అఫ్గానిస్తాన్ ముగ్గురు ప్రపంచ చాంపియన్లను ఓడించడం వెనక 5 అంశాలు.. ఆ జట్టు సెమీస్‌కు చేరుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన మూడు జట్లను ఏ మాత్రం అంచనాలు లేని ఒక జట్టు ఓడించి, ప్రపంచ కప్ సెమీఫైనల్ రేసులోకి వస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.
ఔను, ఆ జట్టు అఫ్గానిస్తానే.
అఫ్గానిస్తాన్ సంచలన విజయాలతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులనే కాదు, విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఇంతటి అసాధారణ ప్రదర్శన అఫ్గానిస్తాన్‌కు ఎలా సాధ్యమైందనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలపై అఫ్గానిస్తాన్ విజయాల వెనక ప్రధానంగా ఐదు అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అవేమిటో ఈ కథనంలో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1. మేటి స్పిన్నర్లు: జట్టులో ప్రపంచస్థాయి మేటి స్పిన్నర్లు ముగ్గురు ఉండటం మంచి అడ్వాంటేజ్ అంటారు క్రికెటర్ విశ్లేషకుడు వెంకటేష్.
‘‘అఫ్టానిస్తాన్ జట్టుకు మహ్మద్ నబీ, ముజీబుర్ రహమాన్, రషీద్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ముగ్గురు ఉన్నారు. ఇలాంటి అడ్వాంటేజ్ మరే టీమ్‌కు లేదు’’ అంటారాయన.
స్పిన్నర్లతోపాటు నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఉమర్జాయ్, ఫారూఖీ లాంటి ఫాస్ట్ బౌలర్లు జట్టుకు బలంగా మారారు.
ఇలా ఏ జట్టుకు ఆరుగురు టాప్ క్లాస్ బౌలర్లు లేరని వెంకటేష్ విశ్లేషించారు.
తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ అప్ఘానిస్తాన్ బౌలర్లు బాగా రాణించారు. పేసర్ ఫారూఖీ విజృంభణతో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఫారూఖీకి మొత్తం నాలుగు వికెట్లు దక్కాయి. మరోపక్క ముజీబుర్ రెహమాన్ 2 వికెట్లు తీశాడు.
శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్థసెంచరీ చేయలేకపోయారంటే అఫ్గాన్ బౌలర్లు ఎంతకట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో తెలుస్తోంది.
2. ఆల్‌రౌండర్లు: నబీ, అజ్మతుల్లా ఉమర్ జాయ్ , రషీద్ ఖాన్ మంచి ఆల్ రౌండర్లు. వీరు బంతితోపాటు బ్యాట్‌తోనూ రాణించడం అఫ్గానిస్తాన్ అద్భుత ప్రదర్శనకు మరో కారణం.
3. ఒత్తిడి తట్టుకొనే బ్యాటింగ్: గతంలో బౌలింగ్ లో మాత్రమే బలంగా కనిపించిన అఫ్గానిస్తాన్ బ్యాటింగ్‌లోనూ చెలరేగుతోంది. టాపార్డర్ లో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ చక్కగా ఆడుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ అవుటైనా ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా అఫ్గానిస్తాన్ తన బ్యాటింగ్ కొనసాగించడమే ఇందుకు ఉదాహరణ.
మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 39 పరుగులు చేయగా, రహ్మత్ షా 62 పరుగులు చేశాడు.
రహ్మత్ ఔటయ్యాకా హస్మతుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో వికెట్‌కు అజ్మత్ ఉమర్జాయ్ తో కలిసి అజేయంగా 111 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
‘‘ఇప్పుడు అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ బావుంది’’ అని చెప్పారు వెంకటేష్.
4. చురుకైన ఫీల్డింగ్: మైదానంలో అఫ్గానిస్తాన్ ఆటగాళ్ళంతా చురుగ్గా ఉంటున్నారు. శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో వీళ్లు రెండు రనౌట్లు చేయడం అఫ్గాన్ ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చూపుతోంది.
5. టీమ్‌స్పిరిట్: పైన చెప్పుకొన్న నాలుగు అంశాలు ఇంచుమించుగా ఇతర జట్లలో కూడా కనిపించవచ్చు. కానీ అఫ్గానిస్తాన్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది ఈ నాలుగు అంశాలతోపాటు అత్యంత ముఖ్యమైన సమష్టితత్వం. జట్టు ప్రదర్శనలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌పై గెలుపుతో అఫ్గాన్ పేరు మార్మోగింది
అఫ్గానిస్తాన్ దిల్లీలో అక్టోబరు 15న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడింది. ఇంగ్లండ్ డిఫెండిండ్ చాంపియన్ కావడంతో అందరూ ఇంగ్లండ్ ఈ మ్యాచ్ చాలా తేలికగా గెలుస్తుందనుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసింది.
తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిషు జట్టును అఫ్గానిస్తాన్ బౌలర్లు కట్టడి చేశారు. ముజీబ్, రషీద్ చెరో మూడు వికెట్లు తీయడంతో పాటు నబీ 2 వికెట్లు, నవీన్, ఫారూఖ్ తలో వికెట్ తీయడంతో ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో 69 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్‌పై గెలిచింది.
అక్టోబరు 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా బదులుగా అఫ్గానిస్తాన్ రెండే వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్లు గుర్బాజ్ 65 పరుగులు చేయగా, ఇబ్రహిం జద్రాన్ 87 పరుగులు చేశారు. వీరిద్దరు ఔటయ్యాక మిగిలిన పనిని రహ్మత్ 77 పరుగులు, హష్మతుల్లా 48 పరుగులతో పూర్తి చేశారు.
ఇంగ్లండ్‌పై బౌలింగ్‌తో మెరిసిన అఫ్గానిస్తాన్ పాకిస్తాన్‌పై బ్యాటింగ్‌తో అదరగొట్టింది.
పాకిస్తాన్‌పై గెలుపు తరువాత అఫ్గానిస్తాన్ పేరు మారుమోగిపోయింది. అఫ్గానిస్తాన్ లో సంబరాలు మిన్నంటాయి.
ఇక అక్టోబరు 30న పుణెలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట శ్రీలంకను 49.3 ఓవర్లలో 241 పరుగులకు కట్టడిచేసి, ఆపైన కేవలం మూడు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి అఫ్గానిస్తాన్ గెలిచింది.
ఈ మ్యాచ్‌లో ఫారూఖీ 10 ఓవర్లలో కేవలం 34 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీయగా, ముజీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. అజ్మతుల్లా, రషీద్, నబీ తలో వికెట్ తీశారు.
ఇలా ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లను అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓడించి తన సత్తా చాటింది.
శ్రీలంకపై విజయంతో అఫ్గానిస్తాన్ మొత్తం 6 పాయింట్లతో 5వస్థానానికి చేరుకుంది.
దీనికి ముందు అఫ్గానిస్తాన్ 2015, 2019 ప్రపంచకప్ పోటీలలో ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.
ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన అఫ్గానిస్తాన్, మూడు గెలవగా, మూడు ఓడిపోయింది. భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో మ్యాచుల్లో అఫ్గాన్ ఓటమి పాలైంది.

ఫొటో సోర్స్, cricketworldcup.com
అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేరే అవకాశమెంత?
అప్ఘానిస్తాన్ తన గత నాలుగు మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు, అదీ పెద్ద జట్లపై గెలవడంతో ఇప్పుడు ఆ జట్టు సెమీస్‌కు చేరుతుందా అనే చర్చ జరుగుతోంది.
అఫ్గానిస్తాన్ ప్రస్తుతం ఆజట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.
ఇకపై ఆ జట్టు నవంబరు 3న నెదర్లాండ్స్‌తో కోల్‌కతాలో, నవంబరు 7న ముంబయిలో ఆస్ట్రేలియాతోనూ, నవంబరు 19న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతోనూ తలపడనుంది.
ఈసారి అఫ్గానిస్తాన్ పెద్దజట్లు అయిన సౌత్ ఆప్రికా, ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే వీటిపై గెలవడం కష్టమని వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఈ గెలుపుతోపాటు నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించనుంది. కనీసం రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం అఫ్గానిస్తాన్ నెట్‌రన్ రేట్ -0.718గా ఉంది. మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు జట్లపైనా గెలవడంతోపాటు నెట్ రన్ రేటు భారీగా పెంచుకుంటేనే అఫ్గానిస్తాన్‌కు సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, AFGHANISTAN CRICKET BOARD
అజయ్ జడేజా పాత్ర ఎంత ?
అఫ్గానిస్తాన్ గెలుపుబాట పట్టినప్పటి నుంచి బాగా వినిపిస్తున్న పేర్లలో ఒకటి అజయ్ జడేజా.నిజానికి ఈ జట్టుకు జోనాథన్ ట్రాట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మెంటార్ పాత్ర పోషిస్తున్నారు.
అఫ్గానిస్తాన్ కు తొలి గెలుపు దిల్లీలో లభించింది. దీని వెనుక అజయ్ జడేజా వ్యూహాలు పనిచేశాయని అంటారు వెంకటేష్.
బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో అజయ్ జడేజా పాత్ర అఫ్గానిస్తాన్‌కు బాగా ఉపయోగపడుతోందంటారు ఆయన.
ఇవి కూడా చదవండి:
- పసిఫిక్ మహాసముద్రంలో 38 రోజులు ఒక చిన్న తెప్ప మీద ఆ కుటుంబం ప్రాణాలు ఎలా కాపాడుకుంది?
- సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాదని జవహర్లాల్ నెహ్రూను మహాత్మా గాంధీ ప్రధానిని చేశారు, ఎందుకు?
- ఖరీదైన స్కూల్లో యువతి హత్య... బాత్రూమ్లో శవమైన కనిపించిన పోలో కోచ్
- అజహరుద్దీన్: యూపీలో గెలిచి, రాజస్థాన్‌లో ఓడి, ఇప్పుడు తెలంగాణ బరిలో దిగిన టీమిండియా మాజీ కెప్టెన్
- గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ
- కోచి - నరేంద్ర మోదీ: వాటర్ మెట్రో అంటే ఏంటి? ఏం సౌకర్యాలు ఉంటాయి? టికెట్ ఎంత?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














