భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, జోనాథన్ హెడ్, ఒలివర్ స్లో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
భారత్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒక ముఖ్యమైన పట్టణాన్ని సైన్యం నుంచి తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు పశ్చిమ మియన్మార్‌లోని జాతిపరమైన తిరుగుబాటుదారుల గ్రూపు అరకాన్ ఆర్మీ(ఏఏ) ప్రకటించింది.
చిన్ రాష్ట్రంలోని పలెట్వా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలిపింది. పలెట్వా భారత సరిహద్దుకు సమీపంలో ఉంటుంది.
‘‘మొత్తం పలెట్వా ప్రాంతంలో ఒక్క మిలటరీ కౌన్సిల్ క్యాంపు కూడా లేదు’’ అని టెలిగ్రామ్ ఛానల్‌లో అరకాన్ ఆర్మీ తెలిపింది. మియన్మార్ సైన్యం మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
పలెట్వా ప్రాంతం భారత్, బంగ్లాదేశ్‌లకు మియన్మార్ సరిహద్దులో ఉంది. పలెట్వాలో పరిణామాలను ఇండియా నిశితంగా గమనిస్తోంది.
అక్టోబర్‌లో సైన్యంపై భారీ దాడులకు దిగిన మూడు సాయుధ తిరుగుబాటు గ్రూపుల్లో అరకాన్ ఆర్మీ ఒకటి.
బ్రదర్‌హుడ్ అలయన్స్‌లో అరకాన్ ఆర్మీ
మారుమూల ప్రాంతాల్లో అనుసంధానతను మెరుగుపరచడం లక్ష్యంగా భారత్ సహకారంతో చేపడుతున్న లక్షల డాలర్ల అభివృద్ధి ప్రాజెక్టులో ఈ పట్టణం భాగంగా ఉంది.
మియన్మార్‌లో జాతిపరమైన సాయుధ తిరుగుబాటు గ్రూప్‌లు చాలా ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా అత్యాధునిక పరికరాలు, ఆయుధ సంపత్తి అరకాన్ ఆర్మీ వద్దే ఉన్నాయి.
సైన్యంతో ఈ గ్రూప్ యుద్ధం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా చిన్ రాష్ట్రంలోని సరిహద్దులను, రఖాయిన్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
2021 ఫిబ్రవరిలో సైన్యం అధికారంలోకి రాక ముందు ఏఏ ఫైటర్లు రఖాయిన్ రాష్ట్రాన్ని చాలా వరకు తమ అధీనంలో ఉంచుకున్నారు. ఈ రాష్ట్రంలో 60 శాతం తమ చేతుల్లోకి తీసుకున్నట్లు రెండేళ్ల క్రితం ఏఏ ఫైటర్లు ప్రకటించారు.
కానీ, 2021 సైనిక తిరుగుబాటు సమయంలో అరకాన్ ఆర్మీ కాల్పుల విరమణను పాటించింది. మియన్మార్ సైన్యం కూడా అప్పుడు ఈ గ్రూపుతో ఘర్షణలకు తావివ్వకుండా, సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తున్నవారిని అణచివేయడంపైనే దృష్టి కేంద్రీకరించింది.
కానీ, గత అక్టోబర్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘బ్రదర్‌హుడ్ అలయన్స్’లో తాము కూడా చేరుతున్నట్లు అరకాన్ ఆర్మీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైన్యానికి వ్యతిరేకంగా వివిధ తిరుగుబాటు గ్రూపులు చేపట్టిన దాడుల్లో అరకాన్ ఆర్మీ కూడా పాల్గొంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అరకాన్ ఆర్మీని నిలువరించేందుకు సైన్యం ఏం చేస్తోంది?
గత 11 వారాలుగా, మియన్మార్-చైనా సరిహద్దు ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో మియన్మార్ సైనికులపై ‘బ్రదర్‌హుడ్ అలయన్స్’ దాడులు చేస్తూ వచ్చింది.
ఆ తర్వాత గత శనివారం దేశానికి మరోవైపు ఉన్న పలెట్వా పట్టణంలోని చివరి మిలటరీ పోస్టును, మీవా హిల్‌టాప్ బేస్‌ను అరకాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. 2020లో 42 రోజుల యుద్ధం తర్వాత కూడా వీటిని చేజిక్కించుకోలేకపోయింది.
కలాదన్ నదిపై ఉన్న పలెట్వా నౌకాశ్రయంతో పాటు, అరకాన్ ఆర్మీ ప్రస్తుతం భారత్ సరిహద్దులో ఉన్న రోడ్డు, జల మార్గాలను తన అధీనంలోకి తీసుకుంది. రఖాయిన్ రాష్ట్రంలో మరిన్ని దాడులు చేయాలనే ప్రణాళికలతో లాజిస్టిక్స్ బేస్‌ను కూడా ఇది ఏర్పాటు చేసుకుంది.
రఖాయిన్ రాష్ట్రంలో మిగతా ఏ ప్రధాన పట్టణమైనా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్తే అది మిలటరీ అథారిటీకి అతిపెద్ద నష్టం కానుంది. దీంతో ఈ కూటమిని అడ్డుకొనేందుకు మియన్మార్ సైన్యం ప్రయత్నిస్తోంది. రఖాయిన్ రాజధాని సితవేను మియన్మార్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రధాన రహదారి పక్కనున్న క్యాయుక్తౌ పట్టణంలోకి అరకాన్ ఆర్మీ రాకుండా అడ్డుకునేందుకు సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది.
అరకాన్ ఆర్మీ తర్వాత ఏం చేయబోతుందన్నది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. సమాఖ్య వ్యవస్థలోనే తాము స్వాతంత్ర్యాన్ని లేదా స్వయంప్రతిపత్తిని సాధించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. సైనిక పాలనలో కంటే ఎన్నికైన ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే తమ లక్ష్యాన్ని సాధించవచ్చని అరకాన్ ఆర్మీ నాయకత్వం భావిస్తోంది.
పలెట్వా నగరం సైనికుల చేజారియిన తరుణంలో సైనిక ప్రభుత్వం తమ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని పునరుద్ధరించగలదా? చాలా వైపుల నుంచి తమపై పోరాడుతున్న వైరి పక్షాలపై పోరాడేలా చేయగలదా? ఇప్పుడు సైనిక ప్రభుత్వం ముందున్నఅతిపెద్ద ప్రశ్నలు ఇవే.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి వద్దకు వెళ్ళిన 24 మంది వ్యోమగాముల్లో సజీవంగా ఉన్న 8 మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు 100 రోజులు... ఈ యుద్దం ఎటు వెళ్తోంది?
- సర్గాస్సమ్ ఆల్గే: టన్నుల కొద్దీ పెరిగే ఈ సముద్రపు నాచుతో ఎన్ని కష్టాలో తెలుసా?
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














