పుచ్చకాయ పాలస్తీనా చిహ్నంగా ఎలా మారింది, ఇజ్రాయెల్‌కు అదంటే ఎందుకంత అసహనం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సెలిన్ గిరిట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘పాలస్తీనాలో పాలస్తీనా జెండా రెపరెపలాడటమే నేరమైనప్పుడు, పుచ్చకాయ ముక్కలు ఇజ్రాయెల్ దళాలను వ్యతిరేకించే పాలస్తీనా జెండాకు ప్రతిరూపంగా మారాయి’’
ఈ వాక్యాలను తాను రాసిన 'ఓడె టు ద వాటర్‌మెలన్' కవితలో ప్రస్తావించాడు అమెరికా కవి అరాసెలిస్ గిర్మేయ్
ఎరుపు, నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు కేవలం పుచ్చకాయలోని రంగులు మాత్రమే కాదు. పాలస్తీనా జెండా రంగులు కూడా. ఈ కారణంగానే పుచ్చకాయ చిహ్నం ఉండే జెండాలకు పాలస్తీనా సంఘీభావ చిహ్నాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోంది.
పాలస్తీనా అనుకూల ర్యాలీలలో పుచ్చకాయ చిహ్నం ఉన్న జెండాలు కనిపిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో పుచ్చకాయ బొమ్మ ఉండే జెండాల ఫోటోలతో పోస్టులు కనిపిస్తున్నాయి.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ బలగాలు చేస్తున్న దాడుల నేపథ్యంలో పుచ్చకాయ చిహ్నం జెండాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పెరుగుతోంది.
అయితే ఈ పుచ్చకాయ రూపానికి మరొక చరిత్ర కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
1967లో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత, గాజా, వెస్ట్ బ్యాంక్‌లను ఇజ్రాయెల్ స్వాధీనంలోకి తీసుకున్న సమయంలో, పాలస్తీనా జాతీయ చిహ్నాలైన జెండా, అందులోని రంగులను ప్రదర్శించడం, చేతబట్టుకోవడం, ధరించడంలాంటి వాటిని ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో నిషేధించారు.
జెండాను పట్టుకోవడంపై నిషేధం ఉండటంతో, పాలస్తీనా పౌరులు అందుకు బదులుగా పుచ్చకాయ ముక్కలను తమ నిరసనల్లో వాడుతున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనాలు 1993లో ఓస్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందులో ఎరుపు, నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులున్న జెండాను పాలస్తీనా అథారిటీ జెండాగా గుర్తించారు.
గాజా, ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులోని కొన్ని ప్రాంతాలు పాలస్తీనా అథారిటీ పాలనలోకి వెళ్లాయి.
అయితే గాజా స్ట్రిప్‌లో పుచ్చకాయ ముక్కలను ప్రదర్శించిన యువకులను కూడా అరెస్టు చేసిన ఘటనలున్నాయి.
పాలస్తీనా జెండా రంగులే ఉండే పుచ్చకాయ ముక్కల బొమ్మలను చూసి తేడా తెలుసుకోలేక నిషేధిత జెండానే ప్రదర్శిస్తున్నారనుకుని వాళ్లను అరెస్టు చేశారని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ జాన్ కిఫ్నర్ రిపోర్ట్ చేశారు. ఈ సంఘటన ఓస్లో ఒప్పందం కుదిరిన కాలంలో జరిగింది.
తర్వాత కొన్ని నెలలకు 1993 డిసెంబరులో న్యూయార్క్ టైమ్స్ వార్తను ధ్రువీకరించలేమని కూడా ఆ సంస్థ తెలిపింది. దీనిపైన ఇజ్రాయెల్ అధికార ప్రతినిధిని అడిగినపుడు, అటువంటి సంఘటనలు జరగలేదని చెప్పడం కష్టమన్నారు.

ఫొటో సోర్స్, INSTAGRAM/KHALED HOURANI
పుచ్చకాయ చిహ్నాలతో నిరసనలు..
అప్పటినుంచే, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా పుచ్చకాయ చిహ్నాలు ఉండేలా కళాకారులు కూడా ఆర్ట్ వర్క్స్ చేయడాన్ని కొనసాగిస్తున్నారు.
వాటిలో బాగా పేరు తెచ్చుకున్నది ఖాలెద్ హూరానీ చేసిన ఆర్ట్ వర్క్.
2007లో 'సబ్జెక్టివ్ అట్లాస్ ఆఫ్ పాలస్తీన్' అనే పుస్తకానికి పుచ్చకాయ ముక్క బొమ్మను కవర్‌గా పెయింట్ వేశారు ఖాలెద్.
'ద స్టోరీ ఆఫ్ ద వాటర్‌మెలన్' పేరుతో మరో పెయింటింగ్ వర్క్ ప్రపంచవ్యాప్తంగా పాపులరై, 2021లో తీవ్రమైన ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణ నాటి నిరసన ప్రదర్శనల్లో ప్రధానంగా కనిపించింది.
ఈ ఏడాది మొదట్లో పుచ్చకాయను పాలస్తీనా చిహ్నంగా ప్రదర్శించడం తారాస్థాయికి చేరింది. దాంతో ప్రజలు గుమిగూడే అన్ని ప్రాంతాల నుంచీ పాలస్తీనా జెండాలను తొలగించాలని ఈ ఏడాది జనవరి నెలలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామిర్ బెన్ గవీర్ ఆదేశించారు.
అంతేకాదు, ఆ జెండాలను ఎగురేయడాన్ని 'ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్య'గా పరిగణిస్తామని కూడా తెలిపారు. అయినా, ఇజ్రాయెలీ వ్యతిరేక నిరసనల్లో ఆ జెండాలను ప్రదర్శించడం కనిపించింది.
ఇజ్రాయెల్ చట్టం పాలస్తీనా జెండాను నిషేధించట్లేదు. అయితే, శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందని పోలీసులు, సైనికులు భావించినపుడు, ఆ జెండాలను తొలగించే హక్కును వాళ్లకు కల్పిస్తోంది.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా టెల్ అవీవ్‌లో గడిచిన ఆగస్టు నెలలో కొందరు నిరసనకారుల ప్రదర్శనలకు దిగారు. ఈ సందర్భంగా వారు పుచ్చకాయ బొమ్మలున్న టీ షర్టులు వేసుకుని కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక మాధ్యమాల్లో....
గాజాపైన ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో పుచ్చకాయ బొమ్మలున్న పోస్టులు చాలా కనిపిస్తున్నాయి.
టిక్‌టాక్‌లో బ్రిటిష్ ముస్లిం కమేడియన్ షుమీరున్ నెస్సా వాటర్‌మెలన్ ఫిల్టర్లను తయారు చేసి ఆమె ఫాలోయర్లు వాటిని వాడుతూ వీడియోలు చేసేలా ప్రోత్సహించారు. వాటి ద్వారా ఆమెకు వచ్చే డబ్బుని గాజా ప్రజలకు సాయంగా అందిస్తానని ప్రకటించారు.
కొందరు సోషల్ మీడియా యూజర్లు పాలస్తీనా జెండాను పోస్ట్ చేస్తే తమ అకౌంట్లను తొలగిస్తారనే భయంతో పుచ్చకాయ బొమ్మలను పోస్ట్ చేస్తున్నారు.
గతంలో, ఇన్‌స్టాగ్రామ్ షాడో బ్యానింగ్ చేస్తోందని పాలస్తీనా మద్దతుదారులు ఆరోపణలు చేశారు. షాడో బ్యానింగ్ అంటే కొందరు చేసిన పోస్టులను ఇతరుల ఫీడ్‌లో కనిపించకుండా చేయడం.
అయితే ఈ షాడో బ్యానింగ్ ప్రస్తుతం కొనసాగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బీబీసీ టెక్నాలజీ కరస్పాండెంట్ జో టైడీ అన్నారు.
‘’పాలస్తీనాకు మద్దతుగా యూజర్లు పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను కనపడకుండా చేస్తున్నట్లుగా ఎక్కడా ఆధారాలు దొరకలేదు’’ అని జో టైడీ అన్నారు.
‘’ప్రజలు తమ సోషల్ మీడియాలో పుచ్చకాయ ఫోటోలను వాడుతున్నారు. అలానే వాళ్లు పాలస్తీనా జెండాను కూడా స్వేచ్ఛగా వాడుతున్నారు. గాజా సంఘర్షణపైన స్వేచ్ఛగా రాస్తున్నారు కూడా.’’ అని టైడీ అన్నారు.
పాలస్తీనా ప్రాంతాల్లో పుచ్చకాయ కేవలం ఫ్రూట్ మాత్రమే కాదు, పాలస్తీనా తర్వాతి తరాల వారికి అత్యంత శక్తిమంతమైన రాజకీయ చిహ్నంగా కూడా మారింది.
ఇవి కూడా చదవండి
- రోజుకు 4 సెం.మీ. కుంగిపోతున్న పట్టణం.. అక్కడేం జరుగుతోంది?
- అఫ్గానిస్తాన్: 'పదేళ్ళ వయసు వరకూ నన్ను మా నాన్న అబ్బాయిగానే పెంచారు... అలానే అందర్నీ నమ్మించి నన్ను కాపాడారు'
- గాజా: బాంబుల శబ్దాలతో మహిళలకు గర్భస్రావాలు, పెయిన్ కిల్లర్స్ లేకుండానే ప్రసవాలు... చెప్పతరం కాని గర్భిణుల కష్టాలు
- గాజా: అల్-షిఫా హాస్పిటల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా... ఇజ్రాయెల్ సైన్యంతో లోపలికి వెళ్ళిన బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?
- హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














