పుట్టగొడుగుల్లో కొన్ని రకాలు ప్రాణం తీస్తాయి... వాటిని గుర్తించడమెలా?

- రచయిత, శాలిని కుమారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుట్ట గొడుగులు (మష్రూమ్స్) తినే అలవాటు భారత్‌లో పెరుగుతోంది. ఇళ్లలోని కూరగాయల అరల్లో ఇవి కూడా స్థానం దక్కించుకుంటున్నాయి. దుకాణాల్లో పుట్టగొడుగులు కొనే బదులుగా కొందరు అడవి నుంచి వాటిని తెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే చాలాసార్లు విషపూరిత పుట్టగొడుగులు తిని చనిపోయారనే వార్తలు మనం వింటుంటాం.
ఇటీవల అస్సాంలో ఇలాంటి ఘటనే జరిగింది. విషపూరిత పుట్టగొడుగులు తిని అక్కడ 13 మంది చనిపోయారు.
అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఏఎంసీహెచ్) అధ్యక్షుడు, డాక్టర్ ప్రశాంత్ దిహింగియా మాట్లాడుతూ... ''బాధితులందరూ అడవిలో దొరికే విషపూరిత పుట్టగొడుగులను సాధారణ పుట్టగొడుగులుగా భావించి ఇంటిలో వండుకొని తిన్నారు'' అని చెప్పారు.
''వారంతా మష్రూమ్స్ తిన్నాక వికారం, వాంతులు, కడుపు నొప్పి వచ్చినట్లు చెప్పారు. పరిస్థితి మరింత దిగజారడంతో చికిత్స కోసం వెంటనే ఏఎంసీహెచ్ ఆసుపత్రి వచ్చారని'' ఆయన తెలిపారు.
ఏటా ఇలాంటి కేసులు వస్తుంటాయని, అందులో ఎక్కువగా టీ తోటల ప్రాంతాల వారు ఉంటారని ఆయన చెప్పారు.
''సాధారణంగా విషపు మష్రూమ్‌లకు, మంచి వాటికి మధ్య తేడాను ప్రజలు అర్థం చేసుకోలేరు. అందుకే పొరపాటున విషపు పుట్టగొడుగులను తింటారు'' అని ఆయన వివరించారు.
ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనీ, అయితే ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలేవీ జరగడం లేదని డాక్టర్ ప్రశాంత్ అన్నారు.

శరీరంలోని ఏ భాగంపై ప్రభావం పడుతుంది?
విషపూరిత పుట్టగొడుగులను తినడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి డాక్టర్ ప్రశాంత్ వివరించారు.
''కొన్ని రకాల మష్రూమ్‌లు కిడ్నీ, కాలేయంపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు బాధితులు ఆలస్యంగా ఆసుపత్రికి వస్తారు. చికిత్స తర్వాత కూడా వారి ప్రాణాలను కాపాడలేకపోతాం. కొన్ని సందర్భాల్లో పుట్టగొడుగుల్లోని విష ప్రభావం వెంటనే కనిపించదు. కానీ, నాలుగైదు రోజుల తర్వాత మెల్లిమెల్లిగా అది శరీరంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది'' అని ఆయన వివరించారు.
మామూలు మష్రూమ్‌ల తరహాలోనే విషపూరిత మష్రూమ్‌ల రంగు, ఆకారం ఒకేలా ఉండటంతో చాలాసార్లు వాటిని గుర్తించడంలో పొరపాటు జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు చెందిన ఇండియన్ ఫార్మర్స్ డైజెస్ట్ చెప్పింది.
వీటిలో ఉండే 'ఎమానిటిన్' అనే పదార్థం చాలా ప్రమాదకరమైనది. ఈ పదార్థాన్ని కలిగి ఉండే మష్రూమ్‌లను 'డెత్ క్యాప్స్', 'డిస్ట్రాయింగ్ ఏంజెల్స్' అని పిలుస్తారు. గోధుమ రంగులో, చిన్నగా ఉండే పుట్టగొడుగుల్లో కూడా ఇది ఉంటుంది. చాలావరకు మష్రూమ్ మరణాలకు కారణం ఈ 'ఎమానిటిన్' పదార్థమే.

ఫొటో సోర్స్, iStock
విషపు మష్రూమ్‌లను గుర్తించడంలో ఎలా పొరబడతాం?
ఐసీఏఆర్ ప్రకారం, విషపూరితపు పుట్టగొడుగులను గుర్తించడం చాలా కష్టం. వీటిని గుర్తించడానికి కొన్ని రకాల సొంత పద్ధతులను ప్రజలు అవలంభిస్తారు. కానీ, ఈ ఊహా పద్ధతుల ద్వారా విషపు పుట్టగొడుగులను కచ్చితత్వంతో గుర్తించలేమని ఐసీఏఆర్ నివేదిక పేర్కొంది.
ఇవి విషపూరితమైనవా? కాదా? అని తెలుసుకోవడానికి రంగుపై ఆధారపడటం కూడా ఈ కోవలోకే వస్తుంది.
ముదురు రంగు పుట్టగొడుగులు విషపూరితమైనవి అని నమ్ముతారు. కానీ, ప్రపంచంలోని చాలా విషపూరితపు పుట్టగొడుగులు తెలుపు లేదా గోదుమ రంగులో ఉంటాయి.
'డిస్ట్రాయింగ్ ఏంజెల్' రకం అయితే పూర్తిగా తెల్లగానే ఉంటుంది. 'ఎమానిటిన్'ను కలిగి ఉండే మష్రూమ్‌లు ముదురు నారింజ లేదా తెలుపు రంగులో ఉంటాయి.
విషపు పుట్టగొడుగులు వెండి పాత్రలో వేసినప్పుడు, ఆ పాత్ర నలుపు రంగులోకి మారిపోతుందని ప్రజలు నమ్ముతారు. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు.
పుట్టగొడుగుల పైభాగం పదునుగా ఉంటే అవి విషపూరితమైనవి అని అనుకుంటారు. అయితే, 'డెత్ క్యాప్' అనే ప్రమాదకర మష్రూమ్‌ల పైభాగం పదునుగా ఉండదు. గుండ్రంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మష్రూమ్‌లను కొన్నిసార్లు స్టార్టర్‌గా, మరికొందరు ఆల్కహాల్‌తో మష్రూమ్ పదార్థాలను తీసుకుంటారని, ఇది ప్రమాదకరమని క్లినికల్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ నుపుర్ చెప్పారు.
ఒక్కోసారి సాధారణ పుట్టగొడుగులు కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయని ఆమె తెలిపారు. ''ఏడేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు పుట్టగొడుగులను ఆహారంలో ఇవ్వకూడదు. వాటిని జీర్ణం చేసే ఎంజైమ్‌లు పిల్లల్లో ఉండవు'' అని ఆమె సూచించారు.
గట్టిగా ఉన్న మష్రూమ్‌లను మాత్రమే మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలని, అవి తడిగా లేకుండా చూసుకోవాలని ఆమె చెప్పారు. పుట్టగొడుగులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. దీనివల్ల అవి ప్రమాదకరంగా తయారవుతాయి.
పుట్టగొడుగులను సేకరించిన తరువాత 48 గంటల్లోగా తినేయాలని ఆమె సూచించారు.
''పుట్టగొడుగులు ఎప్పుడూ ఒక నియంత్రిత వాతావరణంలోనే పండుతాయి. కాబట్టి మీరు అడవిలో లభించే మష్రూమ్‌లను వాడకూడదు. వాటి వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి'' అని ఆమె హెచ్చరించారు.

ఫొటో సోర్స్, iStock
మష్రూమ్ ఎందుకు అంత ప్రత్యేకం?
అసలు పుట్టగొడుగులు అంటే ఏంటి? '' ఇది ఒక ఫంగస్. ఇది గాలిలో వ్యాపించే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. పుట్టగొడుగులు నేలపై, చెక్కపై పుట్టుకొస్తాయి'' అని డాక్టర్ నుపుర్ చెప్పారు.
చాలా ఏళ్లుగా వీటిని తింటున్నారు. ఆరోగ్యానికి మంచిదని భావించడం వల్ల ఈరోజుల్లో వీటి వాడకం మరింత పెరిగింది. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు. అంతేకాకుండా పొటాషియం, విటమిన్ డి, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
మష్రూమ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. కొన్నిరకాల మష్రూమ్‌లు డీఎన్ఏ నాశనం కాకుండా నిరోధించి క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తాయి.
అల్జీమర్స్ వంటి వ్యాధులపై పోరాడటంలో ఇవి ఉపయోగపడతాయని సూచించే కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.
పుట్టగొడుగుల్లో 2000లకు పైగా జాతులు ఉన్నాయి. ఇందులో కేవలం 25 జాతులు మాత్రమే తినడానికి పనికొస్తాయి. 1970లలో భారత్‌లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభమైంది.
2012 అగ్రికల్చర్ ఇయర్ బుక్ ప్రకారం, 1000 ఏళ్ల క్రితమే చైనా ప్రజలు వీటిని పెంపకాన్ని ప్రారంభించారు. వీటితో వ్యాపారాన్ని చేసేవారు మాత్రం యూరోపియన్లు. 16, 17 శతాబ్దాలలో వారు బటన్ మష్రూమ్స్ పెంపకాన్ని ప్రారంభించారు.
మష్రూమ్‌లను ఎలా సాగు చేస్తారు?
భారత్‌లో 2019-2020 సంవత్సరంలో 2,01,088 టన్నుల పుట్టగొడుగుల సాగు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. హరియాణాలో అత్యధికంగా 20,050 టన్నుల మష్రూమ్ సాగు జరిగింది. దీని తర్వాత వరుసగా ఒడిశా, మహారాష్ట్రలు వీటిని ఎక్కువగా పండించే జాబితాలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వీటి సాగులో చైనా తొలి స్థానంలో ఉండగా... అమెరికా, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని 2018 నాటి నివేదికలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
భారత్‌లో బటన్ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్‌లు చాలా పాపులర్. ప్యాడీ స్ట్రా మష్రూమ్, మిల్కీ మష్రూమ్‌లు కూడా ఇక్కడ దొరుకుతాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ప్రకారం, భారత్‌లోని వాయువ్య ప్రాంతంలోని కొండల్లో బటన్ మష్రూమ్‌లను శీతాకాలంలో సంప్రదాయకంగా పండిస్తారు. దీనికి ఆరు నుంచి తొమ్మది నెలల సమయం పడుతుంది. కానీ, సాంకేతికత అభివృద్ధి కారణంగా వీటిని ఇప్పుడు ఎక్కడైనా, ఏ కాలంలోనైనా పండిస్తున్నారు.
ఆయిస్టర్ మష్రూమ్‌లను 20 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వాతావరణంలో పండిస్తారు. వేసవిలో కూడా వీటిని సాగు చేయవచ్చు. వీటి పెంపకం చాలా సులభం. పొదుపైనది కూడా. గ్రామీణ ప్రాంతాలు వీటి సాగుకు అనువుగా ఉంటాయి.
మష్రూమ్ సాగు కోసం కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలి. గోదుమ ఊక, కోడి వ్యర్థాలు, ఇతర పదార్థాలను ఈ ఎరువు తయారీలో ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్‌కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
- రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భారత్‌లో పన్నులు చెల్లించే భార్య కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











