కరోనావైరస్: ఈ వీడియోలో పోలీసులపై ఉమ్మింది తబ్లీగీ జమాత్‌కు చెందిన వ్యక్తేనా? - FactCheck

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కీర్తి దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మార్చిలో జరిగిన తబ్లీగీ జమాత్ ధార్మిక కార్యక్రమానికి హాజరైన వారికి కరోనావైరస్ వ్యాపించిన తర్వాత దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఈ వైరస్ వల్ల చనిపోయిన 56 మందిలో 15 మందికి జమాత్‌తో లింకులు ఉన్నట్టు బయటపడ్డాయి. మొత్తం 2 వేల మందికి కరోనావైరస్ వ్యాపించగా వాటిలో 400 కేసులు తబ్లీగీ జమాత్‌కు సంబంధించినవే.
కానీ, ఈ విషయం బయటికొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల వాదనలు కనిపిస్తున్నాయి.
వాటితోపాటూ, జమాత్‌లో పాల్గొని కరోనా పాజిటివ్ వచ్చిన కొందరు, ఆ వైరస్ వ్యాపించేలా పోలీసులపై ఉమ్మినట్లు ఒక వీడియో షేర్ చేస్తున్నారు.
గురువారం సాయంత్రం ట్విటర్‌లో ఒక యూజర్ 27 సెకన్ల ఈ వీడియోను పెట్టి “ఆధారాలు కావల్సిన వారు ఈ వీడియోను చూడండి” అని ట్వీట్ చేశాడు.

ఫొటో సోర్స్, Twitter
ట్విటర్‌లో ఈ వీడియోను 81 వేల మందికి పైగా చూశారు. దాదాపు 4 వేల మంది రీట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ ఇప్పుడు డెలిట్ అయ్యింది.
దీనిని, ఫేస్‌బుక్‌లో కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు. మేఘరాజ్ చౌధరి అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను రెండు లక్షల మంది చూశారు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతడికి అటూఇటూ, ఎదురుగా పోలీసులు కూర్చుని కనిపిస్తారు. ఆ వ్యక్తి ఎదురుగా కూర్చున్న పోలీసుపై ఉమ్ముతాడు. ఆ తర్వాత పోలీసులు అందరూ లేచి అతడిని కొడతాడు.
బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా శబ్దాలు వినిపిస్తాయి. వీడియో అక్కడితో ముగుస్తుంది. ఈ వీడియోను నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ ఘటనకు సంబంధించినదిగా చెబుతూ షేర్ చేస్తున్నారు.
నిజానికి, బుధవారం పీటీఐ, ఏఎన్ఐ రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 167 మందిని తుగ్లకాబాద్‌లో ఉన్న రైల్వే క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. అక్కడ వీరు డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాదు, వారిపై ఉమ్మారు కూడా. కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియోను ఆ వార్తతో లింకుపెట్టి షేర్ చేస్తున్నారు.
బీబీసీ అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది. ఈ వీడియోలో చెబుతున్న వాదన సరైనదేనా అని తెలుసుకోడానికి ప్రయత్నించింది.


ఈ వీడియోపై మొదట ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే తబ్లీగీ జమాత్ వారు అందరినీ డీటీసీ బస్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. కానీ, వీడియోలో కనిపిస్తున్న ఇది పోలీస్ వ్యాన్‌లా ఉంది.
అందులో వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి కనిపిస్తున్నారు. అతడు కరోనా పాజిటివ్ అయితే, మెడికల్ పరీక్షల కోసం తీసుకెళ్తుంటే, ఆ వాహనంలో మెడికల్ స్టాఫ్ ఒక్కరు కూడా ఎందుకు లేరు.
ఈ వీడియో ఫ్రేమ్ ఉపయోగించి మేం రివర్స్ సెర్చ్ చేసినప్పుడు, మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఒక వీడియో దొరికింది.
2020 మార్చి 2న పబ్లిష్ చేసిన వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం ఒక అండర్ ట్రయల్ ఖైదీ తనను తీసుకెళ్తున్న పోలీసులతో గొడవ పడ్డాడు. వారిపై ఉమ్మాడు. నిజానికి, ఇంట్లో వాళ్లు తన కోసం తీసుకొచ్చిన భోజనం తినడానికి అనుమతించలేదనే కోపంతో అతడు ఇదంతా చేశాడు.
ఈ వీడియోను మరింత సెర్చ్ చేసినపుడు మాకు మహారాష్ట్ర టైమ్స్, ముంబయి మిర్రర్‌లో కూడా ఇదే వీడియో కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముంబయి మిర్రర్‌లో 2020 ఫిబ్రవరి 29న ఈ వీడియోను షేర్ చేశారు.
అందులో ఉన్న వివరాల ప్రకారం ఇందులో అలా చేసిన వ్యక్తి పేరు మొహమ్మద్ సుహైల్ షౌకత్ అలీ. వయసు 26 ఏళ్లు. ఇతడిని విచారణ కోసం ముంబయి కోర్టుకు తీసుకెళ్లారు. అతడి కుటుంబ సభ్యులు సుహైల్ కోసం ఇంటి భోజనం తీసుకొచ్చారు. కానీ పోలీసులు అది తిననివ్వకుండానే అతడిని తీసుకెళ్లిపోయారు.
దాంతో కోపమొచ్చిన అతడు పోలీసులతో గొడవపడ్డాడు. వాళ్లపై ఉమ్మాడు. తర్వాత పోలీసులు షౌకత్ అలీని కొట్టారు.
నిజానికి, ఈ వీడియో మొత్తం ఒక నిమిషం 25 సెకన్లు ఉంది. ఇందులో షౌకత్ అలీ పోలీసులతో గొడవపడడం, వారిని బూతులు తిట్టడం కూడా వినిపిస్తుంది.
కానీ, గురువారం నాడు వైరల్ అయిన వీడియో 27 సెకన్లు మాత్రమే ఉంది. నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లీగీ జమాత్‌తో దీనికి లింకు పెడుతున్నారు.
బీబీసీ పరిశోధనలో ఇది దిల్లీది కాదని, ముంబయికి సంబంధించిన ఒక పాత వీడియో అని తేలింది. దీనికి తబ్లీగీ జమాత్ లేదా కరోనా వైరస్ కేసులతో ఎలాంటి సంబంధం లేదని, దీనిని షేర్ చేస్తూ చెబుతున్నవి కూడా పూర్తిగా అబద్ధం అని గుర్తించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ఇండియా లాక్డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








