ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల కిందటి ఎన్‌కౌంటర్ నుంచి తెలంగాణలో తాజా ఘటన వరకు.. పోలీసుల కథనాల్లో ఎంత నిజముంది - అభిప్రాయం

సింబాలిక్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, అలోక్ ప్రసన్న కుమార్
    • హోదా, అడ్వకేట్, సీనియర్ రెసిడెంట్ ఫెలో, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ

ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ఒక కొత్త సమస్యలో చిక్కుకున్నారు. 'దిశ' అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై వారు వినిపిస్తున్నది కట్టుకథని చాలామంది భావిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తంచేస్తున్నవారిలోనూ ఎంతోమంది సరైన న్యాయం చేశారంటూనే ఇవి పక్కా ప్లాన్‌తో చేసిన హత్యలేనంటున్నారు.

అత్యాచార ఆరోపణ ఎదుర్కొంటున్న నలుగురు నిరాయుధులైన నిందితులను (నేరం చేసినట్లు ఇంకా నిరూపణ కాలేదు) హతమార్చడం ఒకరకంగా సరైనదేనంటున్నవారి వాదన ప్రజల ఆలోచనాధోరణి గురించి చెబుతోంది. అది వేరే విషయం అనుకోండి.. కానీ, శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి శిక్షణ పొందిన పోలీసు అధికారులు ఇలాంటి చర్యలను ఎందుకాశ్రయించాల్సించి వచ్చిందన్నది ఆలోచించాల్సిన విషయం.

ఎన్‌కౌంటర్ల పేరిట జరుగుతున్న ఇలాంటి హత్యలకు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన ముస్లింలే లక్ష్యమవుతున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు.

అధికారం, హోదా ఉన్నవారెవరూ ఇలాంటి పోలీస్ ఎన్‌కౌంటర్లలో బాధితులుగా లేరు. అలాంటివారూ లక్ష్యం కావాలని కాదు కానీ, ప్రస్తుత ఘటనలో మరణించిన నలుగురి నేపథ్యం మన నేర న్యాయ వ్యవస్థ స్థితిని చెప్పకనే చెబుతోంది.

కొవ్వొత్తుల ప్రదర్శన

ఫొటో సోర్స్, Getty Images

చట్టప్రకారం చూస్తే ఇలాంటి చర్యలకు పాల్పడే పోలీసులకేమీ న్యాయ రక్షణ దొరకదు. భారత శిక్షాస్మృతి 1860 ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులకు కఠిన శిక్షలున్నాయి.

దోషులను హింసిస్తే ఐపీసీ సెక్షన్ 330, 331 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

2014లో భారత సుప్రీంకోర్టు 'పీయూసీఎల్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం' కేసులో ఇలాంటి ఎన్‌కౌంటర్ హత్యల తరువాత అనుసరించాల్సిన ప్రక్రియ గురించి వివరంగా తెలిపింది.

ఇలాంటి హత్యలపై దర్యాప్తు స్వతంత్రంగా జరగాలని, వీటిపై సవివరమైన నివేదిక దాఖలు చేసి, దాని ఆధారంగా దోషులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరించింది.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులు తమ ఆయుధాలు లాక్కున్నారని, తమపై దాడిచేశారని పోలీసులు చెబితే చట్టం, కోర్టులు ఆ మాటలను సులభంగా నమ్మేయరాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులో స్పష్టంగా చెప్పింది. సరైన రీతిలో దర్యాప్తు చేయాలని, అవసరమైన నేర విచారణ జరపాలని చెప్పింది.

అయినప్పటికీ న్యాయవ్యవస్థలోని లోపాల కారణంగా పోలీసులు ఇలాంటి కేసుల్లో శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు.

తూటా

చత్తీస్‌గఢ్‌లో ఏమైంది..

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2012 నాటి ఎన్‌కౌంటర్ విషయంలో ఏం జరిగింది.. 2012లో సర్కెగూడ పోలీసు కాల్పుల్లో మరణించింది మావోయిస్టులు కారని, స్థానిక ఆదివాసీలేనని విచారణ కమిటీ తేల్చింది.

ఆ మరణాలు హత్యలేనని కమిటీ నివేదిక చెప్పింది. ఏడేళ్ల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కనీస విచారణే ఇంతవరకు మొదలుకాలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏమైంది?

తమిళనాడుకు చెందిన 20 మందిని ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నారన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2015లో కాల్చిచంపారు. నమ్మశక్యంగా లేని దీనిపై తమిళనాడు ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ చేపట్టింది. కమిషన్ దీనిపై ఇచ్చిన నివేదికలో పోలీసుల చర్యను విమర్శించిందే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయలేదు. ఈ కేసు ఏపీ హైకోర్టులో ఇంకా పెండింగులో ఉంది.

సింబాలిక్

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో ఏం జరిగింది..

ఒక్కోసారి న్యాయస్థానాల నుంచి ఆలస్యంగా తీర్పులు వచ్చేనాటికి శిక్ష పడాల్సినవారెవరూ జీవించి కూడా ఉండరు.

ముంబయిలో ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించడంపై 'యశ్వంత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం' కేసులో 2018లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిర్దోషి అని తెలిసినా పోలీసులు ఒక వ్యక్తిని ఓ కేసులో తీసుకెళ్లి హింసించి, కొట్టడంతో పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. దాన్ని కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో ఆ స్టేషన్లోని పోలీసులనందరినీ బాధ్యులుగా పేర్కొంటూ కింది కోర్టు వేసిన మూడేళ్ల శిక్షను ఏడేళ్లకు పెంచింది. అలాంటి కేసుల్లో పోలీసులు ఏమీ మినహాయింపు కాదన్న సందేశాన్ని బలంగా పంపింది సుప్రీంకోర్టు.

అయితే, తీర్పు వెలువడడానికి పాతికేళ్ల కిందట 1993లో ఆ ఘటన జరిగింది. దిగువ కోర్టులో రెండేళ్లు విచారణ జరిగిన తరువాత పోలీసులకు మూడేళ్ల శిక్ష పడింది. అనంతరం బాంబే హైకోర్టులో 13 సంవత్సరాలపాటు ఆ కేసు కొనసాగింది. అనంతరం సుప్రీంకోర్టుకు చేరిన తరువాత 2018లో తీర్పు వచ్చింది.

ఎన్‌కౌంటర్ స్థలం వద్ద పోలీసులు

ఫొటో సోర్స్, Noah seelam

హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటనను జాతీయ మానవహక్కుల సంఘం, తెలంగాణ హైకోర్టు విచారణకు తీసుకున్నాయి. శాంతిభద్రతల నిర్వహణ వ్యవస్థ పనితీరు ప్రజాభిప్రాయ ప్రభావాలకు గురికాకుండా, మౌనం వహించకుండా కనీసం న్యాయాధికారులు వ్యవహరించడం మంచి పరిణామమే. అయితే, సత్వర దర్యాప్తు, తగిన శిక్షలు విధించాల్సిన బాధ్యతా వారిపై ఉంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)