ఆంగ్ సాన్ సూచీ: జైలు గోడల మధ్య నుంచే మియన్మార్‌పై ప్రభావం చూపుతున్న నేత..

ఆంగ్ సాన్ సూచీ, మియన్మార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2021లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది, ఆంగ్ సాన్ సూచీని అరెస్టు చేసింది.
    • రచయిత, జొనాథన్ హెడ్
    • హోదా, సౌత్ ఈస్ట్ ఏసియా కరస్పాండెంట్

మియన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ ఈ బుధవారం నాటికి 20 ఏళ్లు నిర్బంధంలో గడిపారు. సైనిక తిరుగుబాటుతో, 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఈ ఐదేళ్ల జైలు జీవితంతో కలిపి ఆమె రెండు దశాబ్దాలు నిర్బంధంలో ఉన్నారు.

ఆమె ఆరోగ్యం గురించి, ఆమె ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారనే విషయాల గురించి దాదాపుగా ఎవరికీ ఏమీ తెలియదు. ఆమెను రాజధాని నైపీడా నగరంలోని సైనిక జైలులో ఉంచినట్లు భావిస్తున్నారు.

"నాకు తెలిసినంతవరకు ఆమె చనిపోయి ఉండవచ్చు" అని ఆంగ్ సాన్ సూచీ కుమారుడు కిమ్ ఆరిస్ గత నెలలో అన్నారు. అయితే, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని జుంటా సైనిక ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

ఆమె రెండేళ్లుగా తన న్యాయవాదులను కలవలేదు. జైలు సిబ్బంది మినహా మరెవరూ ఆమెను చూసినట్లు తెలియదు.

తిరుగుబాటు అనంతరం, బూటకపు ఆరోపణలుగా పరిగణిస్తున్న కేసుల్లో ఆమెకు 27 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ఆంగ్ సాన్ సూచీని ప్రజల దృష్టి నుంచి దూరం చేసినప్పటికీ, మియన్మార్‌పై ఇప్పటికీ ఆమె ప్రభావం ఉంది.

సాయుధ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా సాగుతున్న విధ్వంసకర ప్రచారాన్ని ముగించాలని, ఐదేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించేందుకు చర్చలు జరపాలని జనరల్స్‌కు విజ్ఞప్తి చేయడంతో పాటు, ఆమె విడుదలకు పదేపదే డిమాండ్లు వస్తున్నాయి.

సైన్యం ఆమె ఇమేజ్‌ను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించింది కానీ, 'ది లేడీ', 'అమయ్ సు' (మదర్ సు) అంటూ ఆప్యాయంగా పిలుచుకునే పోస్టర్లు ఇప్పటికీ రహస్య ప్రదేశాలలో కనిపిస్తాయి.

అయితే, సైన్యం, ప్రజల మధ్య సంఘర్షణను పరిష్కరించడంలో ఆమె ఇప్పటికీ కీలకపాత్ర పోషించగలరా?

ఏదేమైనప్పటికీ, గతంలోనూ ఇలా జరిగింది. 2010 వరకు సైన్యం దాదాపు 50 ఏళ్లు అధికారంలో ఉంది, ప్రతిపక్షాలను క్రూరంగా అణచివేసింది. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అప్పుడు కూడా, ఇప్పటి తరహాలోనే ఆంగ్ సాన్ సూచీ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీని మినహాయించి, తమ చెప్పుచేతల్లో ఉండే యూఎస్డీపీ గెలిచేలా సాధారణ ఎన్నికలు నిర్వహించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దశలవారీగా జరుగుతున్న ఇప్పటి ఎన్నికల మాదిరిగానే, 2010లో జరిగిన ఎన్నికలను బూటకపు ఎన్నికలుగా చాలా దేశాలు కొట్టిపారేశాయి. ఆ ఏడాది చివర్లో ఆంగ్ సాన్ సూచీ విడుదలయ్యారు, 18 నెలల్లోనే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

1960 తర్వాత దేశంలో, 2015లో జరిగిన మొదటి స్వేచ్ఛాయుత ఎన్నికల నాటికి ఆమె పార్టీ విజయం సాధించింది. ఆమె దేశానికి వాస్తవ నాయకురాలిగా అవతరించారు.

బాహ్య ప్రపంచానికి అదొక అద్భుతమైన ప్రజాస్వామ్య మార్పులా అనిపించింది. కొందరు సైనిక జనరల్స్‌లో నిజమైన సంస్కర్తలు ఉన్నారనేందుకు నిదర్శనంలా నిలిచింది.

మరి, ఈ నెలాఖరులో ముగిసే మూడు దశల ఎన్నికల తర్వాత కూడా అదే పరిస్థితిని చూడగలమా?

అయితే, అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది.

ఆంగ్ సాన్ సూచీ, మియన్మార్, సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విడుదలైన కొన్ని రోజుల తర్వాత, 2010 నవంబర్ 15న యాంగోన్‌లోని తన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆంగ్ సాన్ సూచీ.

సైనిక పాలన ఎలా ముగిసింది?

ఆ సమయంలో ప్రపంచంతో మియన్మార్ సంబంధాలను పునరుద్ధరించడానికి సైనిక నాయకులు, యూఎన్ రాయబారుల మధ్య చాలా ఏళ్లు చర్చలు జరిగాయి. అది మరింత ఆశాజనకమైన కాలం.

పాశ్చాత్య దేశాలతో వాణిజ్యం ద్వారా తమ ఆగ్నేయాసియా పొరుగుదేశాలు ధనవంతులు అవుతున్నారని జనరల్స్ గమనించారు. నష్టపరిచే ఆర్థిక ఆంక్షలకు ముగింపు పలకాలనుకున్నారు. ఒబామా ప్రభుత్వం ఆసియాపై ఎక్కువగా దృష్టి సారించిన సమయంలో, చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించడానికి అమెరికాతో మెరుగైన సంబంధాలను కోరుకుంది మియన్మార్.

అయితే, సీనియర్ జనరల్స్ అప్పటికీ కఠినంగా, అపనమ్మకంతోనే ఉన్నారు. కానీ, కొంతమంది దిగువ స్థాయి అధికారులు రాజకీయ రాజీపై ఆసక్తి చూపారు. సైన్యాన్ని చివరకు ఏది ఒప్పించిందో తెలియదు కానీ, అంగీకరించారు.

కానీ, భారీగా నిధులు సమకూర్చిన వారి రాజకీయ పార్టీతో పాటు, 2008 రాజ్యాంగం (పార్లమెంటులో సైన్యానికి 25 శాతం సీట్ల హామీ) విడుదలైన తర్వాత ఆంగ్ సాన్ సూచీ అధికారాన్ని నియంత్రించడానికి సరిపోతుందని సైన్యం ఉన్నతాధికారులు భావించారు. అయితే, ఆమె ప్రజాదరణను సైన్యం తక్కువగా అంచనా వేసింది. దశాబ్దాల కఠినమైన సైనిక పాలన తర్వాత ప్రజలు ఎంత తీవ్రంగా, కోపంగా దూరం అయ్యారో అర్థం చేసుకోలేకపోయారు.

ఆంగ్ సాన్ సూచీ, మిన్ ఆంగ్ హ్లైంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015 ఎన్నికల ఫలితాల అనంతరం కలిసిన ఆంగ్ సాన్ సూచీ, మిన్ ఆంగ్ హ్లైంగ్

ఆ ఎన్నికల్లో ఏం జరిగింది?

2015 ఎన్నికల్లో, సైనిక మద్దతుగల యూఎస్డీపీ పార్లమెంట్ ఉభయ సభలలో 6 శాతానికి పైచిలుకు సీట్లను మాత్రమే గెలుచుకుంది.

అయితే, 2020 ఎన్నికల్లో మాత్రం ఫలితం మెరుగ్గా ఉంటుందని అంచనా వేసింది యూఎస్డీపీ. ఎందుకంటే, ఎన్ఎల్డీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది. ప్రభుత్వంపై చాలామంది నిరాశలో ఉన్నారు. కానీ, యూఎస్డీపీకి ఫలితం మరింత దారుణంగా వచ్చింది. కేవలం 5 శాతం సీట్లను మాత్రమే గెలుచుకుంది.

ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్న ప్రజలు కూడా సైనిక పార్టీ కంటే ఆమె పార్టీ వైపే మొగ్గుచూపారు. ఇది రాజ్యాంగాన్ని మార్చడానికి, సైన్యం ప్రత్యేక అధికారాలను తొలగించడానికి ఆమెకు తగినంత మద్దతును అందించే అవకాశాన్ని ఇచ్చింది.

దీంతో పదవీ విరమణ అనంతరం అధ్యక్షుడు కావాలనే ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఆశలు కూడా ముగిశాయి. ఇక ఆంగ్ సాన్ సూచీ తన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న రోజు, 2021 ఫిబ్రవరి 1న ఆయన సైనిక తిరుగుబాటు చేశారు.

ఈసారి, సైన్యంలో సంస్కర్తలు లేరు. 2010లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చిన రాజీ వంటి ఆశ లేదు. తిరుగుబాటు తర్వాత నిరసనలను అణచివేసేందుకు ఉపయోగించిన క్రూరమైన హింస చాలామంది యువకులను జుంటా(సైన్యం)కు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టేలా చేసింది. ఘర్షణల్లో 10 వేల మంది వరకు మరణించారు, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇరువైపులా పరిస్థితులు కఠినంగా మారాయి.

కొత్త వ్యతిరేకత

నేటి నిర్బంధానికి, 1989 అనంతరం ఆంగ్ సాన్ సూచీ 15 ఏళ్ల నిర్బంధానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో, ఆమెను యాంగోన్‌లోని ఒక సరస్సు పక్కన ఉన్న తన ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు.

ఆంగ్ సాన్ సూచీ ప్రశాంతత, అహింసాయుత ప్రతిఘటన ఆమెను మియన్మార్‌లో ప్రజాదరణ పొందేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారామె. ఆమె విడుదలైన తర్వాత శక్తిమంతమైన ప్రసంగాలు ఇచ్చారు, జర్నలిస్టులతో మాట్లాడారు.

ఈరోజు, ఆమె అదృశ్యమయ్యారు. ఆమె అహింసా విధానాన్ని ఇపుడు సైన్యంతో పోరాడుతున్న చాలామంది ఏకీభవించడం లేదు. సాయుధ పోరాటం మాత్రమే సైన్యాన్ని రాజకీయాల నుంచి తొలగించగలదని అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో, అప్పటి ఆంగ్ సాన్ సూచీ పాలనపై ఇప్పుడు విమర్శలు ఎక్కువయ్యాయి.

2017లో రోహింజ్యా ముస్లింలపై సైన్యం చర్యలకు సంబంధించిన మారణహోమ ఆరోపణలకు వ్యతిరేకంగా మియన్మార్ తరపున అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ వాదించడంతో ఆమె ఇమేజ్ విదేశాల్లో బాగా దెబ్బతింది. ఆ సమయంలో మియన్మార్‌లో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోహింజ్యా సంక్షోభంపై ఆమె వ్యవహరించిన తీరుపై ఇప్పుడు చాలామంది యువ ప్రతిపక్ష కార్యకర్తలు ఆమెను బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఇప్పుడు 80 ఏళ్ల వయస్సులో, అంతంతమాత్రం ఆరోగ్యంతో ఉన్న ఆంగ్ సాన్ సూచీ ఒకవేళ విడుదలైనా.. కీలకపాత్ర పోషించాలని ఆమె అనుకున్నా.. ఎంతమేర ప్రభావం చూపగలుగుతారో తెలియదు.

అయినప్పటికీ, సైనిక పాలనకు వ్యతిరేకంగా చేసిన సుదీర్ఘ పోరాటం ఆమెను స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య మియన్మార్‌కు చిహ్నంగా మార్చింది.

దేశంలో ఆమెతో సరితూ వారు మరెవరూ లేరు. ఆ కారణంగానే, మియన్మార్ ప్రస్తుత రాజకీయ ప్రతిష్ఠంభన నుంచి బయటపడాలంటే ఆమె అవసరం ఇంకా ఉందని చాలామంది వాదిస్తుంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)