నిర్మలా సీతారామన్: వలస కార్మికులకు మూడు పూట్లా భోజనం అందిస్తాం.. అన్ని రకాలుగా ఆదుకుంటాం

నిర్మలా సీతారామన్

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి విడతల వారీగా ప్రకటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా గురువారం రైతులు, వలసదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆత్మ నిర్భర్ అభియాన్‌లో భాగంగా వారి కోసం రూపొందించిన ప్యాకేజీ వివరాలను వెల్లడించారు.

నిర్మల వెల్లడించిన వివరాలు

చిన్న రైతులకు రూ.4 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాం.

సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ ఇస్తున్నాం. సన్నకారుల రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసే ఏర్పాటు చేస్తున్నాం.

వలసదారుల కోసం రూ.11వేల కోట్లు కేటాయిస్తున్నాం.

వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.4,200 కోట్లు కేటాయిస్తున్నాం.

వలస కార్మికుల్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద కార్మికుల కోసం 3 కోట్ల మాస్కులను అందజేయనున్నాం.

వలస కార్మికులకు మూడు పూట్లా భోజనం అందించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సహాయ శిబిరాల ఏర్పాటుకు, భోజన ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు కేటాయించాం. వలస కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉపాధి పొందవచ్చు. వలస కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తాం.

పట్టణ కార్మికులకు ఏర్పాటు చేసిన వసతి శిబిరాల్లో మూడు పూట్లా భోజనం అందిస్తున్నాం. దేశమంతా ఒకటే వేతనం ఉండేలా చూస్తాం.

వలస కార్మికులందరికీ వైద్య పరీక్షల్ని నిర్వహిస్తాం. వారందరికీ బీమా సౌకర్యం కల్పిస్తాం.

గిరిజన ప్రాంతాల్లో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.

వలస కార్మికులకు వచ్చే రెండు నెలల పాటు ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తాం. జాతీయ ఆహార భద్రతా పథకంలో నమోదు చేసుకోనివారు, రేషన్ కార్డు లేని వలస కార్మికులూ కూడా దీనికి అర్హులే. ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం లేదా గోధుమలు కుటుంబానికి కేజీ సెనగలు అందిస్తాం. అందుకోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనికోసం రూ.3,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాం.

ఆగస్టు నాటికి దేశమంతా ఒకటే రేషన్ కార్డు అమలయ్యేలా చూస్తాం. అప్పుడు, వలస కార్మికులు దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా తమ సరకుల్ని తీసుకోవచ్చు.

వలస కార్మికులకు, పట్టణ కార్మికులకు అందుబాటు ధరల్లో అద్దె ఇళ్లు సౌకర్యం కల్పిస్తాం. ఇందుకోసం పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టనున్నాం.

ముద్ర - శిశు రుణాలు కింద రూ. 50వేలు లోపు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రాయితీ ఇస్తాం.

వీధి వ్యాపారులకు రుణాలను అందించేందుకు త్వరలో ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 50లక్షల మంది వీధి వ్యాపారుల కోసం రూ. 5వేల కోట్లు కేటాయించాం.

గిరిజనుల కోసం రు.6వేల కోట్లు అందించనున్నాం.

గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ.70 వేల కోట్లు అందిస్తాం.

గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ. 4,200 కోట్లు కేటాయించనున్నాం.

అత్యవసర నిధి కింద రూ.30వేల కోట్లు కేటాయిస్తున్నాం.

వలసకార్మికుల విషయంలో మా ప్రభుత్వం మొదట్నుంచి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం.

వలస కార్మికుల కోసం 1200 శ్రామిక్ స్పెషల్ రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. రోజూ 300 రైళ్లు నడుస్తున్నాయి. చార్జీలను 80శాతం కేంద్రం భరిస్తోంది. 20శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు 806 శ్రామిక స్పెషల్ రైళ్లు నడిపాం. 10లక్షల మంది తమ స్వస్థలాలకు చేరారు.

యూపీ 386 రైళ్లు కావాలని కోరింది. బిహార్ 204 రైళ్లు పంపాలని కోరింది. అలాగే మధ్య ప్రదేశ్ 67, ఝార్ఖండ్ 44, రాజస్థాన్ 20, ఛత్తీస్ ఘడ్ 7, పశ్చిమబెంగాల్ 7 రైళ్లను పంపాలని కోరాయి. ఇప్పటికీ రోజూ చాలా రాష్ట్రాలు తమ వలస కార్మికుల కోసం మరిన్ని శ్రామిక్ రైళ్లను పంపాలని కోరుతున్నాయి. వారి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)