Ladakh: లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? కళ్లు తెరిపించేలా చైనా పనులు ఉన్నాయని అమెరికా సైనిక జనరల్ ఎందుకు అన్నారు?

ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో అమెరికా జనరల్ చార్ల్స్ ఎ ఫ్లిన్

ఫొటో సోర్స్, Facebook/Indian Army

ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో అమెరికా జనరల్ చార్ల్స్ ఎ ఫ్లిన్

భారత సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నాయని, అవి కనువిప్పు కలిగిస్తున్నాయని అమెరికా ఆర్మీ పసిఫిక్ విభాగం కమాండింగ్ జనరల్ చార్ల్స్ ఎ.ఫ్లిన్ అన్నారు.

బుధవారం దిల్లీలో మాట్లాడిన ఆయన, సరిహద్దుల్లో చైనా చేపడుతున్న సైనిక కార్యకలాపాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 'సరిహద్దుల్లో చైనా ఏర్పాటు చేసుకుంటున్న కొన్ని మౌలికవసతులు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి' అని విలేకర్ల సమావేశంలో ఫ్లిన్ అన్నారు.

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల ఘర్షణ (పాత ఫొటో)

లద్దాఖ్‌లో 2020 నుంచి సరిహద్దు గొడవలు

లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద 2020 మే 5 నుంచి భారత్, చైనాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. నాడు జరిగిన ఘర్షణల్లో రెండు దేశాలకు చెందిన సైనికులు కూడా చనిపోయారు.

ఇక తూర్పు లద్దాఖ్‌లో రెండో బ్రిడ్జిని చైనా నిర్మిస్తున్నట్లు గత నెలలో తెలిసింది. చైనా బలగాలు లద్దాఖ్‌కు వేగంగా చేరుకునేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. సరిహద్దుల్లో చైనా రోడ్లు వేయడంతోపాటు ఇళ్లు కూడా నిర్మిస్తోంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్

ఫొటో సోర్స్, AFP CONTRIBUTOR

'మోదీ ప్రభుత్వానికి చైనా అంటే భయం'

అమెరికా జనరల్ చార్ల్స్ ఫ్లిన్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చైనా విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ధైర్యం లేదని, పిరికితనంతో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

'భారత్-చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్ వద్ద నెలకొని ఉన్న ఆందోళనకర పరిస్థితుల గురించి ఒక అమెరికా జనరల్ మనకు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మన 'వోకల్' ప్రధాని చైనా పేరు పలకడం కూడా మరిచిపోయారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై అమెరికా జనరల్ చేసిన వ్యాఖ్యలు మనకు కనువిప్పు కలిగించేవి.' అని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

ఇదే విషయం మీద గతంలో తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే నాడు ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎటువంటి చర్చ చేపట్టలేదని ఓవైసీ అన్నారు.

మన భూభాగాన్ని చైనా తీసుకుందనే వాస్తవాన్ని అంగీకరించడానికి మోదీ సిద్ధంగా లేరని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహ్మద్ విమర్శించారు.

బీబీసీ రెడ్ లైన్

ఇండియా, చైనా మధ్య లద్దాఖ్ ఎందుకు వివాదంగా ఉంది?

  • తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంట మిలిటరీ బారీకేడ్లను చైనా ఏర్పాటు చేయడంతో 2020 ఏప్రిల్‌లో భారత్, చైనా మధ్య వివాదం తలెత్తింది.
  • గల్వాన్ లోయ, ప్యాంగాంగ్ సరస్సు వంటి చోట్లు రెండు దేశాల సైనికులు ఘర్షణలకు దిగారు.
  • జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు.
  • ఆ తరువాత తమ సైనికులు నలుగురు చనిపోయినట్లు చైనా వెల్లడించింది. కానీ మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ, ఉత్తర తీరాల వెంట ఉద్రిక్తతలను దశల వారీగా తగ్గించనున్నట్లు 2021 ఫిబ్రవరిలో రెండు దేశాలు ప్రకటించాయి.
  • గోగరా, డెప్సాంగ్ వంటి ప్రాంతాల్లో నేటికీ వివాదం కొనసాగుతోంది.
  • వాస్తవాధీన రేఖ వెంట సుమారు 12 ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య వివాదాలు ఉన్నాయి.
  • 2020 జూన్ తరువాత రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల మధ్య సుమారు 14 సార్లు చర్చలు జరిగాయి.
బీబీసీ రెడ్ లైన్
తూర్పు లద్దాఖ్‌

ఫొటో సోర్స్, ANBARASAN/BBC

'లద్దాఖ్‌లో ఎటువంటి మార్పులను అంగీకరించం'

తూర్పు లద్దాఖ్‌లో ఎటువంటి మార్పులను తాము అంగీకరించమని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవలే అన్నారు. 'దేశ సరిహద్దులను కాపాడుకోవడం మన కర్తవ్యం. సరిహద్దుల వెంట ఏకపక్షంగా చేసే ఎటువంటి మార్పులనైనా మేం అంగీకరించం.' అని ఆయన చెప్పుకొచ్చారు.

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 'దేశ భద్రత కోసం ఏం చేయాలో అది చేస్తాం. సరిహద్దుల్లో మార్పులు చేయాలని చూస్తే తగిన విధంగా బదులిస్తాం.' అని జైశంకర్ తెలిపారు.

సరిహద్దు గొడవలను సజీవంగా ఉంచేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గత నెలలో ఆరోపించారు. సరిహద్దుల్లో మార్పులు చేయాలని చైనా ప్రయత్నిస్తే అడ్డుకోవడమే కాకుండా తగిన విధంగా బదులిస్తామని కూడా ఆయన హెచ్చరించారు.

తూర్పు లద్దాఖ్‌కు సంబంధించి 2020 ఏప్రిల్ ముందు ఎలాంటి స్థితి ఉందో అలాంటి స్థితే ఉండేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)