గాజా రిపోర్టర్: 'కళ్ళతో చూడలేని వాటిని చూడాల్సి వస్తోంది... కెమేరా వెనుక నిలబడి చాలా సార్లు ఏడ్చాను'

మహమూద్ బస్సమ్

ఫొటో సోర్స్, MAHMOUD BASSAM

ఫొటో క్యాప్షన్, మహమూద్ బస్సమ్ భార్య, 11 నెలల బిడ్డ గాజా యుద్ధంలో చిక్కుకున్నారు
    • రచయిత, ఫెర్గల్ కీన్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

అతికష్టమ్మీద ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు, సిగ్నల్ దొరికినప్పుడు ఆయనకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.

ఆయన దొరికింది తింటున్నారు. బాంబు దాడుల వల్ల ఒక చోటును ఖాళీ చేసి మరో చోటుకి వెళ్తున్నారు. తన ప్రయాణానికి అవసరమైన పెట్రోల్ మాత్రం దొరుకుతోంది.

అయితే, తన భార్య, పదకొండు నెలల బిడ్డ గురించి మహమూద్ బస్సమ్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే బాంబు దాడుల బారిన పడకుండా వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే రాత్రికి మళ్లీ అదే చోటుకి తిరిగి వస్తామనే నమ్మకం వారిలో లేదు.

రోడ్డుపై ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటే, బాంబులు పడకుండా ఉంటే మాత్రమే తిరిగి రావడానికి కుదురుతుంది.

ప్రస్తుతం యుద్ధంలో కూరుకుపోయిన గాజాలో మహమూద్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పరిస్థితేంటి? ఆయన ఏం కోల్పోవాల్సి వస్తుంది?

మహమూద్ అక్కడే ఉండి తన ప్రజల ఆవేదనను చరిత్ర పుటల్లోకి ఎక్కిస్తున్నారు. మూడు వారాల కిందట ఇజ్రాయెల్ - గాజా వివాదం మొదలైనప్పటి నుంచి బాంబు పేలుళ్లు, ఇబ్బందికర పరిస్థితుల నడుమ ఆయన అక్కడి ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలకు తిరుగుతూ అక్కడి పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బీబీసీ గాజా కరస్పాండెంట్ రష్టీ అబులౌఫ్‌తో పాటు మహమూద్ వంటి ఫ్రీలాన్సర్లు ఎడతెరిపి లేకుండా జరుగుతున్న వైమానిక దాడులతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఆవేదనను తెలుసుకునేందుకు బీబీసీకి సాయపడుతున్నారు.

నేను గంటల తరబడి ప్రయత్నించిన తర్వాత ఆయన ఫోన్ కలిసింది. అక్కడి పరిస్థితులు, తన మానసిక స్థితి గురించి మహమూద్ వివరించారు.

''ఇక్కడ జరిగేవాటిని కళ్లతో చూడలేం. చూడడానికే కష్టంగా ఉండే వాటిని చూడాల్సి వస్తోంది. అయినా, నేను ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నా'' అని ఆయన అన్నారు. '' సార్లు నేను కెమెరా వెనుక నిల్చుని ఏడుస్తున్నా, కానీ మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేను'' అని మహమూద్ అన్నారు.

గాజా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గాజా ప్రజల బాధలను గాజా జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేస్తున్నారు

యుద్ధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎంతోమంది జర్నలిస్టులు అక్కడి ప్రజల అవస్థలను చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయతను అనుభవిస్తున్నారు. అక్కడ అందరికీ సాయం కావాలి, అలాంటప్పుడు ఎంతమందికి సాయం చేయగలరు? ఆహారం, ప్రాథమిక చికిత్స కూడా అందకుండా ఆపేస్తే ఆ పని ఎలా చేయగలుగుతారు?

మేం సహాయక సిబ్బంది కాదు. వైద్యులం కూడా కాదు. కానీ, మనుషులం.

నాలాంటి విదేశీ జర్నలిస్టు ప్రతినిధులు విమానం ఎక్కి తమ స్వదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. యుద్ధ జ్ఞాపకాలు వెంటాడుతున్నప్పటికీ మనకు, మనవారికి కనీసం భౌతికంగానైనా భద్రత ఉంటుంది. కానీ, స్థానికుడు కావడం వల్ల మహమూద్‌కి అది సాధ్యం కాదు.

గాజా స్ట్రిప్ కేవలం 366 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన చిన్న భూభాగం. అందువల్ల ఆ ప్రాంతంలో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం మహమూద్‌కి ఉంది.

''నేనొక జర్నలిస్టుని. ఇక్కడ ఏం జరుగుతుందో చూసింది చెప్పడమే నా బాధ్యత''

''కానీ, కొన్నిసార్లు నేను పని ఆపేసి అక్కడి పిల్లలతో కూర్చోవాల్సి వస్తుంది. వాళ్లకి మంచినీళ్లు, ఇతర అవసరాలను పట్టించుకోవాల్సి ఉంటుంది. వాళ్లకి అవసరమైన వాటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నా'' అని మహమూద్ చెప్పారు.

ఆయన పంపించిన వీడియో ఫుటేజీ మొత్తం చూశాం. ఆయన చిత్రీకరించిన అక్కడి పరిస్థితులు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు అన్నీ గమనించాం. తాము జీవితంలో ఎన్నడూ ఊహించని పరిస్థితులను చెప్పేందుకు మొదటిసారి వాళ్లు కెమెరా ముందుకు వచ్చారని ఆయనకు తెలుసు. అక్కడి పరిస్థితులను చూసి ఆయన నోరు మూగబోవడం చూసి మా టీం అంతా బాధపడ్డాం.

ఇటీవల కాలంలో జరుగుతున్న వాటిలో ఈ యుద్ధం జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైనదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ 30 మందికి పైగా చనిపోయారు. గాజాలో ఉన్న జర్నలిస్టులు భారీ మూల్యం చెల్లిస్తున్నారని జర్నలిస్టుల రక్షణ కమిటీ (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ - సీపీజే) చెప్పింది.

''గాజాలో జర్నలిస్టులకిది ప్రాణాంతక సమయం'' అని సీపీజేకి చెందిన మిడిల్ ఈస్ట్ నిపుణులు షరీఫ్ మన్సూర్ చెప్పారు.

''ఈ ఘర్షణలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల్లో గత 21 ఏళ్లలో చనిపోయిన వారి కంటే, ఈ మూడు వారాల్లో చనిపోయిన జర్నలిస్టుల సంఖ్య ఎక్కువ. చాలా మంది జర్నలిస్టులు తమ సహోద్యోగులను, ఎన్నోఏళ్లుగా ఉంటున్న ఇళ్లను కోల్పోయారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా మంది అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది.''

వేల్ అల్-దహ్‌దౌ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో అల్ జజీరా జర్నలిస్టు వేల్ అల్-దహ్‌దౌ

గాజా వంటి ప్రదేశాల్లో పనిచేసే అతి కొద్దిమంది జర్నలిస్టుల్లో తమ సహచరులను కోల్పోవడం చాలా మందికి బాధాకరమైన విషయం.

యారా ఈద్ ఒక పాలస్తీనియన్ జర్నలిస్ట్. ఆమె గాజాలోనే పెరిగారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. యుద్ధం ప్రారంభ సమయంలో చనిపోయిన తన స్నేహితుడు ఇబ్రహీం లాఫిని తలుచుకుంటూ ఆమె విచారంలో ఉన్నారు.

''నేను నా బెస్ట్‌ఫ్రెండ్‌‌ను కోల్పోయాను. ఆయనొక పాలస్తీనియన్ జర్నలిస్ట్, కానీ ఆయన కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు. ఆయన కేవలం 21 ఏళ్ల యువకుడు. ఒక సోదరుడు. బెస్ట్‌ఫ్రెండ్. జీవితం గురించి చాలా కలలు కనేవాడు'' అని ఆమె అన్నారు.

''అతనో ఫోటోగ్రాఫర్. జీవితాన్ని ఆస్వాదించాలని అనుకునేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అతను విచారంగా ఉండడం జీవితంలో చూడలేదు. నేను చూసినప్పుడల్లా నవ్వుతూనే కనిపించేవాడు.''

''ఎప్పుడూ తోడుగా ఉండేవాడు. అతనికి చాలా కలలు ఉండేవి. ఫోటోగ్రాఫర్‌గా గాజా అందాలను ఈ ప్రపంచమంతా చూపించాలని అనుకునేవాడు'' అన్నారు.

గాజాలో పనిచేసే జర్నలిస్టులకు తమకు కాదు, తమ కుటుంబానికి కూడా ముప్పు ఉందని తెలుసు. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో అల్ జజీరా బ్యూరో చీఫ్ వేల్ అల్-దహ్‌దౌ తన భార్య, కొడుకు, కూతురు, మనవడిని పోగొట్టుకున్నారు.

ఆ తర్వాతి రోజు ఆయన తన విధులకు వచ్చారు. అది తన బాధ్యతని చెప్పారు. జెరూసలెం నుంచి పనిచేస్తున్న జర్నలిస్టుల అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే.

జెరూసలెం నుంచి హనీన్ అబ్దీన్, ఆలిస్ దొయార్డ్, మోర్గాన్ గిషాల్ట్ మినార్డ్, జాన్ లాండీల అదనపు సమాచారంతో..

వీడియో క్యాప్షన్, దక్షిణ గాజాలోని రఫా క్రాసింగ్‌లో తెరుచుకున్న గేట్లు ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)