కరోనావైరస్: రెమెడెసివీర్ ఔషధం భారత్‌కు ఎలా వస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గుర్‌ప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎబోలా చికిత్సలో ఉపయోగించే రెమెడెసివీర్ అనే ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు అంటున్నారు. రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే కాలాన్ని ఈ ఔషధం 15 రోజుల నుంచి 11 రోజుల వ్యవధికి తగ్గిస్తున్నట్టు తేలిందని చెబుతున్నారు.
ఈ అంశంపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ ఔషధం గురించి మాట్లాడారు.
''కోవిడ్-19పై ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్న ముఖ్యమైన మెడికల్ ప్రొటోకాల్స్‌లో రెమెడెసివీర్ కూడా ఒకటి. దీని గురించి ఓ అధ్యయనం వెలువడింది. ఇది వంద శాతం పనిచేస్తుందని మాత్రం అందులో తేలలేదు. మరిన్ని ఆధారాలు వస్తే గానీ, ఈ ఔషధంపై నిర్ణయాలు తీసుకోలేం'' అని ఆయన అన్నారు.
ఒకవేళ రెమెడెసివీర్ కోవిడ్-19 చికిత్సలో మెరుగ్గా పనిచేస్తున్నట్లు తేలితే, ఆ తర్వాత ప్రక్రియలు ఏముంటాయి? భారత్‌కు ఈ ఔషధం ఎలా వస్తుంది?
తొలుత భారతీయులపై ఈ ఔషధం చూపుతున్న ప్రభావాల గురించి అధ్యయనం జరుగుతుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వర్గాలు అంటున్నాయి.
దేశంలో ఏ కొత్త ఔషధమైనా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఐసీఎంఆర్ సాంకేతిక సలహాలను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ తీసుకుంటారు.
కోవిడ్-19 చికిత్సలో రెమెడెసివీర్ వినియోగంపై అమెరికాలోని గిలియెడ్ అనే సంస్థ ప్రయోగాలు చేస్తోంది.
భారత్‌లోకి ఈ ఔషధం ఎలా వస్తుందన్నది ఆ సంస్థ అనుసరించే వాణిజ్య వ్యూహంపై ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే బీబీసీతో అన్నారు.
''వారికి రెండు, మూడు ఆప్షన్లు ఉన్నాయి. ముందు వాళ్లు ఆమోదం పొందాలి. ఔషధాన్ని భారత్‌కు ఎలా తేవాలన్నది పూర్తిగా వాళ్ల ఇష్టం'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హైడ్రాక్సీక్లోరోక్విన్ లాగే ఇస్తారా?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్ కావాలని నేరుగా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించి, తెప్పించుకున్నారు. రెమెడిసివీర్‌ను కూడా ఇదే తరహాలో భారత్ అమెరికా నుంచి తెప్పించుకోవచ్చా?
ఈ ప్రశ్నకు శేఖర్ మాండే బదులు చెప్పారు.
''ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన అంశాలు. హైడ్రాక్సీక్లోరోక్విన్ చాలా పాత ఔషధం. దానికి పేటెంట్లు ఏమీ లేవు. జనరిక్ సంస్థలు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తయారు చేసి అమ్మవచ్చు. కానీ రెమెడెసివీర్ కొత్త ఔషధం. దానిపై గిలియెడ్ సంస్థకు పేటెంట్లు ఉన్నాయి. అందుకే, దీన్ని ఎవరు తయారు చేయాలన్నది ఆ సంస్థే నిర్ణయం తీసుకుంటుంది'' అని ఆయన వివరించారు.
రెమెడెసివీర్ కోవిడ్-19 చికిత్సలో ఉపయోగపడుతుందని తేలితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ ఔషధాన్ని పొందాలనుకుంటాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

అప్పుడు, గిలియెడ్ వివిధ దేశాల్లో స్థానిక సంస్థలకు తమ పేటెంట్లు ఇచ్చి, ఔషధాలు తయారు చేయించే అవకాశం ఉంది.
''సంస్థలు ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తాయి. భారతీయ సంస్థలకు పేటెంట్లు ఇస్తే, సులువుగా ఆ ఔషధాన్ని తయారు చేస్తాయి. ఆ సామర్థ్యం ఇక్కడి సంస్థలకు ఉంది. కానీ, వ్యూహంపై నిర్ణయం తీసుకోవాల్సింది గిలియెడే'' అని శేఖర్ అన్నారు.
రెమెడిసివీర్ ఔషధం పేటెంట్ 2035 వరకూ ఉందని ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ధారా పటేల్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు భారత సంస్థలు రెమెడెసివీర్‌పై దృష్టి పెట్టాయని... ఒకవేళ అది బాగా పనిచేస్తున్నట్లు తేలితే, గిలియెడ్ సంస్థతో కలిసి అవి ఆ ఔషధ తయారీని చేపట్టవచ్చని ఆయన అన్నారు.
ఔషధంపై పేటెంట్ కలిగిన సంస్థ అంగీకారం లేకపోయినా, కంపల్సరీ లైసెన్స్ పొందిన సంస్థలు ఆ ఔషధాన్ని తయారు చేయవచ్చు.
''ఈ సంస్థలకు ఔషధాన్ని తయారు చేసే సామర్థ్యం ఉందా అన్నది ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాత వాటికి కంపల్సరీ లైసెన్స్ మంజూరు చేస్తుంది. ఏదైనా ఉత్పత్తి అవసరమైతే, దేశ స్థాయిలో ఇలా కంపల్సరీ లైసెన్స్‌ను మంజూరు చేయొచ్చు. ఆ హక్కు దేశానికి ఉంటుంది'' అని ధారా పటేల్ చెప్పారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి.
- రెమ్‌డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- కరోనావైరస్: పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 తగ్గింది... భారత్‌లో ఎందుకు తగ్గించడం లేదు?
- కరోనావైరస్: ఈ సమయంలో మీరు ఏవిధంగా సహాయపడగలరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








