కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ

త్రీడీ ప్రింటింగ్‌తో తయారు చేసిన వాల్వులు

ఫొటో సోర్స్, Isinnova

    • రచయిత, జోయ్ క్లెయిన్‌మన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీలో వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో, కొన్ని ఆస్పత్రుల్లో వైద్య పరికరాలకు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ కొందరి ప్రాణాలను కాపాడుతోంది.

బ్రేషా పట్టణంలోని ఆస్పత్రి ఐసీయూలో 250 మంది కరోనావైరస్ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే, అందులో రోగులకు కృత్రిమ శ్వాస అందించేందుకు వాడే వాల్వుల (కవాటాలు) కొరత ఏర్పడింది.

దాంతో, ఓ త్రీడీ ప్రింటర్ కంపెనీ హుటాహుటిన 24 గంటల వ్యవధిలోనే 100 వాల్వులను తయారు చేసి ఇచ్చింది.

ఐసీయూలో ఉన్న రోగులకు మెషీన్లతో కృత్రిమ శ్వాస అందించేందుకు ఈ వాల్వులను వాడతారు. ఒక్కో వాల్వును గరిష్ఠంగా ఎనిమిది గంటలపాటు వాడొచ్చు.

మొదట వాల్వు నమూనాను డిజైన్ చేసేందుకు మూడు గంటలు పట్టింది. ఇలా తయారు చేసేందుకు ఒక్కో వాల్వుకు 80 రూపాయల కంటే తక్కువే ఖర్చవుతోంది.

"ఎప్పుడూ వాల్వులను సరఫరా చేసే సంస్థ డిమాండ్ అధికంగా ఉండటంతో తొందరగా అందివ్వలేక చేతులెత్తేసిందని ఓ జర్నలిస్టు ద్వారా తెలిసింది. దాంతో హుటాహుటిన త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో వాటిని రూపొందించాలని నిర్ణయించాం. మూడు గంటల్లోనే వాల్వు నమూనాను తయారు చేశాం" అని ఈజ్ఇన్నోవా సంస్థ సీఈవో క్రిస్టియన్ ఫ్రకాసి చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

"మేం తయారు చేసిన తొలి వాల్వును ఆస్పత్రికి తీసుకెళ్లాక ఒక రోగికి అమర్చి పరీక్షించారు. అది బాగా పనిచేస్తోందని వైద్యులు చెప్పారు. వెంటనే పరుగుపరుగున మా కంపెనీకి వెళ్లి మరిన్ని వాల్వులను తయారు చేయడం ప్రారంభించాం" అని మెకానికల్ ఇంజినీర్ రోమయోలి బీబీసీతో చెప్పారు.

ఈజ్ఇన్నోవా కంపెనీకి ఆరు త్రీడీ ప్రింటర్లు ఉన్నాయి. ఒక్కో వాల్వు తయారీకి దాదాపు గంట సమయం పడుతుంది. అయినా, ఈ ఒక్క సంస్థ తయారు చేసే వాల్వులతో కొరత తీరదు.

అందుకే, ఇప్పుడు లొనాటి అనే మరో త్రీడీ ప్రింటింగ్ కంపెనీ కూడా వాల్వుల తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.

కృత్రిమ శ్వాసకు వాడే వాల్వులు

ఫొటో సోర్స్, Isinnova

ఫొటో క్యాప్షన్, ఈ వాల్వులు 10 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.

"ఈ వాల్వులకు 0.8 మి.మీ. కంటే సన్నని రంధ్రాలు, గొట్టాలు ఉంటాయి. కాబట్టి, వాటిని ప్రింట్ చేయడం అంత సులువు కాదు. పైగా అవి ఏమాత్రం కలుషితం కాకుండా జాగ్రత్తపడాలి. చాలా సున్నితమైన పరికరం అది" అని ఫ్రకాసి అంటున్నారు.

"తాజాగా మరో ఆస్పత్రి కూడా వాల్వులు కావాలని మమ్మల్ని సంప్రదించింది. మేం రెండు రోజుల నుంచి నిద్రలేకుండా పనిచేస్తున్నాం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)