కరోనావైరస్: ‘నన్ను బతికించటానికి లీటర్ల కొద్దీ ఆక్సిజన్ అందించారు‘ - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, AFP

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, తాను కరోనావైరస్ సోకి విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్నపుడు ‘ప్రత్యామ్నాయ ప్రణాళికల’ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనను సజీవంగా ఉంచటానికి తనకు ‘‘లీటర్ల కొద్దీ ఆక్సిజన్’’ అందించారని ఆయన ఆదివారం ‘సన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నపుడు, ఇతరుల బాధలను నివారించాలన్న తపన, బ్రిటన్‌ను ‘మళ్లీ తన కాళ్లపై నిలబెట్టి ముందుకు నడిపించాల’న్న తాపత్రయం తనను ముందుకు నడిపించాయని అన్నారు.

అంతకుముందు, ప్రధాని బోరిస్ కాబోయే భార్య క్యారీ సిమండ్స్.. బుధవారం నాడు జన్మించిన తమ కుమారుడికి విల్ఫెడ్ లారీ నికొలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.

క్యారీ సైమండ్స్

ఫొటో సోర్స్, Image copyrightCARRIE SYMONDS

ఫొటో క్యాప్షన్, బిడ్డ పుట్టిన తరువాత ఎన్‌హెచ్ఎస్ సిబ్బందికి ఇన్‌స్టాగ్రామ్‌లో ధన్యవాదాలు చెప్పిన క్యారీ సిమండ్స్

తమ తాతలకు, ఆస్పత్రిలో బోరిస్‌కు చికిత్స చేసిన వైద్యులకు కృతజ్ఞతగా ఈ పేరు పెట్టినట్లు ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాశారు.

తమ కుమారుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. అతడి పేరులో ‘నికొలస్’ అనేది.. బోరిస్ ప్రాణాలు కాపాడిన డాక్టర్ నిక్ ప్రైస్, డాక్టర్ నిక్ హార్ట్‌లకు కృతజ్ఞతగా పెట్టిన పేరని వివరించారు.

డాక్టర్లిద్దరూ తమకు ఈ విధంగా గుర్తింపునివ్వటం నిజంగా గౌరవదాయకంగా ఉందంటూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ సోకినట్లు మార్చి 26న నిర్ధరించారు. పది రోజుల తర్వాత ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆ మరుసటి రోజే ఇంటెన్సివ్ కేర్‌లోకి మార్చారు.

ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో, తన ఆరోగ్య పరిస్థితిని చూపే మానిటర్లు, తన శరీరానికి పెట్టిన వైర్లను చూస్తూ గడపటం... ‘‘చాలా కష్టంగానే ఉంది’’ అని బోరిస్ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘కేవలం కొన్ని రోజుల్లోనే నా ఆరోగ్యం ఇంత తీవ్రంగా విషమించిందంటే నమ్మటం కష్టం. దీని నుంచి నేను ఎలా బయటపడతానో అనుకునే వాడిని’’ అని చెప్పారు.

పరిస్థితులు పూర్తిగా విషమిస్తే ఏం చేయాలనే విషయమై డాక్టర్లు అన్ని రకాల ఏర్పాట్లూ చేశారని తెలిపారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆస్పత్రి సిబ్బంది అద్భుతమైన సంరక్షణ సేవల వల్లే తాను కోలుకున్నానని పేర్కొన్నారు. ఇంకా చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో తాను త్వరగా కోలుకోవటం తన అదృష్టమని భావిస్తున్నానన్నారు.

బ్రిటన్‌లో కరోనావైరస్ సంబంధిత మరణాల సంఖ్య తాజాగా 28,131కి పెరిగింది. ఇది శుక్రవారం నాటికన్నా 621 ఎక్కువ.

అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య గత వారం రోజుల్లో 13 శాతం తగ్గిందని ఇంగ్లండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హెన్నీ హ్యారిస్ చెప్పారు.

దేశంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ గృహ హింస పెరిగిందన్న నివేదికల నేపథ్యంలో.. ఇళ్లలో చిక్కుకుపోయి ప్రమాదంలో ఉన్న చిన్నారులు, గృహ హింస, ఆధునిక బానిసత్వం బాధితుల కోసం ప్రభుత్వం శనివారం నాడు 7.6 కోట్ల పౌండ్ల (దాదాపు రూ. 718 కోట్లు) ప్యాకేజీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)