బ్రహ్మం గారి కాలజ్ఞానం: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా? - BBC Fact Check

ఫొటో సోర్స్, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మఠం
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సందర్భంగా షేర్ అవుతున్న కొన్ని ఫొటోలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అలాంటిదే ఇదొకటి.
వైఎస్ జగన్ తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. ఈ మాటను తన పాదయాత్రలో కూడా చాలాసార్లు ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, UGC
ధరణిలో వికారి సంవత్సరంబున!
తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చేనయ!
చంద్రదోషము నాడు వీడేనయ!
రాజన్న రాజ్యంబు వచ్చేనయ!
తప్పదు నా మాట నమ్మండయ!!
ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అని రాసి ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విస్తృతంగా షేర్ అవుతోంది. దీనిలో ఉన్న నాలుగో లైన్ లేకుండా కూడా కొన్ని ఫొటోలు షేర్ అవుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ రెండో ఫొటోను చూస్తే... దానిలో నాలుగు లైన్లే ఉన్నాయి. అయితే సాధారణంగా ఓ పద్యమైనా, వచనమైనా నాలుగు లైన్లకే పరిమితమై ఉంటుంది. ఐదు లైన్లు ఉండదు. అంటే పైన చూపిన ఫొటోలో ఉన్న నాలుగో లైన్ "రాజన్న రాజ్యంబు వచ్చేనయ" అనేది ఇప్పుడు అదనంగా జతచేసిన వాక్యమే అని స్పష్టమవుతోంది.
అయితే, అసలు బ్రహ్మంగారు బోధించినట్లు చెబుతున్న కాలజ్ఞానం అని ప్రచారంలో ఉన్న పుస్తకాల్లోనూ, ఆడియో ఫైళ్లలోను ఇలాంటి వచనం ఉందా అని మేం పరిశోధించాం. కానీ, ఇక్కడ పేర్కొన్న వాక్యాల ప్రస్తావన వాటిలో కనిపించలేదు.
"రాచరికాలు నశించి, ప్రజా ప్రభుత్వం వస్తుంది" అని మాత్రం ఓ వచనం ఉంది. ఈ వాక్యానికీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్న వాక్యాలకూ ఎలాంటి పొంతనా లేదు.

ఫొటో సోర్స్, SVBMatt
దీనిపై మరింత స్పష్టత, సమాచారం కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న ‘శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మఠం’ అధికారులను బీబీసీ సంప్రదించింది.
ఇదంతా ఎవరో కల్పించి చేస్తున్న ప్రచారమే తప్ప కాలజ్ఞానంలో ఇలాంటి వచనాలుగానీ, వ్యాఖ్యానాలు గానీ లేవు అని ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప జిల్లా కందినిమ్మాయపల్లెలో ఉన్న 'శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మఠం' మేనేజర్ ఈశ్వరాచారి బీబీసీ ప్రతినిధి అనిల్ కుమార్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
"వికారి నామ సంవత్సరం ప్రతి 60 సంవత్సరాలకొకసారి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన వికారి నామ సంవత్సరం ఇదే అనుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మేంద్రయోగి కాలజ్ఞానాన్ని 17వ శతాబ్దంలో బోధించారు. ఈ మధ్యలో కనీసం ఐదారు వికారి నామ సంవత్సరాలు వచ్చాయి" అని ఆయన అన్నారు.
దీనిపై పురాతన తాళపత్రాల్లో ఏమైనా ప్రస్తావన ఉందేమో తెలుసుకునేందుకు వీరబ్రహ్మేంద్ర యోగి కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించాం గానీ, సాధ్యం కాలేదు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: విజన్‌పై 'విశ్వసనీయత' విజయం
- బ్రిటన్ ప్రధాని థెరెసా మే పతనానికి బ్రెగ్జిట్ ఎలా కారణమైంది?
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?
- మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- భారత దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- 'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








