ఒక వ్యక్తి ఎందుకు ఉన్మాదిగా మారతాడు? మంచి ఉన్మాదులు కూడా ఉంటారా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రొఫెసర్ జిమ్ ఫాలన్ ఓ మంచి ఉన్మాది (సైకోపాత్). అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మానసిక వైద్య శాస్త్రం, మానవ ప్రవర్తన విభాగంలో ఆయన ప్రొఫెసర్.
అనేక మంది హంతకుల మెదడు స్కానింగ్‌లను విశ్లేషిస్తూ ఆయన సుదీర్ఘ కాలంగా అధ్యయనం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ల్యాబ్ టెక్నీషియన్లు ఆయనకో స్కానింగ్ కాపీ ఇచ్చారు. దానిని నిశితంగా పరిశీలించిన ఫాలన్... "ఈ స్కానింగ్ రిపోర్టు ఎవరిదో కానీ, ఆ వ్యక్తి బహిరంగ సమాజంలో తిరగకూడదు. అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇంత ప్రమాదకర ఉన్మాద లక్షణాలను నేనెప్పుడూ చూడలేదు" అని అన్నారు.
అప్పటి వరకు ఆ స్కానింగ్ రిపోర్టు ఎవరిదో ఆయనకు తెలియదు. దానిపై పేరు కనిపించకుండా అతికించి ఉన్న ట్యాగ్‌ను తొలగించడంతో అది తనదేనని ఆయనకు తెలిసింది.

సైకోలు అందరూ ప్రమాదకరమేనా?
ఫాలన్ ఎవరినీ చంపలేదు. అంతేకాదు, ఆయన తనను తాను "మంచి వ్యక్తి"గా అభివర్ణిస్తారు. మరి, ఆయన మానసిక రోగి ఎలా అవుతారు?
"నేను సమాజానికి ఉపయోగపడే మానసిక రోగిని. సాధారణంగా ఉన్మాదులు అంటే వాళ్లేం చేస్తున్నారో విచక్షణ ఉండదు. ఇతరులకు హాని కలిగిస్తుంటారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు, నేరాలకు పాల్పడుతుంటారు. నాలో అలాంటి లక్షణాలు లేవు" అని ఫాలన్ అంటున్నారు.
సగటున ప్రతి 100 మందిలో ఒకరు సైకోపాత్ ఉంటారని అంచనా.
హింసాత్మక నేరాలకు పాల్పడే చాలామంది ఉన్మాది అయ్యుంటారు. కానీ, ఉన్మాదులందరూ హింసాత్మక నేర ప్రవృత్తి కలిగి ఉండరని చెప్పేందుకు ఫాలన్ ఓ ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
సైకో మెదడు
ఉన్మాద లక్షణాలు పుట్టుకతోనే వస్తాయా? లేక పెంపకంలో లోపాల వల్ల ఉన్మాదులుగా మారతారా?
హింసాత్మక దాడులకు పాల్పడే మానసిక రోగులు, సాధారణ వ్యక్తుల మెదడు స్కానింగ్‌లను ఫాలన్ నిశితంగా అధ్యయనం చేశారు. వారి మెదళ్లలో కొన్ని భాగాల్లో జరిగే ప్రక్రియల్లో తేడాలను ఆయన గుర్తించారు.
ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో మెదడులోని ముందు భాగాలు కీలకంగా పనిచేస్తాయి. నైతిక విలువల గురించి ఆలోచించేటప్పుడు కూడా ఈ భాగాలు చురుకుగా పనిచేస్తాయి. అయితే, హింసాత్మక ప్రవృత్తి కలిగిన సైకోల మెదడులోని ఈ ప్రదేశాల్లో 'గ్రే మ్యాటర్' తక్కువగా ఉన్నట్లు తేలింది.
సైకోల మెదడులో అమిగ్దల భాగం కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా భయం, ఆందోళనల లాంటి భావోద్వేగాలతో ఈ భాగానికి సంబంధం ఉంటుంది.
మెదడులోని ఆ భాగాలను ఉత్తేజపరచడంలో మానసిక రోగులు విఫలమవుతారు. దాంతో, క్రమంగా ఆ భాగాల్లో చురుకుదనం తగ్గిపోతుంది.
ఈ మార్పులను చిన్న వయస్సులోనే గుర్తించవచ్చు. ఈ రుగ్మతకు జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. పెంపకం తీరు, పెరిగే వాతావరణం కూడా అందుకు కారణం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఫాలన్ కుటుంబ చరిత్రను పరిశీలిస్తే, ఆయన రక్త సంబంధీకుల్లో హత్యారోపణలు ఎదుర్కొన్నవారు ఏడుగురు ఉన్నారు.
1670లలో ఫాలన్ ముత్తాతపై హత్య కేసు నమోదైంది. అమెరికాలో ఒక వ్యక్తి తన తల్లిని చంపిన మొదటి కేసు అది.
1882లో ఫాలన్ కజిన్... లిజ్జీ బార్డెన్ తన తండ్రిని, సవతి తల్లిని గొడ్డలితో నరికిచంపారన్న నేరాభియోగం ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జన్యుపరమైన కారణాలు బలంగా ఉండి, చిన్నవయసులో వేధింపులకు గురైనవారు ప్రమాదకర వ్యక్తులుగా మారి ఎక్కువగా నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని ఫాలన్ అంటున్నారు.
"ఒకవేళ మన పూర్వీకులకు నేరచరిత్ర ఉన్నప్పటికీ, మనం చిన్నతనంలో వేధింపులకు గురికాకుంటే ప్రమాదకర ఉన్మాదులుగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం జన్యుపరమైన సంబంధాలు మన మానసిక ప్రవర్తనపై అంతగా ప్రభావం చూపవు" అని ఆయన వివరించారు.
తన పూర్వీకులకు నేరచరిత్ర ఉన్నప్పటికీ, తనకు బాల్యంలో ఎలాంటి వేధింపులూ ఎదురుకాలేదని, అందుకే తాను 'మంచి ఉన్మాది' అయ్యానని ఫాలన్ అంటున్నారు.
"నా బంధువులు, స్నేహితులు ఏడుస్తున్నప్పుడు చూస్తుంటాను. నేను మాత్రం ఏడవను. అయితే, వారి బాధను, భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటాను. వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంటాను. ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది నాకు బాగా తెలుసు. భావోద్వేగాల విషయంలో మాత్రమే అంతగా స్పందించను" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి
- దక్షిణాఫ్రికా: 'నాజీ మండేలా' చిత్రంపై వివాదం
- చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని 10 కరచాలనాలు
- సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









