురిలో జరిగిన హింస తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది ముస్లింలు భయంతో తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది.

జహంగీర్‌పురి హింస తర్వాత ఇక్కడ నివసిస్తున్న చాలా మంది ముస్లింలు తమ ఇళ్లను, పనిని వదిలి వెళ్తున్నారని బీబీసీకి తెలిసింది. దీనికి కారణం ఏంటి? దీని గురించి తెలుసుకోవడానికి ఏప్రిల్‌లో మత హింస జరిగిన జహంగీర్‌పురి ప్రాంతానికి మేం వెళ్లాం.
జహంగీర్‌పురి ఏరియాలోకి ప్రవేశించాక దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ప్రధాన కూడలి ఉంది. కూడలి నుంచి ఎడమవైపున 200 మీటర్ల దూరంలో మసీదు ఉంది. అక్కడ నుంచి కొన్ని దుకాణాలు దాటాక ఆలయం ఉంది. ఈ దారిపైనే ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి సందర్భంగా మత ఘర్షణలు జరిగాయి. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఎంసీడీ చర్యలు చేపట్టింది.
ఘటన జరిగి నెలన్నర కావొస్తున్నా దుకాణాలు, ఇళ్ల ముందు వరాండాలో ఉన్న బండలు పగిలే ఉన్నాయి. ప్రజలు మళ్లీ సొంతంగా చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు.
రోడ్డుపై బారికేడ్లను పోలీసులు తొలిగించారు. కానీ, మామూలు రోజులతో పోలిస్తే ఇప్పుడు అక్కడ గస్తీ పెరిగింది. పోలీసు వాహనాలు చాలాసార్లు అక్కడ పెట్రోలింగ్ చేయడం మేం చూశాం.
ప్రధాన కూడలి నుంచి నేరుగా వెళుతున్నప్పుడు ఎడమ వైపున ‘సీ’ బ్లాక్ ఉంటుంది. దాని వెనుక మురికివాడలు మొదలవుతాయి. ఇరుకైన వీధులను దాటి మేం మురికివాడ లోపలికి చేరుకున్నాం.
మురికివాడలో నివసించే ప్రజలు బయటి వ్యక్తులను అనుమానంగా చూస్తారు. వారి దుస్తులనే కాకుండా బూట్లను కూడా స్థానికులు గమనిస్తారు. పోలీసులు మామూలు దుస్తుల్లోనే వస్తారని, అయితే వారి బూట్లను బట్టి పోలీసులని గుర్తిస్తామని స్థానికులు చెప్పారు.
ఆ ప్రాంతంలోని కొందరు మాతో మాట్లాడేందుకు అంగీకరించారు. కానీ, పేర్లను వెల్లడించడానికి ఇష్టపడలేదు. పోలీసులు తమను కూడా వేధించడం మొదలుపెడతారని వారు భయపడ్డారు.
''దర్యాప్తు పేరుతో పోలీసులు చాలా మందిని తీసుకెళ్లారు. పోలీసుల వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న చాలా ముస్లిం కుటుంబాలు ఇల్లు వదిలి వెళ్తున్నాయి. చాలా ఇళ్లకు నెల రోజులుగా తాళాలు వేసి ఉన్నాయి'' అని జహంగీర్‌పురిలో నివసించే ఫరూఖ్, బీబీసీతో చెప్పారు.

మురికివాడలోని ఒక ఇరుకైన గల్లీలో సఫియా బీవీ నివసిస్తారు. ఆమె కథ కూడా పోలీసుల చర్యతోనే ముడిపడి ఉంది.
సఫియా కుమారుడు నెల రోజుల క్రితం తన భార్య, పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. గదికి తాళం వేసి ఉంది. అప్పటినుంచి ఆయన స్కూటర్ ఇంటి బయటే ఉంది. దానిపై దుమ్ము పేరుకుపోయింది.
సఫియా కుమారుడు చిన్నప్పటి నుంచి జహంగీర్‌పురిలోనే ఉంటున్నారు. దాదాపు 20 రోజుల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు.
ఆయన తల్లి సఫియా ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారు. ఆమె బీబీసీతో మాట్లాడారు. ''పోలీసులు నా కుమారుని కోసం వెదుకుతున్నారు. జూన్ 1వ తేదీన నలుగురు వ్యక్తులు మా అబ్బాయిని వెదుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. వారు మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. కానీ, మేం దిల్లీ పోలీసులమని నాతో చెప్పారు. మా అబ్బాయి గురించి నాకేమీ తెలియదని వారికి నేను చెప్పాను'' అని ఆమె వెల్లడించారు.
సఫియా రెండో కుమారుడు కూడా జహంగీర్‌పురిలోనే ఉంటారు. ఆయన కుటుంబం కూడా భయపడుతోంది. ''పోలీసులు సోదాల పేరుతో వారంలో రెండుసార్లు వస్తుంటారు. చివరిసారిగా వచ్చినప్పుడు రేషన్ కార్డు ఇవ్వమని అడిగారు. మేం ఇవ్వలేదు. మేము ఏమీ ఇవ్వలేదు'' అని ఆమె చెప్పారు. తన కుమారులు ఎప్పుడు వస్తారో తనకే తెలియదని ఆమె అన్నారు.

సఫియా తర్వాత మేం ముస్తకీమ్‌ను కలిశాం. ''ఏప్రిల్ 17న మత హింస జరిగిన మరుసటి రోజే నేను ఇక్కడి నుంచి పారిపోయాను. రెండు రోజుల క్రితమే తిరిగొచ్చాను. నా స్నేహితుడి ఇంట్లో దాక్కున్నా. అందరినీ పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్లని తీసుకెళ్తున్నారు. నా స్నేహితుల్లో కొంతమందిని పోలీసులు వేధిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.
ముస్తకీమ్ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చారు. కానీ, ఆయన అక్కడ ఎన్ని రోజులు ఉంటారనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.
ముస్తకీమ్ తర్వాత మేం సరీఫా బీవీతో మాట్లాడాం. సరీఫా బీవీ 19 ఏళ్ల కుమారుడిని 10 రోజుల క్రితమే పోలీసులు తీసుకెళ్లారు.
"నా కుమారుడు అన్నం తింటుండగా ఆరుగురు పోలీసులు మామూలు దుస్తుల్లో వచ్చారు. మా అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. రెండు రోజులు వారి దగ్గరే ఉంచుకొని వదిలిపెట్టారు'' అని సరీఫా చెప్పారు.
సరీఫా కుమారుడు జంక్‌యార్డ్‌లో పనిచేస్తున్నారు. ఆమె మరో ముగ్గురు పెద్ద కుమారులు పశ్చిమ బెంగాల్‌లో ఉంటారు.

''జూన్ 1న పోలీసులు మళ్లీ వచ్చారు. మీ పెద్దబ్బాయిని పిలవండి లేకపోతే లేకపోతే ఇంటిని జప్తు చేస్తామని బెదిరించారు. నా పెద్ద కుమారుడు గత ఎనిమిది నెలలుగా పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్నాడు. హింస జరిగిన రోజు తను ఇక్కడ లేడు. నాకు చిన్న కూతురు ఉంది. పోలీసులు ఇష్టమున్నప్పుడు వస్తారు. అందర్నీ స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరిస్తారు. మాకు చాలా భయంగా ఉంది'' అని సరీఫా వివరించారు.
కొన్ని దశాబ్దాలుగా జహంగీర్‌పురిలో నివసిస్తున్న సఫియా, సరీఫా వంటి చాలా కుటుంబాల్లో ఇలాంటి కథలే ఉన్నాయి. ఈ కుటుంబాల్లోని పురుషులు, అబ్బాయిలు జహంగీర్‌పురిని వదిలి వెళ్లిపోతున్నారు.
ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు?
జహంగీర్‌పురిలోని చాలా ముస్లిం కుటుంబాలు... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మిద్నాపూర్‌లోని హల్దియా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు. పని వెదుక్కుంటూ చాలా ఏళ్ల క్రితమే ఈ కుటుంబాలు దిల్లీకి వచ్చాయి. కాలక్రమేణా వారంతా జహంగీర్‌పురిలో నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ నివసించే కుటుంబాల్లో ఎక్కువ మంది తుక్కును సేకరిస్తుంటారు.
మురికివాడల్లో నివసించే చాలా ముస్లిం కుటుంబాలు బెంగాలీ మాట్లాడేవి. వారంతా హిందీకి బదులుగా బెంగాలీ బాగా మాట్లాడతారు.
జహంగీర్‌పురిలో అక్బర్, మొబైల్ దుకాణం నడుపుతారు. ఆయన బీబీసీతో మాట్లాడారు. ''పోలీసుల భయంతో ప్రజలు మళ్లీ పశ్చిమ బెంగాల్ వెళ్తున్నారు. మంగళవారం ప్రధాన కూడలి దగ్గర బాగా ఎక్కువగా ఆటోలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోజే ఆనంద్‌విహార్ నుంచి హల్దియాకు రైలు వెళ్తుంది. గత కొన్ని వారాలుగా ప్రజలు ఇలా చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే పోలీసులు పట్టుకెళ్తారని వారంతా భావిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
పోలీసులు ఎవరి కోసం వెతుకుతున్నారు?
జహంగీర్‌పురి హింసపై విచారణ కొనసాగుతోంది. ఏప్రిల్ 16 నాటి మత హింసతో సంబంధం ఉన్న నిందితుల కోసం పోలీసులు వెదుకుతున్నారు. అయితే జహంగీర్‌పురిలో నివసించే ముస్లిం కుటుంబాలు మాత్రం... పోలీసులు కావాలనే అమాయకులను వేధిస్తున్నారని చెబుతున్నాయి.
పోలీసులు వెదుకుతోన్న వారిలో సాజ్దా కూడా ఒకరు. జహంగీర్‌పురిలోని 'సీ' బ్లాక్‌లో సాజ్దా ఉంటారు. మత హింస జరిగిన రోజు ఆయన అక్కడే ఉన్నారు.
ఆయన దీని గురించి మాట్లాడారు. ''నేను పుచ్చకాయ కొనడం కోసం వెళ్లాను. అప్పుడే హింస చెలరేగింది. ఆందోళనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించాను. వీడియోలో నా ముఖం కూడా కనిపిస్తుంది. నాలుగు సార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు కానీ, పోలీసులు మాత్రం తరచుగా మా వీధిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు'' అని చెప్పారు.
సాజ్దా కుమారుల్లో ఒకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ''ఈ ఘటన తర్వాత మా అబ్బాయి పని చేయడం కష్టంగా మారింది. జహంగీర్‌పురికి చెందిన ముస్లిం అని తనని గేలి చేస్తున్నారు. పని చేయడం అతనికి చాలా కష్టంగా మారింది'' అని సాజ్దా వివరించారు.
మరోవైపు జహంగీర్‌పురి జీహెచ్ బ్లాక్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఇంద్రమణి తివారీ స్పందన వీరికి భిన్నంగా ఉంది. ఆమె పోలీసుల చర్యకు మద్దతు ఇచ్చారు.
ఇంద్రమణి తివారీ మాట్లాడుతూ... ''పోలీసులు, తమ పనిని చేసుకుపోతున్నారు. మత హింసకు పాల్పడిన వ్యక్తులు మాత్రమే పారిపోతున్నారు. వారే భయపడుతున్నారు. మిగతా వారంతా ఇళ్లను వదిలి వెళ్లట్లేదు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయంపై వాయువ్య దిల్లీ డీసీపీ ఉషా రంగనానితో మాట్లాడేందుకు వ్యక్తిగతంగా, ఫోన్, ఈమెయిల్, మెసేజ్ ద్వారా బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆమె వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
పోలీసుల చర్యలకు గురవుతున్న ముస్లిం కుటుంబాలకు సాయం చేస్తున్న వారిలో ఫరూక్ కూడా ఒకరు. జహంగీర్‌పురిలో ఆయన స్క్రాప్ వర్క్ చేస్తుంటారు. ''పోలీసులు ఇప్పటివరకు 35 మందికి పైగా ముస్లింలను అరెస్టు చేశారు. ఆ కుటుంబాలకు సహాయం చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
జహంగీర్‌పురి హింస కేసులో దాదాపు 12 మంది నిందితులకు 'అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్' సంస్థ న్యాయ సహాయం అందిస్తోంది. పోలీసుల చర్యను ఆ సంస్థ జాతీయ కార్యదర్శి నదీమ్ ఖాన్ ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని పోలీసులు వేధిస్తున్నారని అన్నారు.
నదీమ్ ఖాన్ ప్రకారం... జహంగీర్‌పురి హింస కేసులో పోలీసులు ఒక మైనర్ పిల్లాడిని అసలు సూత్రధారిగా భావించి పట్టుకెళ్లారు. కోర్టు నుంచి అతడిని కస్టడీకి కూడా తీసుకున్నారు. అప్పుడు కోర్టు అతని వయస్సును పరిశీలించలేదు. ఈ విషయాన్ని మేం హైకోర్టుకు తీసుకెళ్లాం. పోలీసులను మందలించిన కోర్టు నాలుగు గంటల్లో పిల్లాడిని జువైనల్ సెంటర్‌కు పంపాలని ఆదేశించింది.
జీవనోపాధి కోసం వందల మైళ్ల దూరం వచ్చి జహంగీర్‌పురిలో ఉంటోన్న కుటుంబాల జీవితాలు, ఈ మతహింస తర్వాత మారిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లోని తమ గ్రామాలకు తిరిగి వెళ్లాలని చాలా కుటుంబాలు అనుకుంటున్నాయి. ఈ సమస్య సద్దుమణిగితే జీవితం మళ్లీ మామూలుగా అవుతుందని కూడా చాలా మంది ఆశతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- సద్గురు జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? కళ్లు తెరిపించేలా చైనా పనులు ఉన్నాయని అమెరికా ఎందుకు అంటోంది?
- హిందీ మీడియంలో సివిల్స్ రాసే వాళ్లు సక్సెస్ కాలేక పోతున్నారా
- ఆమ్ ఆద్మీ పార్టీ: గుజరాత్లో కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రీప్లేస్ చేయగలదా? బీజేపీ కోటను కూలగొట్టగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













