PM SVANidhi: మీరు చిరు వ్యాపారులా? వ్యాపారం చేయడానికి పెట్టుబడి కావాలా? రూ.10 వేలు పొందండి ఇలా..

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, నాగ సుందరి
- హోదా, బీబీసీ కోసం
వీధి వ్యాపారులకు రూ.10 వేల పెట్టుబడి, సులభ పద్ధతుల్లో రుణం, వడ్డీపై సబ్సీడీ, క్రమం తప్పకుండా చెల్లిస్తే మరుసటి ఏడాది రెట్టింపు రుణం.. ఇవీ 'పీఎం స్ట్రీట్‌వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' (పీఎం స్వానిధి) పథకం కింద లభించే ప్రయోజనాలు. పట్టణాల్లో వీధి, తోపుడు బండ్ల వ్యాపారం చేసుకునే వాళ్లందరూ దీనికి అర్హులే.
కోవిడ్ లాక్‌డౌన్ సమయాల్లో చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. కొందరు పూట గడవక వ్యాపారం మాని ఎక్కడెక్కడికోపోయి బతుకుతున్నారు.
ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు కేంద్రం ఒక పథకం తీసుకువచ్చింది. అదే 'పీఎం స్ట్రీట్‌వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి'. దీన్నే 'పీఎం స్వానిధి' అని కూడా అంటారు.
ఈ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం లోన్ రూపంలో పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. నామమాత్రపు వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో ఈ పథకాన్ని రూపొందించారు. లోన్ మొత్తాన్ని ఏడాది కాలంలో నెలానెలా కొంత కట్టుకోవచ్చు. ప్రభుత్వం సూచించిన పద్ధతిలో డిజిటల్ పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది.
ఎవరు అర్హులు?
పట్టణ ప్రాంతాల్లో రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్లందరూ ఈ పథకానికి అర్హులు. పండ్లు, కూరగాయలు, కొబ్బరి బోండాలు, టీ కొట్లు, ఇస్త్రీ బండ్లు, రోడ్లపై బట్టలు, చెప్పులు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్లందరూ ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు.
తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవాళ్లంతా పథకానికి అర్హులే. సాధారణంగా ఇలాంటి వ్యాపారం చేసే వాళ్లు చిన్న మొత్తం పెట్టుబడులకు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. డైలీ ఫైనాన్స్‌లతో అధిక వడ్డీలు కడుతుంటారు. కోవిడ్ కారణంగా ఈ చిరు వ్యాపారులకు ఇలాంటి పెట్టుబడి కూడా దొరకకుండా పోయింది.
కోవిడ్ కారణంగా కొందరు వ్యాపారం మానేసి తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఇలాంటి వాళ్లు కూడా తిరిగి పట్టణాలకు వచ్చి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటే ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు.
ఎలా పొందాలి?
పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం చేసే వీధి, తోపుడు బండ్ల వ్యాపారులు అక్కడ పట్టణ స్థానిక సంస్థల (అర్బన్ లోకల్ బాడీస్) నుంచి వీధి వ్యాపారానికి ఒక ఐడీ కార్డ్ లేదా ధృవ పత్రం సంపాదించాలి.
మున్సిపాలిటీల్లోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఆఫీసులో వీధి వ్యాపారిగా గుర్తింపు పొందేందుకు ఇచ్చే నిర్ధారిత దరఖాస్తును పూర్తి చేసి ఇవ్వాలి.
సంబంధిత అధికారులు అర్హతలు చెక్ చేసి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. ఇది పొందిన తరువాత, మళ్లీ అదే ఆఫీసులో లోన్ కోసం ఉద్దేశించిన మరో దరఖాస్తును పెట్టుకోవాలి.
ఆధార్ కార్డు, దానితో లింక్ అయిన ఫోన్ నంబర్‌ను దరఖాస్తుకు జత పర్చాలి. లోన్ కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అర్హతలు నిర్ధారించుకుంటారు.
అనంతరం, లోన్‌కు అర్హులైనట్లు ఒక లేఖ ఇస్తారు. దీన్ని లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్‌ఓఆర్) అంటారు. సాధారణంగా ఒక వెండర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో ఐడీ కార్డు ఇవ్వాలి. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లో ఎల్‌ఓఆర్ ఇవ్వాలి. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బ్యాంకుల ద్వారా లోన్లు
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాల బ్యాంకులు ఈ పథకం కింద లోన్లు అందజేస్తాయి.
ఎల్‌ఓఆర్ పొందిన అనంతరం ఈ బ్యాంకుల్లో తమ ఖాతా ఉంటే రుణం పొందవచ్చు. అయితే ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్బీ) కొన్ని బ్యాంకులను ఎంపిక చేసి వాటి ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాయి. సదరు బ్యాంకులో లబ్ధిదారునికి ఖాతా లేకపోయినా తెరిపించి రుణ సహాయం పొందేలా చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వడ్డీ ఎంత? ఈఎంఐలు ఎలా?
పీఎం స్వానిధి నుంచి పొందే రుణంపై ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారం సదరు బ్యాంకు వడ్డీ వసూలు చేస్తుంది. అయితే ఈ వడ్డీలో ఏడు శాతాన్ని కేంద్రం సబ్బిడీగా ఇస్తుంది. ఈ సబ్సిడీ సొమ్మును అదే బ్యాంకులో మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుని అకౌంట్లో జమ చేస్తుంది.
మొదటి విడతలో ఇచ్చే పది వేల రూపాయలపై రూ. 1,348 వడ్డీ పడుతుంది. పది వేల రుణంపై నెలవారి చెల్లింపులతో రూ. 11,349 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
12 నెలల పాటు నెలకు రూ. 946 లేదా రూ. 945 (ఏ నెల ఎంత ఈఎంఐ కట్టాలో బ్యాంకు నిర్ణయిస్తుంది) చొప్పున చెల్లిస్తే రుణం తీరిపోతుంది. డిజిటల్ పేమెంట్ చేస్తే రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
అంటే, క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించడంతోపాటు డిజిటల్ పేమెంట్ చేస్తే ఒక్కో లబ్ధిదారునికి రూ. 1,200 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
వడ్డీ రాయితీ కూడా కలుపుకుంటే రూ. 1,602 ప్రయోజనం కలుగుతుంది. క్రమం తప్పకుండా లోన్ కట్టిన వాళ్లకు రెండో సంవత్సరంలో లోన్ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం కూడా ఉంది. అంటే లబ్ధిదారుడు రూ. 20వేల రుణం పొందవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
'లోన్ తీసుకొని కట్టిన..'
"మొదటి లాక్ డౌన్ తరువాత స్ట్రీట్‌వెండర్స్ లోన్ తీసుకున్నా. హైదరాబాద్‌లో నా వ్యాపారం. జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో లోన్ పొందాను. పది వేల రూపాయల రుణం వచ్చింది. లాక్‌డౌన్‌లో వ్యాపారం నడువక పూట గడవడం కూడా కష్టమైంది. మళ్లీ వ్యాపారం షురూ చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండే.
అలాంటి టైములో పీఎం స్వానిధి ద్వారా వచ్చిన లోన్ బాగా పని కొచ్చింది. నా వ్యాపారం మళ్లా పుంజుకుంది. లోన్ మొత్తాన్ని టైముకు కట్టేశాను. కష్టం అనిపించలేదు. అంతకు ముందు ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకునేవాళ్లం. అప్పుడు పది వేలకు నెలకు రూ. 500 వడ్డీకే పోయేవి. ఒక్కోసారి డైలీ ఫైనాన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చేది. అపుడు రోజుకు వంద, 150 వడ్డీ కిందనే పోయేది. ఇప్పుడు మరోసారి లోన్ ఇస్తే తీసుకునేందుకు రెడీగా ఉన్నా" అని మాసబ్ ట్యాంక్‌లో కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్న రేఖ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘లతా మంగేష్కర్ ఫొటో చూడకుండా మా నాన్న రికార్డింగ్‌కు వెళ్లేవారు కాదు’
- కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ రంగంలో సమస్యలకు పరిష్కారం చూపగలవా
- లతా మంగేష్కర్‌కు నచ్చిన సింగర్ ఎవరు? ఏ భాషలో పాడడం కష్టంగా భావించారు
- నుదుటిపై తిలకం, హిందూ సంప్రదాయ వస్త్రాల్లో ప్రధాని మోదీ: సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
- 'శవం అంటేనే భయపడేదాన్ని... ఇప్పుడు చితి పక్కనే కూర్చుని పూజలు చేస్తున్నా'- మహిళా జంగం దేవర కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















