ఆమె గుండె ఆరు గంటలు కొట్టుకోవడం మానేసింది, అయినా ఆమె ప్రాణం పోలేదు..ఏం జరిగింది?

Audrey Schoeman

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గుండె ఆగిపోయిన ఆరు గంటలు ఏం జరిగిందో తనకేమీ గుర్తు లేదని స్కూమన్ చెప్పారు

బ్రిటన్‌ మహిళ స్కూమన్.. గుండె ఆరు గంటల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. అయినా, ఆమె చనిపోలేదు. మళ్లీ మామూలు స్థితికి వచ్చారు. అసలేం జరిగిందంటే...

34 ఏళ్ల ఆండ్రే స్కూమన్ తన భర్తతో కలిసి నవంబర్‌లో స్పెయిన్‌లోని పైరినీస్ పర్వతాలను అధిరోహించేందుకు వెళ్లారు. వాళ్లు ఆ పర్వతాల్లో ఉండగా భారీ ఎత్తున మంచు తుపాను విరుచుకుపడింది. దాంతో ఆమె తీవ్రమైన హైపోథెర్మియాకు గురయ్యారు, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.

శరీరంలో ఉత్పత్తయ్యే ఉష్ణోగ్రత కంటే వేగంగా శరీరం వేడిని కోల్పోయే సమస్యను 'హైపోథెర్మియా' అంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరస్థాయికి పడిపోతుంది. గుండె, నాడీ వ్యవస్థ, ఇతర కీలక అవయవాల పనితీరు దెబ్బతింటుంది.

"ఆ పర్వతాలలో వాతావరణం అత్యంత కఠినంగా ఉంది. తీవ్రమైన చలికి మొదట మాటలు రాక ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత స్పృహ కోల్పోయి పడిపోయాను. శ్వాస ఆడట్లేదు, గుండె కొట్టుకుంటున్నట్లు నాకు తెలియదు" అని ఆమె వివరించారు.

ఆమె భర్త రోహన్ వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించారు. సహాయక సిబ్బంది వచ్చేందుకు చాలా సమయమే పట్టింది. ఆలోగా ఆమెలో కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. దాంతో, ఆమె చనిపోయిందని రోహన్ అనుకున్నారు.

వ్యక్తి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పర్వతాలలోనే తన భార్య చనిపోయిందని రోహన్ అనుకున్నారు

సహాయక బృందం రావడానికి రెండుగంటలు పట్టింది. అప్పటికి ఆమె శరీర ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది.

హుటాహుటిన వాళ్లు ఆమెను బార్సిలోనాలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

"ఆస్పత్రికి చేరేటప్పటికి ఆమె బతికున్నట్లుగా ఎలాంటి సంకేతాలూ లేవు. ఆమె చనిపోయినట్లుగా కనిపించారు. శరీరంలో కదలికలు లేవు. ఉష్ణోగ్రత పడిపోయింది. అయినా, మేము చికిత్స మొదలుపెట్టాం. హైపోథెర్మియాకు లోనైనప్పుడు శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినా, బాధితులు ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుందని మాకు తెలుసు. నిజానికి, ఆమె కోమాలో ఉన్నప్పుడు శరీరం, మెదడు దెబ్బతినకుండా హైపోథెర్మియానే కాపాడింది. ఆమెను మృత్యువు అంచు దాకా తీసుకెళ్లిన ఆ హైపోథెర్మియానే ఆమె ప్రాణాన్ని నిలిపింది" అని డాక్టర్ ఎడ్వార్డ్ ఆర్గుడో వివరించారు.

"శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కాబట్టి ఆమె ప్రాణాలతో ఉండగలిగారు. కానీ, ఒకవేళ సాధారణ శరీర ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే ఆమె చనిపోయేవారు" అని ఆయన చెప్పారు.

ఆమెను ఆస్పత్రికి తీసుకురాగానే హుటాహుటిన ప్రత్యేక మెషీన్‌తో ఆమె శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీసి, దానికి ఆక్సిజన్‌ను కలిపిన తర్వాత మళ్లీ ఆమె శరీరంలోకి ఎక్కించారు.

అప్పటికి ఆమె కోమాలోకి వెళ్లి ఆరు గంటలు అవుతోంది. క్రమక్రమంగా శరీర ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పెరిగింది. అప్పుడు డిఫిబ్రిల్లేటర్‌‌తో గుండెకు ఎలక్ట్రిక్ కరెంట్‌ ఇవ్వగానే ఆమెలో చలనం కనిపించింది. దాంతో అందరిలో ఆశలు చిగురించాయి.

అత్యవసర సేవల సిబ్బందితో ఆడ్రే స్కూమన్, ఆమె భర్త రోహన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అత్యవసర సేవల సిబ్బందితో ఆడ్రే స్కూమన్, ఆమె భర్త రోహన్

12 రోజుల పాటు వైద్యం అందించిన తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. ప్రస్తుతం హైపోథెర్మియా ప్రభావంతో చేతులు, కాళ్లలో చిన్ని చిన్న సమస్యలు మినహా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.

ఇన్ని గంటల పాటు కార్డియాక్ అరెస్ట్‌ రావడం స్పెయిన్‌లో ఇదే తొలిసారి అని వైద్యులు అంటున్నారు.

"అన్ని గంటల పాటు గుండె ఆగిపోయిన కేసులు మేము ఎన్నడూ చూడలేదు. ఆమెలో నాడీ వ్యవస్థ దెబ్బతిందేమో అని ఆందోళన పడ్డాం. కానీ, అదృష్టం కొద్దీ అంతా బాగుంది. ఇదొక అద్భుతం" అని వైద్యులు చెప్పారు.

తనకు ఆ ఆరు గంటల్లో ఏం జరిగిందో ఏమీ గుర్తులేదని స్కూమన్ చెప్పారు.

"మొదటి రెండు రోజులు నేను ఎక్కడ ఉన్నానో నాకేమీ తెలియదు. ఆ తర్వాత ఐసీయూలో స్పృహలోకి వచ్చాను. ఈ చలిలో మళ్లీ ఆ పర్వతాలను అధిరోహించే సాహసం చేయకపోవచ్చు. కానీ, వచ్చే వసంత రుతువులో మళ్లీ ప్రయత్నం చేయగలనని అనుకుంటున్నాను" ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)