కరోనావైరస్: ఇతర రోగులంతా ఏమయ్యారు? ఆస్పత్రులు ఎలా నడుస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక వైద్యులపై అందరికీ అపార అభిమానం పెరిగింది. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నవారిని వీరులుగా పోలుస్తూ అందరూ ప్రశంసించారు. ఇదంతా ఒకవైపు. అదే కరోనావైరస్ తెచ్చిన లాక్ డౌన్ ఇప్పుడు వైద్య రంగం, ఆసుపత్రులు, వైద్యులను పెద్ద ఇబ్బందుల్లోకి లాగేసింది. వైద్య రంగాన్ని కుదిపేసింది.
లాక్ డౌన్ వల్ల ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పడిపోయింది. ఆయా ఆసుపత్రులు ఉన్న చోటు, స్థాయిని బట్టి 10 శాతం నుంచి 40 శాతం మంది పేషెంట్లే వస్తున్నారు. కేవలం ఎమర్జెన్సీలు, సెమీ-ఎమర్జెన్సీలకు మాత్రమే చికిత్స జరుగుతోంది. దీంతో ఆసుపత్రుల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి.
చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని నడుస్తున్నాయి, మరికొన్ని తాత్కాలికంగా మూతవేశారు. చిన్న చిన్న క్లినిక్‌ల పరిస్థితి కూడా అంతే. దీంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడింది.
అన్ని వసతులు, అన్ని రకాల వైద్య సేవలు ఉండే భారీ కార్పొరేట్ ఆసుపత్రులు, కొన్ని స్పెషాలటీలతో నడిచే మధ్య స్థాయి ఆసుపత్రులు, పది పడకలు ఉండే నర్సింగ్ హోమ్‌లు, ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లు ఉండే క్లినిక్‌లు, సొంత ఆసుపత్రి లేకుండా పలుచోట్ల సేవలందించే ప్రొఫెషనల్స్.. ఇలా అన్ని స్థాయుల ఆసుపత్రులూ ప్రభావితం అయ్యాయి. ప్రైవేటు రంగంలో దేశంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయనే దానిపై రకరకాల లెక్కలు ఉన్నాయి. పెద్ద ఆసుపత్రుల సంఖ్య సుమారు 20 వేలకు దగ్గరగా ఉండొచ్చని అనేక సంస్థల అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది?
వైద్య రంగం ప్రభావితం అవడం అంటే కేవలం వైద్యులే కాదు, ఆసుపత్రులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధార పడ్డవారందరికీ ఇబ్బంది అయింది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ సంస్థ అంచనా ప్రకారం 2015 నాటికి దేశంలోని వైద్య రంగం 47 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అయితే వారిలో ఎంత శాతం ఉద్యోగాలు కోల్పోయారన్న లెక్కలు ఇంకా రాలేదు. కొన్ని సంస్థలు ఉద్యోగులను తీయకుండా జీతాలు తగ్గించి నెట్టుకొస్తున్నాయి.
పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కూడా లాక్ డౌన్ వల్ల ఖర్చులు తగ్గించుకునే పరిస్థితుల్లో పడ్డాయి. పేషెంట్ల సంఖ్య బాగా తగ్గింది అని చెప్పిన అపోలో ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఉద్యోగాలకు ఇబ్బంది లేదని భరోసా ఇచ్చింది.
''ఆసుపత్రులకు వచ్చేవారు దాదాపు 40-50 శాతం తగ్గిపోయారు. దీనివల్ల 40 శాతం ఆదాయం కోల్పోయాం. అయితే మేం ఉద్యోగస్తులను తీయాలనుకోవడం లేదు. ఇతర ఖర్చులు తగ్గించుకుంటున్నాం. కోవిడ్-19 సమయాల్లో కూడా మా సేవలను ఆపలేదు. ఎమర్జెన్సీ, సెమీ-అర్జెంట్ పేషెంట్లు వస్తున్నారు. పూర్తి స్థాయిలో పేషెంట్లు వచ్చినా ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచుతూనే సేవలు అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నిజానికి చిన్న ఆసుపత్రులు పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీలు పెరిగాయి. ఎవరైనా కోవిడ్-19 లక్షణాలతో వస్తే పరీక్షించి ఐసోలేట్ చేస్తున్నాం. ఒకవేళ పరీక్ష నెగిటివ్ అయితే మా ఆసుపత్రులలోకి తీసుకుని చికిత్స చేస్తున్నాం. పాజిటివ్ అయితే మెయిన్ ఆసుపత్రి బయట ఐసోలేషన్లో చికిత్స చేస్తున్నాం'' అని అపోలో గ్రూపు సంస్థల అధ్యక్షుడు డాక్టర్ కె.హరి ప్రసాద్ అన్నారు.
భారీ కార్పొరేట్లు ఈ కుదుపును తట్టుకుంటున్నాయి. కానీ ఉద్యోగం చేసే లేదా సొంతంగా ప్రాక్టీస్ చేసే వైద్యుల పరిస్థితి మాత్రం ఇబ్బందిగా ఉంది. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు తమ సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తీయలేదు కానీ జీతాలు తగ్గించాయి. వైద్యుల మార్చి నెల జీతాల్లో 50 శాతమే చెల్లించారనీ, ఏప్రిల్ జీతం గురించి అసలు స్పష్టతే లేదని కొందరు బీబీసీతో చెప్పారు. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా పేరు గడించిన పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయి.
హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ధనుంజయ్ ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. దానికి అదనంగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో తన భార్యతో క్లినిక్ నడుపుతున్నారు. ఈయన ఫిజీషియన్, ఆమె గైనకాలజిస్ట్. ఆయన పనిచేస్తున్న సంస్థ మార్చి జీతం సగమే ఇచ్చింది. ఇక సొంత క్లినిక్‌కి 10-20 శాతమే వస్తున్నారు.
''ఇప్పుడు కరోనావైరస్ వల్ల సాధారణంగా వచ్చే జ్వరం వంటి ఇతర కేసులనూ మనం చూడలేని పరిస్థితి. ఓపీ బ్లాక్ అయింది. గైనకాలజిస్టులకు కూడా రొటీన్ చెకప్స్ లేవు. కేవలం నెలలు నిండిన వారికి మాత్రమే చూడాల్సి ఉంది. అలాగని చిన్న ఉద్యోగులను తీసేయలేం. జీతాలు ఆపలేం. దీంతో మైనస్‌లోకి వెళ్లిపోతున్నాం. నేను పనిచేస్తున్న సంస్థ వారు కూడా మార్చి నెల జీతం సగం తగ్గించారు. మార్చి చివర్లోనే సమస్య మొదలైనప్పటికీ, తగ్గించారు. ఇక ఏప్రిల్ సంగతి తెలీదు. నా దగ్గర ఉన్న సిబ్బంది తక్కువ. కాబట్టి నేను వారి జీతం యథాతథంగా ఇస్తున్నా'' అన్నారు ధనుంజయ్.
కానీ మధ్య స్థాయి ఆసుపత్రులు పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా యువ డాక్టర్లు, కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. మార్కెట్లో ఎంతో కాలం నుంచి ఉన్నవారు, ఆదాయం లోటును తట్టుకోగలిగే శక్తి సంపాదించారు. కానీ కొత్త వారి పరిస్థితి అలా లేదు.
''నా స్నేహితుడు ఒక ఆసుపత్రి నడుపుతున్నారు. అతను నెలకు రెండున్నర లక్షలు అద్దె కట్టాలి. ఇది కాక ఎండోస్కోపీ, లాప్రోస్కోపి వంటి మెషీన్లు కొన్నాడు. వాటి ఈఎంఐలు కట్టాలి. వంద రూపాయలు రావాల్సిన చోట ఐదు రూపాయలు కూడా రాకపోతే ఏం చేయాలి?'' అన్నారు ధనుంజయ్.
డాక్టర్ ధనుంజయ్ అభిప్రాయం ప్రకారం బాగా చిన్న క్లినిక్‌లు అంటే ఒకరిద్దరు సిబ్బందితో ఉన్నవారు నిలదొక్కుకోగలుతున్నారు. కానీ, కాస్త పెద్ద, మధ్య స్థాయి ఆసుపత్రులకు నిర్వహణ భారం చాలా ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రులతో పాటు ల్యాబ్‌లు కూడా ఇబ్బంది పడుతున్నాయంటున్నారు డాక్టర్ పి.వినయ్. అంతేకాకుండా రోజూవారీ కన్సల్టేషన్లపై ఆధారపడ్డ ఫిజీషియన్లకూ ఇబ్బందిగా ఉందని ఆయన వివరించారు. డాక్టర్ వినయ్ వివిధ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్ సర్జన్‌గా ఉన్నారు.
''ఎప్పుడైనా నాకు వచ్చే పేషెంట్లను అవసరాన్ని బట్టి ఆసుపత్రులకు రిఫర్ చేస్తాను. కాకపోతే, ఎప్పుడూ తమకు పేషెంట్లను రిఫర్ చేయమని అడగని పెద్ద ఆసుపత్రిలో పనిచేసే ఫిజీషియన్లు కూడా మొదటిసారి, ఆ మాట అడిగారు. లాక్ డౌన్ వల్ల కన్సల్టేషన్లు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. నేను సర్జన్‌ను. ఆపరేషన్ చేసి కొంత మొత్తం తీసుకుంటాను. కానీ ఫిజీషియన్లు అలా కాదు. ఎంత మందిని చూశారనే దాన్ని బట్టి ఆదాయం ఉంటుంది. ఇక నేను చాలా కంపెనీలకు కన్సల్టెంటుగా ఉన్నాను. కానీ నాకు రావల్సిన డబ్బును ఇప్పుడు అడగలేని పరిస్థితి. ప్రస్తుతానికి గుండెనొప్పి, పక్షవాతం వంటి చికిత్సలు కొనసాగుతున్నాయి. చాలా విచిత్రంగా అపెండిక్స్ కేసులు రావడం లేదు. ఫిజీషియన్స్ కొందరు వెళ్తున్నారు కానీ, సర్జన్లకు అసలే పనిలేదు. చాలా ఆసుపత్రులకు దాదాపు ఆదాయం శూన్యం'' అని వినయ్ తెలిపారు.
''ఆసుపత్రులే కాదు. ల్యాబ్‌ల పరిస్థితి కూడా అలానే ఉంది. నాకు తెలిసిన ఒక ప్రైవేటు ల్యాబ్‌లో ముందుగా ఒక ఎన్జీవో సహాయంతో కరోనా టెస్టింగ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కానీ అలా అయితే తాము పనిచేయలేమని సిబ్బంది చెప్పేయడంతో అతను విరమించుకున్నాడు. ప్రస్తుతానికి జీతాలు ఇస్తున్నాను, ఇలా ఎంతకాలం ఇవ్వగలనో తెలియదు, అలా అని సిబ్బందిని వదులుకోలేను, అందుకోసం తప్పడం లేదు'' అని ఆ ల్యాబ్ యజమాని అన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

హెల్త్ టూరిజం
అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం వైద్య రంగంపై ఎంత తీవ్రంగా ఉంటుందనేది ఇప్పుడే పూర్తి స్థాయిలో అంచనా వేయలేం. ఎందుకంటే లాక్ డౌన్ సడలింపు తరువాత కూడా పేషెంట్లు, వైద్యులు తమ దగ్గరలోని ఆసుపత్రులకు వెళతారు. కానీ హెల్త్ టూరిజంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశంలోని చాలా ఆసుపత్రులకు మిగిలిన ప్రపంచ దేశాలు, ముఖ్యంగా దక్షిణాసియా, ఆఫ్రికా, అరబిక్ దేశాల నుంచి పేషెంట్లు వస్తంటారు. వీరే కాదు, భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో పెద్ద ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తుంటారు.
భారతదేశంలో మెడికల్ టూరిజం ఏటా దాదాపు 200 శాతం వేగంతో పెరుగుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015 సంవత్సరంలోనే చికిత్స కోసం 2.34 లక్షల మంది విదేశీయులు భారత్‌కు వచ్చారు. ఇది 2017 నాటికి 4.95 లక్షలకు చేరుకుంది. భారత్‌కు చికిత్స కోసం వచ్చే వారిలో బంగ్లాదేశ్‌ది మొదటి స్థానం. ఆ తరువాత అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఒమన్, మాల్దీవులు, ఉజ్బెకిస్తాన్, నైజీరియా, యెమన్, కెన్యా, టాంజానియా వంటి దేశాలున్నాయి. ఆయా దేశాల పేషెంట్ల కోసం పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా అనువాదకులను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు, దేశీయ రవాణాపైనే ఈ పేషెంట్ల రాకపోకలు ఆధారపడ్డాయి.
లాక్ డౌన్ వైద్య రంగంలో ఊహించని ఇబ్బందులు కలిగించే అవకాశం లేకపోలేదంటున్నారు డాక్టర్ బాలాంబ. ఒక మధ్య స్థాయి ప్రైవేటు ఆసుపత్రిలో కన్సల్టెంట్ గైనకాలజిస్టుగా ఉన్న బాలాంబ, గతంలో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసి రిటైర్ అయ్యారు.
''ఆసుపత్రులకు ఓపీలూ, ముందుగా నిర్ణయించి చేసే (ఎలక్టివ్స్) ఆపరేషన్లతోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. అవి ఆగిపోయాయి. కానీ జీతాలు ఆపలేం కదా? ఎవర్నీ తీసేయలేం. ఎమర్జెన్సీలు తప్ప ఏవీ నడవడం లేదు. కానీ అద్దె కట్టాలి. ఒకవేళ పొరపాటున ఆ వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్ కోవిడ్ పాజిటివ్ అయితే మొత్తం ఆసుపత్రి క్వారంటైన్లోకి పోతుంది. దీంతో చిన్న, మధ్య స్థాయి ఆసుపత్రులకు చాలా ఇబ్బంది ఉంది.
ఇప్పటికే నాకు తెలిసిన కార్పొరేట్ ఆసుపత్రులు వారి దగ్గర పనిచేసే డాక్టర్లకు 50 శాతం కోత విధించారు. దీనివల్ల డాక్టర్లకూ కష్టమే. ట్రాన్స్‌పోర్టు లేకపోతే బయటి నుంచి పేషెంట్లు రారు. దానికి రెండు మూడు నెలలు పడుతుంది. అంటే మొత్తం ఆరు నెలల ప్రభావం. కానీ ఆ ఆరు నెలలూ బ్యాంకు అప్పు కట్టాలి. వడ్డీ పెరుగుతుంది. చాలా భారం'' అన్నారు బాలాంబ.
''ఈ ప్రభావంతో కొన్ని చిన్న చిన్న నర్సింగ్ హోంలు మూసేసినా ఆశ్చర్యం లేదు. ఈ తలపోటు మనకెందుకు, ఎక్కడికైనా వెళ్లి చేసుకుందాం అనుకుంటారు వైద్యులు. అందరూ అనుకున్నట్టు కార్పొరేట్లకూ అంత తేలికగా కాదు. వాళ్లకూ ఏవో ఈక్విటీ సంస్థలు పెట్టుబడులు పెడతాయి. వారు కొంత కాలం చూస్తారు. డబ్బు రాకపోతే ఏం చేస్తారు. అవసరమైతే ఆ ఆసుపత్రిని ఆక్యూపై చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఆసుపత్రులు నిర్వహిస్తోన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రి అలా ఎన్నిసార్లు చేతులు మారిందో మనం చూశాం కదా? నిస్వార్థంగా పనిచేయడం కుదరదు. డబ్బు పెట్టిన వారు లాభం కోసం చూస్తారు కదా? జీతాలు ఇవ్వాలిగా?'' అన్నారు బాలాంబ.
అయితే ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం తమకు ఏదో సాయం చేస్తుందని ఎదురు చూడడం లేదు. గవర్నమెంటు ఆసుపత్రులకే డబ్బు ఇవ్వని వారు, ప్రైవేటు ఆసుపత్రులకు ఉద్దీపనలు ఇస్తుందని ఆశించలేం అన్నారు డాక్టర్లు అంతా ముక్త కంఠంతో.. కాకపోతే వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలూ తమకు ఉన్న బకాయిలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాలు కోరుతున్నారు. ఆరోగ్య శ్రీ వంటి వివిధ ఇన్సూరెన్సు పథకాలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగుల చికిత్స బకాయిలూ పెద్ద మొత్తంలో ఉన్నాయి.
''ఇప్పటికే పొందిన సేవలకు గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచీ మాకు పెద్ద మొత్తంలో డబ్బు రావాల్సి ఉంది. నగదు చెలామణీ జరగాలంటే వీటిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది. టాక్స్ హాలిడే, సాఫ్ట్ లోన్, చెల్లింపుల గడవు పెంచడం, లోన్ రీపెమెంట్ రీషెడ్యూల్ చేయడం వంటివి ఆరోగ్య రంగానికి అవసరం.'' అన్నారు అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డా. హరి ప్రసాద్.
లోన్లపై వడ్డీ రహిత మారటోరియం ఉండాల్సింది అన్నారు డా. వినయ్. దీనివల్ల లోన్ ద్వారా మెషీన్లు తీసుకుని ఆసుపత్రి నడుపుతోన్న వారికి ఉపయోగం ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
టెలి మెడిసిన్:
ఈ కాలంలో టెలిమెడిసిన్ కాస్త పెరిగింది. అయితే భారత వైద్య రంగంతో పోలిస్తే ఆ పెరుగుదల చాలా చిన్నది. ఇప్పటికీ టెలి మెడిసిన్ భారత్ లో పెరగాల్సినంత పెరగలేదని కొందరు వైద్యులు చెప్పారు. అయితే బాగా పెద్ద సంస్థలకు లాక్ డౌన్ కాలంలో టెలి మెడిసిన్ పెరిగినట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. కొందరి విషయంలో టెలిమెడిసిన్ కేవలం అపాయింట్‌మెంట్లు ఇవ్వడానికి మాత్రమే పనికి వచ్చే దశలో ఉంది. ''మా సంస్థ టెలిమెడిసిన్ చాలా కాలం నుంచి అందిస్తోంది. ఈ మహమ్మారి వల్ల అది బాగా పెరిగింది. జనం నెమ్మదిగా అయినా, కచ్చితంగా డిజిటల్ మార్గాల వైపు అడుగులేస్తున్నారు'' అన్నారు హరిప్రసాద్.
భారతదేశంలో ఆరోగ్య పరిశ్రమ:
బ్రాండ్ ఇండియా ఈక్విటీ ఫౌండేషన్ 2020 మార్చి నాటి అంచనా ప్రకారం, 2022 నాటికి భారత ఆరోగ్య పరిశ్రమ 372 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల పెరుగుతోన్న అవగాహన, జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు, ఇన్సూరెన్స్ సౌకర్యం పెరగడం వీటికి కారణం అంటోంది ఆ సంస్థ. 2017-18 నాటికి 4 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఆరోగ్య పరిశ్రమ, 2022నాటికి 8 లక్షల 60 వేల కోట్లకు చేరుకుంటుందని ఆ సంస్థ అంచనా. మరో సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ప్రకారం 2017లో 4 లక్షల 32 వేల కోట్లు ఉన్న ఆరోగ్య పరిశ్రమ, 2023 నాటికి పది లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ పెరుగుదల వేగం సగటున ఏడాదికి సుమారు 17 శాతం ఉంటోంది.
ఇక భారత్ లో 80ల చివర్నుంచీ ప్రైవేటు వైద్య రంగం బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం, 2013 నాటికి దేశంలోని ఆసుపత్రుల్లో 58 శాతం, పడకలలో 29 శాతం, వైద్యుల్లో 81 శాతం ప్రైవేటు సెక్టార్లోనే ఉన్నారు.
ఇంతకీ ఈ పేషెంట్లంతా ఏమైపోయారు?
లాక్ డౌన్ తరువాత చాలా మందికి సోషల్ మీడియా వేదికగా వెలుబుచ్చిన సందేహం ఒక్కటే. ఒకప్పుడు పేషెంట్లతో కిటకిటలాడిన ఆసుపత్రలన్నీ ఇప్పుడేమైపోయాయి అనీ… డాక్టర్లు ఇప్పటి వరకూ లేని జబ్బులు చూపించి డబ్బు గుంజారా అంటూ ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.. అదే ప్రశ్నను చాలా మంది వైద్యులను అడిగింది బీబీసీ.
''వ్యాధులు ఎప్పట్లాగానే ఉన్నాయి. కాకపోతే జనం అత్యవసరం కాని వాటి చికిత్స వాయిదా వేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. కానీ అదంత మంచిది కాదు. దానివల్ల కోవిడ్ కాని వ్యాధులు పెరుగుతాయి. మరణాల రేటు కూడా పెరగవచ్చు'' అన్నారు డాక్టర్ హరిప్రసాద్.
''ప్రాబ్లమ్ లేకుండా వచ్చి ఎవరూ ఊరికే డబ్బులు కట్టరు కదా? లాక్ డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. స్పాండిలైటిస్ వంటి సమస్యలు తగ్గాయి. ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు తగ్గాయి. ప్రాబ్లమ్ ఉంటే తప్ప ఎవరూ ఆసుపత్రికి రారు. స్ట్రెస్, ఫుడ్ పాయిజినింగ్, యాక్సిడెంట్, వర్క్ లోడ్ వల్ల వచ్చే సమస్యలు 50 శాతం ఉంటాయి. అవి తగ్గిపోయాయి. ఇన్సూరెన్స్ కట్టడం వల్ల అఫర్డబులిటీ పెరిగింది. అంతే తప్ప జబ్బులు లేకపోయినా వైద్యం చేస్తున్నారన్న వాదన తప్పు'' అన్నారు డాక్టర్ ధనుంజయ్.
''ప్రజలకు తమ ఆరోగ్య సమస్యల కంటే కరోనా భయంకరంగా కనిపిస్తోంది కాబట్టి ఆసుపత్రులకు రావడం తగ్గించారు. బాగా సమస్య ఉన్న కొందరు ఫోన్ల ద్వారా కన్సల్ట్ చేస్తున్నారు'' అన్నారు డాక్టర్ వినయ్.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా?
- కరోనావైరస్: కమ్యూనిటీ కేసులు లేవని ప్రకటించి లాక్డౌన్ సడలించిన న్యూజీలాండ్
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ట్రాన్స్జెండర్లకు ఊహించని కష్టాలు
- కరోనావైరస్: ‘నన్ను బతికించటానికి లీటర్ల కొద్దీ ఆక్సిజన్ అందించారు‘ - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








