డ్వాక్రా గ్రూపు నుంచి పార్లమెంటు వరకు

ఫొటో సోర్స్, facebook/mimichakraborty
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఈసారి ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. రెండు ప్రధాన పార్టీలు మూడొంతుల్లో ఒకవంతు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులుగా మహిళలను బరిలోకి దించడంతో ఈ మార్పు సాధ్యమైంది.
మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తరపున 41 మంది మహిళలు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. టీఎంసీ తరపున మొత్తం 17 మంది గెలిస్తే, అందులో సగం పైగా అంటే 9 మంది మహిళలే.
నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) ఏడుగురు మహిళలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. వీరిలో ఐదుగురు గెలిచారు.
బీజేడీ తరపున మొత్తం ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపీలుగా గెలిచారు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం చూస్తే ఇది గొప్పగా ఉంది.
మహిళలు ఎన్నికల్లో బరిలో బలహీనంగా ఉంటారు అనే వాదనను ప్రస్తుత పరిస్థితి సవాలు చేస్తోంది అని 'శక్తి' బృంద సభ్యురాలు నిషా అగర్వాల్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగేందుకు కృషి చేస్తున్న ఓ స్వతంత్ర సంస్థ 'శక్తి'.
"మహిళలు గెలవలేరు, మహిళలకు టికెట్లివ్వడం వల్ల నష్టమే అనేవి ఇప్పుడు అర్థం లేని వాదనలు. వీటిపై చర్చ జరగాలి. ఇలాంటి మార్పు రావాలంటే మనకు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి నేతలు కావాలి" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Pramila bisoi/facebook
బీజేడీ టికెట్‌తో గెలిచినవారిలో ప్రమీలా బిసోయ్ ఓ సామాజిక కార్యకర్త. ఆమె గత 20 ఏళ్లుగా మహిళల స్వయంసహాయక సంఘాల ఏర్పాటు, నిర్వహణపై కృషి చేస్తున్నారు.
రెండో తరగతి మాత్రమే చదివిన ఆమెకు బీజేడీ టికెట్ ఇవ్వడంతో ఎంపీ కాగలిగారు.
గెలిచిన మిగిలిన మహిళల్లో ఓ డాక్టర్, ఓ సివిల్ సర్వీసెస్ అధికారి, ఓ శాస్త్రవేత్త ఉన్నారు.

ఫొటో సోర్స్, facebook/nusratjahan
మమతా బెనర్జీ పార్టీ తరపున గెలిచిన మహిళల బృందంలో నుస్రత్ జెహాన్, మిమి చక్రవర్తి యువ సినీ నటులు. మరో మహిళ శతాబ్దీ రాయ్ కూడా పాతతరం సినీ నటే. అయితే ఈమె రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చారు. ఇది ఆమెకు వరుసగా మూడో విజయం.
కాకోలీ ఘోష్, మాలా రాయ్ వంటి రాజకీయ సీనియర్లతో పాటు మహువా మొయిత్రా వంటి మహిళలు కూడా ఉన్నారు. మహువా తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి రాహుల్ గాంధీతో కలసి పనిచేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత కాలంలో ఆమె టీఎంసీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు.
రాజకీయాల్లో ప్రవేశించడానికి ఎక్కువ మంది మహిళలకు అవకాశాలివ్వాలని మమతా అనుకుంటారు. అందుకే ఆమె ప్రతి ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు టికెట్లు ఇస్తారు. ఈసారి కూడా మాలా రాయ్, మాజీ బ్యాంకు ఉద్యోగి మహువా మొయిత్రా లాంటి సమర్థులను ఎంపిక చేశారు" అని 'దీదీ: ది అన్‌టోల్డ్ మమతా బెనర్జీ' పుస్తక రచయిత షుతాప పాల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
బరిలో నిలిచిన ప్రముఖులు
జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ కూడా తమ పార్టీ తరపున 50 మందికి పైగా మహిళలకు అవకాశాలిచ్చాయి.
కానీ వారి తరపున పోటీ చేసిన మొత్తం అభ్యర్థులతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. ఈ ఎన్నికల్లో బీజేపీ 12శాతం, కాంగ్రెస్ 13శాతం టికెట్లను మహిళలకు కేటాయించాయి.
బీజేపీ తరపున పోటీ చేసిన 55మంది మహిళల్లో 41 మంది విజయం సాధించారు. అంటే 74శాతం మంది గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన 52మంది మహిళల్లో కేవలం ఆరుగురే గెలిచారు. అంటే 11శాతం మంది మాత్రమే అంచనాలను అందుకున్నారు.
రాజకీయాల్లో మహిళల అదృష్టాన్ని నిర్ణయించడంలో పార్టీకున్న పాపులారిటీ, అభ్యర్థి ప్రతిభ, సామర్థ్యం, పోటీ చేస్తున్న నియోజకవర్గం, ప్రచార వ్యయం... ఇలా చాలా అంశాల పాత్ర ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సోనియా గాంధీలాంటి ప్రముఖులతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా భార్య గీతా కోడా వంటి వారే కాదు, కాంగ్రెస్ తరపున కూడా కొన్ని కొత్త ముఖాలు ఈసారి బరిలో నిలిచాయి.
రమ్య హరిదాస్ తండ్రి ఓ కూలీ, తల్లి కుట్టుపని చేస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రమ్య వామపక్ష సీనియర్ నేతను ఓడించి, కేరళ నుంచి గెలిచిన రెండో దళిత మహిళగా నిలిచారు.
రైతు కుమార్తె ఎస్ జోతిమణి 22 ఏళ్ల వయసులో యూత్ కాంగ్రెస్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు.
ఎప్పుడూ వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించే బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈసారి ఈ అంశంపై సమాధానం చెప్పాల్సి ఉంది.
మహారాష్ట్రనే తీసుకుంటే... ఈ ఎన్నికల్లో గెలిచిన మహిళలు ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్, ఏక్‌నాథ్ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సే, గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే... వీరంతా సీనియర్ పురుష రాజకీయ నాయకుల బంధువులే.
హేమ మాలిని, కిరణ్ ఖేర్, లాకెట్ ఛటర్జీ వంటి సినీ స్టార్లు, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, నిరంజన్ జ్యోతి వంటి మతతత్వ నాయకులకు కూడా బీజేపీ అవకాశం ఇచ్చింది.
అయితే, బీజేపీ తరపున గెలిచిన మహిళల్లో ఈసారి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం స్మృతీ ఇరానీ గురించే. తనపై ఎన్ని విమర్శలు ఉన్నా, కాంగ్రెస్ కంచుకోట అమేఠీలో రాహుల్ గాంధీని ఓడించి ఓ రాజకీయ నాయకురాలిగా ఈసారి తనను తాను నిరూపించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వారసత్వ రాజకీయాలకు ఏ పార్టీ అతీతం కాదు
"ప్రతిభ, సామర్థ్యం అవసరమే కానీ భారత రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది" అని షుతాప అన్నారు.
"జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే తేడా ఏమీ లేదు... వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆతిషి లాంటి ప్రతిభ ఉన్న మహిళలు ఈసారి గెలవలేకపోయారు. వారెంతగా కష్టపడినా ఇతర అంశాలు వాటిని అధిగమించాయి" అని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే, తమిళనాడులోని డీఎంకే ఇద్దరు మహిళలకు అవకాశమిచ్చింది. ఇద్దరూ గెలిచారు.
వీరద్దరూ డీఎంకేలోని ప్రముఖుల కుమార్తెలే. ఒకరు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కణిమోళి కాగా, ఇంకొకరు తంగపాండ్యన్ కుమార్తె సుమతి. ఈమె మొదటిసారి ఎన్నికల్లో నిలిచారు, గెలిచారు.
అన్ని పార్టీల్లో ఈసారి మహిళల గాలి వీచింది. బిహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ వీణా దేవి జనతా దళ్(యు) పార్టీ ఎంఎల్‌సీ దినేశ్ సింగ్ భార్య, జేడీయూ మాజీ నేత జగ్మాతో దేవి కోడలు కవిత కూడా గెలిచారు.
అయితే, గెలిచిన ప్రతి మహిళా ఎంపీ వెనకా ఓ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉంది. బిహార్‌లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భార్య హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపకుడు పీఏ సంగ్మా కుమార్తె అగాధా సంగ్మా వంటి వారు దీనికి నిదర్శనం. కానీ ఇలా ఎలాంటి మద్దతూ లేని వారు కూడా ఈసారి గెలుపును సొంతం చేసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున నలుగురు మహిళలు బరిలో నిలిస్తే, నలుగురూ గెలిచారు. వారిలో ఒక్కరు... గొడ్డేటి మాధవి మాత్రమే ఓ ఎమ్మెల్యే కుమార్తె. మిగిలిన ముగ్గురిలో సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వంగా గీత ఒకరు. మరొకరు సామాజిక కార్యకర్త, డాక్టర్ సత్యవతి. మూడో మహిళ చింతా అనూరాధ.
మహారాష్ట్రలో స్వతంత్ర అభ్యర్థి, పెళ్లి తర్వాత పంజాబ్ నుంచి వచ్చి స్థిరపడిన నవ్‌నీత్ కౌర్ విజయం సాధించారు.
మహిళలకు తమ కుటుంబ నేపథ్యాల కారణంగా టికెట్లు లభించినప్పటికీ వారు ఆ టికెట్లను దక్కించుకోవడానికి తమ కుటుంబాల్లోని పురుషులతో పోటీ పడాల్సిందే. ఇందులో రహస్యమేమీ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
'పీఆర్ఎస్ ఇండియా' గణాంకాల ప్రకారం, ఈ కొత్త లోక్‌సభలో అత్యధికంగా 78 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం. కానీ ఈ పెరుగుదల చాలా నెమ్మదిగా జరుగుతోంది.
మొదటి లోక్‌సభలో 24 మంది (5శాతం) మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ముగిసిన లోక్‌సభలో 66 మంది (12శాతం) మంది మహిళలున్నారు. ఇప్పుడు ఏర్పడబోయే 17వ లోక్‌సభలో ఈ సంఖ్య రెండు శాతం పెరిగింది.
కొన్నేళ్లుగా పార్లమెంటులో మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినా ఈ సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే.
ఇది రువాండా (61%), దక్షిణాఫ్రికా (43%), యూకే (32%), అమెరికా (24%), బంగ్లాదేశ్‌లో (21%) గా ఉంది.
బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. సొంతంగానే 300కు పైగా సీట్లను గెల్చుకుంది.
"రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లేదు. పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ఇప్పుడైనా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తుందో లేదో మనం చూడాలి" అని నిషా అన్నారు.
ఇవి కూడా చదవండి.
- ఎడిటర్స్ కామెంట్: విజన్‌పై 'విశ్వసనీయత' విజయం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు
- ఆ పది కీలక నియోజకవర్గాల్లో గెలిచిందెవరు.. ఓడిందెవరు?
- సూటిపోటి మాటలను భరిస్తూనే అనుకున్నది సాధించిన యూపీ యువతి
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








