మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1968లో మంకీపాక్స్ సోకిన కోతి నుంచి తీసుకున్న చర్మ కణజాలం

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని పలు దేశాల్లో 90కి పైగా మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

ఆఫ్రికాలో ఇది తరచూ కనిపించే అంటువ్యాధి. కానీ, ఇప్పుడు ఆఫ్రికాకు బయట ఇతర దేశాల్లో కనిపిస్తోంది.

పైన చెప్పిన దేశాలు కాక, మరో 12 దేశాల్లో కనీసం 28 అనుమానిత కేసులను పరీక్షిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

అయితే, ఇది కోవిడ్ లాంటిది కాదని, దీని నియంత్రణ సాధ్యమేనని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంటున్నారు.

మంకీపాక్స్ గురించి మనం తెలుసుకోవలసిన విషయాలేంటి?

మంకీ పాక్స్ వైరస్

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, మంకీ పాక్స్ వైరస్

మంకీపాక్స్ అంటే ఏమిటి?

ఈ వైరస్ ఎక్కువగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుంది.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. అక్కడ ఈ ఏడాది 1,200 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మే 1 నాటికి 57 మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి.

మంకీపాక్స్ లక్షణాలేంటి?

ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తరువాత, చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కనిపిస్తాయి. ముందు చర్మం ఎర్రగా కందినట్టు అవుతుంది. ఆపై పొక్కులు వస్తాయి. తరువాత బొబ్బర్లుగా మారతాయి. ఆపై పెద్ద స్పోటకపు మచ్చల్లాగ ఏర్పడతాయని డబ్ల్యుహెచ్ఓ స్మాల్‌పాక్స్ సెక్రటేరియట్ హెడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ వివరించారు.

మెల్లగా అవి ఎండిపోయి, పైన పొక్కులు ఊడిపోతాయని ఆమె చెప్పారు.

దద్దుర్లు లేదా పొక్కులు దురద పెడతాయని, నొప్పిగా ఉండవచ్చని, కాలక్రమేణా దురదలు తగ్గుతాయని అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీకి చెందిన డాక్టర్ అమేష్ అడాల్జా చెప్పారు.

"దద్దుర్లు, పొక్కులు తగ్గిపోతాయి. చాలామందికి త్వరగానే తగ్గిపోతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావు" అని ఆయన చెప్పారు.

సాధారణంగా ఈ వ్యాధి 14 నుంచి 21 రోజుల లోపు దానంతట అదే తగ్గిపోతుంది.

మంకీపాక్స్ లక్షణాలు

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?

సాధారణంగా మంకీపాక్స్ కోతులు, ఎలుకలు, ఉడుతల వంటి జంతువుల నుంచి మానవులకు సోకుతుంది.

మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువ. కానీ, వైరస్ సోకిన వ్యక్తితో బాగా సన్నిహితంగా మెలిగితే ఇంఫెక్షన్ వ్యాపించవచ్చు.

చర్మం పగుళ్లు, శ్వాసకోశ వ్యవస్థ, కళ్లు నోటి ద్వారా ఇది సంక్రమిస్తుంది.

వ్యాధి ఉన్నవారు వాడిన తువ్వాళ్లు, దుప్పట్లు ఇతరులు వాడితే వ్యాధి సంక్రమించవచ్చు.

మంకీపాక్స్‌లో కొత్త వేరియంట్స్ పుట్టుకొచ్చాయా?

అది మనకు స్పష్టంగా తెలీదని డాక్టర్ లూయీస్ అన్నారు.

"ఇది చాలా స్థిరమైన వైరస్" అని చెబుతూ, స్మాల్‌పాక్స్ అనేది డీఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్‌ల కన్నా వీటిలో మ్యూటేషన్ చాలా తక్కువగా ఉంటుందని ఆమె వివరించారు. కోవిడ్ ఆర్ఎన్ఏ వైరస్ కుటుంబంలోకి వస్తుంది.

మంకీపాక్స్ వైరస్‌లో మ్యూటేషన్ వచ్చిందన్న ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. నిపుణులు ఆ దిశలో పరిశోధనలు చేస్తున్నారని లూయీస్ తెలిపారు.

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెద్దల కన్నా పిల్లల్లో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు

గే వ్యక్తులకు రిస్క్ ఎక్కువ ఉందా?

ప్రస్తుతం యూరోప్‌లో బయటపడిన కేసుల్లో స్వలింగ సంపర్కులైన పురుషుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధి కాదు.

"ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తున్న మాట నిజమేగానీ ఇది 'గే వ్యాధి' కాదు. సోషల్ మీడియాలో అలాంటి ప్రచారం జరుగుతోంది. కానీ, అది నిజం కాదు. ఇది ఎవరికైనా సోకవచ్చు" అని డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు ఆండీ సీల్ వివరించారు.

"మంకీపాక్స్ వ్యాపించడానికి లైంగికంగా దగ్గర కావాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

స్వలింగ్ సంపర్కుల్లో ఎక్కువగా కనిపించడానికి ఒక కారణం, ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే, వారు మరింత చురుకుగా మారడం కావొచ్చని ఆండీ సీల్ అన్నారు.

"ఈ జనాభా సాధారణంగా లైంగిక వ్యాధుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఏదైనా పొక్కు లేద దద్దుర్లు లాంటివి కనిపిస్తే వాళ్లు వెంటనే అప్రమత్తమవుతారు. దానికి చికిత్స చేయించుకుంటారు" అని సీల్ చెప్పారు.

మరో వైపు, మీడియా సంస్థలు మంకీపాక్స్ గురించి తెలియజెప్పడానికి నల్లజాతి చిన్నారుల ఫొటోలు వాడుతున్నారనే విమర్శ కూడా వినిపిస్తోంది.

వాళ్లంతా "సహానుభూతి లేకుండా" ఉన్నారని, నల్లజాతీయులు లేదా ఆఫ్రికన్ల పట్ల ఉన్న "ప్రతికూల భావాలు, మూస ఆలోచనలను" బలపరుస్తున్నారని ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (ఎఫ్‌పీఏ) ఆఫ్రికా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.

"మంకీపాక్స్ ప్రపంచంలో ఏ ప్రాంతం వారికైనా సోకవచ్చు. దానికి జాతి, తెగల భేదం లేదు. వ్యాధి గురించి చెప్పడానికి జాతి లేదా చర్మం రంగు ఆధారం కాకూడదు" అని ఎఫ్‌పీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

వీడియో క్యాప్షన్, భర్తను చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్న మహిళ కథ..

మంకీపాక్స్ పిల్లలకు వస్తుందా?

పిల్లలకు రావచ్చు. పెద్దల కన్నా పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

కడుపులో పిండానికి లేదా నవజాత శిశువుకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి.

మంకీపాక్స్ ప్రాణాంతకమా?

సాధారణంగా మంకీపాక్స్ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రతరం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.

ఇటీవల కాలంలో మరణాల రేటు 3 నుంచి 6 శాతం ఉంది. దీనికి కారణాలు వివరించడం కష్టమని చెబుతున్నారు.

"ఒక్కోసారి మరణాలు రేటు 10 శాతానికి కూడా పెరుగుతోంది. కానీ వాటికి కారణాలు అర్థం చేసుకోవడం కష్టం. వారిలో చాలామంది సరైన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాలవారే" అని డాక్టర్ అడాల్జా చెప్పారు.

ఇప్పటివరకు మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు బయటపడ్డాయి. ఒక వెస్ట్ ఆఫ్రికన్, రెండోది సెంట్రల్ ఆఫ్రికన్. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ వెస్ట్ ఆఫ్రికన్.

"సెంట్రల్ ఆఫ్రికన్ వెర్షన్ కన్నా వెస్ట్ ఆఫ్రికన్ వెర్షన్ తీవ్రత తక్కువ. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. కాబట్టి వ్యాధి సోకినవారికి తీవ్రమయే అవకాశాలు తక్కువ" అని మెల్‌బోర్న్‌లోని డీకిన్ యూనివర్సిటీలో ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ కేథరీన్ బెనెట్ బీబీసీకి చెప్పారు.

చికిత్స ఏంటి?

మంకీపాక్స్ చికిత్స ప్రధానంగా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడంపై దృష్టి పెడుతుంది. యాంటీవైరల్ మందులు ఉన్నాయి కానీ, "వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే వాటి ప్రభావం అంత మెరుగ్గా ఉంటుందని" ప్రొఫెసర్ బెనెట్ చెప్పారు.

మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సీన్ లేదు. మశూచికి ఇచ్చే వ్యాక్సీన్ 85 శాతం పనిచేస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

అయితే, కోవిడ్ 19 లాగ ప్రపంచంలో జనాభా మొత్తానికి వ్యాక్సీన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ప్రొఫెస బెనెట్ అంటున్నారు.

గతంలో మశూచి విజృంభించినప్పుడు చాలామందికి వ్యాక్సీన్ వేశారు. వాళ్లంతా ఇప్పుడు వృద్ధులు. ప్రస్తుతం ఎక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాల్లో పనిచేసే హెల్త్ వర్కర్లకు వ్యాక్సీన్లు ఇవ్వవచ్చు.

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంకీపాక్స్ వలన వచ్చే దద్దుర్లు, పొక్కులు బాగా దురద పెట్టవచ్చు. నొప్పి కలిగించవచ్చు

మనం ఆందోళన చెందాలా?

కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా, అంత భయపడక్కర్లేదని అంటున్నారు.

"ఏ మాత్రం లక్షణాలున్న వారైనా ఇప్పుడు అప్రమత్తమవుతారు కాబట్టి కేసులు పెరిగినట్టు కనిపించవచ్చు. లేదా ప్రత్యేకంగా లక్షణాలు బయటకు కనిపించని వారిలో పాజిటివ్ కేసులు బయటపడవచ్చు" అని ప్రొఫెసర్ బెనెట్ చెప్పారు.

వ్యాధి లక్షణాలు 12 రోజులు ఉంటాయి కాబట్టి, కేసుల సంఖ్య వాస్తవంలో సంక్రమణ తీవ్రతను సూచించకపోవచ్చని డాక్టర్ అడాల్జా అన్నారు.

ఈ వ్యాధి "నియంత్రణ సాధ్యమని" డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

యూరప్, నార్త్ అమెరికాలలో దీన్ని కట్టడి చేయడం సాధ్యమే, కానీ "ఇది ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో వ్యాధి సంక్రమణను జాగ్రత్తగా గమనిస్తుండాలని" ఆమె అన్నారు.

"ఒక వైరస్ వ్యాప్తి వ్యత్యాసంగా కనిపించినా, దాని ప్రవర్తనలో మార్పులు కనిపించినా మనం అప్రమత్తం కావాలి. కానీ, ఇది మహమ్మారి అయే అవకాశం ఉందా? లేదు. సాధారణ ప్రజానీకానికి ప్రమాదమా? కాదు" అని డాక్టర్ అడాల్జా అన్నారు.

వీడియో క్యాప్షన్, మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తారు/ఉతుకుతారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)