మొక్కల వ్యర్థాలు చేపలకు ఆహారం.. చేపల వ్యర్థాలు మొక్కలకు ఆహారం.. వృధా ఆహారాన్ని ఉపయోగించుకోవటం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాథరీన్ లాథామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకవైపు ప్రపంచ ఆహార ఉత్పత్తి పెరుగుతోంటే.. మరోవైపు ఆహార వృధా కూడా పెరిగిపోతోంది. మొత్తం ఆహారంలో దాదాపు 40 శాతం వ్యర్థమవుతోంటే.. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది పస్తులుంటున్నారు.ఈ ఆహార వృధా వాతావరణ మార్పుకు కూడా కారణమవుతోంది.. ఆహార భద్రత ముప్పును పెంచుతోంది.
మనం ‘క్యాచ్ 22’ పరిస్థితిలో చిక్కుకున్నాం. పెరుగుతున్న జనాభాకు మరింత ఆహారం అవసరం. కానీ దానిని పండించటానికి ప్రపంచంలోని వనరులను మరింత ఎక్కువగా ఉపయోగించుకోలేం. అయితే.. ఈ సమస్యకు పరిష్కారం మనం ఆలోచిస్తూ కూర్చున్న పీట కిందే దాగివుందా?
ఇప్పటికే మొత్తం భూమిలో 38 శాతం వ్యవసాయ భూమిగా ఉంది. అది దాదాపు 500 కోట్ల హెక్టార్ల విలువైన భూమి.
కానీ.. పెరుగుతున్న అంతకంతకూ సంపన్నవంతమవుతున్న జనాభాకు తిండి పెట్టాలంటే సాగు భూములను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. మరింత ఆహారాన్ని పండించాలన్న అత్యవసర పరిస్థితుల్లో కొన్ని సాగు పద్ధతులు భూమిని నిస్సారం చేస్తున్నాయి. వాతావరణ మార్పును వేగవంతం చేస్తున్నాయి. జీవవైవిధ్య నష్టానికి కారణమవుతున్నాయి. అంతేకాదు.. భవిష్యత్ తరాలు ఆహారం పండించుకునే అవకాశాలను కూడా మనం దెబ్బతిస్తున్నాం.
అయితే.. కొత్తగా సాగుభూమిని సృష్టించకుండా, మరింత ఎక్కువగా పంటలు పండించకుండా, మరిన్ని పశువులను పెంచకుండా.. మనం ఉత్పత్తి చేసే ఆహారం పరిమాణాన్ని పెంచుకోగలిగే మార్గం ఒకటుంది.
ప్రతి రోజూ రైతులు, సరఫరాదారులు, తయారీదారులు, ఉత్పత్తిదారులు, చివరికి వినియోగదారులు సైతం.. భారీ మొత్తంలో మనం తినగలిగే ఆహారాన్ని పారేస్తున్నారు. ఆ వ్యర్ధాన్ని తగ్గించగలిగితే మనం ప్రపంచం మొత్తానికి తిండి పెట్టగలమా?

ఫొటో సోర్స్, Getty Images
వినియోగదారుల వంతులో.. తమకు అవసరమైనంత వరకు మాత్రమే కొనుక్కోవటం, వృధా కాకుండా ఉండేలా వాడుకోవటం చేయాల్సి ఉంటుంది.
అయితే.. ప్రతి ఏటా 1200 టన్నుల ఆహారం అసలు దుకాణాలకు చేరక ముందే వృధా అవుతోందని అంచనా. ఇది ఒక కోటి నీలి తిమింగలాల బరువుతో సమానం. పంట కోత సమయంలో, శుద్ధి చేసే సమయంలో, రవాణా సమయంలో.. సరఫరా గొలుసు అంతటా ఆహార వృధా జరుగుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం పరిమితులతో పాటు.. శ్రామికులు, ఆర్థిక వనరుల కొరత, రవాణా, నిల్వల కోసం సరైన సదుపాయాలు లేకపోవటం.. ఆహార వృధాకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
పారిశ్రామిక దేశాల్లో పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వల్ల ఆహారం వృధా కావచ్చు. ధరలు మరీ తక్కువగా ఉంటే రైతులు పొలాల నుంచి అదనపు పంటలను తరలించకపోవచ్చు. తక్కువ నాణ్యత ఉన్న దిగుబడులను వినియోగదారులు ఇష్టపడరు కనుక వాటిని పొలంలోనే వదిలివేయవచ్చు.
బాగా మగ్గిపోయిన పండ్లు, సరైన ఆకారంలో లేని కూరగాయలు, తక్కువ నాణ్యత గల ఉత్పత్తులు తరచుగా అలాగే పొలంలో వదిలివేటమో, చెత్తకుప్పల్లో పారేయటమో జరుగుతుంది.
ఆహార అభద్రతను తగ్గించటంలో, వాతావరణ మార్పును పరిష్కరించటంలో.. ఆహార నష్టం, వృధాలను తగ్గించటం చాలా కీలకం. అయితే పరిష్కారాలు ఎల్లప్పుడూ నేరుగా ఉండవు. ఈ సమస్యను పరిష్కరించటానికి అగ్రస్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు వినూత్న ఆలోచనలతో రావలసి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆహార వృధాను ఎలా నివారించాలి?
పంటకోత ప్రక్రియలో కొంత భాగాన్ని ఆటోమేట్ చేయటానికి రోబోలను ఉపయోగించటం ఒక మార్గం కావచ్చు. తద్వారా పంటను మరింత కచ్చితత్వంతో కోయవచ్చు. కానీ.. కోతకొచ్చిన పంటను గుర్తించే విషయంలో యంత్రాల్లో కూడా లోపాలున్నాయి.
కాబట్టి.. రోబోలకు అనుగుణంగా ఉండే పంటలను వేయటం మీద ప్రయోగాలు చేస్తున్నారు న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన పంట శాస్త్రవేత్త స్టెఫనీ వాకర్.
న్యూమెక్సికోలోని తన పంటల ప్రయోగశాలలో.. పంటకోత యంత్రాలకు అనుగుణంగా ఉండే మిరపను ఉత్పత్తి చేయటానికి సెలెక్టివ్ బ్రీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. మిరపకాయలను కోయటం కష్టం: మొక్కలు గుబురుగా ఉంటాయి. కాయలు కాండానికి దగ్గరగా ఉంటాయి. అన్నిటికీ మించి పచ్చిమిరపను కోయటం చాలా కష్టం. ఎందుకంటే అవి ఇంకా పండలేదు కాబట్టి మొక్కను వీడి రావటం కష్టం.
‘‘ఈ ఏడాది వరకూ న్యూమెక్సికో పచ్చిమిరపను పూర్తిగా చేతితో కోసేవారు. ఎందుకంటే పంటకోత యంత్రాల వల్ల చాలా కాయలు విరిగిపోవటం, చాలా కాయలు కాండానికే ఉండిపోవటం, మొక్కలు ఊడిరావటం జరుగుతోంది’’ అని చెప్పారు స్టెఫనీ.

ఫొటో సోర్స్, Getty Images
పలు పంటకోత యంత్రాలను మార్చుతూ ఉపయోగించి చూసిన తర్వాత.. మార్చాల్సింది యంత్రాలను కాదు, మిరపకాయలను అని ఆమె తెలుసుకున్నారు. దీంతో ఆమె ప్రత్యేకంగా కొత్త మిరప వంగడాన్ని తయారు చేశారు. న్యుమెక్స్ ఒడిస్సీ అని పిలుస్తున్న ఈ కొత్త మిరప మొక్క బలంగా ఉంటుంది. ఒకటే కాండం ఉంటుంది. కాయ మొక్క పైభాగాన కాస్తుంది. యంత్రాలతో పంటకోతకు అనుకూలంగా ఉంటుంది.
మిరపకాయలను కోసిన తర్వాత మిగిలిన మొక్కలతో రైతుకు పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే.. మామూలుగా వ్యర్థాలుగా మిగిలే ఈ వ్యవసాయ ఉప ఉత్పత్తులను కొందరు.. చర్మరక్షణ ఉత్పత్తుల నుంచి వస్త్రాల తయారీ వరకూ వినూత్నంగా ఉపయోగించుకుంటున్నారు.
బ్రిటన్‌లోనూ, తూర్పు ఆఫ్రికాలోనూ కూరగాయల వ్యర్థాలను తినిపిస్తూ పెంచుతున్న కీటకాలు.. జంతువులకు, మనుషులకు హైప్రొటీన్ ఆహారంగా మారుతున్నాయి. అమెరికాలో టోఫు తయారీలో మిగిలిపోయే సోయా వ్యర్థాలతో గ్లుటెన్ రహిత పిండిని తయారు చేస్తున్నారు.
‘‘ఆహార వ్యర్థాలకు 4,600 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది. పొలంలో ఉప ఉత్పత్తులను, వ్యవసాయ వ్యర్థాలను ముడిపదార్థాలుగా మనం మార్చవచ్చు’’ అని చెప్పారు ఎలెన్ మాక్‌ఆర్థర్ ఫౌండేషన్ ఫుడ్ ఇనీషియేటివ్ సారథి ఎమ్మా చౌ.

ఫొటో సోర్స్, Getty Images
వరి వ్యర్థాలతో ఎన్ని ఉపయోగాలో...
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల పంట వరి. మరింత వ్యవసాయ వ్యర్థాన్ని ఉపయోగకరంగా మలచుకోవటానికి ఇది మంచి ఉదాహరణ. ప్రతి టన్ను వరి పండించటానికి.. ఒక టన్ను గడ్డి పెరుగుతుంది. అందులో కొంత భాగాన్ని పరుపులుగా, పశువుల మేతగా, భవన నిర్మాణ పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. లేదంటే మట్టిలోనే ఎరువుగా కలిసిపోయేలా దున్నేస్తారు.
కానీ అత్యధిక శాతం ఎండుగడ్డిని పొలాల్లోనే తగులబెట్టటమో, కుళ్లిపోయేలా వదిలేయటమో జరుగుతోంది. ఈ వరిగడ్డిని ఉపయోగించి బయోగ్యాస్ తయారు చేయవచ్చు. అలా గృహ వినియోగానికి, వాణిజ్య వినియోగానికి ఇంధనం లభిస్తుంది. కుళ్లిన ఎండుగడ్డిని పుట్టగొడుగుల పెంపకానికి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 80 కోట్ల టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అవుతోంది. దీనిని.. రైతుల జీవనోపాధిని మెరుగుపరచటానికి, పర్యావరణాన్ని పరిరక్షించటానికి ఉపయోగించాలని మేం భావిస్తున్నాం’’ అని బ్రిటన్‌లోని బర్మింగామ్‌లో గల ఆస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ ప్రొఫెసర్ పాట్రీసియా థార్న్‌లీ చెప్పారు.
2050 సంవత్సరానికల్లా మొత్తం ఆహారంలో దాదాపు 80 శాతాన్ని నగరాల్లోనే వినియోగిస్తారు. పట్టణ జనాభా పెరుగుతుండటం, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలు విస్తరిస్తుండటం వల్ల.. ఆహార సరఫరా వ్యవస్థలు మరింత సుదీర్ఘంగా సంక్లిష్టంగా మారుతున్నాయి. దీనివల్ల ఆహార వృధా జరుగుతోంది.

ఫొటో సోర్స్, VICTORIA GILL
పంటకోతకు, పంపిణీకి మధ్య సగటున 14 శాతం ఆహారం వ్యర్థమవుతోంది. ఇలా.. ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాల్లో అత్యధికంగా 16 శాతం ఆహారం వ్యర్థమవుతోంటే.. తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలై ఓషియానాలో 8 శాతం, లాటిన్ అమెరికా, కరీబియన్ వంటి ప్రాంతాల్లో 12 శాతం ఆహార వృధా జరుగుతోంది.
అల్పాదాయ దేశాల్లో జనం నిల్వ ఉండే ధాన్యాలు, ఎండిన ఆహారం ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. సంపన్న దేశాల్లో త్వరగా పాడయ్యే తాజా పండ్లు, కూరగాయలు, మాంసం వంటి ఆహారం ఎక్కువగా ఉపయోగించటం ఇందుకు ఒక కారణం కావచ్చు.
అలాగే.. ఆదాయంతో పోలిస్తే ఆహారం ధర తక్కువగా ఉండటం కూడా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార వృధా అలవాట్లకు కారణం కావచ్చు. అయితే పట్టణీకరణ వల్ల ఈ సమస్య మరింతగా ముదురుతోంది. పొలానికి – పళ్లేనికి మధ్య సరఫరా వ్యవస్థలో మరిన్ని లింకులు పెరగటం వల్ల వృధా మరింతగా పెరుగుతోంది.
ఉదాహరణకు బ్రిటన్‌లో పండ్లలో 84 శాతం, కూరగాయల్లో 46 శాతం దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సరఫరాకు వాతావరణ మార్పు, నీటి కొరత, శ్రామికుల కొరత, కోవిడ్-19 అన్నీ ముప్పుగా పరిగణించగలవు. ఇళ్ల సమీపంలో పండ్లు, కూరగాయలు పెంచటం ఈ సమస్యకు ఒక పరిష్కారం కాగలదు.
‘‘నగరాలు తమ మొత్తం ఆహార అవసరాల్లో మూడో వంతు వరకూ పట్టణ ప్రాంతాల పరిధిలోనే ఉత్పత్తి చేయవచ్చు. దోసకాయల వంటి త్వరగా పాడయ్యే ఆహారాలను నగరాల్లోనే పండించటం వల్ల.. వాటిని పొలం నుంచి పళ్లెంలోకి పంపించటం మరింత త్వరగా జరుగుతుంది. దానివల్ల వృధా చాలా తగ్గిపోతుంది’’ అని చెప్పారు చౌ.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 280 కోట్ల టన్నుల ఆర్గానిక్ వ్యర్థం తయారవుతోంది. అందులో మళ్లీ ఉపయోగిస్తున్నది 2 శాతం కూడా లేదు. పారేసిన ఆహార ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, సీవేజ్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిని కొత్త ఆహారం పండించటానికి, బయోపదార్థాల తయారీకి ఉపయోగించాలి. ఈ వ్యర్థాలతో ఏమైనా చేయవచ్చా?
‘‘పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉండే వ్యర్థం.. సీవేజ్ (మురుగునీరు). ఇది ఆహారపు తుది ఉప ఉత్పత్తి. దీనిని తిరిగి మంచి ఎరువుగా మలచవచ్చు. ఇక ఇళ్లలో వ్యర్థాలు, వాణిజ్య వ్యర్థాలు కూడా ఉంటాయి. ఆహార తయారీ వల్ల వచ్చే అన్నిరకాల ఉప ఉత్పత్తులూ ఉపయోగపడపతాయి’’ అని చౌ వివరించారు.
పాస్తా తయారీ వల్ల మిగిలిపోయే తవుడుతో కాగితం తయారు చేయవచ్చు. నారింజ తొక్కలు, చెక్క పొట్టుతో వస్త్రాలు తయారుచేయవచ్చు. గంజి వంటి ద్రవాల వ్యర్థాలతో ప్లాస్టిక్ బ్యాగులకు మంచి ప్రత్యామ్నాయాలను రూపొందించవచ్చు.
‘‘వ్యర్థం అంటే వనరులని మేం నమ్ముతాం’’ అని బయోప్లాస్టిక్స్ తయారీ సంస్థ ట్రేస్‌లెస్ సహ వ్యవస్థాపకురాలు, జర్మనీలోని టెక్నికల్ యూనివర్సిటీ హంబగర్గ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాల్‌మెంటల్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎకానమిక్స్ ఇంజనీర్ ఆన్ లాంప్ చెప్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో మిగిలిపోయిన వ్యర్థాలను తీసుకుని వాటితో ప్రకృతిలో కలిసిపోగల ప్లాస్టిక్స్ తయారు చేస్తోంది ట్రేస్‌లెస్.
అయితే.. వ్యవసాయ వ్యర్థాలతో బయోప్లాస్టిక్స్ తయారుచేయటానికి కొన్ని సవాళ్లూ ఉన్నాయి. వ్యర్థాల్లో ఉండే పదార్థాలు మారిపోతూ ఉంటాయి. అంతేకాదు అందులో నీటి పరిమాణం కూడా ఎక్కువగా ఉండటం వల్ల రవాణా చేయటం కష్టంగా ఉంటుంది. అయితే.. చమురు వెలికితీసి, దాని నుంచి కొత్త పాలిమర్స్ తయారు చేయటం కన్నా కానీ.. ఇప్పటికే ఉన్న వనరులను ఉపయోగించుకోవటం ముఖ్యమని ల్యాంప్ చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యర్థాల పునర్వినియోగంతో లాభమా? నష్టమా?
కొన్ని పొలాలు.. పెద్ద మొత్తంలో వ్యవసాయ రసాయనాలను, మందుల అవశేషాలను పర్యావరణంలోకి వెదజల్లుతాయి. వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చే నీరు.. నీటి పర్యావరణా వ్యవస్థలను కలుషితం చేస్తుంది. ఇది అందులోని జీవులకే, వన్యప్రాణులకే కాదు మనుషుల ఆరోగ్యానికీ చేటు చేస్తుంది. పోషకాల కాలుష్యం వల్ల.. చెరువులు, సరస్సుల వంటి నీటి క్షేత్రాల్లో పోషకాలు బాగా పెరిగిపోయి వాటిలో పాచి, మొక్కలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఈ పాచి వెల్లువలు.. నీటిప్రాణులు మనుగడ సాగించలేని మృతక్షేత్రాలను తయారు చేస్తాయి.
వ్యవసాయాన్ని అసలు ప్రకృతి నుంచి వేరు చేస్తే ఎలా ఉంటుంది? ప్రకృతితో సంబంధం లేకుండా మూసివేసిన వ్యవసాయ వ్యవస్థ వల్ల పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఉంటుందా?
గ్రీన్‌హౌస్‌లు, పాలిటన్నెల్స్, గిడ్డంగుల వంటి వాటిలో నియంత్రిత పర్యావరణ వ్యవసాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ఇటీవలి కాలంలో పెరుగుతోంది.
‘‘ఆక్వాపోనిక్స్ విధానం చాలా బాగుంటుంది. ఇందులో పోషకాలను, నాటిని పునర్వినియోగిస్తారు. హరిత ఇంధన శక్తితో దీనిని నడిపించవచ్చు’’ అని చెప్పారు చౌ.
ప్రతి ఏటా ప్రపంచంలోని మంచి నీటిలో 70 శాతాన్ని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. అయితే ఇందులో దాదాపు సగం నీరు పర్యావరణంలో కలుస్తోంది.
అక్వాకల్చర్ – హైడ్రోపోనిక్స్ కలగలిసిన ఆక్వాపోనిక్స్ విధానంలో.. ఎరువులు, పురుగుమందులు, కలుపునాశినిలు ఏవీ అవసరం ఉండదు. ఈ వ్యవసాయం ద్వారా పర్యావరణంలో ఏదీ కలవదు. పోషకాలేవీ పోవు. నీటిని నిరంతరం పునర్వినియోగిస్తారు. ఇంకా విశేషమేమిటంటే ఆక్వాపోనిక్స్ సాగును ఎక్కడైనా, ఎంత పరిమాణంలోనైనా చేయవచ్చు. పారిశ్రామిక స్థాయి గిడ్డంగుల్లో, ఇళ్ల పైకప్పుల మీద, ఖాళీ స్థలాల్లో సైతం చేపలను, మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధానం ద్వారా పట్టణ ప్రాంత ప్రజలు స్థానికంగానే తాజా ఆహారాన్ని ఉత్పత్తిచేయవచ్చు. తద్వారా సరఫరా వృధాను, కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువ వెలుతురున్న తన ప్రయోగశాలలో దాదాపు 30 బారెళ్లలో.. తిలాపియా చేప పిల్లలున్నాయి. అవి తోకకప్పల కన్నా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. ‘‘ఇవి నీటి కోళ్లు. ఏం పెట్టినా తినేస్తాయి’’ అని చెప్పారు మెరైన్ బయాలజిస్ట్ సారా బారెంటో. బ్రిటన్‌లోని స్వాన్సీ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాటిక్ రీసెర్చ్ (సీఎస్ఏఆర్) విభాగంలో పనిచేస్తున్నారామె.
ఇక్కడ చేపపిల్లలకు ఉపయోగించిన నీటిని మెకానికల్ ఫిల్టర్, బయో ఫిల్టర్లతో శుద్ధిచేస్తారు. చేపలకు ప్రాణాంతకమైన అమ్మోనియాను.. బయో ఫిల్టర్‌లోని బ్యాక్టీరియా నైట్రేట్‌గా మారుస్తుంది. ఆ నీటిని మొక్కలను పెంచే పడకల మీదుగా పారిస్తారు. నీటిలోని పోషకాలను మొక్కలు పీల్చుకుంటాయి. శుద్ధి జరిగిన నీరు మళ్లీ చేపలకు చేరుతుంది.
సీఎస్ఏఆర్ ప్రస్తుతం.. స్వాన్సీ యూనివర్సిటీ పైకప్పుల మీద అక్వాపోనిక్స్ వ్యవస్థలను పెట్టటానికి అవసరమైన పరిస్థితులను అభివృద్ధి చేయటానికి బయోఫిలిక్ లివింగ్ అనే ప్రాజెక్టు మీద పని చేస్తోంది. ఇందులో మొక్కల నుంచి మిగిలే వ్యర్థాలను చేపలకు ఆహారంగా ఉపయోగించే మైక్రోఆల్గేగా తయారు చేసే ప్రణాళిక కూడా ఉంది.
ప్రకృతిలో సహజంగా జరుగుతున్న దానినే ఇక్కడ జరిగేలా చేస్తారు. ఒక జీవి నుంచి వచ్చే వ్యర్థం మరొక జీవికి ఆహారం అవుతుంది. అది మళ్లీ మొదటి జీవికి ఆహారమవుతుంది.
ఉదాహరణకు చెట్లను చూడండి: మృత కలప ఫంగైకి ఆహారమవుతుంది. అది కుళ్లిపోయి మట్టిలో పోషకాలుగా కలుస్తుంది. ఆ మట్టిలోని పోషకాలు మరొక చెట్టుకు ఆహారమవుతాయి. ఈ అంతులేని ఆహార వలయానికి మనుషులు అవాంతరాలు కలిగిస్తున్నారు.
వ్యర్థం అనేది.. ఆధునిక జీవితపు అనివార్యమైన పర్యవసానంగా మనం భావించవచ్చు. కానీ ప్రకృతిలో వ్యర్థం అనేది ఏదీ లేదు.

ఇవి కూడా చదవండి:
- 70 నిమిషాల్లో 21 బాంబులు, 59 మంది మృతి- 2008లో అహ్మదాబాద్లో ఏం జరిగింది
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- అటకామా అగాధంలో 8000 మీటర్ల లోతుకు వెళ్లొచ్చిన తొలి శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు
- వీధి వ్యాపారులకు పెట్టుబడిగా రూ.10 వేలు, ఎలా పొందాలంటే..
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















