ఇజ్రాయెల్‌‌పై హమాస్ మెరుపుదాడులకు 100 రోజులు... ఈ యుద్దం ఎటు వెళ్తోంది?

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

    • రచయిత, వైర్ డేవీస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

100 రోజుల క్రితం ఊహించలేనిది జరిగింది. కష్టాలు, యుద్ధం నుంచి 75 ఏళ్ల క్రితం పుట్టిన దేశం అకస్మాత్తుగా ఊహించని సవాలును ఎదుర్కొంది. ఆ దేశం ఉనికికే ముప్పుగా భావించిన క్షణమది. ఆ పరిస్థితిని ఎదుర్కొన్న దేశమే ఇజ్రాయెల్.

రాజధాని టెల్ అవీవ్‌లో అక్టోబర్ 7న జరిగిన సంఘటనను వేలాది మంది ప్రజలు గుర్తు చేసుకున్నారు.

హమాస్ చేతిలో బందీలుగా ఉన్న సుమారు 130 మంది గురించిన ప్రశ్నలు అక్కడి ప్రతి వ్యక్తి మదిలో మెదులుతూనే ఉన్నాయి.

ఆ 130 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు హమాస్ మిలిటెంట్లు, బహుశా బందీలలో కొందరు ఇప్పుడు సజీవంగా లేకపోవచ్చు కూడా.

వేలాది మంది సాయుధ హమాస్ మిలిటెంట్లు గాజా సరిహద్దును దాటి నగరంలోకి ప్రవేశించి నేటికి 100 రోజులు.

గాజాలోకి ప్రవేశించిన వెంటనే కిబుట్జిమ్, సైనిక స్థావరాలు, సరిహద్దు పట్టణాలపై దాడి చేయడం ప్రారంభించారు.

ఈ నగరం హమాస్ రాకెట్ దాడులకు అలవాటుపడినప్పటికీ, ఆ రోజు దాడి మర్చిపోలేనిది.

దాడి జరిగిన తర్వాత నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వందలమంది చిత్రాలు ఇజ్రాయెల్‌ను కదిలించాయి.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

దాడి సమయంలో ఇజ్రాయెల్‌లో వేడుకలు జరుగుతున్నాయి, ఆ వేడుక ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు 360 మందిని చంపేశారు, పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.

దాడిని ఎదుర్కోడానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమయ్యేలోపు హమాస్ 1,200 మందిని చంపేసింది.

హమాస్ దాడి చేసి 100 రోజులు పూర్తవడంతో టెల్ అవీవ్‌‌కు వేలమంది వచ్చారు. వారిలో బందీల కుటుంబాలూ ఉన్నాయి.

వారు పోస్టర్లను ప్రదర్శించారు, వారి టీ-షర్టులపై తప్పిపోయిన కుటుంబ సభ్యుల ఫోటోలు ముద్రించారు.

బందీల బంధువులు

బందీల పరిస్థితి ఏంటి?

షిరి బిబాస్ కజిన్ అయిన యోస్సీ షినీదర్‌తో బీబీసీ ప్రతినిధి డేవీస్ మాట్లాడారు. గాజాలో బిబాస్‌తో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలు కూడా బందీలుగా ఉన్నారని యోస్సీ చెప్పారు.

దాడి గురించి యోస్సీ మాట్లాడుతూ “అక్కడ సుమారు 130 మంది బందీలుగా ఉన్నారు. చాలామందికి సరైన మందులు కూడా లేవు. రెడ్‌క్రాస్‌ వాళ్లను కూడా అనుమతించడం లేదు'' అన్నారు.

బందీల కుటుంబాలకు ఎలాంటి సమాచారం అందకపోవడంపై యోస్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బందీల శారీరక, మానసిక స్థితిగతుల గురించి ఎవరికీ తెలియదంటున్నారు యోస్సీ.

"నా కుటుంబంలోని మూడు తరాల వాళ్లు తప్పిపోయారు. మూడు తరాల వాళ్లు. ప్రపంచం నిశ్శబ్ధంగా ఉంది. ప్రశాంతంగా ఉండమని కోరుతోంది. కానీ, నేనిక ఓపిక పట్టలేను" అని యోస్సీ ఆవేదనతో చెబుతున్నారు.

ఇంతకుముందు అక్టోబర్ 7వ తేదీ లాంటి రోజును ఇజ్రాయెల్ చూడలేదని ఇక్కడ చాలామంది చెబుతారు. ఇజ్రాయెల్ మునుపెన్నడూ ఇంత బలహీనంగా భావించలేదు.

బందీలను సురక్షితంగా తీసుకురావడమే దాని ప్రాధాన్యత అయినప్పటికీ, ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల పట్ల చాలామంది మద్దతుగా ఉన్నారు.

కొంతమంది మాత్రమే సహనం, కలిసి ఉండటం గురించి మాట్లాడుతున్నారు.

ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. గాజాలో భారీగా కాల్పులు జరిపింది. హమాస్‌ను దానికి మద్దతిస్తున్న గాజాలోని వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే దాని లక్ష్యంగా మారింది.

గాజాలో ఎక్కువ భాగం అంటే ఉత్తర గాజాలోని గాజా నగరం నుంచి దక్షిణాన ఉన్న ఖాన్ యునిస్ వరకు దాడుల ధాటికి నాశనమైంది.

ఫాతెన్
ఫొటో క్యాప్షన్, ఫాతెన్, ఆమె పిల్లలు ఖాన్ యూనిస్‌లో ప్లాస్టిక్ టెంట్‌లో నివసించాల్సి వస్తోంది.

హమాస్ బలహీన పడిందా?

దాడులతో హమాస్‌ను చాలావరకు బలహీనపరిచామని ఇజ్రాయెల్ అంటోంది. ఉత్తర గాజాలో హమాస్‌ కార్యకలాపాలు నిర్వహించడం దాదాపు అసాధ్యమని చెబుతోంది.

ఇదే సమయంలో ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య చాలా పెద్దది. గాజాలో 85 శాతం మంది నిరాశ్రయులయ్యారని పాలస్తీనా తెలిపింది.

ఇప్పుడు గాజాకు మరింత సాయం చేరుకుంటోంది, అయితే అక్కడ పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉందని ఐక్యరాజ్యసమితి మానవతా సహాయక ఆపరేషన్ అధిపతి ఒకరు చెప్పారు.

ఫతేన్ అబు షహదా అనే మహిళకు రెగ్యులర్‌గా కిడ్నీ డయాలసిస్ అవసరం, దీని కారణంగా ఆమె కుటుంబం దక్షిణాదికి వెళ్లవలసి వచ్చింది.

ఇప్పుడు ఫాతెన్, ఆమె పిల్లలు ఖాన్ యూనిస్‌లో ప్లాస్టిక్ టెంట్‌లో నివసించాల్సి వస్తోంది. గుడారాల పైన డ్రోన్‌ల శబ్దం వారిని నిరంతరం భయపెడుతూనే ఉంటుంది.

"గాజాను నాశనం చేశారు" అని అంటున్నారు ఫాతెన్. ''ఇప్పుడు గాజా లేదు, ఆసుపత్రి లేదు, విద్య లేదు. మా పిల్లల చదువు ఏడాదిగా ఆగిపోయింది. గాజా చచ్చిపోయింది'' అని అన్నారు.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడులతో గాజాలో 85 శాతం మంది నిరాశ్రయులయ్యారని పాలస్తీనా తెలిపింది.

ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడితో పోరు ముగిసిపోతుందా?

యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. గాజాలో పౌరులు చనిపోతున్న తీరుతో ఈ ఒత్తిడి మరింత పెరిగింది.

అయితే, ఇజ్రాయెల్ రక్షణ హక్కు, అక్టోబర్ 7 వంటి సంఘటనలు జరగకుండా చేపట్టే చర్యలకు దాని మిత్రదేశమైన అమెరికా మద్దతుదారుగా ఉంది.

ఇదే సమయంలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఇజ్రాయెల్‌కు అమెరికా గుర్తుచేస్తూనే ఉంది.

విచక్షణారహిత బాంబు దాడులపై ఇజ్రాయెల్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. దీని కారణంగా ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్నదని తెలిపారు.

జిడియాన్ లెవీ
ఫొటో క్యాప్షన్, జిడియాన్ లెవీ ఇజ్రాయెలీ వార్తాపత్రిక హారెట్జ్‌కి కాలమిస్ట్

జిడియాన్ లెవీ ఇజ్రాయెలీ వార్తాపత్రిక హారెట్జ్‌కి కాలమిస్ట్. ఆయన ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహుపై తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో 1948 నుంచి పరిశీలిస్తే సుదీర్ఘంగా భావిస్తున్న ఈ యుద్ధం, ముగింపునకు చేరుకుంటుందా అని ఆయనను అడిగారు డేవీస్.

"అమెరికన్లు ఇజ్రాయెల్‌ను అనుమతించినంత కాలం ప్రస్తుత రూపంలో ఈ యుద్ధం కొనసాగుతుంది" అని లెవీ అభిప్రాయపడ్డారు.

అయితే, ఇది మరిన్ని వారాల పాటు కొనసాగుతుందని అనుకోవట్లేదని కూడా ఆయన చెప్పారు. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఆలోచించనంత మాత్రాన యుద్ధం ముగిసిందని అనుకోవద్దన్నారు.

"గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రతిఘటన ఉంటుంది" అని ఆయన చెప్పారు. ప్రతిఘటన ఉంటే, ప్రతీకార చర్య కూడా ఉంటుందన్నారు.

సెంట్రల్, దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దాడి కొనసాగుతోంది. దీన్ని బట్టి నెతన్యాహు గాజాలో యుద్ధం ఇప్పట్లో ముగించేలా లేరని తెలుస్తోంది.

హమాస్‌ను నిర్మూలించే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, గాజాలో వేలాదిగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం భవిష్యత్తు అంధకారంగానే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)