‘వీడియో కాల్‌లో చూస్తుండగానే అమ్మ తుదిశ్వాస విడిచింది.. ఏడు వేల కిలోమీటర్ల దూరంలో కోవిడ్-19 మా అమ్మ ప్రాణాలు తీసింది’

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్-19 మరణాల్లో మా అమ్మ కూడా ఒకటవుతుందని ఊహించలేదు.
మే 13వ తేదీన అమ్మ ఇండియా రావాల్సి ఉంది. ఇంతలోనే అమ్మకి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ఫోన్ వచ్చింది. ఆమె కోవిడ్-19కి బలైపోతారని ఊహించలేదు.
ఇక్కడ గంపెడంత కుటుంబం. కూతుర్లు, మనుమరాళ్ళు , అక్క చెల్లెళ్ళు, వదినలు, తోడికోడళ్లు, మరుదులు. కానీ, ఆఖరి క్షణాల్లో ఎవరూ దగ్గర లేరు. తను కూడా ఇక కోలుకోనేమో అనుకోలేదు. కోవిడ్-19 తన ప్రాణాన్ని హరిస్తుందని ఊహించలేదు. వెంటిలేటర్ పెడుతున్నా ఏదో ఆశ. నయం అవుతుందనే ఆశ, ఆమెకి, మా కుటుంబానికి కూడా.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకి చెందిన 64 ఏళ్ల మహిళ ఒకరు నవంబర్ 22వ తేదీన విజిటర్ వీసాతో బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఉన్న తన కొడుకు దగ్గర ఆరు నెలలు ఉండేందుకు వెళ్లారు. ఆమె కోవిడ్-19 బారిన పడి ఏప్రిల్ 17వ తేదీన మరణించారు. అయితే, ఆమె కొడుకు, కోడలు మినహా మిగతా కుటుంబ సభ్యులంతా భారతదేశంలోనే ఉన్నారు.
ఈ బాధ జీవితాంతం తనని వేధిస్తూనే ఉంటుందని హైదరాబాద్‌కి చెందిన ఆ మహిళ కుమార్తె బీబీసీతో అన్నారు. తన తల్లికి కోవిడ్-19 సోకిన విధానం, తదనంతర పరిణామాలను ఆమె ఇలా పంచుకున్నారు...

ఫొటో సోర్స్, Getty Images
అమ్మ మా తమ్ముడు, మరదలితో కలిసి ఉన్నారు.
కరోనావైరస్ గురించి వార్తలు వింటున్నప్పుడు మార్చి నెలలో ‘ఇండియా వచ్చేస్తావా’ అని అమ్మను అడిగాం. "నేను ఇంట్లోనే ఉంటున్నా కదా. నాకేమి కాదులే. మే కాకపొతే వీసా పొడిగించుకుని జూన్‌కి వచ్చేస్తా. ఫర్వాలేదు’ అని ధైర్యంగానే మాట్లాడారు. తను ధైర్యంగానే ఉండటంతో మేమిక రమ్మని ఒత్తిడి చేయలేదు. ఈ లోగా అంతర్జాతీయ ప్రయాణాల రాక పోకలు కూడా నిలిచిపోయాయి.
అమ్మ ఇంట్లోనే ఉంది కదా అని అనుకున్నాం. రోజూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాం. తను జాగ్రత్తగానే ఉంది కదా అనుకున్నాం. తను గ్రోసరీ షాప్‌కి కూడా వెళ్ళలేదు. వైరస్ ఎలా సోకిందో ఇప్పటికీ మాకు అంతు పట్టడంలేదు.
ఏప్రిల్ 3వ తేదీన అమ్మకి తేలికపాటి జ్వరం వచ్చింది. అయితే హాస్పిటల్‌కి కాల్ చేస్తే దగ్గు, గొంతు నొప్పి లేకపోతే జ్వరానికి మందులు వేసుకోమని చెప్పారు. అలాగే పారాసెటమాల్ వేసుకున్నాక కాస్త తగ్గినట్లనిపించిందని చెప్పింది. మళ్ళీ కొంతసేపటికి జ్వరం ఆగకుండా 103 డిగ్రీలు, అలా ఉంటూనే ఉంది. దీంతో భయపడి మళ్ళీ హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే, దగ్గు లేదు కదా అని అడిగారు.
అప్పటికి అమ్మకి దగ్గు లేదు. కానీ, మరో రెండు రోజులకి తేలికపాటి దగ్గు మొదలైంది. మళ్ళీ డాక్టర్‌కి ఫోన్ చేస్తే 7 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండమని చెప్పారు. అమ్మ నీరసంగా ఉంది. కానీ, గొంతు నొప్పి లేదనే చెప్పింది. ఇంతలో అమ్మకి ఆకలి మందగించింది. తను అది నోటి పూతగా భావించింది. అల్సర్ జెల్ వాడింది. కానీ, తనకి కూడా అప్పటికి వైరస్ సోకిందేమోనన్న అనుమానం రాలేదు.
ఇంతలో విరేచనాలు మొదలయ్యాయి. దీంతో భయపడి మళ్లీ హాస్పిటల్‌కి ఫోన్ చేసాం. వాళ్ళు ఏప్రిల్ 8వ తేదీన హాస్పిటల్‌కి తీసుకుని రమ్మని చెప్పారు. అప్పటి వరకు నేను అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను.

ఫొటో సోర్స్, PA Media
ఏప్రిల్ 8వ తేదీన తమ్ముడు అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళేటప్పటికి అమ్మకి వెంటనే ఆక్సిజన్ స్థాయి సరిగ్గా లేదని ఆక్సిజన్ పెట్టారు. హాస్పిటల్‌కి వెళ్లే ముందు అమ్మతో ఫోన్‌లో మాట్లాడి ఏమి ఫర్వాలేదు. ధైర్యంగా ఉండమని చెప్పాను. అమ్మ అప్పటికే ఏమి మాట్లాడటం లేదు. సరే సరే అంది.
మరికొంత సేపటికి వెంటిలేటర్ మీద పెట్టాలని చెప్పారు. వెంటనే తమ్ముడు ఫోన్ చేసి, అమ్మని వెంటిలేటర్ మీద పెట్టేస్తున్నారు. మళ్లీ ఐసీయూలోకి రానివ్వరు, ఒక్కసారి మాట్లాడమని ఫోన్ చేస్తే, అప్పుడు కూడా ఏమి ఫర్వాలేదు, ధైర్యంగా ఉండు అన్నాను. అప్పటికీ అమ్మ ఏమీ మాట్లాడటం లేదు. సరే అంది. అవే అమ్మతో నేను మాట్లాడిన ఆఖరి మాటలు. వెంటిలేటర్ పెట్టే ముందు అమ్మకి మత్తు ఇస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు.
యూకేలో మంచి వైద్యం అంది అమ్మ బయటకి వచ్చేస్తుందనే అనుకున్నాను. కానీ, వెంటిలేటర్ మీద అమ్మ ఏప్రిల్ 17 వరకు ఉన్నారు.
ప్రతి రోజూ నర్సులు, డాక్టర్లు తమ్ముడితో మాట్లాడుతూ అమ్మ ఆరోగ్య పరిస్థితిని విపులంగా వివరిస్తూ ఉండేవారు. ఒక రోజు కోలుకుంటుందని చెప్పేవారు. మరొకరోజు నిలకడగా ఉందని చెప్పేవారు. ఇంకోరోజు పరిస్థితి క్షీణిస్తోందని చెప్పేవారు. అమ్మ కోలుకుంటుందని ఎక్కడో ఆశ. తిరిగి వచ్చేస్తుంది. విమానాలు తిరిగితే త్వరగా ఇండియా వచ్చేస్తుంది అనే ఆశ. నేను అమ్మ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను. తెలిసిన వాళ్లందరితో పూజలు చేయిస్తూనే ఉన్నాం. ఏదో మాయ జరిగి అమ్మ కోలుకుంటుందేమో.. ఏ దేవుడైనా కాపాడతాడేమో అని.
మా ప్రార్ధనలు, డాక్టర్ల వైద్యం రెండూ పని చేయలేదు. ఆఖరి రోజుకి అమ్మ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇక వెంటిలేటర్ తీసేస్తామని డాక్టర్లు చెప్పారు.
అమ్మకి కోవిడ్-19 సోకడంతో, తమ్ముడి కుటుంబాన్ని కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళమని డాక్టర్లు సూచించారు. కానీ, వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయలేదు.
ఏప్రిల్ 17వ తేదీన హాస్పిటల్ నుంచి తమ్ముడికి ఫోన్ వచ్చింది. వచ్చి అమ్మని చూసుకోమని. హాస్పిటల్లో ఇచ్చిన పీపీఈ కిట్ ధరించి తమ్ముడు ఐసీయూలోకి వెళ్లాడు. తను చూస్తుండగానే వెంటిలేటర్ తొలగించారు. అమ్మని సాధారణ వార్డుకి తరలించారు. ప్రాణం పోవడానికి శరీరం సహజంగా కొంత సమయం తీసుకుంటుందని చెప్పారు. మా అందరికీ వీడియో కాల్ చేశాడు తమ్ముడు. మేం అలా చూస్తూ ఉండగానే అమ్మ తుది శ్వాస విడిచింది.

ఫొటో సోర్స్, Getty Images
తమ్ముడి కుటుంబం క్వారంటైన్లో ఉండవలసి వచ్చింది. అమ్మ మృత దేహాన్ని మాకు ఓ శవ పేటికలో పెట్టి ఇచ్చారు. కానీ స్మశాన వాటికలు ఏవీ ఖాళీ లేకపోవడంతో ఏప్రిల్ 24 వ తేదీ వరకు అమ్మ అంత్యక్రియలు జరగలేదు. కోవిడ్-19 మరణం కావడం వల్ల మాకు దగ్గరుండి అంత్యక్రియలు జరిపే అవకాశం దొరకలేదు. తమ్ముడు కూడా దూరం నుంచే చూడాల్సి వచ్చింది.
కనీసం మృతదేహాన్ని ఇండియాకి తిరిగి తేలేకపోయామనే బాధ.. ఈ కోవిడ్-19 మరణాల లెక్కల్లో మా అమ్మ సంఖ్య కూడా ఒకటి అనే బాధ మమ్మల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. కేవలం ఈ కోవిడ్-19 బారిన పడటానికే ఏడు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వెళ్లిందా అని అనిపిస్తోంది.
మా నాన్న కూడా మూడు సంవత్సరాల క్రితం ఇలా యూకేకి వెళ్ళినప్పుడే మరణించారు. అప్పుడు మేము మృతదేహాన్ని వెనక్కి తెచ్చి ఆఖరి చూపు చూసుకోగలిగాం.
పిల్లలెవరూ దగ్గర లేకుండా అమ్మ వెళ్లిపోయిందనే బాధ మమ్మల్ని తొలుస్తోంది. నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఎంత ఏడ్చినా అమ్మ అయితే తిరిగి రాదు. అమ్మని ఆఖరి సారి చూడలేకపోవటం బహుశా ఎప్పటికీ నేను జీర్ణించుకోలేని విషయం.
అమ్మ అంత్యక్రియలు ఏప్రిల్ 24వ తేదీన జరిగితే కోవిడ్-19 బారిన పడి విదేశాల్లో మరణించిన వారిని వెనక్కి తీసుకురావడానికి ఏప్రిల్ 25వ తేదీన ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఇక ఏమి చేస్తాం? ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధించడం తప్ప.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: డాక్టర్ల అంత్యక్రియలను ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?
- కరోనావైరస్: ఈక్వెడార్ గ్వాయాక్విల్‌లో వేలల్లో మృతులు... మార్చురీలు మూసేయడంతో రోడ్ల మీద మృతదేహాలు
- కరోనావైరస్: మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందా?
- కరోనావైరస్: స్పెయిన్‌లో దిక్కు లేకుండా మృతి చెందిన వృద్దులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం
- కరోనావైరస్: 'చనిపోయిన బామ్మ'ను నెల రోజుల తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆస్పత్రి వర్గాలు
- కరోనావైరస్: శవపేటికలతో నిండిన ఇటలీ.. మరణించిన వారికి అంతిమ సంస్కారాలనూ దూరం చేసిన కోవిడ్-19
- కరోనావైరస్: హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు, ‘హర హర మహాదేవ' నినాదాలు’
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








