కరోనావైరస్: విదేశాల్లోని భారతీయుల తరలించేందుకు 'వందే భారత్ మిషన్' ప్రారంభం

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ఇవాళ ప్రారంభం అవుతోంది.
వచ్చే వారం రోజుల్లో 12 దేశాల నుంచి 60కి పైగా ప్రత్యేక విమానాలలో దాదాపు 15,000 మందిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి వచ్చే విమానాలు గురువారమే భారత్ చేరుకోవాల్సి ఉంది. కానీ, విమాన సిబ్బందికి కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కావడం వల్ల షెడ్యూలులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
సింగపూర్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు గురువారం రాత్రి 11:15 గంటలకు దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం వెళ్లనుంది. అది సింగపూర్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 11:35 గంటలకు దిల్లీ చేరుకోనుంది.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. దాంతో, వేల మంది భారతీయులు విదేశాల్లోనే ఉండిపోయారు.
కొన్ని విమానాలతో కొంతమందిని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు 'వందే భారత్' మిషన్ పేరుతో వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మిషన్‌లో భాగంగా దాదాపు 2,00,000 మందిని వెనక్కి తీసుకురానున్నారని అంచనా.
ఈ కార్యక్రమం విజయవంతమైతే, 1990 తర్వాత భారత్ చేపట్టిన అతిపెద్ద తరలింపు కార్యక్రమం ఇదే అవుతుంది. అప్పుడు గల్ఫ్ యుద్ధం జరుగుతున్న సమయంలో కువైట్ నుంచి లక్షా 70 వేల మంది భారతీయులను స్వదేశానికి చేర్చారు.
ఇప్పటికే ఒక్క యూఏఈలోనే 1,97,000 మంది భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

‘వందే భారత్’ మిషన్‌ను భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పూర్తి చేయనుంది. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, సింగపూర్, ఖతార్, మలేసియా సహా 12 దేశాల నుంచి ప్రత్యేక విమానాలను నడపనుంది.
విదేశాల్లో పనిచేసే భారతీయుల్లో కేరళ వాసులే అత్యధికంగా ఉన్నారు. కాబట్టి, ఎక్కువ విమానాలు ఆ రాష్ట్రానికే చేరుకునే అవకాశం ఉంది.
ఒక్కో విమానంలో 200 నుంచి 250 మందిని తీసుకొస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
కరోనావైరస్ లక్షణాలు ఉన్నవారిని ఈ విమానాల్లోకి అనుమతించరు. ముందే స్క్రీనింగ్ చేసి వైరస్ లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతిస్తారు.
ఈ విమాన టికెట్ల ఛార్జీలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
విమాన సిబ్బంది పూర్తిగా స్వీయ రక్షణ దుస్తులు ధరిస్తారు. ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు వాడాలి, భౌతిక దూరంతో పాటు, ఇతర ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారిని విమానంలోని ఐసోలేషన్ జోన్‌కు తరలిస్తారు.
స్వదేశం చేరుకున్నాక వాళ్లందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు రాష్ట్రాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి.
విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, గర్భిణీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విమానాల్లోకి మొదట అనుమతిస్తామని అధికారులు బీబీసీతో చెప్పారు.
విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు నేవీ యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాయి.
మాలీ నౌకాశ్రయంలో చిక్కుకుపోయిన 1000 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రెండు ఓడలు వెళ్లాయి.
విదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని భారత ఎంబసీలను సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సూచించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- లాక్‌డౌన్ సడలింపు: ఏపీలో మద్యం షాపుల ముందు భారీగా క్యూలు... ఇతర దుకాణాలు తెరవడంపై గందరగోళం
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ లాక్‌డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








