గాజా చరిత్ర: ఎన్నో విధ్వంసాలు, విపత్తులు, విషాదాలను భరించిన వేల ఏళ్ళనాటి నగరం

ఫొటో సోర్స్, SEPIA TIMES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
- రచయిత, ఒమేమా అల్-షాజిల్
- హోదా, బీబీసీ అరబిక్ సర్వీస్, కైరో (ఈజిప్ట్)
‘చరిత్రలో అత్యంత పురాతన నగరాల్లో ఇది ఒకటి. ఇది ఏ ఒక్క శతాబ్దానికో యుగానికో చెందిన నగరం కాదు. తరతరాల జన జీవన స్రవంతికిది ప్రత్యక్ష నిదర్శనం. చరిత్ర పుట్టినప్పటి నుంచి ఈ నగరం మనుగడలో ఉంది’
జెరూసలేంకు చెందిన పాలస్తీనా చరిత్రకారుడు అరిఫ్ అల్-అరిఫ్ 1943లో ప్రచురించిన పుస్తకంలో గాజా నగరం గురించి ఇలా ప్రస్తావించారు.
అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, తుర్కియే సాహిత్యంలో ఈ తీర ప్రాంత నగరం గురించి రాసిన వివరాలను ఆయన తన పుస్తకంలో పొందుపరిచారు.
చరిత్ర గురించి అధ్యయనం చేయాలనుకునే వారికి ఇది చాలా సందడిగా ఉండే నగరమని 1907లో గాజా గురించి అమెరికాకు చెందిన రబ్బీ మార్టిన్ మేయర్ ప్రచురించిన పుస్తకంలో అమెరికాన్ ఓరియెంటలిస్ట్ రిచర్డ్ గోథైల్ రాశారు.
‘‘దక్షిణ అరేబియా నుంచి మధ్యధరాకు సరకులు రవాణా చేసే యాత్రికులకు గాజా ఒక సమావేశ స్థలంగా ఉండేది. ఇక్కడి నుంచి ఉత్పత్తులను సిరియా, తుర్కియే, యూరప్ ప్రాంతాలకు తరలించే వారు. ఇది అలా ఒక రవాణా కేంద్రంగా ఉండేది. పాలస్తీనా, ఈజిప్ట్‌కు ఇది అనుసంధాన నగరం’’ అని గోథైల్ దీని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ రాశారు.
హజాతి, గజాతు... గడాటు
13వ శతాబ్దానికి చెందిన రచయిత, పర్యాటకుడు యాఖుత్ అల్-హమావికి చెందిన దేశాల డిక్షనరీ (కితాబ్ ముజమ్ అల్-బుల్దాన్) అనే ఎన్‌సైక్లోపీడియాలో గాజా అని పిలిచే ఈ ప్రాంతంలో మూడు నగరాల ప్రస్తావన ఉంది.
మొదటిది జజీరా అల్-అరబ్. ప్రముఖ అరబిక్ కవి అల్-అఖ్తల్ అల్-తఘ్లిబి ఈ నగరం గురించి ఒక పద్యం రాశారు.
అల్-హమావి దీనికి ‘ఇఫ్రిఖియా’ అనే మరో పేరును ఇచ్చారు. దీని పాత పేరు తునీషియా.
దీనికి, కైరోకి మధ్యలో మూడు రోజులు ప్రయాణించాల్సి ఉంటుందని అల్-హమావి చెప్పారు.
‘‘ఈజిప్ట్ దిశలో లెవాంట్‌కు దూరంగా ఉండే నగరం గాజా. అష్కెలాన్‌కు పశ్చిమాన పాలస్తీనా ప్రాంతంలో ఈ నగరం ఉంది’’ అని గాజా గురించి వర్ణిస్తూ అల్-హమావి రాశారు.
పురాతన కాలం నుంచి అరబ్ ప్రపంచం దీన్ని గాజాగా పిలుస్తోంది. ఇస్లామిక్ కాలంలో, దీన్ని ‘హసీమ్ గాజా’గా పిలిచేవారు.
ఎందుకంటే, మొహమ్మద్ ప్రవక్త తాత ‘హసీమ్ బిన్ అబ్ద్ మనాఫ్’ ఇక్కడే చనిపోయారని ఇస్లామిక్ కాలంలో చెప్పేవారు.
ప్రముఖ ఇస్లామిక్ రచయిత, పండితుడు ఇనామ్ అల్-షఫీ ఇక్కడే పుట్టారు.
అల్-అరిఫ్ రాసిన తన పుస్తకం ‘ది హిస్టరీ ఆఫ్ గాజా’లో కొన్ని కమ్యూనిటీలు దీన్ని ‘హజాతి’ అని, పురాతన ఈజిప్టియన్లు దీన్ని ‘గజాతు’ లేదా ‘గడాటు’గా పిలిచే వారని చెప్పారు.
ప్రతి యుగంలో కూడా గాజాకు భిన్నమైన పేర్లు ఉండేవని గ్రీక్ డిక్షనరీలో చెప్పారు. దీనిలో ‘అయోని’, ‘మినోవా’, ‘కాన్‌స్టాంటియా’ అనే పేర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, SEPIA TIMES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
గాజా అర్థమేంటి?
గాజా అంటే గౌరవం, శక్తి, హోదా అని నాలుగో శతాబ్దానికి చెందిన, ప్రస్తుత ఇజ్రాయెల్‌లోని సీసరియా ప్రాంతంలో పుట్టిన క్రైస్తవ మతగురువు యూసేబియస్ చెప్పారు.
స్కాట్లండ్‌కు చెందిన ప్రముఖ నిఘంటు రూపశిల్పి సర్ విలియం స్మిత్ కూడా 1863లో తాను రాసిన ‘డిక్షనరీ ఆఫ్ ది ఓల్డ్ టెస్టామెంట్’లో గాజా గురించి ప్రస్తావించారు.
1910లో రచయిత సోఫ్రోనియస్ ప్రచురించిన ‘డిక్షనరీ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్’లో 'ఘాజా'ను పర్షియన్ పదంగా చెప్పారు. ఘాజా అంటే రాజ సంపదగా అభివర్ణించారు.
గ్రీక్ భాష నుంచి ఈ పదం పుట్టిందని చాలా మంది విశ్వసిస్తారు. గ్రీక్‌లో దీని అర్థం సంపద లేదా ఖజనా. ఎన్ని రకాలుగా చూసుకున్నా.. గాజా అనేది పర్షియన్, గ్రీక్‌తో దగ్గర సంబంధాలున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ రాజు కూడా తన సంపదను గాజాలో దాచిపెట్టుకున్నారని చరిత్రలో చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన ఇరాన్‌కు వెళ్లిపోయారని పేర్కొంటున్నారు.
ఈ సంఘటన రోమన్ యుగంలో జరిగిందని చెబుతుంటారు.
‘ఘాజా’ అనేది టైర్ అనే వ్యక్తి భార్య పేరు అని యాఖుత్ అల్-హమావి చెప్పారు.
ఫోనీషియన్ నగరమైన టైర్ ఆయన పేరు మీదే కట్టారని తెలిపారు. ప్రస్తుతం ఇది లెబనాన్‌లో ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గాజాను ఎవరు నిర్మించారు?
ఇంగ్లిష్ ఆర్కియాలజిస్ట్ సర్ ఫ్లిండర్స్ పెట్రీని ఈజిప్ట్, ఆని పరిసర ప్రాంతాల పురావస్తు నిపుణుడని చెబుతుంటారు.
పెట్రీ చెప్పిన ప్రకారం గాజా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం ‘హిల్ అల్-అజ్వాల్’ అనే కొండపై నిర్మితమైంది. అయితే, ఆ తరువాత జరిగిన దాడుల వల్ల ఆ నగరంలోని ప్రజలు విడిచిపెట్టేశారని ఆయన వివరించారు.
దాడుల వల్ల ఆ నగరం నుంచి బయటికి వచ్చేసిన ప్రజలు మూడు మైళ్ల దూరంలో స్థిరపడ్డారని, గాజా అనే కొత్త నగరాన్ని నిర్మించారని చెప్పారు.
ప్రస్తుతం గాజా అదే ప్రాంతంలో ఉంది. ఈజిప్ట్‌లోని హైక్సోస్ రాజవంశం కాలంలో ఈ దాడి జరిగిందని చెబుతుంటారు. 1638-1530 బీసీ నుంచి 108 ఏళ్ల పాటు ఈజిప్ట్‌ను ఈ రాజవంశీకులే పాలించారు.
ఆ కాలంలో గాజా నగరం ఈ రాజవంశం ఆధీనంలోనే ఉండేదని నమ్ముతారు.

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
పురాతన ఘాజా
అయితే, ఈ కథనాన్ని తిరస్కరించే వారు కూడా ఉన్నారు. తొలుత ఎక్కడైతే ఘాజా స్థిరపడిందో ఇప్పటికే అదే పురాతన స్థలంలో ఉందని వీరు చెబుతుంటారు.
అలెగ్జాండర్ ది గ్రేట్ పురాతన గాజాను నాశనం చేశారని కొందరు విశ్వసిస్తుంటారు. ఆధునిక గాజా మరో ప్రాంతంలో స్థిరపడిందని అంటుంటారు. సర్ పెట్రీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గాజా నగరాన్ని మెనైట్స్ తెగ నిర్మించిందని అల్-అరిఫ్ తన పుస్తకంలో రాశారు.
అరబ్ ప్రపంచంలో అత్యంత పురాతన నివాసితులుగా మెనైట్స్‌ను పేర్కొంటుంటారు. క్రీస్తు పూర్వం 1000 నాగరికత జెండాను వీరే ఎగరవేశారని చెబుతుంటారు.
గాజా నగరాన్ని నిర్మించిన ఘనత ఈ ప్రజలకే దక్కుతుందని అల్-అరిఫ్ పేర్కొన్నారు.
అరబ్‌లకు గాజా ఎందుకంత ముఖ్యంగా మారిందంటే, అది ఈజిప్ట్, భారత్‌కు అత్యంత ముఖ్యమైన వాణిజ్య అనుసంధానంగా ఉండటమే. ఎర్ర సముద్రంలో నౌకాయానంతో పోలిస్తే ఈ నగరమే వారికి అత్యంత ఉన్నతమైన వాణిజ్య మార్గం.

ఫొటో సోర్స్, BILDAGENTUR-ONLINE/UIG VIA GETTY IMAGES
అరబ్ ప్రపంచం, భారత్
అరేబియన్ ద్వీపకల్పంలో దక్షిణంగా ఉన్న యెమెన్ నుంచి ఈ ప్రాంతంలో వాణిజ్యం ప్రారంభమైంది. అప్పుడే అరబ్ ప్రపంచానికి, భారత్‌కు మధ్య వాణిజ్యం వికసించింది.
యెమెన్ తర్వాత ఈ వాణిజ్య మార్గం రెండు భాగాలుగా విభజించడానికి ముందు మక్కా, మదీనా, పెట్రాకు ఉత్తరం దిశగా ఈ మార్గం ఉంది.
రెండవ మార్గం తైమ్, డమాస్కస్, పాల్మిరా నుంచి ఎడారి గుండా మధ్యధరా సముద్రంలో గాజాకు చేరుకుంటుంది.
కొంత మంది చరిత్రకారులు గాజా నగరాన్ని అరబ్ తొలి పాలకులైన మాయన్, షెబా రాజ్యాలు నిర్మించాయని చెబుతున్నారు.

అత్యంత పురాతన నగరాల్లో ఒకటి
బుక్ ఆఫ్ జెనెసిస్ (హీబ్రూ భాషలోని తొలి బైబిల్, క్రిస్టియన్ ఓల్డ్ టెస్టమెంట్) ప్రకారం గాజా ప్రపంచంలో అత్యంత పురాతన నగరాల్లో ఒకటని ‘ది హిస్టరీ ఆఫ్ గాజా’ అనే పుస్తకంలో చెప్పారు.
బుక్ ఆఫ్ జెనెసిస్ ప్రకారం, నోవాహ్ కుమారుడైన హామ్ వారసులు, కనాన్ నాగరికత నాటి ప్రజలు ఇక్కడ నివసించారు. కానీ, కనాన్ ప్రాంత ప్రజలు అమోరీయుల నుంచి దీన్ని గెలిచారని మరో ప్రస్తావన ఉంది.
14వ శతాబ్దంలో తునీసియాలో జన్మించిన చరిత్రకారుడు ఇబ్న్ ఖల్దున్ చెప్పిన ప్రకారం, కనానీయులు అరబ్బులు. వారి మూలాలు అమలేకియా అనే తెగలో ఉన్నాయి.
అయితే, కనానీయులు నిజానికి పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చారని కొందరు నమ్ముతారు. వారు 5,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించినట్లు చరిత్రకారులు అంచనా వేశారు.

ఫొటో సోర్స్, SEPIA TIMES/ UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
ఆల్ఫాబెట్ ఆవిష్కరణ
ఈజిప్ట్‌కు చెందిన హైక్సోస్ రాజవంశీకులు ఆక్రమించుకున్న కనానైట్ నగరం శిథిలాలను గాజా స్ట్రిప్‌లోని మరో నగరమైన నగరం టెల్ అల్-అజుల్‌కు దక్షిణాన కనుగొన్నారు. ఇక్కడే సమాధులను కూడా గుర్తించారు.
వీటిల్లో కొన్ని క్రీస్తుపూర్వం 4,000 ఏళ్ల కిందట కాంస్య యుగానికి చెందినవి కొందరు చెబుతున్నారు.
గాజా ప్రాంతంలో కనానీయులు ఆలివ్ తోటుల పెంచే వారని అల్-అరిఫ్ తెలిపారు. కుండల నుంచి మైనింగ్ వరకు వీరు పలు వ్యాపారాలు చేసేవారని తెలిసింది.
అల్ఫాబెట్‌ను కనుగొన్నది కూడా కనానైట్ నాగరీకులేనని చెబుతుంటారు. ఈ నాగరికతకు చెందిన న్యాయసూత్రాలు, నియమాలను ఎన్నింటినో యూదులు స్వీకరించారని చరిత్రకారులు చెబుతున్నారు.
చరిత్రలో గాజాను ఈజిప్టియన్లు, బాబీలోనియన్లు, అసీరియన్లు, గ్రీక్, ఇరాన్, రోమన్లు పాలించారు.
గాజా చరిత్ర ఒక 'అద్భుతం' అంటారు పాలస్తీనా చరిత్రకారుడు అరిఫ్ అల్-అరిఫ్. ఎందుకంటే, ‘‘గాజా తన జీవితకాలంలో అన్ని రకాల సంక్షోభాలను, విపత్తులను అనుభవించింది. ఈ నగరం ఎన్నో దాడులను సహించింది. దాడులు చేసినవారు ఓడిపోయారు. సమూల నిర్మూలనకు గురయ్యారు. చరిత్రలో ఇలాంటి నగరం మరొకటి లేదు."
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో గత ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు... ప్రపంచంలో ఒకే ఒక శాతం వాహనాలున్న దేశంలో ఇన్ని ప్రమాదాలా?
- గాజా రిపోర్టర్: 'కళ్ళతో చూడలేని వాటిని చూడాల్సి వస్తోంది... కెమేరా వెనుక నిలబడి చాలా సార్లు ఏడ్చాను'
- ఇజ్రాయెల్-గాజా: కుటుంబంలో నలుగురు పిల్లలు సహా 11మందిని కోల్పోయిన ఓ తండ్రి వేదన ఇది
- కేజ్రీవాల్ అరెస్టయితే ఆమ్ ఆద్మీ కథ ముగిసినట్లేనా... 5 ప్రశ్నలు-జవాబులు
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














