కరోనావైరస్ లాక్‌డౌన్ సడలింపు: మద్యం షాపుల ముందు భారీగా క్యూలు... ఇతర దుకాణాలు తెరవడంపై గందరగోళం

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
లాక్ డౌన్ సడలింపు వ్యవహారం కొన్ని చోట్ల గందరగోళానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా సాధారణ జీవనానికి అనుమతి ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దాంతో వ్యాపారులు సోమవారం ఉదయం తమ దుకాణాలు తెరిచారు. అలా షాపులు తెరిచిన కొద్దిసేపటికే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపారులు, పోలీసులు భిన్న వాదనలు వినిపించడంతో గందరగోళంగా మారింది.
మరోవైపు, మద్యం దుకాణాలు మాత్రం కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా తెరుచుకున్నాయి. మద్యం కోసం పలువురు బారులు తీరడం కనిపించింది.
క్లస్టర్లుగా విభజించి సడలింపులు
కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఏపీలో ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్ జోన్లో ఉంది. ఇప్పటి వరకూ ఆ జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేకపోవడంతో గ్రీన్ జోన్‌గా కొనసాగుతోంది. మిగిలిన 12 జిల్లాలకు గానూ 5 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు వాటిలో ఉన్నాయి. ఇక మిగిలిన ప్రకాశం, అనంతపురం, కడప, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా నిర్ధరించారు.
గ్రీన్ జోన్లలో ఇచ్చిన సడలింపులను కేంద్రమే ప్రకటించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం మండలాలను ఒక యూనిట్‌గా తీసుకుని సడలింపులు అమలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలిన అన్ని చోట్లా ఆంక్షలు సడలిస్తున్నట్టు ప్రకటించింది. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో సడలింపులకు సంబంధించి క్లస్టర్ల వారీగా నిబంధనలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా పట్టణాల్లో కాలనీ లేదా వార్డుని ఒక క్లస్టర్‌గా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి లేదా కొన్ని గ్రామాల సముదాయాన్ని క్లస్టర్‌గా భావిస్తున్నారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం చుట్టూ 1 కిలోమీటరు పరిధిని కంటైన్మెంట్ క్లస్టర్‌గా చెబుతున్నారు. కంటైన్మెంట్ క్లస్టర్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి క్లస్టర్స్ 246 ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో గ్రామీణ ప్రాంతంలో 113, పట్టణ ప్రాంతాల్లో 133 ఉన్నాయి. అత్యధికంగా కృష్ణాలో 37, నెల్లూరులో 36, కర్నూలు జిల్లాలో 30 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కేవలం 2 క్లస్టర్స్ ఉన్నాయి. వాటి పరిధిలోనే ఆంక్షలు అమలు చేస్తూ మిగిలిన అన్ని ప్రాంతాలకు సడలింపులు అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

కంటైన్మెంట్ జోన్‌లో కఠిన నిబంధనలే..
కంటైన్మెంట్ క్లస్టర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి అన్ని రకాల నియంత్రణలు అమలు చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి బీబీసీకి తెలిపారు.
"కంటైన్మెంట్ జోన్లకు ఒకే ఒక్క మార్గం ఏర్పాటు చేస్తాం. ఇతరులను అనుమతించేది లేదు. ఆహార సరఫరా, వైద్య సిబ్బందికి మాత్రమే అవకాశం ఉంటుంది. తనిఖీ చేయకుండా ఎవరినీ అనుమతించకూడదు. నిత్యావసర సరకులను ఇంటికే అందించేలా ఆదేశాలు ఇచ్చాం. కంటైన్మెంట్ జోన్ నుంచి రాకపోకల వివరాలన్నీ రికార్డు చేస్తాం. ఒక పాజిటివ్ కేసు నమోదైన 5 రోజుల్లోపు కొత్త కేసులు నమోదైతే వెరీ యాక్టివ్ క్లస్టర్స్‌గా వర్గీకరిస్తాం. 28 రోజుల పాటు వరుసగా కేసులు లేకపోతే కంటైన్మెంట్ క్లస్టర్స్ నిబంధనల సడలింపు ఉంటుంది" అని వెల్లడించారు.

ప్రభుత్వ ప్రకటనలో ఏముంది?
కంటైన్మెంట్ క్లస్టర్స్‌లో ఎటువంటి కార్యకలాపాలకూ అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెడ్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో మాత్రం పట్టణ ప్రాంతంలో అత్యవసర సేవలు అందించే షాపులకు అనుమతించగా, గ్రామాల్లో అన్ని షాపులకు అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలతో కూడిన కార్యకలాపాలకు అవకాశం ఇచ్చారు. పారిశ్రామిక కార్యకలాపాలు కూడా 33 శాతం మందితో భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని అనుమతిస్తామని వెల్లడించారు.
ఆరెంజ్ జోన్లో ఉన్న జిల్లాల్లో మాత్రం ప్రైవేట్ క్యాబ్‌లు సహా వాహనాలకు అనుమతి ఇచ్చారు. పరిశ్రమలు, నిర్మాణ పనులు అన్నింటికీ అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా కంటైన్మెంట్ క్లస్టర్స్ మినహా మిగిలిన అన్ని చోట్ల తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
గ్రీన్ జోన్ పరిధిలో మాత్రం మాల్స్‌కి కూడా అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ రవాణా, ప్రైవేటు రవాణాపై కూడా ఎటువంటి ఆంక్షలూ లేవని తెలిపారు. సెలూన్లు, స్పాలు కూడా తెరుచుకోవచ్చని వివరించారు.
సామూహిక మత కార్యక్రమాలు, థియేటర్లు, విద్యాసంస్థలకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.

అన్ని జోన్లలోనూ తెరుచుకున్న మద్యం షాపులు
ఏపీలో కేవలం కంటైన్మెంట్ క్లస్టర్లు మినహా అన్ని చోట్లా మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఉదయం నుంచే మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాల్లో అమ్మకాలు సాగుతాయని ప్రకటించింది.
మద్యం ధరలు కూడా పెంచింది. అన్ని రకాల మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం నియంత్రణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు తోడుగా ఒక్కో దుకాణం వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. మద్యం షాపుల ముందు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా పోలీసులు, వాలంటీర్లు పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చింది.
కానీ, ప్రభుత్వ ఆదేశాలు అమలైనట్టు కనిపించలేదు. షాపులు తెరుచుకోకముందే పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. 40 రోజులుగా మందు అందుబాటులో లేకపోవడంతో.. ఎదురుచూస్తున్న వారంతా ఒక్కసారి తరలివచ్చారు. దీంతో అనేకచోట్ల భౌతికదూరం ప్రశ్నార్థకంగా మారింది. వారిని నియంత్రించడం సిబ్బంది వల్ల కూడా కాలేదు.

వ్యాపార, వాణిజ్య సంస్థలకు అనుమతి ఉందా, లేదా?
రాష్ట్రంలోని కొన్ని క్లస్టర్స్ మినహా మిగిలిన్న అన్ని ప్రాంతాల్లో నిబంధనలతో వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై కరోనావైరస్ ప్రత్యేక అధికారిగా ఉన్న కాంతిలాల్ దండే బీబీసీతో మాట్లాడారు.
"ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నాం. కంటైన్మెంట్ ఏరియాల్లో కఠిన నిబంధనలు ఉంటాయి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మిగిలిన ప్రాంతాల్లో వ్యాపార సంస్థలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ అనుమతి ఇస్తున్నాం. ఆ తర్వాత ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా సహించేది లేదు. సడలింపులతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రైవేట్ సంస్థలలో 33 శాతం సిబ్బందితో అనుమతులు ఇచ్చాం. అక్కడ కూడా జాగ్రత్తలు పాటించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదు" అని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల ప్రకటనలతో అనేక చోట్ల సోమవారం ఉదయాన్నే షాపులు తెరిచారు. దాంతో సాధారణ జనజీవనం పునరుద్దరణ జరిగినట్టు కనిపించింది. 40 రోజుల లాక్ డౌన్ తర్వాత జాగ్రత్తలతో షాపులకు అనుమతించిన ప్రాంతాల్లో తమ వ్యాపార సంస్థలు తెరిచిన వారికి పోలీసులు అభ్యంతరం తెలిపారు.
రాజమండ్రి వంటి చోట్ల పోలీసుల తీరు మీద వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై క్షత్రియ సుందర్ సింగ్ అనే వ్యాపారి బీబీసీతో మాట్లాడుతూ... "ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మేం షాపులు తెరిచాం. సిబ్బంది అంతా వచ్చారు. 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని చెప్పారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈలోగా పోలీసులు వచ్చి మళ్లీ షాపులు మూసివేయాలనడంతో మాకు ఏమీ అర్థం కాలేదు. కలెక్టర్ ఆదేశాలు ఇస్తారు. పోలీసులు కూడదంటారు. మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చి మాకు లేదనడం ఏమిటి?" అంటూ ప్రశ్నించారు.

ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిన
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని క్లస్టర్స్ మినహా రెడ్ జోన్లో ఉన్న జిల్లాల్లో కూడా వివిధ అంశాల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవల పునరుద్ధరణకు, పరిశ్రమల్లో కార్యకలాపాలకు మాత్రమే అనుమతిస్తామని ఒంగోలులో చెప్పడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలుకి చెందిన మండవ వీరేష్ అనే వ్యాపారి బీబీసీతో మాట్లాడుతూ... "ఒక్కో జిల్లాలో ఒక్కో రూల్ ఎలా ఉంటుంది? ఆరెంజ్ జోన్‌లు అన్నింట్లో ఒకటే రూల్ అమలు చేయాలి. కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇచ్చి మరికొన్నింటికి లేదని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. జనం గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ పబ్లిక్ పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం లేని షాపులను కూడా తెరవకూడదని చెబుతున్నారు. ప్రభుత్వం ఓ మాట చెబుతూ, కింద అధికారులు మరో రీతిన వ్యవహరించడం ఏమిటో తెలియడం లేదు" అన్నారు.

నిబంధన ఒకటే, కానీ స్పష్టత లేదు
లాక్ డౌన్ సడలింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కానీ ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, అవన్నీ సర్దుకుంటాయి అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని బీబీసీకి తెలిపారు.
"క్లస్టర్స్ విషయంలో పక్కా ఆదేశాలు ఇచ్చాం. జోన్ల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాం. ఎక్కడైనా అధికారుల మధ్య సమన్వయ సమస్యలు ఉంటే సరిచేస్తాం. రేపటికి స్పష్టత వస్తుంది. కేంద్రం ఆదేశాలు అమలు చేస్తున్నాం. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరి కుటుంబం కోసం వారు రక్షణ చర్యలు తీసుకోవాలి. వ్యాపారాల విషయంలో కూడా అనుమతి ఉన్న వాటిని నిర్దేశించిన సమయంలో యధేచ్ఛగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి.
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?
- ఎలాన్ మస్క్: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల రూపాయలు ఆవిరి
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతుందా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- కరోనావైరస్: ఇతర రోగులంతా ఏమయ్యారు? ఆస్పత్రులు ఎలా నడుస్తున్నాయి?
- కరోనావైరస్: కమ్యూనిటీ కేసులు లేవని ప్రకటించి లాక్‌డౌన్ సడలించిన న్యూజీలాండ్
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ట్రాన్స్జెండర్లకు ఊహించని కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








