నా చిన్నప్పుడే మా అమ్మను నాన్న చంపేశాడు... ఎందుకంటే?

తస్నీమ్ లోవ్‌
ఫొటో క్యాప్షన్, తల్లి ఫొటోతో తస్నీమ్ లోవ్‌

ఇది పదహారేళ్ల భార్యను చంపిన ఓ భర్త కథ. కుమార్తె తస్నీమ్ లోవ్‌కు 16 నెలల వయసున్నప్పుడు ఆమెను ఒక దుప్పటిలో చుట్టి చెట్టు కింద పెట్టేసి భార్యను, ఆమె కుటుంబాన్ని చంపిన అజర్ అలీ మెహ్మూద్ అనే భర్త కథ.

ఇప్పుడు తస్నీమ్ పెద్దదైంది.. తన తల్లి లూసీకి ఏమైందో పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంది.

ఏం తెలుసుకుందో ఆమె మాటల్లోనే..

''మా తాత దగ్గర పెరిగాను నేను. చిన్నప్పుడు స్కూలులో పిల్లలంతా నాపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. మీ తాత దగ్గర ఎందుకున్నావ్.. మీ అమ్మానాన్న ఏరీ? అని నన్ను అడిగేవారు'' అంటూ తస్నీమ్ తల్లి లేని తన బాల్యాన్ని తలచుకుని బాధపడ్డారు.

''వాళ్లకేం చెప్పాలో నాకు తెలియదు. మా నాన్న హంతకుడు అని చెప్పలేను''

తస్నీమ్ తల్లి లూసీ లోవ్
ఫొటో క్యాప్షన్, తస్నీమ్ తల్లి లూసీ లోవ్

''గర్భంతో ఉన్న అమ్మను ట్యాక్సీ డ్రైవరుగా పనిచేసే నాన్న అజర్ అలీ మెహ్మూద్ చంపేసేటప్పటికి నా వయసు 16 నెలలు. అమ్మను చంపేశాడు కానీ నన్నేమీ చేయలేదు.

అమ్మ లూసీ, ఆమె కడుపులో ఉన్న బిడ్డ, అమ్మమ్మ లిండా, పిన్ని సారాలు తగలబడిపోతున్న ఇంట్లోనే కాలిపోతున్నప్పుడు నన్ను ఒక దుప్పటిలో చుట్టి ఇంటి బయట ఉన్న యాపిల్ చెట్టు కింద పెట్టాడు.

ఆయన నన్ను బతకనివ్వాలనుకున్నాడు. కానీ, అమ్మను చంపేయడం ద్వారా బతికున్నప్పటికీ నన్నూ చంపేసినట్లయింది.

గృహ దహనంలో చనిపోయిన ముగ్గురు
ఫొటో క్యాప్షన్, గృహ దహనంలో చనిపోయిన ముగ్గురు

2000 సంవత్సరం ఆగస్టులో ష్రాప్‌షైర్‌లోని ట్రెల్‌ఫోర్డ్‌లో ఉన్న మా ఇల్లు తగలబడిపోయింది. ఇంటికి నిప్పు పెట్టింది నాన్నే. అమ్మ, అమ్మమ్మ, పిన్నిని మంటల్లో దహనం చేసిన నేరానికి ఆయనకు 2001లో జీవిత ఖైదు పడింది.

నేను పెరిగి పెద్దదాన్నవుతున్నకొద్దీ నా తల్లిదండ్రులు నాకు మనుషుల్లా అనిపించలేదు.. అదంతా కథలా అనిపించింది.

2018లో 'బీబీసీ త్రీ'తో కలిసి నా కథపై ఒక డాక్యుమెంటరీ తీసే అవకాశం వచ్చినప్పుడు నేను దాన్ని వినియోగించుకున్నాను.

తన తల్లి గురించి.. ఆమె మరణానికి కారణమైన గృహ దహనం గురించి, నా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను.

అజర్ అలీ మెహ్మూద్
ఫొటో క్యాప్షన్, అజర్ అలీ మెహ్మూద్

అప్పటికి అమ్మ వయసు పదిహేనేళ్లే..

మా అమ్మ లూసీ కంటే కొంచెం రంగు తక్కువగా ఉంటాను. కానీ అచ్చుగుద్దినట్లు ఆమెలానే ఉంటానని నేననుకుంటూ ఉంటాను. కానీ, నేను ఆమె గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమెను అమ్మలా చూడలేను. అందుకే ఆమెను అమ్మ అని పిలవాలనుకోను. లూసీ అనే అంటుంటాను. నేను పుట్టేటప్పటికి అమ్మ వయసు 15 ఏళ్లే. అప్పటికి నాన్న వయసు 25. ఇద్దరి వయసు అంతరం.. అంత చిన్న వయసులోనే అమ్మ నాన్నతో రిలేషన్‌షిప్‌లో ఉండి నన్ను కనడంపై ఎందరో ఎన్నో అంటుంటారు కానీ నాకు మాత్రం అదేమీ తప్పనిపించలేదు. బహుశా ఆమె నా అమ్మ కావడం వల్ల కావొచ్చు.

తాత దగ్గరే పెరగడం వల్ల నేను ఆయనకు చాలా క్లోజ్. కానీ, ఎప్పుడూ అమ్మానాన్నల గురించి ఎక్కువగా చెప్పలేదు. ఆయన తన భార్య(తస్నీమ్ అమ్మమ్మ), ఇద్దరు కూతుళ్ల(తస్నీమ్ తల్లి, పిన్ని)ను పోగొట్టుకున్నారు. ఆ తరువాత ఆయన నన్ను పెంచారు.

అమ్మానాన్నల విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి.

అది 2018 మార్చి 11.. ఆ రోజు మాతృ దినోత్సవం. ఆ రోజు సండే మిర్రర్ మొదటి పేజీలో అమ్మ లూసీ ఫొటోతో కథనం ప్రచురించారు.

అది చూసి ఆశ్చర్యపోయాం. అప్పటి ఘటనపై ఏదో కారణంతో మళ్లీ కథనం వేశారనుకున్నాం. ఆ కథనంలో కొత్త సమాచారం ఏమీ ఉండదనుకున్నాను.

ఆ కథనంలో.. టెల్‌ఫోర్డ్‌లో 1980 నుంచి సుమారు వెయ్యి మంది పిల్లలును కొందరు లోబరుచుకున్నారని తెలిపారు. మా అమ్మ లూసీని 14 ఏళ్ల వయసులోనే నాన్న అజర్ ఎలా లోబరుచుకున్నాడో ఆ కథనంలో ఉంది.

తస్నీమ్ లోవ్‌

నాన్న ఎంతగా హింసించేవాడంటే..

ఇదంతా చదివి నేను మొదట అయోమయానికి గురయ్యాను. నా తల్లిదండ్రులకు వయసులో చాలా అంతరం ఉన్నా, మా అమ్మ చిన్నపిల్లే అయినా వారు ఒక బంధంలో ఉండేవారని సరిపెట్టుకున్నాను అంతవరకు. ఇప్పుడు ఈ కథనం వల్ల నాకు వేరే కథ తొలిసారి తెలియడంతో ఆశ్చర్యపోయాను. అదంతా నిజం కాకూడదనుకున్నాను. పత్రికలో తప్పుగా రాసి ఉంటారనుకున్నాను.

ఈ కొత్త కథను అంగీకరించడం నాకు అస్సలు సాధ్యం కాలేదు. దాన్ని జీర్ణించుకోవడానికి నాకు సమయం పట్టింది.

నా గురించి, నా గతం గురించి, మా అమ్మ గురించి నాకు తెలిసిన విషయాలపై ఈ కథనం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది.

నాన్న మీద జరిగిన విచారణకు సంబంధించిన కోర్టు పత్రాలను పరిశీలించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో తెలుసుకోవాలనుకున్నాను.

ఆ కేసులో వాదనలకు సంబంధించిన పత్రాలు అయోమయంగా ఉన్నాయి.

ఆ పత్రాల్లో నాన్న, అమ్మల మధ్య వయసు అంతరంపై ప్రస్తావన ఉంది. ఇద్దరి మధ్యా పదేళ్ల వయస్సు తేడా ఉంది.

అమ్మ స్నేహితుల వాంగ్మూలాలు ఆ పత్రాల్లో ఉన్నాయి. వాటి ప్రకారం నాన్న అమ్మ దేహాన్ని పరీక్షగా చూసేవాడని, ఆమె ఇతర పురుషులు ఎవరితోనైనా గడిపిందేమోనని అనుమానించేవాడని తెలిసింది.

చర్చియార్డులోని ఇతర కొందరు పురుషులతో ఆమెకు లైంగిక సంబంధాలున్నాయన్న అనుమానాలుండేవని.. ఒక ముఠాగా ఆమెను లైంగికంగా దోచుకున్నారా అన్నది తమకు స్పష్టంగా తెలియదని వారు చెప్పారు.

నేను, తాతయ్య దీనిపై కొంత మాట్లాడుకున్నాం. నువ్వు ఏమీ చేయలేకపోయావెందుకు అని తాతయ్యను ప్రశ్నించాను. అమ్మానాన్నల మధ్య సంబంధాన్ని ఎందుకు అంగీకరించలేదని అడిగాను.

మీ నాన్నపై నాకంత పెద్దగా ఆసక్తి ఉండేది కాదని తాతయ్య నాతో చెప్పాడు.

తాతయ్య జార్జితో తస్నీమ్
ఫొటో క్యాప్షన్, తాతయ్య జార్జితో తస్నీమ్

రేప్ చేయబోయినా..

అమ్మానాన్న ఎందుకంతగా వాదులాడుకునేవారు. నాన్న అమ్మ నుంచి సెక్స్ డిమాండ్ చేయడం వల్లే గొడవ పడేవారా అని తాతయ్యను అడిగాను.

''చాలాసార్లు మీ నాన్న ఇంటి డాబాపైకి వెళ్లేవాడు'' అని చెప్పారాయన. ''ఒక రోజు ఎవరో రేప్.. రేప్.. అని అరుస్తుండడంతో నేను పైకి వెళ్లి తలుపు తన్నాను. మీ నాన్న ఆ గది నుంచి బయటకు వచ్చి పారిపోయాడు. పక్కింటమ్మాయి బాయ్‌ఫ్రెండ్ కూడా ఆ వెంటే పారిపోయాడు'' అని చెప్పారు తాతయ్య.

మరెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అడిగాను.

''మీ అమ్మ సహాయం కోసం అరిచానని చెప్పలేదు. మాకు చెబితే ఏమైనా చేసేవాళ్లం. కానీ, మీ అమ్మ ఏమీ చెప్పలేదు'' అన్నారాయన.

అమ్మ విషయంలో వీళ్లంతా నిర్లక్ష్యం చేశారనిపించింది. తాతయ్య, అమ్మమ్మలకు అంత అవగాహనా లేదు.

మరి వీటన్నిటిపైనా నాన్నేమనుకుంటున్నాడో తెలుసుకోవాలనిపించింది నాకు. ఇంటిని తగలబెట్టి అమ్మ, పిన్ని, అమ్మమ్మ చావుకు కారణమవడంపై ఆయనేమైనా పశ్చాత్తాపపడుతున్నాడా అన్నది తెలుసుకోవాలనుకున్నాను. పదహారేళ్ల వయసున్నప్పుడు నాన్నను కలవడానికి జైలుకు వెళ్లాను. అంతకుముందే వెళ్లాలనుకున్నాను కానీ నాకు పదహారేళ్లు వచ్చేవరకు ఆయన్ను కలిసే వీలులేదని కోర్టు ఆదేశాలుండడంతో వెళ్లలేకపోయాను.

అతడిని ఒక మనిషిగా చూడాలనుకున్నాను, అతడి అభిరుచులేంటో, ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకోవాలనుకున్నాను.

అతడి గురించి నా ఆలోచనల్లో కొంత గందరగోళం ఉంది. నేనడిగినవాటికి అతడు పూర్తి సమాధానాలివ్వడం లేదని అర్థమైంది. ఆయన చెప్పినవి రికార్డు చేసినవి మళ్లీ వినాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో మనసు విప్పి మాట్లాడాడు.. మరికొన్నిటిని దాచుకున్నాడు. నేనేమడిగానన్నదాన్ని బట్టే అతడి సమాధానాలున్నాయి. అయినా నాన్నను కలుసుకున్నందుకు సంతోషంగానే అనిపించింది. కలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది.

జార్జ్
ఫొటో క్యాప్షన్, జార్జ్

హత్యానేరంపైనే విచారణ జరిపారు

మా నాన్నను కేవలం ముగ్గురిని తగలబెట్టి హత్య చేసిన నేరంపైనే విచారించి లైంగిక నేరాలపై విచారించకపోవడం న్యాయ వ్యవస్థ వైఫల్యం.

నిందితులను ప్రతి నేరంలోనూ విచారించి తీరాల్సిందే. ఎందుకలా చేయలేదని పోలీసులను అడిగాను. కానీ, ఇప్పుడున్న పోలీసులు వేరు అప్పుడు ఆ కేసును విచారించిన పోలీసులు వేరు. అయితే, అమ్మకు సంబంధించిన డైరీలను వారు నాకిచ్చారు.

అవి చదువుతుంటే ఆమె నాకు ఎంతో సన్నిహితురాలిగా అనిపించింది. అప్పట్లో నాన్న ఏం చేశాడన్నది అవగాహన చేసుకోవడానికీ ఆ డైరీలు ఉపయోగపడ్డాయి.

నాన్న ఇప్పుడు పెరోల్ తీసుకోవడానికి అర్హుడు. అమ్మను లైంగికంగా వేధించినందుకు ఆయన ఎన్నడూ విచారణ ఎదుర్కోలేదు.

ఈ డాక్యుమెంటరీ చేసే ప్రయత్నంలో తెలుసుకున్నవన్నీ నాకు వేదనను కలిగించాయి, నాకు ఇది కష్టకాలం. కానీ, ఈ డాక్యుమెంటరీ వల్లే మా అమ్మంటే మరింత ఇష్టం పెరిగింది. నా గతమేంటో అంతా తెలిసింది. మా తాతకూ మరింత దగ్గరయ్యాను. బాలలపై లైంగిక దోపీడీపైనా నాకు అవగాహన ఏర్పడింది. ప్రజలను మరింత అప్రమత్తం చేయడానికి అవకాశం దొరికింది.''

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)