కరోనావైరస్ సంక్షోభం: సమానత్వం, న్యాయమే పునాదిగా సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా?

లాక్‌డౌన్‌ వల్ల రైళ్లు, బస్సులు లేకపోవడంతో అనేక మంది వలసకార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్‌ వల్ల రైళ్లు, బస్సులు లేకపోవడంతో అనేక మంది వలసకార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
    • రచయిత, రీతిక ఖేరా
    • హోదా, బీబీసీ కోసం

రెండో ప్రపంచ యుద్ధం నాటి ప్రపంచానికి, ప్రస్తుత ప్రపంచానికి పెద్దగా తేడా ఏమీ లేదనిపిస్తోంది. అప్పుడు లక్షల మంది మరణాలు, ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం చిన్నాభిన్నమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హిట్లర్ లాంటి నాయకులు ఉండేవారు. ఎన్నో దేశాలను సర్వనాశనం చేసిన ఆ రెండో ప్రపంచ యుద్ధమే, కొత్త తరహా సమాజాన్ని సృష్టించేందుకు మూలమైంది.

బ్రిటన్‌లో ప్రజలందరికీ సేవలు అందించే ఆరోగ్య వ్యవస్థ, నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ఏర్పాటైంది. అది కార్యరూపం దాల్చేందుకు ఎన్నో ఏళ్ల పాటు సమాలోచనలు జరిగాయి. అప్పటిదాకా ఆ దేశంలో వైద్యులందరూ ప్రైవేటు వాళ్లే. ఎన్‌హెచ్‌ఎస్ ఏర్పాటు కోసం ఆ వైద్యుల సంఘాన్ని ఒప్పించేందుకు అప్పటి లేబర్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లార్డ్ బేవాన్‌ చాలానే కష్టపడాల్సి వచ్చింది.

మిగిలిన పశ్చిమ దేశాల్లో సామాజిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపుదిద్దుకన్నాయి. ఆ కార్యక్రమాల ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి లాంటి సాయం అందుతోంది.

అదే సమయంలో చాలామంది శ్రామికులు సంఘటితం అయ్యారు. అది పన్నుల వ్యవస్థ మరింత బలపడేందుకు దోహదపడింది.

ప్రజలు చెల్లించే పన్నులకు ప్రతిఫలాలను ఉచిత విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, పెన్షన్ల రూపంలో తిరిగి పొందడం ప్రారంభమైంది.

దాంతో, ప్రభుత్వాలు పన్ను రేట్లను 30 నుంచి 50 శాతం పెంచగలిగాయి. యాభై ఏళ్ల పాటు పశ్చిమ ఐరోపా దేశాలకు ఆ నమూనా బాగా పనిచేసింది.

అయితే, సంస్థల ఏర్పాటు ప్రయత్నాలపై, ప్రేరణపై అధిక పన్ను రేట్ల విధానం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని పాఠకులకు గుర్తు చేయడం అవసరం.

అప్పుడు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు మరింత మానవీయంగా మారేందుకు ఆ సంక్షోభాన్ని వాడుకున్నారు.

బాంబులు సృష్టించే విధ్వంసానికి పేద, ధనిక అనే తేడాలు ఉండవని ప్రజలు గ్రహించేందుకు రెండో ప్రపంచ యుద్ధం దోహపడింది. ప్రస్తుత కరోనావైరస్ కూడా దాదాపు అలాంటిదే.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఇప్పుడు, భారతదేశం మూడింతల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ఒకటి, కరోనావైరస్ కారణంగా ఆరోగ్య సంక్షోభం. రెండోది, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించాల్సి రావడం. మూడోది, ఆకస్మిక, ప్రణాళిక రహిత లాక్‌డౌన్ ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం.

లాక్‌డౌన్ వల్ల తలెత్తే ఆర్థిక నష్టం ప్రభావం మనందరి మీదా ఉంటుంది. ఈ వైరస్ బారిన పడకుండా తప్పించుకునేవారు కూడా ఆ నష్టాన్ని భరించాల్సిందే. (ఒక అంచనా ప్రకారం, దేశ జనాభాలో సుమారు 20 శాతం మంది ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది, అందులో 1 నుంచి 3 శాతం మంది చనిపోయే అవకాశం ఉంది.)

భారత్‌లో ఉపాధి పొందిన వారిలో 17 శాతం మంది మాత్రమే నెలనెలా వేతనాలు వచ్చే ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలిన వారిలో చాలామంది (మూడింట ఒక వంతు మంది) సాధారణ కూలీలు, సగం మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు.

స్వయం ఉపాధి కలిగిన వర్గంలో టైలర్లు, మెకానిక్‌లు, సైకిల్ రిపేరింగ్, కూరగాయల దుకాణాలు నడిపేవారు, తోపుడు బండ్ల మీద ఆహార పదార్థాలు అమ్మేవారి నుంచి వ్యాపారవేత్తలు, కంపెనీల వ్యవస్థాపకుల వరకు ఉన్నారు. నెలనెలా జీతం లేని అనేక మందికి, లాక్‌డౌన్ ఒక మానవతా సంక్షోభంగా మారింది.

మిగతా దేశాలతో పోల్చితే, లాక్‌డౌన్ ప్రభావం భారత్‌లో చాలా భిన్నంగా ఉంటుంది. లాక్‌డౌన్ అమలు చేసిన మొదటి వారంలోనే, దేశంలో ఆకలి, ఎండ, అలసట, రోడ్ల మూసివేత, ఆత్మహత్యల కారణంగా 40 నుంచి 90 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మిగతా దేశాలు కూడా చాలావరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. కానీ, ఆ దేశాల్లో నెలనెలా వేతనాలు అందుకునే ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువ మంది ఉంటారు. చాలామందికి సామాజిక భద్రత లేదా నిరుద్యోగ ప్రయోజనాలు అందుతాయి. ఆరోగ్య సంరక్షణ కోసం జీడీపీలో 8-10 శాతం దాకా ఖర్చు చేస్తున్న దేశాలవి. భారత్‌లో ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 1 శాతం మాత్రమే.

కాలినడకన బయలుదేరి కొందరు మధ్యలోనే కూలబడిపోతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాలినడకన బయలుదేరి కొందరు మధ్యలోనే కూలబడిపోతున్నారు

విదేశాల్లో మాదిరిగా సౌకర్యాలు, వసతులు ఉన్న భారత ప్రజలకు లాక్‌డౌన్‌ విధించాలనే వ్యూహం పనిచేస్తుంది. నెలనెలా ఆదాయం వచ్చేవారికి, పొదుపు చేసుకున్న వారికి లాక్‌డౌన్‌ను ఎదుర్కొనే ఆర్థిక స్తోమత ఉంటుంది. ఇంట్లో నిరంతర నీటి సదుపాయం (తరచూ సబ్బుతో చేతులు కడుక్కునేందుకు) ఉన్నవారు బయటకు వెళ్లకుండా ఉంటే వైరస్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ప్రజలు రోజుల తరబడి ఇళ్లలోనే ఉండటం వల్ల విసుగు చెందుతారు కాబట్టి, దూరదర్శన్‌లో రామాయణం సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, దేశ జనాభాలో 30 శాతం మందికి మాత్రమే సౌకర్యవంతంగా టీవీలు చూసే వీలుంది.

మిగతా 70 శాతం మంది ఇరుకైన ఇళ్లలో నివసిస్తున్నారు. ఆ ఇళ్లలో కుటుంబ సభ్యులందరూ సౌకర్యవంతంగా, సామాజిక దూరం పాటిస్తూ ఉండటం కష్టం. కరోనావైరస్ వ్యాప్తి మూడో దశకు (సామూహిక సంక్రమణ)కు చేరే ప్రమాదం కూడా ఎక్కువ. (ముంబయిలోని ధారావి మురికి వాడను అందుకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు).

లాక్‌డౌన్ వారి జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. రోజూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. వారిలో చాలామంది వలసకార్మికులుగా ఎక్కడెక్కడో పనిచేసుకుంటూ బతికేవాళ్లే. సొంతూళ్ల నుంచి వందల కిలోమీటర్ల దూరం వెళ్లి బతుకుతున్నారు. కానీ, లాక్‌డౌన్‌కు ముందు వారంతా ఇళ్లకు వెళ్లిపోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సమయం నాలుగు గంటలు మాత్రమే.

వారిలో చాలా మంది అర్ధాకలితో గడిపేవారు ఉన్నారు, సరైన జీవనోపాధి ఉండదు. లాక్‌డౌన్‌తో ఆ పేదల జీవితాలు తలకిందులయ్యాయి. దాంతో, వందల కిలోమీటర్ల దూరమైనా సొంతూళ్లకు కాలినడకన వెళ్లాలని వేలాది మంది నిర్ణయించుకున్నారు.

ఆహార భద్రత వారి ప్రాథమిక అవసరం. పేదలకు మూడు నెలల పాటు రెట్టింపు రేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం స్వాగతించాల్సిన విషయం. కానీ, ఆ ప్రయోజనాలు పొందాలంటే ముందు వారు తమ ఇళ్లకు చేరుకోవాలి కదా.

లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో వారికి పాఠశాలల్లోనో, కమ్యూనిటీ హాల్స్‌లోనో తాత్కాలిక ఆశ్రయం కల్పించి, ఆహారం (కమ్యూనిటీ వంటశాలల ద్వారా) అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది.

వలసకార్మికులు

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, వలసకార్మికులు

ఆహార మంత్రిత్వ శాఖ దగ్గర బోలెడన్ని అదనపు నిల్వలు ఉన్నాయి. కాబట్టి, అందులో కొంత ఈ పేదలకు పంచొచ్చు. అందుకు ఇంకా సమయం ఏమీ మించిపోలేదు.

ఒకవేళ, కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న ఏకైక పరిష్కారం లాక్‌డౌన్ మాత్రమే అనిపిస్తే, బస్సులు, రైళ్లను నిలిపివేయడానికి ముందు వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకునేందుకు 2-4 రోజుల సమయం ప్రభుత్వం ఇచ్చి ఉండాల్సింది. ఆ అవకాశం ఇచ్చి ఉంటే, వారికి కనీసం తలదాచుకునేందుకు నీడ, ఆకలి తీర్చుకునేందుకు కొంత ఆహారమైనా దొరికేది.

వారి గురించి ముందుగా ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వలసకార్మికుల కుటుంబాలు, పిల్లాపాపలతో, కొద్దిపాటి వస్తువులను భుజాన వేసుకొని కాలినడకన బయలుదేరిన దృశ్యాలు కనిపించాయి. బస్సులు లేవు, రైళ్లు లేవు, ఆహారం లేదు... కేవలం నీళ్లు తాగుతూ కాలినడకన సుదూర ప్రయాణం చేయలేక కొందరు సాయం కోసం ప్రభుత్వాలను వేడుకున్నారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి పేదలకు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించారు కానీ, వీరికి ఆహారం గురించి, ఆశ్రయం కల్పించడం గురించి మాత్రం హామీ ఇవ్వలేదు.

ప్రభుత్వం నిరుపేదలకు ఆహారం, నగదు సహాయం కలిపి ఇవ్వాల్సిన అవసరం ఉంది. జన్ ధన్ యోజన ఖాతాలు ఉన్న మహిళలకు రూ.500 నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, అది సరిపోదు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులను ఆపేశారు. కాబట్టి, ఈ పథకం కింద పనిచేసే కూలీలకు వచ్చే మూడు నెలల పాటు ప్రభుత్వం ప్రతినెలా 10 రోజుల చొప్పున వేతనం చెల్లించాలి. అ తరువాత వారికి పని కల్పించొచ్చు.

ఇది ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, సామాజిక సవాల్ కూడా. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతల మనసును ఇది గాయపరచొచ్చు. కానీ, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తమకు అండగా ఉంటాయన్న ఆలోచనతోనే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ బాధ్యతకు దాతృత్వం ప్రత్యామ్నాయం కాదు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు, లండన్ నుంచి తిరిగొచ్చి, స్వీయ నిర్బంధంలో ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి, బయట తిరిగిన ‘విద్యావంతులను’ కూడా మనం ఉపేక్షించొద్దు. మరో షాకింగ్ విషయం, కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్నందున ఒక డాక్టర్‌ను ఇల్లు ఖాళీ చేయాలని యజమాని ఆదేశించడం. ఈ విపరీత ధోరణిని అర్థం చేసుకోవడం కష్టం.

వలస కార్మికులు పడుతున్న కష్టాలు, కొన్నిచోట్ల కొందరు పోలీసులు పాల్పడుతున్న దురాగతాలకు సంబంధించిన దృశ్యాలతో మన ఫోన్ల తెరలన్నీ నిండిపోయాయి. మరి, ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియకుండా ఉంటాయా? తెలియకపోతే, లాక్‌డౌన్‌ను ధిక్కరించే వారిని ఉంచేందుకు స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చేయాలన్న ఆలోచన గురించి ఏం చెబుతారు? అదే సమయంలో ఒక మంత్రి ఇంట్లో రామాయణం చూస్తున్నానంటూ ఫోటోను ట్వీట్ చేయడం గురించి ఏమంటారు?

సమస్య ఏంటంటే, ఈ దేశ జనాభాలో దాదాపు 70 శాతం మందిని విధాన రూపకల్పన ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవడంలేదు. విధాన రూపకర్తలకు వారు కనిపించరు. సున్నితమైన పాత్రికేయులను, చిన్న, సన్నకారు రైతులను కూడా వారు పట్టించుకోరు. భూమిలేని పేద కూలీలు వాళ్లకు అసలే కనిపించరు. లాక్‌డౌన్ వల్ల ఇప్పుడు అకస్మాత్తుగా వారిలో చాలామంది మనకు తొలిసారి కనిపిస్తున్నారు.

అయితే, వలస కార్మికులను ఆదుకునేందుకు చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో ఆశలు పెరుగుతున్నాయి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

వలస కార్మికులందరికీ ఆశ్రయం కల్పించి, ఆహారం అందిస్తామని, వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ప్రతి వలస కార్మికుడికీ రూ.500 చొప్పున నగదు సాయంతో పాటు, బియ్యం లేదా గోధుమ పిండి పంపిణీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో 5 రూపాయల భోజన కేంద్రాలు, కేరళ, తమిళనాడులో కమ్యూనిటీ వంటశాలలు (అమ్మ క్యాంటీన్లు వంటివి) వాటితో పేదల కడుపు నింపుతున్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

బస్సుల్లో చిక్కుకుపోయిన వారికి రాజస్థాన్ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ఒడిశా షెల్టర్లు ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చేవారికి శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తారు, ఆహారం అందిస్తారు.

ఆరోగ్యం విషయానికి వస్తే, వైద్య సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేటు ఆస్పత్రులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. మిగతా రాష్ట్రాల్లోనూ అలా చేయాల్సి ఉంది.

ఇన్నాళ్లూ ఈ దేశంలో ప్రభుత్వాలు చేసిన అతిపెద్ద తప్పు, వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఖర్చు చేయకపోవడమేనని అంగీకరించాల్సిన సమయం ఇది. రక్షణ విమానాల తయారీ, భారీ వంతెనల నిర్మాణం లాగే, వైద్య సదుపాయాలను విస్తరించడం ద్వారా కూడా జీడీపీ వృద్ధి రేటును పెంచవచ్చనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్లూ మన ప్రభుత్వాలు ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి పెట్టి ఉంటే, ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరింత బాగా సన్నద్ధమై ఉండేవాళ్లం.

దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఒక సమాజంగా, భవిష్యత్తు కోసం మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నామో అందరూ ఆలోచించాలి. సమానత్వ, న్యాయ మూలాలతో కూడిన సున్నితమైన సమాజం కావాలా? లేదా మనం ప్రస్తుతం జీవిస్తున్నట్లుగానే (కులం, మతం, వర్గం, లింగం అనే బేధాలతో కూడిన సమాజం) ఉండిపోదామా? అన్నది ఆలోచించాలి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)