మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ: ఆర్థిక జాతీయవాదం ఆచరణ సాధ్యమా? స్వావలంబన ఇంకెంత దూరం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ఇండియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘స్వావలంబన భారత్’ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అంతర్గత మెమో ప్రకారం స్వావలంబన్ భారత్ సృష్టికి ప్రధాని ఇచ్చిన పిలుపు కేవలం కోవిడ్-19 విపరిణామాలను ఎదుర్కోవడానికే కాకుండా భారత పునర్నిర్మాణానికీ ఉద్దేశించిన కార్యక్రమం. దీన్నే ఆ మెమోలో ‘ఫ్యూచర్ ప్రూఫింగ్ ఇండియా’గా పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో స్వావలంబన గురించి ఉండడంతో పాటు దాన్ని సాధించాలన్న నిశ్చితాభిప్రాయం ఉంది. అందుకే, అరకొరగా కాదు రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
కాలగతిలో సమాధి అయిన స్వదేశీ అనే పదాన్ని మోదీ ఉపయోగించలేదు. ఏకాకి భారతం, దాని రక్షణాత్మక ఆర్థిక వ్యవస్థను గుర్తుచేసే ఒక ఆర్థిక నమూనా అది. అంతేకాదు, అది జాతీయవాదులు సూచించే భావజాలం.
అయితే, ప్రధానమంత్రి స్వావలంబన ఆలోచన నేరుగా ఈ స్వదేశీ నమూనాల నుంచే వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆయన ఖాదీ వస్తువుల గురించి ప్రస్తావించడమే దీనికి ఉదాహరణ.
ఆత్మ విశ్వాస లోపం, బయటి ప్రపంచంపై అనుమానంతో భారత్ అనేక దశాబ్దాలుగా ఇతర ప్రపంచానికి తలుపులు తెరవడానికి వెనుకాడుతూ వచ్చింది. గత శతాబ్దపు చివరి నాలుగు దశాబ్దాలలో భారత్ పంచవర్ష ప్రణాళికలతో ఆర్థిక వ్యవస్థను నడిపింది.
మతపరంగా స్వదేశీ నమూనాపై ఆధారపడుతూ వృద్ది చెందింది. దీన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్(2.5 నుంచి 3 శాతం వృద్ధి రేటు)గా చెబుతారు.
చివరికి 1991లో భారత్ తన ఆర్థిక భారాల ఒత్తిడి వల్ల విస్తృత ప్రపంచానికి తలుపులు తెరిచింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోసారి సంస్కరణల సమయం
ఇప్పుడు భారత్ మళ్లీ మొత్తం పరిశీలన చేసుకుంటోంది.
తాను చెప్పిన స్వావలంబన విధానం ప్రపంచానితో సంబంధాలు తెంచుకోమని కాదని మోదీ చెబుతున్నప్పటికీ అమెరికాలో స్టాక్ మార్కెట్లో వచ్చే కుదుపు భారత్, చైనాల్లోనూ ప్రకంపనలు సృష్టించే ఈ గ్లోబలైజేషన్ కాలంలో అదేమంత సులభం కాదు.
ఇక స్థానిక ఉత్పత్తులను పోటీగా నిలపాలంటే దానికి స్థానిక తయారీదారులకు ప్రోత్సాహమివ్వాలి.
అది డబ్ల్యూటీవో సభ్య దేశాలతో ఘర్షణకు తావిస్తుంది.ఇదంతా ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘మోదీ స్వావలంబన విధానం చాలా భిన్నంగా ఉంటుంది’ అన్నారు. ప్రపంచానికి సాయపడుతూ ప్రపంచంతో పోటీ పడడంపై నిర్దిష్టమైన చర్చ జరుగుతోంది అన్నారా నేత.
చాలా ధనిక దేశాలు ఈ కరోనావైరస్ మహమ్మారి తరువాత దేశీయ ఉత్పత్తులను పెంచాలని యోచిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ మాట్లాడుతూ.. కరోనావైరస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక జాతీయవాదం విస్తరిస్తుందని అన్నారు. డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే ‘అమెరికా ఫస్ట్’ విధానం పాటిస్తున్నారు.

ఫొటో సోర్స్, getty images
అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనే సత్తా భారత్‌కు లేదు. ట్రంప్ మొట్టమొదటిసారి ఈ ఏడాది ఫిబ్రవరి 25న భారత్ వచ్చినప్పుడు భారత్ విధిస్తున్న సుంకాల గురించి కరాఖండీగా తన అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు.
‘‘బహుశా ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారతే అనుకుంటాను. కనీసం అమెరికా విషయంలోనైనా వాటిని సడలించాలి’’ అన్నారు ట్రంప్.
మోదీ తన ప్రసంగంలో, ‘స్థానికతకు స్వరం ఇవ్వండి’ అని చెప్పారు. అది నినాదంగా చాలా బాగుంది. స్వావలంబన అనేది ప్రతి దేశపు కల. అయితే, అమలు ఎలా అన్నదే ప్రశ్న. మోదీ గతంలో తన మేకిన్ ఇండియా ప్రాజెక్టు విషయంలో విఫలమయ్యారు. మోదీ చెప్పినట్లు భారత్‌ను తయారీరంగ కేంద్రంగా మలచడంలో మేకిన్ ఇండియా విఫలమైంది.
విమర్శకులు అన్నట్లు మోదీ హామీలివ్వడంలో ముందుంటారు కానీ, నిలబెట్టుకోవడంలో వెనుకబడతారు. ప్రధాని మోదీ ఇంకా ఈ స్వావలంబనకు విధివిధానాలు చెప్పలేదు కానీ, చూచాయగా కొన్ని అంశాలు చెప్పారు.
ఉదాహరణకు, ఈ స్వావలంబన విధానం ఆర్థిక, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, బలమైన ప్రజాస్వామ్యం, గిరాకీ అనే అయిదు స్తంభాలపై ఉంటుందన్నారు.

మరి ఈ అయిదు స్తంభాలు బలంగానే ఉన్నాయా?
ఆర్థిక వ్యవస్థ: మోదీ చెప్పిన అయిదు స్తంభాల ఆరోగ్యం గురించి విమర్శకులెవరూ ఆసక్తిగా లేరు. 2.7 లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థ 2 కంటే తక్కువ వృద్ధిరేటుతో మెల్లగా కదులుతోంది. ప్రస్తుత తరం చూసిన అత్యల్ప వృద్ధి రేటు ఇదే. లాక్‌డౌన్ కారణంగా మళ్లీ దారిద్ర్య రేఖ దిగువకు చేరిన కోట్ల మంది పేదలను ఆర్థికంగా పైస్థాయికి చేర్చాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మౌలిక సదుపాయాలు: చైనాతో పోటీపడడానికి లేదా చైనా కేంద్రంగా పనిచేసే విదేశీ సంస్థలను భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన అవసరం. భూమి, నీరు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అవసరం.భారత్‌లో వ్యాపారం స్థాపించాలనుకునే విదేశీ సంస్థలకు ఎదురయ్యే ప్రధాన అవరోధాల్లో మౌలిక సదుపాయాల లేమి ఒకటి. మోదీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లయినా ఇప్పటికీ మౌలిక వసతుల ప్రాజెక్టులు అసంపూర్ణంగానే ఉన్నాయని విమర్శకులుఅంటున్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తికావడానికి ఏళ్లు పడుతుంది.. కానీ, భారత్‌కు ఇప్పుడు అంత సమయం లేదు.
వ్యవస్థ: సాంకేతిక పరిజ్ఞానాన్ని తగినంతగా వినియోగించుకోవాలని మోదీ సూచించారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కొన్ని సరైన అడుగులు వేసింది ఇప్పటికే. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వాడడం.. సమాజ స్థాయికి డిజిటల్ టెక్నాలజీని తీసుకెళ్లడంలో మోదీ ప్రభుత్వం ప్రగతి సాధించింది. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సాధనంగా నిరూపించుకోగలదు.
యువశక్తితో నిండిన ప్రజాస్వామ్యం: మోదీ హయాంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయన్నది విశ్లేషకుల మాట. అయితే, యువతరం జనాభా శాతం అధికంగా ఉన్న భారత జనాభాయే దేశ ప్రజాస్వామ్యానికి ప్రధాన బలం. ఈ విషయంలో చైనా భారత్‌తో ఏమాత్రం పోటీపడలేదు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు విలువిస్తూ బాలలపై వేధింపులను నిర్మూలించాలని కోరుకునే ఉత్పత్తిదారులు, తయారీదారులు కమ్యూనిస్ట్ చైనా కంటే భారత్‌కే ప్రాధాన్యమిస్తారు.
గిరాకీ: అవును.. భారత దేశీయ మార్కెట్ పెట్టుబడిదారులకు నిజంగానే అత్యంత ఆకర్షణీయమైనది. కానీ, ఇప్పుడు గిరాకీ బాగా తగ్గిపోయింది. అయితే, కోవిడ్ అనంతర కాలంలో భారత్‌లో మళ్లీ మార్కెట్, గిరాకీ పుంజుకొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు అవసరం.. ఎస్‌ఎంఈలతోనే తాను చెప్పిన స్వావలంబన సాధ్యమని మోదీ చెప్పడం నిజంగా శుభవార్తే.
ఇవి కూడా చదవండి:
- ‘వీడియో కాల్లో చూస్తుండగానే అమ్మ తుదిశ్వాస విడిచింది.. ఏడు వేల కిలోమీటర్ల దూరంలో కోవిడ్-19 మా అమ్మ ప్రాణాలు తీసింది’
- Mother's Day: మాతృ దినోత్సవాన్ని మొదలుపెట్టింది ఈమే.. దీన్ని రద్దు చేయాలని మొదట్లోనే డిమాండ్ చేసిందీ ఈమే
- కరోనావైరస్పై అమెరికాలో పరిశోధన చేస్తున్న చైనా సంతతి ప్రొఫెసర్ బింగ్ ల్యూ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందా?
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు చేసిన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్
- కరోనావైరస్: 1918లో ఐదు కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?
- కరోనావైరస్: ‘1940లో మా తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








