మియన్మార్: పారాగ్లైడర్‌తో బాంబుదాడులు, 24మంది మృతి, 47మందికి గాయాలు

ఫొటో సోర్స్, PDF
- రచయిత, కోహ్ ఈవ్
- నుంచి, బీబీసీ బర్మీస్
మియన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంపై ఆర్మీకి చెందిన ఓ మోటరైజ్డ్ పారాగ్లైడర్ రెండు బాంబులను విసిరిన ఘటనలో 24 మంది చనిపోగా మరో 47 మంది గాయపడ్డారని ప్రవాస ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీ బర్మీస్‌కు తెలిపారు.
సెంట్రల్ మియన్మార్‌లోని చావుంగ్ యూ టౌన్‌షిప్‌లో సోమవారం నాడు దాదాపు 100మంది ప్రజలు జాతీయ సెలవు దినోత్సవాన్ని జరుపుకోవడానికి గుమిగూడినప్పుడు సైన్యం ఈ దాడి చేసింది.

మియన్మార్‌లో సైన్యం 2021లో అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటి నుంచి వేలాదిమంది మరణించారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడంతో అంతర్యుద్ధం రాజుకుంది. సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ బృందాలు, స్వయంపాలన కోరుతున్నజాతుల బలగాలు పోరాడుతున్నాయి .
దేశంలోని సగానికి పైగా ప్రాంతాలపై నియంత్రణ కోల్పోయిన సైన్యం ఇప్పుడు మళ్లీ గగనతలదాడులు, భారీ బాంబుదాడులతో తన పట్టును పెంచుకుంటోంది.
సోమవారం దాడి జరిగిన టౌన్ షిప్ సాగైంగ్ ప్రాంతంలోనిది. ఇది యుద్ధంలో కీలకక్షేత్రంగా ఉంది. ఆ ప్రాంతంలోని అనేక భాగాలు..సైనిక ప్రభుత్వంపై పోరాడుతున్న స్వచ్ఛంద సైనికుల నియంత్రణలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, PDF
‘‘ 7 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది’
పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్) గా పిలిచే ఈ గ్రూపులు స్థానికంగా పరిపాలన కొనసాగిస్తున్నాయి. సోమవారం నిరసనకారులపై గగనతల దాడి జరిగే అవకాశం ఉందని తమకు నమ్మదగిన సమాచారం అందిందని స్థానిక పీడీఎఫ్‌కు చెందిన అధికారి ఒకరు బీబీసీ బర్మీస్ కు తెలిపారు.
వాళ్లు తమ నిరసన కార్యక్రమాన్ని త్వరగా ముగించాలనుకున్నారు. కానీ, ఊహించినదానికంటే త్వరగా పారామోటార్స్ ఆ ప్రదేశానికి చేరుకున్నాయని ఆయన అన్నారు. ఇదంతా ఏడు నిమిషాల వ్యవధిలోనే జరిగిందని ఆయన తెలిపారు. ఈ పేలుడు కారణంగా తన కాలికి గాయమైందని, కానీ తనకు సమీపంలోని మరికొంతమంది మాత్రం ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని స్థానికులు బీబీసీ బర్మీస్ తో చెప్పారు.
‘యుద్ధం కొత్త మలుపు తిరిగిందా?’
"చిన్నారుల శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి" అని ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో సాయపడిన ఓ మహిళ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో అన్నారు. ఘటనా సమయంలో ఆమె అక్కడ లేరు. కానీ, మంగళవారం జరిగిన అంత్యక్రియల్లోపాల్గొన్నారు.
"ఆందోళన కలిగించే ధోరణి"లో భాగంగా జుంటా ప్రభుత్వం ప్రజలపై మోటార్లతో కూడిన పారాగ్లైడర్లను ఉపయోగించి దాడి జరిపిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల కొరత నేపథ్యంలో జుంటా పారామోటార్ల సేకరణ పెంచుతోందని బీబీసీ బర్మీస్ ఇటీవల ఓ కథనం వెలువరించింది.
గత కొన్నేళ్లుగా విధించిన అంతర్జాతీయ ఆంక్షలతో సైనిక సంపత్తిని సేకరించడంలోమియన్మార్ సైనిక పాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే... చైనా, రష్యా నుంచి అడ్వాన్స్ డ్ డ్రోన్లు, సైనిక సాంకేతికత సరఫరా కావడంతో ఈ యుద్ధక్షేత్రం.. కొత్త మలుపు తిరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
డిసెంబరులో సార్వత్రిక ఎన్నికలు
తాజా దాడి "మియన్మార్ లోని పౌరులకు అత్యవసర రక్షణ కల్పించాల్సి ఉందనడానికి అత్యవసర పిలుపు అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మియన్మార్ పరిశోధకుడు జో ఫ్రీమాన్ అన్నారు.
ఈ నెలాఖరులో సమావేశమయ్యే దక్షిణాసియా ప్రాంతీయ కూటమి 'ఆసియాన్' జుంటాపై ఒత్తిడి పెంచి, దాదాపు ఐదేళ్లుగా మియన్మార్ ప్రజలను పరాజితులుగా చేసిన విధానాన్ని పునరాలోచించేలాగా చూడాలని'' ఫ్రీమాన్ కోరారు.
సోమవారం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ జుంటా బలవంతపు సైనిక నియామకాలు, రానున్న జాతీయ ఎన్నికలకు వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత ప్రదర్శన. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ సహా నిర్బంధంలో ఉంచిన ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
మియన్మార్‌లో రానున్న డిసెంబరులో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. 2021 తర్వాత జరగనున్న తొలి ఎన్నికలు ఇవే. అయితే.. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా,సజావుగా జరగవని విమర్శకులు అంటున్నారు.
అనేక ప్రతిపక్ష పార్టీలపై నిషేధం విధించారు. అంతర్యుద్ధం కారణంగా దేశంలోని సగం ప్రాంతాలలో మాత్రమే ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














